Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గౌహతిలో అడ్వాంటేజ్ అసోం 2.0 పెట్టుబడులు, మౌలికవసతుల సదస్సు 2025 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

గౌహతిలో అడ్వాంటేజ్ అసోం 2.0 పెట్టుబడులు, మౌలికవసతుల సదస్సు 2025 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం


అసోం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు, డైనమిక్ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు, పారిశ్రామికవేత్తలు, విశిష్ట అతిథులు, సోదరసోదరీమణులారా!

తూర్పు, ఈశాన్య భారతం నేడు నూతన భవిష్యత్తుకు నాంది పలుకుతోంది. భారత ఘన చరిత్రలో తూర్పు రాష్ట్రాల పాత్ర విశేషమైంది, అలాగే నేడు అభివృద్ధి చెందిన భారత్ సాధనలోనూ తూర్పు, ఈశాన్య ప్రాంతాలు కీలకం కానున్నాయి. అసోం సామర్థ్యం, అబివృద్ధిని ఈ అడ్వాంటేజ్ అసోం సదస్సు ప్రంపంచంతో అనుసంధానిస్తుంది. ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అసోం ప్రభుత్వానికి, హిమంత జీ బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. “ప్రజలు అక్షరమాలను నేర్చుకునేటప్పుడు, ‘ఏ అంటే అసోం’ అని చెప్పే రోజు ఎంతో దూరంలో లేదు” అని 2013 ఎన్నికల ప్రచారంలో యాదృచ్చికంగా నేను చెప్పిన విషయం ఇప్పటికీ నాకు గుర్తుంది.

మిత్రులారా,

నేడు ప్రపంచమంతా అనిశ్చితిలో ఉంటే, భారత్ వేగవంతమైన వృద్ధిరేటుతో ముందుకుసాగుతోంది. భారత వృద్ధి పట్ల ప్రపంచవ్యాప్తంగా నిపుణులు స్పష్టతతో ఉన్నారు. దీనికి కారణం భారత్ ఈ 21వ శతాబ్దంలోని రాబోయే 25ఏళ్ల సుదీర్ఘ లక్ష్యం కోసం ఐక్యంగా కృషి చేస్తూ ముందుకు సాగుతోంది. సరికొత్త నైపుణ్యాలను ఆకళింపు చేసుకుని, ఆవిష్కరణలతో దూసుకెళ్తున్న భారత యువశక్తినీ అలాగే పేదరికం నుండి బయటపడి కొత్త ఆకాంక్షలతో ముందుకు సాగుతున్న నవ-మధ్యతరగతి వర్గాన్ని నేడు ప్రపంచమంతా విశ్వసిస్తోంది. రాజకీయ స్థిరత్వాన్ని, విధానాల కొనసాగింపును సమర్థించే 140కోట్ల మంది భారతీయులను ప్రపంచం విశ్వసిస్తోంది. నిరంతరం సంస్కరణలు అమలు చేస్తూ, ప్రపంచంలోని వివిద దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటూ భారత్ అభివృద్ధిని సాధిస్తోంది. తూర్పు ఆసియాతో అనుసంధానాన్ని మెరుగుపర్చుకుంటూనే, నూతన భారత్-మధ్య తూర్పు-యూరప్ ఆర్థిక కారిడార్ కోసం అనేక అవకాశాలను సృష్టిస్తోంది.

మిత్రులారా,

భారత్‌ పట్ల ప్రపంచానికి పెరుగుతున్న విశ్వాసం నేపథ్యంలో, మనమంతా ఈరోజు కామాఖ్యదేవి పవిత్ర భూమి అయిన అసోంలో సమావేశమయ్యాం. అడ్వాంటేజ్ అసోం సదస్సు మొదటి ఎడిషన్ 2018లో జరిగింది. నాడు అసోం ఆర్థిక వ్యవస్థ 2.75 లక్షల కోట్ల రూపాయలుగా ఉండగా, నేడు 6 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధించింది. అంటే బిజెపి ప్రభుత్వ హాయాంలో కేవలం ఆరు సంవత్సరాల్లోనే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విలువ రెట్టింపు అయింది. ఇది కచ్చితంగా డబుల్ ఇంజిన్ ప్రభుత్వ డబుల్ ఎఫెక్ట్. మీరంతా పెట్టిన పెట్టుబడులు అలాగే ప్రపంచవ్యాప్తంగా గల పలు సంస్థల పెట్టుబడులతో అసోం అపరిమిత అవకాశాలు గల రాష్ట్రంగా అవతరించింది. భారత అబివృద్ధిలోనూ ముఖ్య పాత్రను పోషిస్తోంది. అసోం ప్రభుత్వం విద్య, నైపుణ్యాభివృద్ధి, పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, మెరుగైన పెట్టుబడి వాతావరణాన్ని కల్పించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తోంది.

రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం కనెక్టివిటీ సంబంధిత మౌలిక సదుపాయాలపై విస్తృతంగా కృషి చేస్తోంది. 2014కు ముందు బ్రహ్మపుత్ర నదిపై కేవలం మూడు వంతెనలు ఉండేవి, అంటే ఏడు దశాబ్దాల్లో మూడే వంతెనలు నిర్మించారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పదేళ్లలోనే ఏకంగా నాలుగు కొత్త వంతెనలు నిర్మించడం మా ప్రభుత్వ దార్శనికతకు నిదర్శనం. ఈ వంతెనల్లో ఒకదానికి భారతరత్న భూపేన్ హజారికా జీ పేరుపెట్టి వారిని గౌరవించుకున్నాం. 2009-14 కాలంలో అసోం రైల్వే బడ్జెట్ 2,100 కోట్ల రూపాయలుగా ఉంటే, ఇప్పుడు మా ప్రభుత్వం నాలుగు రేట్లు అధికంగా 10వేల కోట్లు కేటాయించింది. ఈ రాష్ట్రంలోని 60కి పైగా స్టేషన్‌లను ఆధునికీకరించడంతో పాటు ఈశాన్య ప్రాంతంలోని మొదటి సెమీ-హైస్పీడ్ రైలు గౌహతి – న్యూజల్పాయిగురి మార్గంలోనే ప్రారంభమైంది.

మిత్రులారా,

విమానరంగంలో కూడా అసోం దూసుకెళ్తోంది, 2014 వరకు కేవలం ఏడు మార్గాల్లోనే విమాన సేవలు అందుబాటులో ఉండగా నేడు సుమారు ముప్పై మార్గాల్లో విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటు అసోం యువతకు అనేక ఉపాధి అవకాశాలు కల్పించింది.

మిత్రులారా,

కేవలం మౌలిక సదుపాయాల్లోనే కాకుండా శాంతిభద్రతల విషయంలోనూ అసోం ఎంతో పురోగతి సాధించింది. ఎంతోకాలంగా పరిష్కారం లేకుండా ఉన్న సరిహద్దు సమస్యలకు నేడు ప్రభుత్వం చేసుకున్న పలు శాంతి ఒప్పందాలతో శాశ్వత పరిష్కారం లభించింది. దీంతో అసోంలో ప్రతి ప్రాంతం, ప్రతి పౌరుడు రాష్ట్రాభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు.

మిత్రులారా,

ఆర్థిక వ్యవస్థలో ప్రతి స్థాయిలో సంస్కరణలు చేపట్టి వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరుస్తూ మా ప్రభుత్వం నేడు పరిశ్రమలు, ఆవిష్కరణలకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తోంది. అంకురసంస్థల కోసం ప్రత్యేక విధానాలు, తయారీరంగం కోసం పీఎల్ఐ వంటి పథకాలు, అలాగే తయారీరంగ కంపెనీలు, ఎమ్ఎస్ఎమ్ఈలకు పన్ను మినహాయింపులు వంటి అందరికీ అనువైన విధానాలను మేం అమలు చేస్తున్నాం. అలాగే మౌలిక వసతుల రంగంలో పెద్దమొత్తంలో పెట్టుబడులు కొనసాగుతున్నాయి. భారత అబివృద్ధిలో ఈ సంస్థాగత సంస్కరణలు, పరిశ్రమలు, మౌలిక వసతులు, ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత్ సామర్థ్యాన్ని, వృద్ధి అవకాశాలను గుర్తించిన ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులు భారత్ పట్ల విశ్వాసం కనబరుస్తున్నారు. అసోం ప్రభుత్వం 2030 నాటికి 150 బిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుని డబుల్ ఇంజిన్ వేగంతో దూసుకెళ్తోంది. అసోం ప్రజల సమర్థత, ప్రతిభ అలాగే ప్రభుత్వ నిబద్ధత కారణంగా ఇది కచ్చితంగా సాకారం అవుతుందని నేను నమ్ముతున్నాను. నేడు ఆగ్నేయాసియా, భారత్‌లకు ముఖద్వారంగా అభివృద్ధి చెందుతున్న అసోం రాష్ట్రం తమ సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకునేందుకు “ఉన్నతి” పేరుతో ఈశాన్య ప్రాంత పరివర్తనాత్మక పారిశ్రామీకరణ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అసోం సహా ఈశాన్య ప్రాంతాల్లో పరిశ్రమలు, పెట్టుబడులు, పర్యాటక రంగాల్లో అభివృద్ధికి ఈ రాష్ట్రం ప్రణాళిక చేస్తోంది. ఇక్కడున్న పారిశ్రామికవేత్తలంతా ఈ పథకాన్ని, అసోం ప్రజల సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను. సహజ వనరులతో, వ్యూహాత్మక ప్రదేశంగా అసోం ప్రత్యేకత గలది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో ముఖ్య భాగమైన తేయాకు అసోం ప్రధాన బలం. 200ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ అసోం తేయాకు ఇతర రంగాల్లో రాష్ట్ర పురోగతికి స్ఫూరినిస్తోంది.

మిత్రులారా..

నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ప్రపంచం ఇప్పుడు స్థిరమైన సరఫరా వ్యవస్థలను కోరుకుంటోంది. ఇటువంటి కీలక సమయంలో భారత్ తన తయారీ రంగాన్ని బలోపేతం చేసుకునేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. మేకిన్ ఇండియాలో భాగంగా తక్కువ ఖర్చుతో ఉత్పాదన జరిపేందుకు ప్రాధాన్యాన్నిస్తున్నాం. ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైళ్ళు వంటి రంగాల్లో మా పరిశ్రమలు స్థానిక అవసరాలను నెరవేర్చడం సహా నాణ్యమైన ఉత్పత్తులతో అంతర్జాతీయ మార్కెట్లలో నూతన ప్రమాణాలను నెలకొల్పుతున్నాయి. ఈ ఉత్పత్తి విప్లవంలో అసోం కీలక పాత్ర పోషిస్తోంది.  

మిత్రులారా..

ప్రపంచ వాణిజ్యంలో అసోం ఎప్పుడూ ముఖ్య భాగస్వామి ఉంటూ తన ఉనికిని చాటుకుంది. దేశంలోని సముద్రేతర (ఆన్-షోర్) సహజ వాయువు ఉత్పాదనలో సగానికి పైగా అసోం నుంచే అందుతోంది. గత కొద్ది సంవత్సరాలుగా అసోం చమురు శుద్ధి వ్యవస్థల సామర్థ్యం గణనీయంగా మెరుగైంది. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, హరిత ఇంధన రంగాల్లో కూడా అసోం వేగవంతమైన వృద్ధి చూపుతోంది. ప్రభుత్వ విధానాల ఊతంతో అసోం అటు అత్యాధునిక పరిశ్రమలకే కాక, అంకుర పరిశ్రమలకు సైతం కీలక కేంద్రంగా మారుతోంది.

మిత్రులారా..

కొద్ది రోజుల క్రితం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో కేంద్రం నామరూప్-4 కేంద్రానికి అనుమతులను మంజూరు చేసింది.  రానున్న రోజుల్లో ఈ యూరియా ఉత్పాదన కేంద్రం ఈశాన్య ప్రాంత అవసరాలనే కాక, మొత్తం దేశం అవసరాలను కూడా తీర్చగలదు. దేశ తూర్పు ప్రాంతంలో అసోం కీలక ఉత్పాదన కేంద్రంగా ఆవిర్భవించే రోజు మరెంతో దూరం లేదు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తోంది.

మిత్రులారా..

21వ శతాబ్దంలో ప్రగతి సాధనకు డిజిటల్ విప్లవం, సృజనాత్మకత, సాంకేతిక వృద్ధి అనివార్యమైనవి. ఈ దిశగా ముందస్తు సన్నద్ధతే అంతర్జాతీయ స్థాయిలో మనకు బలమైన స్థానాన్ని తెచ్చిపెడుతుంది. ఇదే లక్ష్యంగా మా  ప్రభుత్వం 21వ శతాబ్దానికి అనువైన విధానాలు, వ్యూహాలతో శరవేగంగా ముందుకు ఉరుకుతోంది. గత దశాబ్దంలో భారత్ ఎలక్ట్రానిక్స్, మొబైల్ రంగాల్లో అద్భుతమైన  ప్రగతిని సాధించిందని మీకు తెలుసు. ఇక సెమీకండక్టర్ల రంగంలో కూడా ఇదే మాదిరి విజయాన్ని పునరావృతం చేయాలని మేం భావిస్తున్నాం. సెమీకండక్టర్ల ఉత్పాదనలో అసోం ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందడం నాకెంతో సంతోషాన్నిస్తోంది. కొన్ని నెలల క్రితం అసోం జాగీరోడ్ లో టాటా సెమీకండక్టర్ అసెంబ్లీ, పరీక్షా కేంద్రం ప్రారంభమైంది. రానున్న సంవత్సరాల్లో ఈ కేంద్రం ఈశాన్య ప్రాంత సాంకేతిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించగలదు.

మిత్రులారా..

సెమీకండక్టర్ల రంగంలో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఐఐటీలతో సహకార ఒప్పందాలను కుదుర్చుకున్నాం. దేశంలో సెమీకండక్టర్ పరిశోధనాలయం ఏర్పాటవుతోంది. ఈ దశాబ్దాంతానికి ఎలక్ట్రానిక్ రంగం విలువ 500 బిలియన్ డాలర్లకు చేరగలదని భావిస్తున్నాం. భారత్ వేగం, స్థాయిలను పరిగణనలోకి తీసుకుంటే సెమీకండక్టర్ల ఉత్పాదనలో మేం ముఖ్యమైన శక్తిగా ఎదగడం ఖాయం. దరిమిలా ఈ రంగం లక్షలాది మందికి ఉపాధిని కల్పించడంతో పాటూ అసోం ఆర్థిక వ్యవస్థకు లబ్ధి చేకూరుస్తుంది.

మిత్రులారా..

గత దశాబ్ద కాలంగా భారత్ విధానపరమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో పర్యావరణ హితం పట్ల తన బాధ్యతను ఏనాడూ విస్మరించలేదు.. మా పునర్వినియోగ ఇంధన కార్యక్రమాలు అనుసరణీయమని ప్రపంచదేశాలు భావిస్తున్నాయి.  గత పదేళ్ళలో భారత్ సౌరశక్తి, పవన శక్తి, పునర్వినియోగ ఇంధన రంగాల్లో పెద్దయెత్తున పెట్టుబడులు పెట్టింది. దరిమిలా పర్యావరణ బాధ్యతలను నెరవేర్చడంతో పాటూ దేశ పునర్వినియోగ ఇంధన ఉత్పాదనా సామర్థ్యం  ఎన్నో రెట్లు పెరగడం మాకు ఒనగూడిన ప్రయోజనం. 2030 నాటికల్లా దేశ ఇంధన వ్యవస్థకు 500 గిగావాట్ల పునర్వినియోగ ఇంధన సామర్థ్యాన్ని జోడించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక హరిత ఇంధన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా కృషి చేస్తున్నాం. దేశంలో గ్యాస్ ఆధారిత మౌలిక సదుపాయాలు పెరుగుతున్నందువల్ల గ్యాస్ కు విపరీతరంగా డిమాండ్ పెరిగింది. గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కూడా వేగంగా విస్తరిస్తోంది కనుక ఈ ప్రయాణంలో అసోంకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి.  పీఎల్ఐ స్కీములు, హరిత విధానాలు సహా పరిశ్రమల ప్రయోజనార్థం ప్రభుత్వం అనేక పథకాలను సిద్ధం చేసింది. పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రం అగ్రగామిగా నిలవాలని కోరుకుంటున్నాను. అయితే  మీవంటి పరిశ్రమల నేతలు ముందుకొచ్చి  అసోం  సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగంలోకి తెస్తేనే ఇది సాధ్యపడగలదు.

మిత్రులారా…

2047కల్లా భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో దేశ తూర్పు ప్రాంతం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రోజున దేశ ఈశాన్య, తూర్పు ప్రాంతాలు మౌలిక వ్యవస్థలు, రవాణా, వ్యవసాయం, పర్యాటకం, పరిశ్రమలు వంటి రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. భారత్ అభివృద్ధి ప్రస్థానానికి ఈ ప్రాంతాలు సారథ్యం వహిస్తున్నట్లు  ప్రపంచం గుర్తించే రోజు ఎంతో దూరంలో లేదు. అసోం అభివృద్ధి యాత్రలో మీరంతా భాగస్వాములు కాగలరని, రాష్ట్రాభివృద్ధికి మీ వంతు తోడ్పాటును అందిస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. మనమంతా కలిసి అభివృద్ధి చెందుతున్న ప్రపంచ దేశాల్లో భారత్ సామర్థ్యాన్ని పటిష్టం చేసే రాష్ట్రంగా అసోంను తీర్చిదిద్దుదాం. ఈ సదస్సు సందర్భంలో మరొక్కసారి మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ మాట ఇస్తున్నాను.. ‘వికసిత్ భారత్’ యాత్రలో మీ వెంటే నిలిచి, మీ భాగస్వామ్యానికి నా సంపూర్ణమైన మద్దతును అందిస్తాను.

అందరికీ అనేకానేక ధన్యవాదాలు..

గమనిక: ఇది ప్రధాని ప్రసంగానికి భావానువాదం. ఆయన హిందీలో ప్రసంగించారు.

 

***