Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పెట్టుబడులు, మౌలిక సదుపాయాలలో అడ్వాంటేజ్ అసోం 2.0 శిఖరాగ్ర సదస్సు 2025 ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

పెట్టుబడులు, మౌలిక సదుపాయాలలో అడ్వాంటేజ్ అసోం  2.0 శిఖరాగ్ర సదస్సు 2025 ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అసోంలోని గౌహతి లో అడ్వాంటేజ్ అసోం 2.0 ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ 2025 ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులందరికీ స్వాగతం పలుకుతూ, ” భారతదేశ తూర్పు ఈశాన్య ప్రాంతాలు ఈ రోజు భవిష్యత్తు వైపు కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాయి. అడ్వాంటేజ్ అసోం అనేది అసోం సామర్థ్యాన్ని, పురోగతిని ప్రపంచంతో పెనవేయడానికి ఒక బృహత్తర చొరవ” అని శ్రీ మోదీ అన్నారు. భారతదేశ అభివృద్ధిలో తూర్పు ప్రాంతం పోషించిన ప్రధాన పాత్రకు చరిత్రే సాక్ష్యమని ఆయన అన్నారు. “ఈ రోజు వికసిత్ భారత్ వైపు మన పురోగమనంలో తూర్పు, ఈశాన్య రాష్ట్రాలు తమ నిజమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి” అని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. అడ్వాంటేజ్ అసోం అదే స్ఫూర్తికి ప్రతీక అని అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అసోం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఆయన అభినందించారు. ‘ఎ ఫర్ అసోం’ అనేది ప్రామాణికంగా మారడానికి ఎంతో దూరం లేదని 2013లో తాను చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు.

 

“ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్నప్పటికీ, నిపుణులు ఏకగ్రీవంగా ఒక నిర్ధారణను అంగీకరిస్తున్నారు: అది భారతదేశ వేగవంతమైన వృద్ధి”, అని ప్రధానమంత్రి అన్నారు. ఈ శతాబ్దపు రాబోయే 25 సంవత్సరాల కోసం నేటి భారతదేశం దీర్ఘకాలిక దార్శనికతతో పనిచేస్తోందని ఆయన ఉద్ఘాటించారు. నైపుణ్యం, సృజనాత్మకతలను శరవేగంగా అందిపుచ్చుకుంటున్న భారత యువ జనాభాపై ప్రపంచానికి అపారమైన విశ్వాసం ఉందన్నారు. కొత్త ఆకాంక్షలతో పేదరికం నుంచి బయటపడుతున్న భారత నూతన మధ్యతరగతిలో ఆత్మవిశ్వాసం పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. రాజకీయ సుస్థిరతకు, విధాన కొనసాగింపునకు మద్దతు ఇచ్చే భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలపై ప్రపంచం నమ్మకాన్ని ఉంచిందని చెబుతూ, సంస్కరణల అమలును కొనసాగిస్తున్న భారతదేశ పాలన గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. అంతేకాకుండా, భారతదేశం తన స్థానిక సరఫరా వ్యవస్థలను బలోపేతం చేస్తోందని, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటోందని ఆయన తెలిపారు.. తూర్పు ఆసియాతో బలమైన కనెక్టివిటీ, కొత్త ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ నూతన అవకాశాలను అందిస్తాయని ఆయన పేర్కొన్నారు.

దేశంపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నమ్మకాన్ని అసోంలో జరిగిన ఈ సదస్సు సాక్ష్యంగా చూపిస్తోందని అంటూ, “భారత అభివృద్ధిలో అసోం పాత్ర క్రమంగా పెరుగుతోంది” అని శ్రీ మోదీ అన్నారు.

 

అడ్వాంటేజ్ అసోం శిఖరాగ్ర సదస్సు మొదటి ఎడిషన్ 2018 లో జరిగిందని, ఆ సమయంలో అసోం ఆర్థిక వ్యవస్థ విలువ రూ .2.75 లక్షల కోట్లు అని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు అసోం సుమారు రూ.6 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా మారిందని, తమ ప్రభుత్వ హయాంలో కేవలం ఆరేళ్లలో అసోం ఆర్థిక వ్యవస్థ రెట్టింపు అయిందని అన్నారు. పైగా, ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ ప్రభావమని ఆయన అన్నారు. అసోంలో అనేక పెట్టుబడులు దానిని అపరిమితమైన అవకాశాల రాష్ట్రంగా మార్చాయని ఆయన పేర్కొన్నారు. అసోం ప్రభుత్వం విద్య, నైపుణ్యాభివృద్ధి, మెరుగైన పెట్టుబడి వాతావరణ పై దృష్టి సారించిందని ప్రధానమంత్రి అన్నారు. కనెక్టివిటీ సంబంధిత మౌలిక సదుపాయాలపై తమ ప్రభుత్వం ఇటీవలి సంవత్సరాల్లో విస్తృతంగా పనిచేసిందని ఆయన పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణ ఇస్తూ, 2014కు ముందు బ్రహ్మపుత్ర నదిపై 70 ఏళ్లలో నిర్మించిన వంతెనలు కేవలం మూడు మాత్రమే ఉండేవని, అయితే గత పదేళ్లలో కొత్తగా మరో నాలుగు వంతెనలు నిర్మించారని చెప్పారు. వీటిలో ఒక వంతెనకు భారతరత్న భూపేన్ హజారికా పేరు పెట్టారు. 2009 నుంచి 2014 మధ్య కాలంలో అసోం సగటున రూ.2,100 కోట్ల రైల్వే బడ్జెట్ ను పొందిందని, అయితే తమ ప్రభుత్వం అసోం రైల్వే బడ్జెట్ ను నాలుగు రెట్లు పెంచి రూ.10,000 కోట్లకు చేర్చిందని తెలిపారు. అసోం లోని 60 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నామని, ఈశాన్యంలో మొదటి సెమీ హైస్పీడ్ రైలు ఇప్పుడు గౌహతి – న్యూ జల్పాయిగురి మధ్య నడుస్తోందని ఆయన చెప్పారు.

 అసోంలో వైమానిక సదుపాయాలు శరవేగంగా విస్తరిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, 2014 వరకు కేవలం ఏడు మార్గాల్లో మాత్రమే విమానాలు నడిచాయని, ఇప్పుడు దాదాపు 30 రూట్లలో విమానాలు నడుస్తున్నాయని ప్రధాన మంత్రి చెప్పారు. ఈ విస్తరణ స్థానిక ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందించిందని, యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించిందని ఆయన అన్నారు. ఈ మార్పులు కేవలం మౌలిక సదుపాయాలకు మాత్రమే పరిమితం కాదని, గత దశాబ్ద కాలంలో అనేక శాంతి ఒప్పందాలు కుదుర్చుకోవడం, దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సరిహద్దు సమస్యలను పరిష్కరించడంతో శాంతిభద్రతల్లో కూడా అపూర్వమైన మెరుగుదల కనిపించిందని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. అసోం లోని ప్రతి ప్రాంతం, ప్రతి పౌరుడు, ప్రతి యువకుడు రాష్ట్ర అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. భారతదేశం అన్ని రంగాలలోనూ, ఆర్థిక వ్యవస్థ స్థాయిలోనూ గణనీయమైన సంస్కరణలకు లోనవుతోందని, వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని, పరిశ్రమలు సృజనాత్మక సంస్కృతిని ప్రోత్సహించడానికి సమగ్ర సానుకూల వ్యవస్థను ఏర్పాటు చేశామని శ్రీ మోదీ స్పష్టం చేశారు. స్టార్టప్ ల కోసం అద్భుతమైన విధానాలు రూపొందించామని, తయారీ సంస్థలకు పీఎల్ ఐ పథకాల ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నామని, కొత్త తయారీ కంపెనీలకు, ఎంఎస్ఎంఇ లకు పన్ను మినహాయింపులు ఇచ్చామని వివరించారు. దేశ మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం గణనీయమైన పెట్టుబడులు పెడుతోందని ఆయన పేర్కొన్నారు. సంస్థాగత సంస్కరణ, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణల కలయిక భారతదేశ పురోగతికి పునాదిగా మారిందని ప్రధానమంత్రి చెప్పారు. డబుల్ ఇంజిన్ వేగంతో పురోగమిస్తున్న అసోంలో కూడా ఈ పురోగతి కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. అసోం 2030 నాటికి 150 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేశారు. అసోం ఈ లక్ష్యాన్ని సాధించగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు, దీనికి అసోం లోని సమర్థులైన, ప్రతిభావంతులైన ప్రజలు, వారి ప్రభుత్వ నిబద్ధత కారణమని ఆయన అన్నారు. ఆగ్నేయాసియాకు, భారతదేశానికి మధ్య అసోం ముఖద్వారంగా ఎదుగుతోందని, ఈ సామర్థ్యాన్ని మరింత పెంచడానికి ప్రభుత్వం ‘ఉన్నతి’ అనే ఈశాన్య ప్రాంత మార్పునకు దోహదపడే పారిశ్రామికీకరణ పథకాన్ని ప్రారంభించిందని శ్రీ మోదీ అన్నారు. ‘ఉన్నతి‘ పథకం అసోంతో సహా మొత్తం ఈశాన్య ప్రాంతంలో పరిశ్రమలు, పెట్టుబడులు, పర్యాటక వృద్ధిని వేగవంతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ పథకాన్ని, అసోం అపరిమిత సామర్థ్యాన్ని పరిశ్రమ భాగస్వాములు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అసోంను దాని సహజ వనరులు, వ్యూహాత్మకంగా దాని స్థానం ఆ రాష్ట్రాన్ని పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా మారుస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అసోం సామర్థ్యానికి ఉదాహరణగా అసోం టీని ప్రస్తావిస్తూ, అది గత 200 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్త బ్రాండ్‌గా మారిందని, ఇతర రంగాల్లో కూడా అభివృద్ధికి ప్రేరణగా నిలిచిందని అన్నారు.

 ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంభవిస్తున్న మార్పుల గురించి చెబుతూ భరోసాని కల్పించే సరఫరా వ్యవస్థలకు డిమాండ్ పెరుగుతోందన్నారు. “తయారీ రంగంలో వేగవంతమైన వృద్ధి సాధించేందుకు భారత్ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది” అని ప్రధాని చెప్పారు. మేకిన్ ఇండియా పథకాల్లో భాగంగా ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైళ్ళు వంటి రంగాల్లో తక్కువ ఖర్చుతో ఉత్పాదన జరిపేందుకు ప్రాధాన్యాన్ని ఇస్తున్నట్లు చెప్పారు. భారతీయ పరిశ్రమలు స్థానిక అవసరాలను నెరవేర్చడం సహా అంతర్జాతీయ మార్కెట్లలో తమ సత్తా చాటుతున్నాయన్నారు. ఈ ఉత్పత్తి విప్లవంలో అసోం కీలక భూమిక పోషిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు.  

 

ప్రపంచ వాణిజ్యంలో అసోం ఎప్పుడూ భాగస్వామి గానే ఉందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈనాడు దేశంలోని సముద్రేతర (ఆన్-షోర్) సహజ వాయువు ఉత్పాదనలో సగానికి పైగా అసోం నుంచే అందుతోందని, ఇటీవలి కాలంలో అసోం చమురు శుద్ధి వ్యవస్థల సామర్థ్యం గణనీయంగా మెరుగైందని చెప్పారు. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, హరిత ఇంధన రంగాల్లో కూడా అసోం ముఖ్య భాగస్వామిగా ఆవిర్భవిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ప్రభుత్వ విధానాల ఊతంతో అసోం అటు అత్యాధునిక పరిశ్రమలకే కాక, అంకుర పరిశ్రమలకు సైతం కీలక కేంద్రంగా మారుతోందన్నారు.

తాజా బడ్జెట్లో కేంద్రం నామరూప్-4 కేంద్రానికి అనుమతులను మంజూరు చేసిన విషయాన్ని చెబుతూ, రానున్న రోజుల్లో ఈ యూరియా ఉత్పాదన కేంద్రం ఈశాన్య ప్రాంతం అవసరాలనే కాక, మొత్తం దేశం అవసరాలను కూడా తీర్చగలదన్నారు. “దేశ తూర్పు ప్రాంతంలో అసోం కీలక ఉత్పాదన కేంద్రంగా ఆవిర్భవించే రోజు మరెంతో దూరం లేదు”, అని శ్రీ మోదీ అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తోందన్నారు. 21వ శతాబ్దంలో ప్రగతి సాధించేందుకు డిజిటల్ విప్లవం, సృజనాత్మకత, సాంకేతిక వృద్ధి అత్యవసరమన్న శ్రీ మోదీ, “మనం ఎంత ముందస్తుగా సన్నద్ధంగా ఉండగలం అన్నదాన్ని బట్టి అంతర్జాతీయ స్థాయిలో మన పాత్ర అంత బలంగా ఉంటుంది” అని అన్నారు. తమ ప్రభుత్వం 21వ శతాబ్దానికి అనువైన విధానాలు, వ్యూహాలతో ముందుకు సాగుతోందన్నారు. గత దశాబ్దంలో భారత్ ఎలక్ట్రానిక్స్, మొబైల్ రంగాల్లో సాధించిన గణనీయమైన ప్రగతిని ఉటంకిస్తూ, సెమీకండక్టర్ల రంగంలో కూడా ఇదే మాదిరి విజయాన్ని పునరావృతం చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. సెమీకండక్టర్ల ఉత్పాదనలో అసోం ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేసిన ప్రధాని, జాగీరోడ్ లో ఇటీవల ప్రారంభించిన టాటా సెమీకండక్టర్ అసెంబ్లీ, పరీక్షా కేంద్రం ఈశాన్య ప్రాంతంలో సాంకేతిక అభివృద్ధికి దోహదపడగలదని అన్నారు. సెమీకండక్టర్ల రంగంలో సృజనాత్మకతను సాధించేందుకు ఐఐటీతో కుదుర్చుకున్న సహకార ఒప్పందం గురించి చెబుతూ దేశవ్యాప్తంగా ఈ రంగంలో జరుగుతున్న పరిశోధనల గురించి వివరించారు. ఈ దశాబ్దాంతానికి ఎలక్ట్రానిక్ రంగం విలువ 500 బిలియన్ డాలర్లకు చేరగలదన్న విశ్వాశాన్ని శ్రీ మోదీ వ్యక్తం చేశారు. “భారత్ వేగం, స్థాయిలను పరిశీలిస్తే సెమీకండక్టర్ల ఉత్పాదనలో మనం ముఖ్యమైన శక్తిగా ఎదగడం తథ్యం. ఈ రంగం లక్షలాది మందికి ఉపాధిని కల్పించడంతో పాటూ అసోం ఆర్థిక వ్యవస్థకు లబ్ధి చేకూరుస్తుంది” అని అన్నారు.

“గత దశాబ్దంలో మనం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు పర్యావరణ హితం పట్ల మన బాధ్యతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నవే… మన పునర్వినియోగ ఇంధన కార్యక్రమాలను అనుసరించదగ్గవని ప్రపంచదేశాలు భావిస్తున్నాయి” అని ప్రధాని అన్నారు. గత పదేళ్ళలో భారత్ సౌరశక్తి, పవన శక్తి, పునర్వినియోగ ఇంధన రంగాల్లో పెద్దయెత్తున పెట్టుబడులు పెట్టిందని వెల్లడించారు. దరిమిలా పర్యావరణపరంగా గల బాధ్యతలను తీర్చడంతో పాటూ దేశ పునర్వినియోగ ఇంధన ఉత్పాదనా సామర్థ్యం ఎన్నో రెట్లు పెరిగిందని విశ్లేషించారు. 2030 నాటికల్లా పునర్వినియోగ ఇంధన సామర్థ్యాన్ని 500 గిగా వాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శ్రీ మోదీ వెల్లడించారు. “2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక హరిత ఇంధన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా కృషి చేస్తున్నాం” అని పేర్కొన్నారు. దేశంలో గ్యాస్ ఆధారిత మౌలిక సదుపాయాలు పెరుగుతున్నందువల్ల గ్యాస్ కు డిమాండ్ పెరిగిందని, గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తోందన్న ప్రధాని, ఈ ప్రయాణంలో అసోంకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. పీఎల్ఐ స్కీములు, హరిత విధానాలు సహా పరిశ్రమల ప్రయోజనార్థం ప్రభుత్వం అనేక పథకాలను సిద్ధం చేసిందని శ్రీ మోదీ అన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రం అగ్రగామిగా నిలవాలని కోరుకుంటున్నట్లు, ఈ దిశగా అసోం సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాలని పరిశ్రమ నేతలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు.

2047కల్లా భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో దేశ తూర్పు ప్రాంతం కీలక పాత్ర పోషిస్తుందన్న శ్రీ మోదీ, “ఈ రోజున భారత దేశ ఈశాన్య, తూర్పు ప్రాంతాలు మౌలిక వ్యవస్థలు, రవాణా, వ్యవసాయం, పర్యాటకం, పరిశ్రమలు వంటి రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి” అన్నారు. భారత్ అభివృద్ధి ప్రస్థానానికి ఈ ప్రాంతాలు సారథ్యం వహిస్తున్నట్లు ప్రపంచం గుర్తించే రోజు ఎంతో దూరంలో లేదని శ్రీ మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అసోం అభివృద్ధి పథంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన శ్రీ మోదీ, అభివృద్ధి చెందుతున్న ప్రపంచ దేశాల్లో భారత్ సామర్థ్యాన్ని పటిష్టం చేసే రాష్ట్రంగా అస్సాంకు అందరూ సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. వికసిత్ భారత్ ప్రయాణంలో పెట్టుబడిదార్లు, పరిశ్రమ నేతల భాగస్వామ్యానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని, తాను వారి వెంటే ఉన్నానంటూ వారి విశ్వాసాన్ని పెంపొందించారు.

 

అసోం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వశర్మ, కేంద్ర మంత్రులు డాక్టర్ ఎస్. జయశంకర్, శ్రీ సర్బానంద్ సోనోవాల్, శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ పబిత్ర మార్గరీటా, ఇతర ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం

 

2025-అడ్వాంటేజ్ అసోం 2.0 పెట్టుబడులు, మౌలిక సదుపాయాల సదస్సును ఫిబ్రవరి 25, 26 తేదీల్లో గౌహతిలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రారంభ సమావేశం సహా ఏడు మంత్రివర్గ సమావేశాలు, 14 ఇతివృత్త ఆధారిత సమావేశాలు ఏర్పాటయ్యాయి. 240 మంది ప్రదర్శనకారులతో కూడిన ప్రదర్శనలో రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని ఆవిష్కరిస్తారు. పారిశ్రామిక వృద్ధి, ప్రపంచదేశాలతో వాణిజ్య భాగస్వామ్యాలు, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎంఎస్ఎంఈ రంగాలపై ప్రదర్శన ప్రత్యేక దృష్టి సారిస్తుంది.

 

వివిధ అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ నేతలు, పెట్టుబడిదారులు, విధానకర్తలు, పరిశ్రమ నిపుణులు, అంకుర పరిశ్రమలు, విద్యార్థులు తదితరులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.