భారత్ మాతా కీ – జై!
భారత్ మాతా కీ – జై!
గౌరవనీయ అస్సాం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వశర్మ, కేంద్ర ప్రభుత్వంలో నా సహచరులు డాక్టర్ ఎస్. జయశంకర్, శ్రీ సర్బానంద్ సోనోవాల్, త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ మాణిక్ సాహా, ఇతర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు, కళాకారులు, అస్సాం సోదర సోదరీమణులు…
అందరికీ నమస్కారం… మీరంతా కుశలమే కదా ప్రియ మిత్రులారా!
మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు!
ఈరోజున ఈ కార్యక్రమానికి హాజరవడం నాకెంతో సంతోషాన్నిస్తోంది..
సోదర సోదరీమణులారా..
ఈ రోజు ఇక్కడ అస్సాంలో అద్భుతమైన వాతావరణం నెలకొంది.. ఉత్సాహం ఉరకలు వేస్తోంది .. మొత్తం స్టేడియంలో ఉల్లాసం, సంతోషం ఉప్పొంగుతున్నాయి… ఎటుచూసినా ఝుమోయిర్ నృత్యం కోసం కళాకారులంతా సన్నద్ధులవడం కనిపిస్తోంది.. ఈ సన్నద్ధతలో అస్సాం తేయాకు తోటల అందం, సుగంధం స్పష్టంగా తెలుస్తోంది.. తేయాకు రంగూ రుచీ సువాసన గురించి టీ అమ్మినవారికన్నా ఎవరికి బాగా అర్ధమవుతుంది చెప్పండి! మీ అందరికీ ఝుమోయిర్ తో, టీ తోటల సంస్కృతితో ఉన్న ప్రత్యేకమైన అనుబంధం మాదిరిగానే నాకూ వీటితో అనుబంధం ఉంది.
మిత్రులారా..
ఇంత పెద్ద సంఖ్యలో కళాకారులు కలిసి ఝుమోయిర్ నృత్యాన్ని ప్రదర్శిస్తే, అది కచ్చితంగా ఒక రికార్డుగా నిలిచిపోతుంది. కిందటసారి, అంటే 2023లో నేను అస్సాం సందర్శనకి వచ్చినప్పుడు 11,000 మందికి పైగా బిహు నృత్యాన్ని సామూహికంగా ప్రదర్శించి సరికొత్త రికార్డుని నెలకొల్పారు. ఆ క్షణాలని నేను ఎన్నటికీ మరువలేను! ఆనాడు టీవీలో ఆ కార్యక్రమాన్ని వీక్షించిన వారు కూడా పదేపదే ఆ విషయాన్ని నాకు జ్ఞాపకం చేస్తారు. ఈరోజు మళ్ళీ అటువంటి అద్భుతమైన ప్రదర్శన ఆవిష్కృతమయ్యేందుకు నేను ఎదురుచూస్తున్నాను. ఇటువంటి భవ్యమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చురుకైన మన ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మాజీకి, అస్సాం ప్రభుత్వానికీ అభినందనలు తెలియజేస్తున్నాను.
తేయాకు పంటతో మమేకమైన అస్సాం సమూహాలకీ, స్థానిక ప్రజలకూ ఈ సందర్భం గర్వకారణం, ఎంతో ప్రత్యేకం. ఈ సందర్భంగా అందరికీ శుభాభినందనలు.
మిత్రులారా..
ఇటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలు కేవలం అస్సాం హోదాని పెంచేవి మాత్రమే కాదు. భారత దేశ వైవిధ్యానికి కూడా ప్రతీకలుగా నిలిచేవి. అస్సాం సంస్కృతిని ప్రత్యక్షంగా అనుభూతి చెందేందుకు 60 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ఇక్కడున్నారని మీకు చెప్పాను కద! ఒకప్పుడు అస్సాం సహా ఈశాన్య భారతదేశ అభివృద్ధిని పట్టించుకునేవారు కాదు. ఇక్కడి విలక్షణమైన సంస్కృతిని గురించి పట్టించుకునేవారు కాదు! నేడు పరిస్థితి మారింది! ఈశాన్య భారతదేశ సంస్కృతికి ప్రత్యేకమైన రాయబారి ఉన్నారు.. అది మోదీనే! ఇక్కడి కాజీరంగా అభయారణ్యంలో బస చేసిన తొలి భారత ప్రధానిని నేనే! ఈ సందర్భంగా ఇక్కడి జీవ వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశాను. ఇప్పుడే హిమంత దా ఆ విషయాన్ని గురించి చెబితే మీరంతా మీ కృతజ్ఞతాపూర్వక స్పందన తెలిపేందుకు లేచి నిలుచున్నారు! అస్సామీలు కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూసిన గుర్తింపునొకదాన్ని మేం కొద్ది నెలల కిందటే అందించాం. అస్సామీకి ప్రాచీన భాష హోదాను కల్పించడం. అదే విధంగా చరాయిదియో మైదాంకు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు కల్పించాం. ఈ దిశగా బీజేపీ చేసిన కృషి ఎంతో ఉపకరించింది.
మిత్రులారా,
మొఘలులను అప్రతిహతంగా ప్రతిఘటించి అస్సాం సంస్కృతిని, అస్తిత్వాన్ని కాపాడిన అస్సాం ధీర పుత్రుడు వీర లచిత్ బోర్ఫుకాన్ వారసత్వం ఈ రాష్ట్రానికి గర్వకారణం. ఆయన 400వ జయంతి వేడుకలను మేం ఘనంగా నిర్వహించాం. గణతంత్ర దినోత్సవ కవాతులో ఆయన అద్భుతమైన ప్రతిమను కూడా ప్రదర్శించాం. యావద్దేశమూ అప్పుడాయనకు నివాళి అర్పించింది. ఇక్కడ అస్సాంలో 125 అడుగుల లచిత్ కాంస్య విగ్రహాన్ని కూడా నెలకొల్పాం. అలాగే, గిరిజన సమాజాల వారసత్వ ఘనతను చాటేలా జనజాతీయ గౌరవ దివస్ నిర్వహణను ప్రారంభించాం. అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ స్వయంగా గిరిజన నేపథ్యం ఉన్న వ్యక్తి. అంకితభావం, అచంచల కృషితో ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా గిరిజన యోధులు, ధీరవనితల కృషిని అజరామరంగా నిలపడం కోసం గిరిజన ప్రదర్శన శాలలను కూడా ఏర్పాటు చేస్తున్నాం.
మిత్రులారా,
బీజేపీ ప్రభుత్వం అస్సాం అభివృద్ధిని పరుగులు పెట్టించడం మాత్రమే కాకుండా, గిరిజనులైన తేయాకు తోటల కార్మికులకు కూడా విశేషంగా సేవలందిస్తోంది. తేయాకు తోటల కార్మికుల ఆదాయాన్ని పెంచడం కోసం అస్సాం టీ కార్పొరేషన్ కార్మికులకు ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. తేయాకు తోటల్లో పనిచేసే మన అక్కాచెల్లెల్లు, ఆడబిడ్డలు ఎదుర్కొనే ప్రధాన సమస్య గర్భవతులుగా ఉన్న సమయంలో ఆర్థిక అభద్రత. ప్రస్తుతం 1.5 లక్షల మంది మహిళలు ఖర్చుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా గర్భవతులుగా ఉన్న సమయంలో రూ.15 వేల ఆర్థిక సాయం పొందుతున్నారు. ఈ కుటుంబాల ఆరోగ్యం కోసం అస్సాం ప్రభుత్వం తేయాకు తోటల్లో 350 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేస్తోంది. అంతేకాకుండా 100కు పైగా మోడల్ టీ గార్డెన్ స్కూళ్లను ఏర్పాటు చేయడం ద్వారా వారి పిల్లలకు నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తోంది. మరో 100 మోడల్ స్కూళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. తేయాకు తోటల్లో పనిచేసే యువతకు ఓబీసీ కోటా కింద 3 శాతం రిజర్వేషన్లను కూడా ప్రవేశపెట్టాం. ఇంకా, స్వయం ఉపాధి కోసం రూ.25,000 ఆర్థిక సాయం అందించి అస్సాం ప్రభుత్వం వారికి చేయూతనిస్తోంది. తేయాకు పరిశ్రమ, కార్మికుల అభివృద్ధి అస్సాం అభివృద్ధిని వేగవంతం చేయడంతోపాటు తద్వారా మన ఈశాన్య ప్రాంతం ప్రగతిపథంలో కొత్త శిఖరాలను అధిరోహిస్తుంది.
మీరిప్పుడు అద్భుత ప్రదర్శనను ప్రారంభించబోతున్నారు. ముందుగానే హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ రోజు భారత్ మొత్తం మీ నృత్యాన్ని ఆస్వాదిస్తుందని నా నమ్మకం. ఈ ప్రదర్శన ఎప్పుడు మొదలవుతుందా అని టీవీ చానెళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ దేశం, మొత్తం ప్రపంచం ఈ గొప్ప ప్రదర్శనను వీక్షించబోతోంది. అద్భుతంగా ఝుమోయిర్ ప్రదర్శన చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అందరూ బాగుండాలని కోరుకుంటూ.. ఎప్పుడెప్పుడు మళ్లీ మిమ్మల్ని కలుస్తానా అని ఎదురుచూస్తుంటాను. ధన్యవాదాలు!
భారత్ మాతా కీ – జై!
***
Delighted to be amongst the wonderful people of Assam at the vibrant Jhumoir Binandini programme. Grateful for the warmth and affection. https://t.co/fER1Jfg2cf
— Narendra Modi (@narendramodi) February 24, 2025
PM @narendramodi participated in the Jhumoir Binandini programme in Guwahati, Assam. Here are a few glimpses. pic.twitter.com/e4ffqf5EJm
— PMO India (@PMOIndia) February 24, 2025
Every moment of Jhumoir Binandini was pure magic! This was an experience that touched the soul.
— Narendra Modi (@narendramodi) February 24, 2025
As we celebrate 200 years of Assam Tea, this programme beautifully merges history, culture and emotion.
The culture of the tea tribes, their spirit and their deep connection to the… pic.twitter.com/7BxtdNyCqB
I call upon people across India to know more about Jhumoir and the exceptional culture of the tea tribes. Today’s programme will be remembered as a monumental effort in this direction. pic.twitter.com/2DXEfYFRcB
— Narendra Modi (@narendramodi) February 24, 2025
ঝুমইৰ বিনন্দিনীৰ প্ৰতিটো মুহূৰ্ত যাদুৰ দৰে লাগিল! এয়া এক অন্তৰস্পৰ্শী অভিজ্ঞতা আছিল।
— Narendra Modi (@narendramodi) February 24, 2025
আমি অসমৰ চাহৰ ২০০ বছৰ উদযাপন কৰাৰ সময়ত এই অনুষ্ঠানত ইতিহাস, সংস্কৃতি আৰু আৱেগৰ সুন্দৰ মিশ্ৰণ ঘটিছে।
চাহ জনগোষ্ঠীৰ সংস্কৃতি, তেওঁলোকৰ উদ্যম আৰু এই ভূমিৰ সৈতে তেওঁলোকৰ গভীৰ সংযোগ সকলো আজি… pic.twitter.com/0j44v8vgi5
ভাৰতবৰ্ষৰ সকলো জনসাধাৰণক ঝুমইৰ আৰু চাহ জনজাতিসকলৰ ব্যতিক্ৰমী সংস্কৃতিৰ বিষয়ে অধিক জানিবলৈ আহ্বান জনাইছো। আজিৰ অনুষ্ঠানটো এই দিশত এক মহত্বপূৰ্ণ প্ৰচেষ্টা হিচাপে স্মৰণীয় হৈ থাকিব। pic.twitter.com/knn8Em1dq7
— Narendra Modi (@narendramodi) February 24, 2025