भैया हरौ बोलो मतंगेश्वर भगवान की जै, बागेश्वर धाम की जै, जय जटाशंकर धाम की जै, अपुन ओंरण खाँ मोरी तरफ सें दोई हाँथ, जोर के राम–राम जू।
కార్యక్రమానికి విచ్చేసిన మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్ గారూ, ముఖ్యమంత్రి భాయ్ మోహన్ యాదవ్ గారూ, జగద్గురు పూజ్య రామభద్రాచార్య గారూ, భాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి శ్రీ ధీరేంద్ర శాస్త్రి గారూ, సాధ్వి రితంబర గారూ, స్వామి చిదానంద సరస్వతి గారూ, మహంత్ శ్రీ బాలక్ యోగేశ్చర దాస్ గారూ, ఈ ప్రాంత పార్లమెంటు సభ్యుడు శ్రీ విష్ణుదేవ్ శర్మ గారూ, ఇతర ప్రముఖులూ… ప్రియమైన సోదరీ సోదరులారా!
వీరులకు నిలయమైన బుందేల్ ఖండ్ ను సందర్శించే భాగ్యం చాలా కాలం తర్వాత రెండోసారి నాకు లభించింది. ఈసారి బాలాజీయే నన్ను పిలిచారు. ఈ పవిత్ర ధార్మిక కేంద్రం హనుమంతుని అనుగ్రహంతో ఇక ఆరోగ్య కేంద్రంగా కూడా మారబోతున్నది. శ్రీ బాగేశ్వర్ ధామ్ వైద్య, వైజ్ఞానిక పరిశోధన సంస్థకు నేనిప్పుడే భూమిపూజ చేశాను. పదెకరాల్లో ఈ సంస్థను ఏర్పాటు చేయబోతున్నారు. మొదటి దశలో 100 పడకల కేంద్రాన్ని పూర్తి చేస్తారు. ఈ బృహత్తర కార్యాన్ని చేపట్టిన శ్రీ ధీరేంద్ర శాస్త్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు, బుందేల్‌ఖండ్ ప్రజలకు శుభాకాంక్షలు.
మిత్రులారా,
ఒక వర్గం నాయకులు మతాన్ని అపహాస్యం చేస్తూ, హేళన చేస్తూ, విచ్ఛిన్నకర ఎత్తుగడలకు పాల్పడుతుండడాన్ని ఇటీవల మనం గమనిస్తున్నాం. చాలాసార్లు విదేశీ శక్తులు కూడా అలాంటి వ్యక్తులకు మద్దతిస్తూ మన దేశాన్ని, దేశ ఆధ్యాత్మిక మూలాలను బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నాయి. హిందూ విశ్వాసం పట్ల శత్రుత్వం ఉన్నవారు శతాబ్దాల నుంచి ఏదో ఒక రూపంలో ఉండనే ఉన్నారు. వలసవాద మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్నవారు మన విశ్వాసాలపై, మన ఆలయాలపై, మన సాధువులపై, మన సంస్కృతిపై, మన విలువలపై ఎప్పుడూ దాడి చేస్తూంటారు. మన పండుగలు, సంప్రదాయాలు, ఆచారాల పట్ల తీవ్ర అగౌరవాన్ని ప్రదర్శిస్తారు. స్వతహాగా ప్రగతిశీలమైన ఈ మతం, సంస్కృతిని నిందించడానికి కూడా సాహసిస్తారు. సమాజాన్ని విచ్ఛిన్నం చేసి, దేశ ఐక్యతను దెబ్బతీయడమే వారి ఎజెండా.
ఇలాంటి పరిస్థితుల్లో నా తమ్ముడు ధీరేంద్ర శాస్త్రి చాలా కాలంగా దేశవ్యాప్తంగా ఐక్యతా మంత్రంతో ప్రజలను జాగరూకులను చేస్తున్నారు. ఇక ఇప్పుడు సమాజ, మానవాళి సేవ కోసం కృతనిశ్చయుడైన ఆయన ఈ క్యాన్సర్ వైద్య సంస్థను స్థాపించాలని సంకల్పించారు. అలా ఈ బాగేశ్వర ధామం భజనలూ ప్రసాదాలను మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన జీవితాన్ని కూడా ప్రసాదిస్తుంది.
మిత్రులారా,
మన ఆలయాలు, మఠాలు, పవిత్ర ప్రదేశాలు ఎప్పుడూ ఆరాధనకూ ధ్యానానికీ కేంద్రాలుగా నిలిచాయి. అంతేకాకుండా శాస్త్రీయ దృక్పథం, సామాజిక చింతన, సమష్టి జాగరణకు కేంద్రాలుగానూ ఉన్నాయి. నేడు ప్రపంచమంతా ఆచరిస్తున్న ఆయుర్వేదాన్ని, యోగాను ప్రసాదించినది మన రుషులే. మిత్రులారా, మన విశ్వాసం చాలా సులభమైనది. నిస్వార్థ సేవకను మించిన మతం లేదు. మరో మాటలో చెప్పాలంటే ఇతరులకు సేవచేయడం, వారి బాధలను తగ్గించడమే నిజమైన మత సారం. అందుకే నరుడిలో నారాయణుడినీ, జీవులన్నింటిలో శివత్వాన్నీ దర్శిస్తూ.. మనుషులందరిలో దైవత్వం ఉందన్న విశ్వాసంతో సమస్త జీవరాశులకూ సేవ చేయడం మన చిరకాల సంప్రదాయం.
ఇప్పుడు ఎక్కడచూసినా మహాకుంభమేళా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే కోట్లాది మంది తరలివచ్చి, పుణ్యస్నానాలు ఆచరించి సాధుసంతుల ఆశీస్సులు పొందిన ఈ మహత్తర కార్యక్రమం ముగింపు దశకు వచ్చింది. ఈ మహాకుంభమేళాను పరిశీలిస్తే.. నిజంగా ఇదొక ఏకతా మహాకుంభమేళా అన్న నిశ్చితాభిప్రాయం మనలో కలుగుతుంది. 144 ఏళ్ల తరువాత జరిగిన ఈ మహా కుంభమేళా ఐక్యతా చిహ్నంగా భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తూ.. శాశ్వత సుధా వాహినిగా మన దేశ సమష్టి స్ఫూర్తిని బలోపేతం చేస్తుంది. ప్రజలలో విశేషమైన సేవాభావం వెల్లివిరుస్తోంది. కుంభమేళా సందర్శకులంతా దీనికి ప్రత్యక్ష సాక్షులే. భారత నలుమూలల నుంచీ మహా కుంభమేళాకు హాజరైన వారిలో.. నేను కలిసిన ప్రతి ఒక్కరూ చెప్పే అంశాల్లో రెండు భావాలు ఉమ్మడిగా వినిపించాయి. మొదటిది– పారిశుద్ధ్య కార్మికులను వారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఈ ఏకతా మహా కుంభమేళాలో నిరంతరం పారిశుద్ధ్య నిర్వహణలో వారి అంకితభావం, అవిశ్రాంత కృషి ఎంతగానో ప్రశంసనీయం. అచంచలమైన సేవా స్ఫూర్తితో పనిచేస్తున్న ఈ పారిశుద్ధ్య కార్మికులందరి పట్లా విశేషమైన గౌరవభావంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
చెప్పుకోదగ్గ రెండో అంశం– మన పోలీసు సిబ్బంది అందిస్తున్న అసాధారణ సేవలు. మన దేశంలో వారి సేవలకు గుర్తింపు లభించడం చాలా అరుదు. పోలీసులు నిస్వార్థ సేవకులుగా పనిచేస్తూ.. ఎంతో గౌరవంగా, అంకితభావంతో కోట్లాదిగా తరలివచ్చిన భక్తుల పట్ల ఎంతలా శ్రద్ధ వహించారో మహా కుంభమేళాకు వెళ్లొచ్చిన ప్రతి యాత్రికుడు చెప్తున్నారు. ఆదర్శవంతమైన సేవలతో ప్రజల హృదయాలను గెలుచుకున్న పోలీసులకు కూడా హృదయపూర్వక అభినందనలు.
కానీ, సోదరీ సోదరులారా,
ఈ ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో నిస్వార్థ సేవాస్ఫూర్తితో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దురదృష్టవశాత్తు మీడియా వాటిని పెద్దగా దృష్టిపెట్టలేదు. దాంతో వాటికి తగిన గుర్తింపు దక్కలేదు. ఈ సేవా కార్యక్రమాలన్నింటినీ నేను వివరిస్తే సమయం సరిపోక నా తర్వాతి కార్యక్రమం ఆగిపోవచ్చు. అయినప్పటికీ, ఈ ఏకతా మహాకుంభమేళాలో భాగంగా జరుగుతున్న నేత్ర మహాకుంభమేళా గురించి నేను వివరించాలనుకుంటున్నాను.
ఈ నేత్ర మహా కుంభమేళాలో దేశం నలుమూలల నుంచి వస్తున్న యాత్రికులు, ముఖ్యంగా నిరుపేదలు ఉచితంగా కంటి పరీక్షలు పొందుతున్నారు. గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నేత్ర వైద్యులు స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు లక్షల మందికి పైగా సోదరీ సోదరులకు కంటి పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా దాదాపు లక్షన్నర మందికి పైగా ఉచితంగా మందులు, కళ్లద్దాలు అందించారు. దాదాపు 16,000 మందికి కంటిశుక్లం ఉన్నట్లు నిర్ధారించగా, వారిని చిత్రకూట్, అధునాతన సదుపాయాలున్న సమీప ఆసుపత్రులకు పంపించారు. అక్కడ వారికి పూర్తి ఉచితంగా కంటిశుక్లం శస్త్రచికిత్స చేశారు. ఈ ఏకతా మహా కుంభమేళాలో ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి.
సోదరీ సోదరులారా,
ఈ కృషి వెనుక ఎవరున్నారు? మన సాధుసంతుల మార్గదర్శకత్వంలో వేలాదిగా వైద్యులు, వలంటీర్లు అచంచలమైన సేవాభావం, ఉన్నతమైన సేవాస్ఫూర్తితో పనిచేస్తూ నిస్వార్థంగా ఈ కార్యక్రమానికి అంకితమయ్యారు. ఏకతా మహాకుంభమేళాను సందర్శిస్తున్న వారు ఈ సేవలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.
సోదరీ సోదరులారా,
అదేవిధంగా, దేశంలోని చాలా అతిపెద్ద ఆస్పత్రులను మన మత సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఆరోగ్యం, విజ్ఞాన శాస్త్రాల్లో కృషిచేస్తున్న అనేక పరిశోధన సంస్థలను కూడా ధార్మిక ట్రస్టులు నిర్వహిస్తున్నాయి. ఈ సంస్థలు కోట్లాది మంది నిరుపేదలకు ముఖ్యమైన చికిత్సలు చేస్తూ, చేయూతనిస్తూ వైద్యసేవలందిస్తున్నాయి. మా ‘దీదీ మా’ ఇక్కడే ఉంది. అనాథ బాలికలకు సేవ చేయాలన్న ఆమె నిబద్ధత నిజంగా స్ఫూర్తిదాయకం. ఈ ఆడబిడ్డల సంక్షేమం కోసమే ఆమె తన జీవితాన్ని అంకితం చేశారు.
మిత్రులారా,
బుందేల్ ఖండ్ లోని చిత్రకూటం.. శ్రీరామచంద్రుడితో అనుబంధమున్న పవిత్ర భూమి. చాలాకాలంగా రోగులకు, దివ్యాంగులకు సేవలందించే ప్రధాన కేంద్రంగా ఇది ఉంది. ఈ ఉదాత్త సంప్రదాయానికి బాగేశ్వర్ ధామ్ ద్వారా మరో మహిమాన్వితమైన అధ్యాయాన్ని జోడిస్తుండడం ఎంతో సంతోషాన్నిస్తోంది. ఇప్పుడు, బాగేశ్వర ధామం విశ్వాసానికి, ఆధ్యాత్మికతకు మాత్రమే కాదు.. స్వస్థతకూ ప్రధాన కేంద్రంగా నిలిచి ఆరోగ్యాన్ని ప్రసాదించబోతున్నది.
మరో రెండు రోజుల్లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 251 మంది ఆడబిడ్డలకు సామూహిక వివాహ వేడుకను కూడా ఇక్కడ నిర్వహించబోతున్నట్టు తెలిసింది. ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని చేపట్టినందుకు బాగేశ్వర్ ధామానికి అభినందనలు. నూతన వధూవరులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఆ బిడ్డలకు ముందస్తుగానే ఆశీర్వాదాలు అందిస్తున్నాను. వారి జీవితాల్లో సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను.
మిత్రులారా,
‘శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం’ అని మన గ్రంథాలు చెప్తాయి. అంటే మన విధులు నిర్వహించడానికి, ఆనందాన్ని, విజయాన్ని సాధించడానికి మన శరీరం, ఆరోగ్యాలే ముఖ్య సాధనాలు. అందుకే, దేశం నాకు సేవ చేసే అవకాశాన్నిచ్చినప్పుడు ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ను మా ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రంగా మలిచాను. ‘సబ్ కా ఇలాజ్, సబ్ కా ఆరోగ్య (అందరికీ చికిత్స, అందరికీ ఆరోగ్యం)’ అనే సూత్రం ఈ సంకల్పానికి మూలం.
ఈ సంకల్పాన్ని నెరవేర్చడం కోసం వ్యాధి నివారణకు విశేషంగా ప్రాధాన్యమిస్తూ వివిధ స్థాయిల్లో మేం కృషిచేస్తున్నాం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను – స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా ప్రతి ఊర్లో టాయిలెట్లు నిర్మించారా లేదా? అవి మీకు ఉపయోగపడుతున్నాయా లేదా? టాయిలెట్లను నిర్మించడం ద్వారా పారిశుద్ధ్య లోపం వల్ల కలిగే వ్యాధులను కూడా తగ్గించవచ్చన్న విషయం మీకు తెలిసిందే. సరైన టాయిలెట్లు ఉన్న కుటుంబాలకు వేల రూపాయలు ఆదా అయ్యాయని, సరైన పారిశుద్ధ్యమే లేకపోతే వాటిని హాస్పిటళ్లలో ఖర్చు చేయాల్సి వచ్చేదని అధ్యయనాలు వెల్లడించాయి.
మిత్రులారా,
మా ప్రభుత్వం 2014లో అధికారంలోకి రావడాని కన్నా ముందు కాలంలో, దేశంలో స్థితి ఎలా ఉండింది అంటే పేదలు వారికి వచ్చిన రోగాని కన్నా కూడా చికిత్సకయ్యే ఖర్చులను చూసి భయపడిపోయేవారన్న మాట. కుటుంబంలో ఎవరైనా పెద్ద జబ్బు వచ్చిందంటే, పూర్తి కుటుంబం తీవ్రమైన ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యేది. నేను కూడా, మీలో చాలా మంది లాగానే, ఏమంత స్తోమత లేని నేపథ్యం నుంచి వచ్చిన వాడినే సుమా. ఈ సంఘర్షణలు ఎలాంటివో నేను స్వయంగా ఎరుగుదును. అందుకనే నేను ఒక పవిత్రమైన ప్రతిజ్ఞను స్వీకరించాను.. వైద్య చికిత్సల తాలూకు భారాన్ని తగ్గించాలనీ, మీరు రెక్కలు ముక్కలు చేసుకొని మరీ సంపాదించిన దాన్లో వీలయినంత వరకు మిగుల్చుకొనేటట్లు చూడాలన్నదే అది.
అర్హత కలిగిన ఏ వ్యక్తినీ వదలివేయకుండా ఉండాలనే నేను కోరుకుంటున్నాను. ఈ కారణంగా నేను మా ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల సమాచారాన్ని పదేపదే చెబుతూ ఉంటాను. ఈ రోజు, కొన్ని ముఖ్య వివరాల్ని నేను మరోసారి మీ దృష్టికి తీసుకువస్తున్నాను. వాటిని మీరు గుర్తుపెట్టుకోవడం ఒక్కటే కాకుండా మీకు పరిచయం ఉన్న వారితో కూడా ఆ వివరాలను పంచుకొంటారని నేను ఆశిస్తున్నాను. మీరు నా కోసం ఈ పనిని చేసిపెడతారా? నాకు తెలుసు మీరు తప్పక చేస్తారని. దీనికి ఒక కారణం, అవగాహనను కలిగించడం సైతం సేవాకార్యమే అవుతుంది. మనం వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించుకోవాలా వద్దా?
ఈ కారణంగానే నేను సమాజంలో ఆదరణకు నోచుకోని ప్రతి ఒక్క వ్యక్తికి ఎలాంటి ఖర్చు లేకుండానే ఉచిత వైద్య చికిత్స.. రూ.5 లక్షల వరకు వైద్య రక్షణ… వెసులుబాటును ప్రవేశపెట్టాను. ఏ కుమారుడూ కూడా తన తల్లితండ్రుల చికిత్సకు 5 లక్షల రూపాయలను ఖర్చు చేసే విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదు. ఢిల్లీలో ఉన్న మీ పుత్రుడు మీ కోసం ఆ సంగతిని చూసుకుంటాడు. ఏమైనప్పటికీ, ఈ లాభాన్ని పొందాలంటే, మీరు ఆయుష్మాన్ కార్డును తప్పక తీసుకోవాలి. మీలో చాలా మంది ఇప్పటికే మీ ఆయుష్మాన్ కార్డును తీసుకొనే ఉంటారని నాకనిపిస్తోంది. ఎవరైతే తీసుకోలేదో, వాళ్లు వీలయినంత త్వరగా ఆ పనిని పూర్తిచేయండి. దీనికి తోడు, ఈ ప్రాంతంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని వెనువెంటనే చక్కదిద్దేటట్లు చూడాల్సిందిగా నేను ముఖ్యమంత్రికి సూచిస్తున్నాను.
మిత్రులారా,
మీరు గుర్తుపెట్టుకు తీరాల్సిన ముఖ్య విషయం మరొకటి ఉంది. ప్రస్తుతం, 70 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు వారు పేదలా, మధ్యతరగతి వారా, లేక సంపన్నులా అన్న దానితో సంబంధం లేకుండా వైద్య చికిత్సను ఉచితంగా అందించడానికి ఆయుష్మాన్ కార్డులను జారీ చేస్తున్నారు. ఈ కార్డులను ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు– అదీ ఎలాంటి చెల్లింపూ చేయనక్కర లేకుండానే. . దీనిని ఇవ్వడానికి ఎవరైనా డబ్బు అడిగారంటే, మీరు నేరుగా నాకే ఆ సంగతిని రాయండి. మిగతాది నేను చూసుకుంటాను. కాబట్టి, ఎవరైనా డబ్బు అడిగితే, మీరు ఏం చేస్తారు? మీరు ఆ సంగతిని నాకు (ఓ ఉత్తరమ్ముక్క) రాస్తారు. నేను మన గౌరవనీయ సాధువులను, ఆధ్యాత్మిక నేతలను కూడా ఆయుష్మాన్ కార్డుల్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒకవేళ వారు అస్వస్థులయ్యారంటే, వారికి సేవ చేసుకొనే భాగ్యం నాకు దక్కుతుంది. మీరు మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను ఆశపడుతున్నాననుకోండి. అయితే ఒకటి, ఎప్పుడైనా అవసరపడితే, ఈ సదుపాయం మీకు అందుబాటులో ఉండితీరాలి.
సోదర సోదరీమణులారా,
చాలా సందర్భాల్లో, ఆసుపత్రిలో చేరాల్సిన పనుండదు.. రోగులు వారికి వైద్యులు రాసిచ్చిన మందులచీటీలో మందుల్ని వారు ఇంట్లో ఉంటూనే వేసుకొంటే సరిపోతుంది. మందులను తక్కువ ధరల్లో దొరికేలా చూడడానికి, మేం దేశవ్యాప్తంగా 14,000 కన్నా ఎక్కువ సంఖ్యలో జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటుచేశాం. ఈ కేంద్రాలు మందులను చాలా తక్కువ ధరల్లో అందిస్తాయి. బజారులో 100 రూపాయలు ఖరీదైన మందునే జన్ ఔషధి కేంద్రంలో 15 రూపాయలు లేదా 20 రూపాయలకు లేదంటే 25 రూపాయలకో కొనుగోలు చేయొచ్చు. ఇప్పుడు నాతో చెప్పండి, ఇది మీరు డబ్బును ఆదా చేసుకోవడానికి సాయపడదా..? మీరు మీకు కావలసిన మందులను జన్ ఔషధి కేంద్రాల్లో కొనుగోలు చేయాలా, వద్దా?
నేను మరొక ఆందోళనకర అంశాన్ని సైతం ప్రధానంగా చెప్పదలుస్తున్నాను. మూత్రపిండాల వ్యాధి పల్లెపట్టుల్లో పెచ్చుపెరిగిపోతోందని నివేదికలు తెలియజేస్తున్నాయి. మూత్రపిండాల జబ్బులు విషమించాయంటే, రోగులకు క్రమం తప్పక డయాలిసిస్ అవసరమవుతుంది. దీనికోసం తరచుగా చాలా దూరాలకు ప్రయాణం చేస్తూ, బాగా ఎక్కువ మొత్తంలో డబ్బును ఖర్చు చేయాల్సివస్తూ ఉంటుంది. ఈ సమస్యను తీర్చడానికి, మేం దేశంలో 700 కన్నా ఎక్కువ జిల్లాల్లో 1,500 డయాలిసిస్ సెంటర్లను ఏర్పాటు చేసి, ఉచిత డయాలిసిస్ సదుపాయాల్ని సమకూర్చుతున్నాం.
ఈ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను మీరు మాత్రమే అందుకోవడం కాకుండా ఇతరులకు కూడా వీటిని గురించి తెలియజేయడం చాలా అవసరం. నాకోసం మీరు ఈ పనిని చేయగలరా? మీ చేతులు ఎత్తి పట్టుకొని నాతో చెప్పండి.. మీరు ఈ పనిని చేస్తారా? ఇది ఒక సేవా కార్యం, ఒక పవిత్రమైన పని. ఇది మీకు పుణ్యాన్ని ప్రసాదిస్తుంది.
మిత్రులారా,
కేన్సర్ రోగులకు ఒక పెద్ద ఆసుపత్రిని బాగేశ్వర్ ధామ్‌లో త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. కేన్సర్ ప్రతి చోటా ఒక గంభీర సమస్యగా మారిపోతున్న క్రమంలో, దీనితో పోరాటం చేయడానికి ప్రభుత్వం, సమాజం, ఆధ్యాత్మిక నాయకులు కలిసి ప్రయత్నాలు చేస్తున్నారు.
సోదర సోదరీమణులారా,
కేన్సర్‌తో పోరాడడం, ప్రత్యేకించి పల్లెల్లో ఎంతటి సవాలుతో నిండిందనేది నేను అర్థం చేసుకున్నాను. చాలా సందర్భాల్లో, ప్రజలు వారికి కేన్సర్ వచ్చిందన్న సంగతిని రోజులు, చివరకు నెలల తరబడి తెలుసుకోలేకపోతారు. మొదట్లో, వారు జ్వరానికీ, నొప్పికీ ఇళ్లలో అనుసరించే చిట్కా ల వైపు మొగ్గు చూపుతారు. కొంత మంది ప్రార్థనలు చేస్తుండడం, ఆచారాలను పాటిస్తుండడం చేస్తారు. మరికొందరు ఎలాంటి మొండి వ్యాధులనైనా ఇట్టే నయం చేసేస్తామని మాయమాటలు చెప్పే వారి చేతులలో చిక్కుతున్నారు. నొప్పి ముమ్మరిస్తేనో, లేదా ఒక కంతి లాంటిది కనపడుతుంటేనో వారు వైద్యుల వద్దకు వెళ్తున్నారు. అప్పటికి అది భారీ నష్టాన్ని కలిగించే కేన్సర్‌గా నిర్ధారణ అవుతోంది. వ్యాధి పేరెత్తితేనే కుటుంబ సభ్యులు అందరూ దు:ఖంలో, భయంలో మునిగిపోయి, వారి కలలు కల్లలై, చికిత్స కోసం ఎక్కడికి వెళ్లాలో పాలుపోని స్థితిని ఎదుర్కొంటున్నారు. చాలా మందికి, ఢిల్లీ ముంబయి.. ఇవి మాత్రమే తెలిసిన దారులు.
ఈ కారణంగానే మా ప్రభుత్వం ఈ సవాళ్లను చురుగ్గా పరిష్కరిస్తోంది. కేన్సర్‌తో పోరాడడానికి ఈ సంవత్సరం బడ్జెటులో అనేక కీలక ప్రకటనలను పొందుపరిచారు. కేన్సర్ మందులను మరింత తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకురావాలని మోదీ కంకణం కట్టుకున్నాడు. రాబోయే మూడు సంవత్సరాల్లో, దేశమంతటా ప్రతి జిల్లాలో కేన్సర్ డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. ఈ కేంద్రాలు పరీక్షలు చేయడంతోపాటు విశ్రాంతి సదుపాయాలను సమకూర్చుతాయి. దీనికి అదనంగా, చికిత్సను మరింతగా చేరువ చేయాలనే ఉద్దేశంతో, మీరున్న చోట్లకు దగ్గర్లో గల వైద్య కేంద్రాల్లో, జిల్లా ఆసుపత్రుల్లో కేన్సర్ వైద్యశాలలను ఏర్పాటు చేస్తున్నారు.
అయితే, సోదర సోదరీమణులారా,
నేను తప్పక చెప్పాల్సిన సంగతి ఒకటుంది.. అది వినడానికి బాగుండకపోవచ్చు, అయితే అది మనమంతా పూనుకొని చేసితీరాల్సిన కార్యక్రమం. దానిని గుర్తుపెట్టుకోండి. దానిని మన జీవనంలో ఓ భాగం చేసుకోవాలి. మీరు కేన్సర్ బారిన పడకుండా మిమ్మల్ని కాపాడుకోవడంలో అప్రమత్తంగాను, క్రియాశీలంగాను ఉండాల్సిందే. (ఈ వ్యాధిని) ముందుగానే గుర్తించడం మొదటిదీ, అత్యంత ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిందీనూ. ఒకసారి కేన్సర్ విస్తరించిందా అంటే, దానిని నయం చేయడం నమ్మశక్యం కానంత కష్టంగా మారిపోతుంది. ఈ కారణంగానే మేం 30 ఏళ్లు పైబడిన వయస్సు గల వారికి దేశవ్యాప్తంగా పరీక్షల్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం పూర్తి ప్రయోజనాన్ని పొందండి, దీనిని నిర్లక్ష్యం చేయకండి అంటూ మీలో ప్రతి ఒక్కరినీ నేను కోరుతున్నాను. ఏ కాస్త అనుమానం ఉన్నా సరే, కేన్సర్ పరీక్ష చేయించుకోవడానికి ముందడుగు వేయండి. చైతన్యం మరో కీలక అంశం. కేన్సర్ ఒకరి నుంచి మరొకరికి సోకే వ్యాధి కాదు. అది శారీరిక స్పర్శ వల్ల వ్యాప్తి చెందదు. ఏమైనా, కొన్ని జీవనశైలి అలవాట్లు ప్రమాదం వైపు నెట్టివేస్తాయి. బీడీలు, సిగరెట్లు తాగడం, గుట్కాను, పొగాకును సేవించడం, బాగా ఎక్కువ మోతాదులో మసాలా దట్టించిన ఆహారపదార్థాల్ని తీసుకోవడం.. ఇవి కేన్సరుకు దారితీసే ప్రధాన కారకాలు. మన మధ్య ఉన్న మాతృమూర్తులు, సోదరీమణులు ఈ విషయాన్ని విని సంతోషిస్తున్నారని నేను ఇప్పటికే గ్రహించాను. అందుకని, నేను మిమ్మల్ని వేడుకొంటున్నాను.. హానికర పదార్థాల జోలికి మీరు పోకండి, ఈ పనిని చేయాలంటూ ఇతరులను కూడా ప్రోత్సహించండి. మీ ఆరోగ్యానికి, శ్రేయానికి పెద్ద పీట వేయండి. మనం నివారక చర్యలను తీసుకొంటే, బాగేశ్వర్ థామ్‌లో నిర్మిస్తున్న తరహా ఆసుపత్రులపై పడే భారాన్ని మనం తగ్గించగలుగుతాం. మీరు ఇక్కడికి ఒక రోగిగా ఎన్నడూ రావాల్సిన స్థితి ఎదురైందంటే అది మేలైంది కాదూ? మీరు ముందుజాగ్రత్తలు తీసుకొంటారు, మీరు తీసుకోరా? మీరు అజాగ్రత్తగా ఉండనే ఉండరు, కదూ?
మిత్రులారా,
మోదీ మీకు వినయపూర్వక సేవకునిగా సేవలను అందించడానికి అంకితమయ్యాడు. కిందటి సారి నేను ఛతర్‌పుర్‌కు వచ్చినప్పుడు, వేల కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రాజెక్టులను ప్రారంభించే, శంకుస్థాపన చేసే భాగ్యానికి నోచుకొన్నాను. వాటిని గురించి ముఖ్యమంత్రి కాసేపటి కిందట మీకు వివరించారు. వాటిలో రూ.45,000 కోట్లు ఖర్చయ్యే కెన్–బెత్వా లింక్ ప్రాజెక్టు కూడా ఉందన్న సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. ఈ ప్రాజెక్టును దశాబ్దాల తరబడి ఆపేశారు.. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, వెళ్లిపోయాయి. ప్రతి రాజకీయ పార్టీకి చెందిన నేతలు బుందేల్‌ఖండ్‌కు వచ్చారు.. అయినా ఇక్కడ నీటి సంక్షోభం ముదిరింది. అంతే. నాకు చెప్పండి, ఇది వరకటి ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం అయినా అవి చేసిన వాగ్దానాలను నెరవేర్చాయా? చాలా కాలంగా పెండింగు పడ్డ ఈ ప్రాజెక్టు మీరు మీ ఆశీస్సులను మోదీకి అందించిన తరువాతనే పురోగమించిది.
తాగునీటి సంకట స్థితిని చక్కదిద్దడానికి కూడా త్వరిత గతిన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జల్ జీవన్ మిషన్.. అదే.. హర్ ఘర్ జల్ (ప్రతి ఇంటికీ నీటిని అందించే) ప్రాజెక్టు. బుందేల్‌ఖండ్‌లో ప్రతి పల్లెకు నీటిని ప్రస్తుతం గొట్టపుమార్గాల ద్వారా చేరవేస్తున్నారు. నీరు గ్రామీణ ప్రాంతాలకు చేరేలా, మన రైతు సోదరులు, రైతు సోదరీమణులకు ఇక్కట్లను తగ్గించేలా, చివరగా వారి ఆదాయాన్ని పెంచేలా మేం అలసటనేదే ఎరుగక పనిచేస్తున్నాం.
సోదర సోదరీమణులారా,,
బుందేల్‌ఖండ్ నిజంగానే సమృద్ధిని అందుకోవాలంటే, మన మాతృమూర్తులకు, సోదరీమణులకు సమాన సాధికారతను సమకూర్చడం అత్యవసరం. దీనిని దృష్టిలో పెట్టుకొని, మేం లఖ్‌పతి దీదీ (లక్షాధికారి సోదరి), డ్రోన్ దీదీ (డ్రోన్ సోదరి)ల వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టాం. మా లక్ష్యం 3 కోట్ల మంది సోదరీమణులను లఖ్‌పతి దీదీలుగా మార్చాలి అనేదే. దాంతో వారు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోగలుగుతారు. డ్రోన్లను పనిచేయించడంలోనూ మహిళలకు శిక్షణనిస్తున్నారు. కాస్త ఊహించండి.. సాగునీరు బుందేల్‌ఖండ్‌కు చేరుకొందంటే గనక మన సోదరీమణులు డ్రోన్ల సాయంతో పైర్లకు నీటిని అందిస్తారు, వారు వ్యవసాయంలో చురుకుగా పాలుపంచుకొంటారు. ఇది సమృద్ధి మార్గంలో బుందేల్‌ఖండ్ శరవేగంగా దూసుకుపోయేటట్లు చేస్తుంది.
సోదర సోదరీమణులారా,
డ్రోన్ టెక్నాలజీ ద్వారా మన గ్రామాల్లో మరో ముఖ్య మార్పు చోటుచేసుకొంటోంది. స్వామిత్వ యోజనలో భాగంగా, సరి అయిన భూమి సర్వేలను నిర్వహించడానికి, సముచితమైన యాజమాన్య హక్కుల దస్తావేజులను జారీ చేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఇక్కడ మధ్య ప్రదేశ్‌లో ఈ విషయంలో చెప్పుకోదగ్గ పురోగతి నమోదైంది. ప్రజలు ఇప్పుడు ఈ చట్టబద్ధ దస్దావేజులను ఉపయోగించి బ్యాంకు రుణాలను పొందగలుగుతున్నారు. ఆ రుణాలను వ్యాపారాలు మొదలుపెట్టుకోవడానికీ, ఉద్యోగ అవకాశాలను కల్పించడానికీ, చివరగా ఆదాయాలను పెంచుకోవడానికీ ఉపయోగించుకొంటున్నారు.
మిత్రులారా,
పవిత్ర భూమి అయిన ఈ బుందేల్‌ఖండ్‌ను అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేర్చడానికి డబల్ ఇంజిన్ ప్రభుత్వం ఉదారంగా పనిచేస్తోంది. ఈ రోజు, బాగేశ్వర్ ధామ్‌లో నేను బుందేల్‌ఖండ్ సమృద్ధి, ప్రగతిల మార్గంలో ముందుకు ముందుకు పోతూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. హనుమాన్ దాదా చరణాల చెంతకు నేను చేరుకొన్నప్పుడు, నా మదిలో ఒక ఆలోచన వచ్చింది.. ఒక్క ధీరేంద్ర శాస్త్రికి మాత్రమే దైవీ అనుగ్రహం లభిస్తుందా, లేక ఆ ఔదార్యం నా పైన సైతం వర్షిస్తుందా? అని. హనుమాన్ దాదా జీ నన్ను ఆశీర్వదిస్తారేమో గమనించాలని నేను అనుకున్నాను. మరి నిజంగా, ఆయన దైవీ కరుణతో, ఈ రోజు నేను తొలి దీవెనను, అదే.. ఆయన మాత ఆశీర్వాదాన్ని.. అందుకొన్నాను. మరి దీని మహత్వాన్ని శాస్త్రి గారు మీకు ఇప్పటికే తెలియజేశారాయె.
మంచిది, నా సహచరులారా,
ఇదొక గొప్ప సందర్భం, ఒక మహత్తర ఉద్యమం. సంకల్పం బలంగా ఉంటే, సాధువుల ఆశీర్వాదాలు, దైవీ కృప మనతో ఉంటే ప్రతి ఒక్క లక్ష్యాన్ని దానికి పెట్టుకొన్న నిర్దిష్ట గడువు లోపల సాధించవచ్చు. మీలో కొందరు ఈ ప్రారంభ కార్యక్రమానికి రావాలంటూ నన్ను కోరారు, ఇతరులు వారి పెళ్లి ఊరేగింపులకు హాజరు కండి అంటూ నన్ను పిలిచారు. ఈ రోజు, నేను బహిరంగంగా ఒక మాట ఇస్తున్నా.. నేను ఈ రెండు వాగ్దానాలను నిలబెట్టుకొంటాను.
మరోసారి, మీకందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీకు అనేకానేక ధన్యవాదాలు. హర్ హర్ మహాదేవ్.
గమనిక: ఇది ప్రధాని ఉపన్యాసానికి భావానువాదం. ఆయన హిందీలో ప్రసంగించారు.
***
मध्य प्रदेश के छतरपुर में बागेश्वर धाम मेडिकल एंड साइंस रिसर्च इंस्टीट्यूट की आधारशिला रखकर अत्यंत हर्षित हूं। https://t.co/3BvyyvlkgH
— Narendra Modi (@narendramodi) February 23, 2025
हमारे मंदिर, हमारे मठ, हमारे धाम... ये एक ओर पूजन और साधन के केंद्र रहे हैं तो दूसरी ओर विज्ञान और सामाजिक चेतना के भी केंद्र रहे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 23, 2025
हमारे ऋषियों ने ही हमें आयुर्वेद का विज्ञान दिया।
— PMO India (@PMOIndia) February 23, 2025
हमारे ऋषियों ने ही हमें योग का वो विज्ञान दिया, जिसका परचम आज पूरी दुनिया में लहरा रहा है: PM @narendramodi
जब देश ने मुझे सेवा का अवसर दिया, तो मैंने ‘सबका साथ, सबका विकास’ के मंत्र को सरकार का संकल्प बनाया।
— PMO India (@PMOIndia) February 23, 2025
और, ‘सबका साथ, सबका विकास’ के इस संकल्प का भी एक बड़ा आधार है- सबका इलाज, सबको आरोग्य: PM
यह देखकर बहुत संतोष होता है कि बागेश्वर धाम में अध्यात्म और आरोग्य के संगम से लोगों का कल्याण हो रहा है। pic.twitter.com/0dn8jg8nAe
— Narendra Modi (@narendramodi) February 23, 2025
हिन्दू आस्था से नफरत करने वाले और गुलामी की मानसिकता से घिरे लोगों का एक ही एजेंडा है- हमारे समाज को बांटना और उसकी एकता को तोड़ना। pic.twitter.com/9kmdta4SR3
— Narendra Modi (@narendramodi) February 23, 2025
एकता के महाकुंभ में स्वच्छता, सुरक्षा और स्वास्थ्य को लेकर पूरे सेवा भाव के साथ जो कार्य हो रहे हैं, उसने देशवासियों का दिल जीत लिया है। pic.twitter.com/7LJFz2tOev
— Narendra Modi (@narendramodi) February 23, 2025
‘सबका साथ, सबका विकास’ के संकल्प का एक बड़ा आधार है- सबका इलाज, सबको आरोग्य! pic.twitter.com/qrjqvggidI
— Narendra Modi (@narendramodi) February 23, 2025
देश में गरीब जितना बीमारी से नहीं डरता था, उससे ज्यादा डर उसे इलाज के खर्च से लगता था। इसीलिए, मैंने संकल्प लिया कि… pic.twitter.com/FPWArzM4mP
— Narendra Modi (@narendramodi) February 23, 2025
ये अत्यंत प्रसन्नता की बात है कि बागेश्वर धाम में कैंसर मरीजों के लिए एक बड़ा अस्पताल खुलने जा रहा है। लेकिन कैंसर से सुरक्षा को लेकर आपको मेरी ये बात जरूर याद रखनी है… pic.twitter.com/posYPijHem
— Narendra Modi (@narendramodi) February 23, 2025
बुंदेलखंड समृद्ध बने और यहां के किसानों और माताओं-बहनों का जीवन आसान हो, इसके लिए मोदी आपका सेवक बनकर दिन-रात सेवा में जुटा है। pic.twitter.com/krmiCY6RoO
— Narendra Modi (@narendramodi) February 23, 2025
बागेश्वर धाम में बाला जी सरकार के दर्शन-पूजन का सौभाग्य मिला। उनसे देशवासियों की सुख-समृद्धि और कल्याण की कामना की। pic.twitter.com/atbEulAjj6
— Narendra Modi (@narendramodi) February 23, 2025