మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్ గారూ, ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ గారూ, ఇతర ప్రముఖులూ, సోదరీ సోదరులారా!
ముందుగా నేను ఇక్కడికి రావడం ఆలస్యమైనందుకు క్షమాపణలు కోరుతున్నాను. 10, 12వ తరగతి విద్యార్థులకు ఈ రోజు పరీక్షలున్నాయని నిన్న నేనిక్కడికి వచ్చినప్పుడు తెలిసింది. వారి పరీక్షల సమయం, రాజ్ భవన్ నుంచి నేను బయలుదేరే సమయం ఒకేసారి ఉన్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా రోడ్లను మూసేస్తే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఇబ్బందులు పడతారు. వారికి అసౌకర్యం కలగకుండా విద్యార్థులంతా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నాకే రాజ్ భవన్ నుంచి బయలుదేరాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఆలస్యమైంది. అలా కావాలనే నేను నా ప్రయాణాన్ని 15-20 నిమిషాలు ఆలస్యం చేశాను. ఇది మీకు కొంత అసౌకర్యాన్ని కలిగించింది. నన్ను మన్నించాలని మరోసారి మీ అందరినీ కోరుతున్నాను.
మిత్రులారా,
భోజరాజు పాలించిన ఈ పవిత్ర నగరానికి మిమ్మల్ని స్వాగతించడం నాకు గర్వకారణం. వివిధ పరిశ్రమలు, అనేక రంగాలకు చెందిన చాలామంది సహచరులు నేడిక్కడ సమావేశమయ్యారు. ‘వికసిత మధ్యప్రదేశ్’ నుంచి ‘వికసిత భారత్’ దిశగా సాగుతున్న ప్రస్థానంలో ఈ కార్యక్రమానికి విశేష ప్రాధాన్యముంది. ఈ బృహత్కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మోహన్ గారికి, ఆయన బృందానికి నా హృదయపూర్వక అభినందనలు.
మిత్రులారా,
ప్రపంచం యావత్తూ భారత్ పట్ల ఇంత ఆశావహంగా ఉండడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. సామాన్యులు, ఆర్థిక నిపుణులు, పలు దేశాలు, లేదా అంతర్జాతీయ సంస్థలు… ఏవైనా కావచ్చు – అందరికీ భారత్ పై భారీ అంచనాలున్నాయి. కొన్ని వారాలుగా చేసిన వ్యాఖ్యలు భారత్ లోని పెట్టుబడిదారులందరిలో ఉత్సాహాన్ని పెంచాయి. కొన్నేళ్లలో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుందని కొన్ని రోజుల కిందటే ప్రపంచ బ్యాంకు పేర్కొన్నది. ప్రపంచ భవిష్యత్తు భారత్ లోనే ఉన్నదని ఓఈసీడీ కీలక ప్రతినిధి వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పులపై పనిచేసే ఐక్యరాజ్యసమితి సంస్థ ఇటీవల భారత్ ను సౌరశక్తిలో అగ్రగామిగా పేర్కొన్నది. అనేక దేశాలు మాటలకే పరిమితమవుతుండగా, భారత్ ఫలితాలను సాధిస్తోందని కూడా ఈ సంస్థ పేర్కొన్నది. అంతర్జాతీయ ఏరోస్పేస్ సంస్థలకు అద్భుతమైన సరఫరా శ్రేణీ నిలయంగా భారత్ ఎదుగుతున్న తీరును తాజా నివేదిక వివరిస్తోంది. అంతర్జాతీయంగా సరఫరా శ్రేణిలో ఎదురవుతున్న సవాళ్లకు భారత్ ను పరిష్కారంగా చాలా మంది భావిస్తున్నారు. భారతదేశంపై ప్రపంచానికి విశ్వాసం పెరుగుతున్నదని చాటే అనేక ఉదాహరణలను నేను చెప్పగలను. ఇది భారత్ లోని ప్రతీ రాష్ట్ర విశ్వాసాన్ని కూడా శక్తిమంతం చేస్తోంది. నేడు మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న ఈ ప్రపంచ సదస్సులో ఆ సానుకూలత స్పష్టంగా వ్యక్తమవుతోంది.
మిత్రులారా,
జనాభా పరంగా మధ్యప్రదేశ్ దేశంలో అయిదో అతిపెద్ద రాష్ట్రం. వ్యవసాయంలో అగ్ర రాష్ట్రాలలో ఒకటి. ఖనిజ వనరులలో మొదటి అయిదు రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ ఒకటిగా ఉంది. రాష్ట్రానికి జవసత్వాలనిస్తూ నర్మదామాత మధ్యప్రదేశ్ కు ఆశీస్సులు అందిస్తోంది. జీడీపీలో కూడా దేశంలోని అయిదు అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా అవతరించగల సామర్థ్యం, అపారమైన అవకాశాలు ఇక్కడ ఉన్నాయి.
మిత్రులారా,
విప్లవాత్మకమైన మార్పుల దిశగా గత రెండు దశాబ్దాలుగా కొత్త శకంలో మధ్యప్రదేశ్ పయనిస్తోంది. ఒకప్పుడు విద్యుత్, నీటి సరఫరాలో పెద్ద సవాళ్లనే రాష్ట్రం ఎదుర్కొన్నది. శాంతిభద్రతల పరిస్థితీ దారుణంగా ఉండి పారిశ్రామికాభివృద్ధి కష్టతరమైంది. అయితే గత 20 ఏళ్లుగా ప్రజల మద్దతుతో మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం సుపరిపాలనపై దృష్టి సారించింది. రెండు దశాబ్దాల కిందట మధ్యప్రదేశ్ లో పెట్టుబడులకు పెట్టుబడిదారులు వెనుకాడేవారు. కానీ, నేడు దేశంలో అత్యధిక పెట్టుబడుల గమ్యస్థానంగా ఈ రాష్ట్రం నిలిచింది. ఒకప్పుడు ఇక్కడ రోడ్లు సరిగా లేక బస్సు ప్రయాణం కూడా కష్టంగా ఉండేది. కానీ నేడు, దేశంలో ఎలక్ట్రిక్ వాహన విప్లవంలో ముందువరుసలో నిలిచిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. 2025 జనవరి నాటికి 90% వృద్ధిని నమోదు చేస్తూ.. రాష్ట్రంలో దాదాపు 2 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు నమోదయ్యాయి. కొత్త ఉత్పాదక రంగాలకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మధ్యప్రదేశ్ వేగంగా ఎదుగుతోందనడానికి ఇది నిదర్శనం. ఈ సంవత్సరాన్ని పరిశ్రమలు, ఉపాధి సంవత్సరంగా ప్రకటించిన మోహన్ గారికి, ఆయన బృందానికి నా అభినందనలు.
మిత్రులారా,
గత దశాబ్దకాలంలో భారత్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో దూసుకుపోతోంది. దీనివల్ల మధ్యప్రదేశ్ ఎంతో ప్రయోజనం పొందిందని నేను నమ్మకంగా చెప్పగలను. దేశంలోని రెండు అతిపెద్ద నగరాలను కలిపే ఢిల్లీ – ముంబయి ఎక్స్ ప్రెస్ రహదారి ఎక్కువ భాగం మధ్యప్రదేశ్ గుండా వెళ్తోంది. అంటే, ఓవైపు ముంబయి ఓడరేవులను వేగంగా చేరుకోవడంతోపాటు ఉత్తర భారత మార్కెట్లతో కూడా మధ్యప్రదేశ్ అనుసంధానమవుతోంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో 5 లక్షల కిలోమీటర్లకు పైగా రోడ్లున్నాయి. రాష్ట్రంలోని పారిశ్రామిక కారిడార్లను ఆధునిక ఎక్స్ ప్రెస్ రహదారులతో అనుసంధానం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లో రవాణా రంగంలో వేగవంతమైన వృద్ధికి ఇది నిదర్శనం.
మిత్రులారా,
విమాన రవాణా విషయానికొస్తే గ్వాలియర్, జబల్పూర్ విమానాశ్రయాల టెర్మినళ్లను విస్తరించాం. అంతటితో మేం ఆగిపోలేదు… విస్తృతమైన మధ్యప్రదేశ్ రైల్వే వ్యవస్థను కూడా ఆధునికీకరిస్తున్నాం. రాష్ట్రంలో 100 శాతం రైల్వేల విద్యుదీకరణ జరిగింది. భోపాల్ లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ దాని రూపురేఖలతో ప్రపంచస్థాయి గుర్తింపు పొందింది. ఈ నమూనాను అనుసరించి అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మధ్యప్రదేశ్ లోని 80 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నాం.
మిత్రులారా,
గత దశాబ్దంలో భారత ఇంధన రంగంలో అపూర్వమైన వృద్ధి నమోదైంది. ముఖ్యంగా హరిత ఇంధనం విషయంలో ఊహకందని విజయాన్ని దేశం సాధించింది. గత పదేళ్లలో ఇంధన రంగంలో 70 బిలియన్ డాలర్లకు పైగా, అంటే రూ. 5 ట్రిలియన్లకు పైగా పెట్టుబడులు పెట్టాం. దీంతో గత ఏడాది కాలంలోనే పర్యావరణ హిత ఇంధన రంగంలో పది లక్షలకు పైగా ఉద్యోగాలు లభించాయి. ఇంధన రంగంలో ఈ అసాధారణమైన వృద్ధి వల్ల మధ్యప్రదేశ్ కూడా విశేషమైన ప్రయోజనాలు పొందింది. నేడు దాదాపు 31,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో మధ్యప్రదేశ్ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉంది. ఇందులో 30% పర్యావరణ హిత ఇంధన వనరుల నుంచి లభిస్తోంది. దేశంలోని అతిపెద్ద సోలార్ పార్కులలో రేవా సోలార్ పార్క్ ఒకటి. ఇటీవలే ఓంకారేశ్వర్ లో తేలియాడే సోలార్ ప్లాంటును ప్రభుత్వం ప్రారంభించింది. అంతేకాకుండా, మధ్యప్రదేశ్ ను పెట్రోకెమికల్స్ లో ప్రధాన కేంద్రంగా నిలపడానికి దోహదం చేసే బినా రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్సులో ప్రభుత్వం రూ. 50,000 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఆధునిక విధానాలు, ప్రత్యేక పారిశ్రామిక అవస్థాపన ద్వారా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేయూతనిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే 300కు పైగా పారిశ్రామిక మండళ్లున్నాయి. పీఠంపూర్, రాట్లాం, దేవాస్ లలో వేలాది ఎకరాల విస్తీర్ణంలో భారీ పెట్టుబడి జోన్లు ఏర్పాటవుతున్నాయి. వీటిద్వారా పెట్టుబడిదారులందరికీ అత్యధిక రాబడులు లభించేలా అపారమైన అవకాశాలను మధ్యప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తోంది.
మిత్రులారా,
పారిశ్రామికాభివృద్ధికి నీటి భద్రత ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. ఇందుకోసం ఓ వైపు జలసంరక్షణపై దృష్టి సారిస్తూనే మరోవైపు నదుల అనుసంధానం అనే బృహత్తర కార్యక్రమంతో ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రధానంగా మధ్యప్రదేశ్ వ్యవసాయం, పరిశ్రమలు లబ్ధి పొందనున్నాయి. కెన్–బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు పనులు రూ. 45,000 కోట్ల పెట్టుబడితో ఇటీవల ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 10 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిలో ఉత్పాదకత పెరుగుతుంది. మధ్యప్రదేశ్ లో నీటి నిర్వహణను కూడా ఇది గణనీయంగా బలోపేతం చేస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు ఆహార శుద్ధి, వ్యావసాయిక పరిశ్రమలు, టెక్స్ టైల్ రంగాల్లో రాష్ట్రానికి అపారమైన అవకాశాలను అందిస్తాయి.
మిత్రులారా,
మధ్య ప్రదేశ్‌లో డబల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, అభివృద్ధి వేగం కూడా రెట్టింపయింది. రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేయడానికి మధ్య ప్రదేశ్ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం భుజం భుజం కలిపి పనిచేస్తోంది. ఎన్నికలప్పుడు, మేంమా మూడో పదవీకాలంలో మూడింతలు వేగంగా పనిచేస్తామని నేను అన్నాను. ఈ ఏడాదిలో తొలి 50 రోజుల్లో ఇప్పటికే ఈ వేగాన్ని మనం చూశాం. ఈ నెలలోనే, మా బడ్జెటును ప్రవేశపెట్టాం. ఈ బడ్డెటులో, భారత్ వృద్ధికి అవసరమయ్యే ప్రతి ఒక్క ఉత్ప్రేరకానికీ మేం శక్తిని అందించాం. మా పన్ను చెల్లింపుదారుల్లో అతి పెద్ద వర్గం మధ్యతరగతి. అంతేకాదు సేవలకూ, తయారీకీ గిరాకీని కల్పిస్తోంది ఈ వర్గం. మధ్యతరగతికి సాధికారతను కల్పించడానికి ఈ బడ్జెటులో మేం అనేక చర్యలు తీసుకొన్నాం. మేం 12 లక్షల రూపాయల వరకు ఆదాయానికి పన్ను లేకుండా చేయడంతోపాటు పన్ను శ్లాబులలో మార్పులు చేశాం. బడ్జెటు తరువాత ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లను తగ్గించింది.
మిత్రులారా,
బడ్జెటు స్థానిక సరఫరా వ్యవస్థ (లోకల్ సప్లయ్ చైన్)ను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేస్తోంది. అదే జరిగితే మనం తయారీ రంగంలో సంపూర్ణంగా స్వయంసమృద్ధం కాగలుగుతాం. సూక్ష్మ లఘు మధ్యతరహా వాణిజ్య వ్యవస్థ (ఎంఎస్ఎంఈ) అవకాశాలకు ఇదివరకటి ప్రభుత్వాలు గిరి గీసిన కాలమంటూ ఒకటి ఉండింది. ఇది భారత్‌లో స్థానిక సరఫరా వ్యవస్థ పూర్తి స్థాయిలో రూపుదాల్చకుండా అడ్డుకొంది. ప్రస్తుతం, మేం ఎంఎస్ఎంఈల నాయకత్వంలో స్థానిక సరఫరా హారాన్ని తయారు చేయడానికి ప్రాధాన్యాన్ని ఇస్తున్నాం. ఎంఎస్ఎంఈల పరిధిని మరింత మెరుగుపరిచి, రుణ సదుపాయంతో ముడిపెట్టిన ప్రోత్సాహకాలను అందిస్తూ, మునుపటితో పోలిస్తే రుణ ప్రాప్తి అవకాశాల్ని సరళతరం చేసి, విలువ జోడింపునకు మరింతగా మద్దతిచ్చి ఎగుమతులను పెంచే చర్యలను తీసుకున్నాం.
మిత్రులారా,
గత పది సంవత్సరాలుగా, మేం జాతీయ స్థాయిలో ప్రధాన సంస్కరణల జోరును పెంచాం. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో, స్థానిక స్థాయిలలో కూడా సంస్కరణలను ప్రోత్సహిస్తున్నాం. బడ్జెటులో ప్రస్తావించిన స్టేట్ డీరెగ్యులేషన్ కమిషనును గురించి నేను ప్రధానంగా చెప్పదలచుకొన్నాను. మేం రాష్ట్రాలతో అదేపనిగా సంప్రదింపులు జరుపుతున్నాం. గత కొన్ని సంవత్సరాల్లో, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 40,000 కన్నా ఎక్కువ నియమపాలన షరతుల్ని తగ్గించాం. ఇటీవలి సంవత్సరాల్లో, సుమారు 1,500 కాలం చెల్లిన చట్టాలను రద్దు చేశాం. ఆ చట్టాలు వాటిని ప్రవేశపెట్టిన ప్రయోజనాలను ఇక ఎంతమాత్రం నెరవేర్చడంలేదు. వ్యాపార నిర్వహణలో సౌలభ్యానికి అడ్డుపడుతున్న నిబంధనలను గుర్తించాలన్నదే మా ధ్యేయం. రాష్ట్రాలలో పెట్టుబడులకు అనుకూలంగా ఉండే నియంత్రణల సంబంధి విస్తారిత అనుబంధ వ్యవస్థ (రెగ్యులేటరీ ఇకోసిస్టమ్)ను ఏర్పాటుచేయడంలో డీరెగ్యులేషన్ కమిషన్ తోడ్పడుతుంది.
మిత్రులారా,
ఈ సారి బడ్జెటులో, మేం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ స్వరూపాన్ని కూడా సులభతరంగా చేశాం. పరిశ్రమలకు అత్యవసరమయ్యే అనేక ఇన్పుట్స్ రేట్లను తగ్గించాం. దీనికి అదనంగా, ప్రైవేటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావడానికీ, పెట్టుబడులు పెరగడానికీ కొత్త కొత్త రంగాలను అనుమతిస్తూ వస్తున్నాం. ఈ ఏడాదిలో, పెట్టుబడులకు అనేక నూతన రంగాలను మేం అనుమతించాం. వాటిలో పరమాణు శక్తి, బయోమాన్యుఫాక్చరింగ్, కీలక ఖనిజాల ప్రాసెసింగ్, లిథియం అయాన్ బ్యాటరీల తయారీ రంగాలు ఉన్నాయి. ఇది మా ప్రభుత్వ ఉద్దేశాలను, నిబద్ధతను చాటిచెబుతోంది.
మిత్రులారా,
భారత్‌కు అభివృద్ధి ప్రధానమైన భవిష్యత్తును అందించడంలో మూడు రంగాలది కీలక పాత్ర. ఈ మూడు రంగాలు లక్షల కొద్దీ కొత్త కొలువులను సృష్టించగలుగుతాయి. ఇవే.. వస్త్రాలు, పర్యాటకం, టెక్నాలజీ రంగాలు. మనం వస్త్ర రంగంపై దృష్టి సారిస్తే భారత్ పత్తి, పట్టు, పాలియెస్టర్, విస్కోస్‌ల రెండో అతి పెద్ద తయారీదారు దేశంగా ఉంది. జౌళి పరిశ్రమ లక్షలాది ప్రజలకు బతుకుతెరువును చూపుతోంది. వస్త్రాల తయారీలో భారత్‌కు బలమైన పరంపర, చేయితిరిగిన శ్రామికలోకంతోపాటు ఔత్సాహిక పారిశ్రామిక స్ఫూర్తి ఉంది. మా దేశంలో ఉత్పత్తి అవుతున్న ఆర్గానిక్ కాటన్లో దాదాపుగా నాలుగో వంతు మధ్య ప్రదేశ్ నుంచే అందుతోంది. దేశంలోనే అతి ప్రధాన మల్బరీ రకం పట్టు ఉత్పత్తిదారుగా ఈ రాష్ట్రం వర్ధిల్లుతోంది. ఇక్కడ ఉత్పత్తి చేసే ప్రఖ్యాత చందేరి, మహేశ్వరి చీరలు అమిత ప్రజాదరణకు నోచుకోవడంతోపాటు జీఐ ట్యాగ్ హోదాను కూడా చేజిక్కించుకొన్నాయి. ఈ రంగంలో మీరు పెట్టే పెట్టుబడులు మధ్య ప్రదేశ్‌లో తయారయ్యే వస్త్రాలు ప్రపంచ శ్రేణి ప్రభావాన్ని ప్రసరించడంలో సార్థక మద్దతును అందించగలుగుతాయి.
మిత్రులారా,
సాంప్రదాయక వస్త్రాలకు తోడు, భారత్ కొత్త దారులను సైతం వెతుకుతోంది. మేం అగ్రో టెక్స్‌టైల్స్‌కు, మెడికల్ క్స్‌టైల్స్‌కు, జియోటెక్స్‌టైల్స్‌కు సాయపడుతున్నాం. ఇవి సాంకేతిక వస్త్రాల వర్గంలోకి వస్తాయి. దీనికోసం ఒక జాతీయ ఉద్యమాన్ని మొదలుపెట్టాం, మరి మేం దీనికి బడ్జెటులో ప్రోత్సాహకాలను ప్రకటించాం. మీరు ‘పీఎం మిత్ర స్కీము’ గురించి కూడా తెలుసుకొనే ఉంటారు.. దీనిలో భాగంగా దేశం నలుమూలలా ఏడు ప్రధాన టెక్స్టైల్ పార్కులను తీర్చిదిద్దుతారు. ఈ పార్కులలో ఒక పార్కును మధ్య ప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఇది జౌళి రంగం వృద్ధి చెందడానికి మరింతగా ఊతాన్నందిస్తుంది. జౌళి పరిశ్రమ కోసం ప్రకటించిన పీఎల్ఐ స్కీము తాలూకు పూర్తి ప్రయోజనాలను పొందాలంటూ నేను మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
మిత్రులారా,
వస్త్రాలలో మాదిరిగానే, భారత్ తన పర్యాటక రంగానికి కూడా కొత్త కోణాలను జోడిస్తోంది. మధ్య ప్రదేశ్ టూరిజంలో ఓ ప్రచార ఉద్యమం ‘‘ఎంపీ అజబ్ భీ హై, సబ్సే గజబ్ భీ హై’’ అని సూచించేది.. ఈ మాటలకు– మధ్య ప్రదేశ్ అద్వితీయమైంది, అలాగే అత్యంత అపరూపమైంది– అని భావం. మధ్య ప్రదేశ్ లో, నర్మద నది చుట్టుపక్కల, ఇంకా ఆదివాసీ ప్రాంతాలలో పర్యాటక రంగ సంబంధి మౌలిక సదుపాయాల కల్పనలో విశేషమైన ప్రగతి చోటు చేసుకొంది. ఈ రాష్ట్రం అనేక జాతీయ ఉద్యానాలకు నిలయం. అంతేకాక ఆరోగ్య ప్రధాన పర్యాటక రంగానికీ, వెల్నెస్ టూరిజానికీ ఎన్నో అవకాశాలను అందిస్తోంది. ‘‘హీల్ ఇన్ ఇండియా’’ అనే మాటలు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకొంటున్నాయి. ఆరోగ్యం, వెల్నెస్ రంగంలో పెట్టుబడులకు అవకాశాలు నిరంతరాయంగా అధికం అవుతూ ఉన్నాయి. ఈ కారణంగానే మా ప్రభుత్వం ఈ రంగంలో పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తోంది. భారత్ సాంప్రదాయక వైద్య చికిత్స పద్ధతులను, అలాగే ఆయుష్‌ను కూడా పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. మేం ఆయుష్ వీజాలంటూ ప్రత్యేక వీజాలను సైతం జారీ చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు అన్నీ మధ్య ప్రదేశ్‌కు కూడా ఎంతో ప్రయోజనకారిగా మారుతాయి.
అన్నట్టు, మిత్రులారా,
మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి, ఉజ్జయినిలో మహాకాలుని మహాలోకాన్ని చూడాల్సిందిగా నేను మీకు సూచిస్తున్నాను. మీరు మహాకాలుని ఆశీర్వాదాలను అందుకోవడంతోపాటు మా దేశం తన పర్యాటక, ఆతిథ్య రంగాలను ఎలా విస్తరిస్తోందో కూడా తెలుసుకోగలుగుతారు.
మిత్రులారా,
నేను ఎర్ర కోట మీద నుంచి మాట్లాడుతూ ‘‘ఈ కాలం, సరైన కాలం’’ అని చెప్పాను. మీరు మధ్య ప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికీ, పెట్టిన పెట్టుబడులను విస్తరించడానికీ ఇదే సరైన తరుణం. మరోసారి, మీకందరికీ నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మీకందరికీ అనేకానేక ధన్యవాదాలు.
గమనిక: ఇది ప్రధాని ఉపన్యాసానికి భావానువాదం. ఆయన హిందీలో ప్రసంగించారు.
***
Addressing the Global Investors Summit 2025 in Bhopal. With a strong talent pool and thriving industries, Madhya Pradesh is becoming a preferred business destination. https://t.co/EOUVj9ePW7
— Narendra Modi (@narendramodi) February 24, 2025
The world is optimistic about India. pic.twitter.com/5cBcUw74p3
— PMO India (@PMOIndia) February 24, 2025
In the past decade, India has witnessed a boom in infrastructure development. pic.twitter.com/bndn4hv8Bn
— PMO India (@PMOIndia) February 24, 2025
The past decade has been a period of unprecedented growth for India's energy sector. pic.twitter.com/ZIfB0MKjEz
— PMO India (@PMOIndia) February 24, 2025
Water security is crucial for industrial development.
— PMO India (@PMOIndia) February 24, 2025
On one hand, we are emphasising water conservation and on the other, we are advancing with the mega mission of river interlinking. pic.twitter.com/hv2QOzmaLw
In this year's budget, we have energised every catalyst of India's growth. pic.twitter.com/5taehyiNQa
— PMO India (@PMOIndia) February 24, 2025
After national level, reforms are now being encouraged at the state and local levels. pic.twitter.com/7zisj7ek88
— PMO India (@PMOIndia) February 24, 2025
Textile, Tourism and Technology will be key drivers of India's developed future. pic.twitter.com/yi0jFA1wTp
— PMO India (@PMOIndia) February 24, 2025
The Global Investors Summit in Madhya Pradesh is a commendable initiative. It serves as a vital platform to showcase the state’s immense potential in industry, innovation and infrastructure. By attracting global investors, it is paving the way for economic growth and job… pic.twitter.com/MyRyx3CqrY
— Narendra Modi (@narendramodi) February 24, 2025
The future of the world is in India!
— Narendra Modi (@narendramodi) February 24, 2025
Come, explore the growth opportunities in our nation…. pic.twitter.com/IRcLhy4CJK
Madhya Pradesh will benefit significantly from the infrastructure efforts of the NDA Government. pic.twitter.com/WVdXczW3cV
— Narendra Modi (@narendramodi) February 24, 2025
Our Governments, at the Centre and in MP, are focusing on water security, which is essential for growth. pic.twitter.com/9xzR8tGbNJ
— Narendra Modi (@narendramodi) February 24, 2025
The first 50 days of 2025 have witnessed fast-paced growth! pic.twitter.com/CfbaU7US2m
— Narendra Modi (@narendramodi) February 24, 2025