Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇండోనేషియాలోని జకార్తాలో శ్రీ సనాతన ధర్మ ఆలయం మహా కుంభాభిషేకం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ఇండోనేషియాలోని జకార్తాలో శ్రీ సనాతన ధర్మ ఆలయం మహా కుంభాభిషేకం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం


ఇండోనేషియాలోని జకార్తాలో శ్రీ సనాతన ధర్మాలయం మహా కుంభాభిషేకం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, మురుగన్ టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ పా.హషీమ్, మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ కోబాలన్, తమిళనాడు, ఇండోనేషియాకు చెందిన ప్రముఖులు, పూజారులు, ఆచార్యులు, ప్రవాస భారతీయులు, ఇండోనేషియా, ఇతర దేశాలకు చెందిన పౌరులు, ఈ దివ్యమైన, అద్భుతమైన ఆలయాన్ని సాకారం చేసిన ప్రతిభావంతులైన కళాకారులందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకలో పాల్గొనడం తన అదృష్టమని, అధ్యక్షుడు ప్రబోవో హాజరు కావడం తనకు ఈ కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకం చేసిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. జకార్తాకు భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ, ఈ కార్యక్రమానికి తాను మానసికంగా దగ్గరగా ఉన్నానని, ఇది బలమైన భారత్-ఇండోనేషియా సంబంధాలను ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. అధ్యక్షుడు ప్రబోవో ఇటీవల 140 కోట్ల మంది భారతీయుల అభిమానాన్ని ఇండోనేషియాకు తీసుకెళ్లారని, ఆయన ద్వారా ఇండోనేషియాలోని ప్రతి ఒక్కరూ ప్రతి భారతీయుడి శుభాకాంక్షలను అనుభూతి చెందినట్టు తాను భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. జకార్తా ఆలయ మహా కుంభాభిషేకం సందర్భంగా ఇండోనేషియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మురుగన్ భక్తులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తిరుప్పుగళ్ భజనల ద్వారా మురుగన్ కీర్తి కొనసాగాలని, అలాగే స్కంద షష్టి కవచం మంత్రాల ద్వారా సమస్త ప్రజల కు రక్షణ కలగాలని ప్రధాని ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణం కలను సాకారం చేయడంలో కృషి చేసిన డాక్టర్ కోబాలన్ ను, ఆయన బృందాన్ని అభినందించారు.

“భారత్,  ఇండోనేషియా మధ్య సంబంధాలు కేవలం భౌగోళిక- రాజకీయాలకు పరిమితం కాదు, వేలాది సంవత్సరాల భాగస్వామ్య సంస్కృతి,  చరిత్రలో పాతుకుపోయాయి” అని ప్రధాన మంత్రి ఉద్వేగంగా అన్నారు. రెండు దేశాల మధ్య బంధం వారసత్వం, విజ్ఞానం, విశ్వాసం, పరస్పర విశ్వాసాలు, ఆధ్యాత్మికతపై ఆధారపడి ఉందని ఆయన ఉద్ఘాటించారు. ఈ సంబంధంలో మురుగన్, రాముడు బుద్ధుడు కూడా ఉన్నారని అన్నారు. భారతదేశానికి చెందిన ఎవరైనా ఇండోనేషియాలోని ప్రంబనన్ ఆలయాన్ని సందర్శించినప్పుడు కాశీ, కేదార్ నాథ్ లలో ఉన్న మాదిరి ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో వాల్మీకి రామాయణం, కంబ రామాయణం, రామచరిత మానస్ వంటి భావోద్వేగాలను కాకవిన్, సెరాత్ రామాయణ కథలు ప్రతిబింబిస్తాయని ఆయన తెలిపారు. భారతదేశంలోని అయోధ్యలో ఇండోనేషియా రామ్ లీలాను కూడా నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. బాలిలో “ఓం స్వస్తి-అస్తు” వింటే భారత్ లోని వేద పండితుల ఆశీస్సులు గుర్తుకు వస్తాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఇండోనేషియాలోని బోరోబుదూర్ స్థూపం భారత్లోని సారనాథ్, బుద్ధగయలో కనిపించే బుద్ధుడి బోధనల తో సమానమైన సందేశాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒడిశాలో జరిగే బలి జాత్రా ఉత్సవం పురాతన కాలంలో భారతదేశం,  ఇండోనేషియాల మధ్య ఉన్న సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలను గుర్తుచేస్తుందని చెప్పారు.నేటికీ భారతీయులు గరుడ ఇండోనేషియా ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించినప్పుడు, ఉభయ దేశాల మధ్య ఉన్న ఉమ్మడి సంస్కృతిని స్పష్టంగా చూడగలుగుతున్నారని ఆయన పేర్కొన్నారు.

భారత్, ఇండోనేషియా మధ్య సంబంధాలు అనేక బలమైన దారాలతో అల్లుకుందని, అధ్యక్షుడు ప్రబోవో ఇటీవల భారత పర్యటన సందర్భంగా, ఈ ఉమ్మడి వారసత్వంలోని అనేక అంశాలను ఎంతో ఆస్వాదించారని ప్రధాని పేర్కొన్నారు. జకార్తాలో కొత్తగా నిర్మించిన ఈ గొప్ప మురుగన్ ఆలయం శతాబ్దాల నాటి వారసత్వానికి కొత్త సువర్ణ అధ్యాయాన్ని జోడిస్తుందని,  ఈ ఆలయం విశ్వాసానికి, సాంస్కృతిక విలువలకు కొత్త కేంద్రంగా మారుతుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

జకార్తాలోని మురుగన్ దేవాలయంలో మురుగన్ మాత్రమే కాకుండా అనేక ఇతర దేవతలు కూడా ఉన్నారని పేర్కొన్న శ్రీ మోదీ, ఈ వైవిధ్యం, బహుళత్వం మన సంస్కృతికి పునాది అని చెప్పారు. ఇండోనేషియాలో ఈ భిన్నత్వ సంప్రదాయాన్ని ‘భిన్నెకా తుంగల్ ఇకా’ అని, భారత్ లో భిన్నత్వంలో ఏకత్వం అని పిలుస్తారని తెలిపారు. ఇండోనేషియా, భారత్ రెండింటిలోనూ భిన్న మతాల ప్రజలు ఇంత సామరస్యంతో జీవించడానికి ఈ భిన్నత్వాన్ని అంగీకరించడమే కారణమని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని స్వీకరించడానికి ఈ పవిత్రమైన రోజు మనకు స్ఫూర్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు.

“సాంస్కృతిక విలువలు, వారసత్వం,  భారత్, ఇండోనేషియా దేశాల ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తున్నాయి” అని శ్రీ మోదీ అన్నారు. ప్రంబనన్ ఆలయాన్ని పరిరక్షించాలని ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం, బోరబుదూర్ బౌద్ధాలయం పట్ల ఉమ్మడి నిబద్ధతను ఆయన ప్రస్తావించారు. అయోధ్యలో ఇండోనేషియా రామ్ లీలాను ప్రస్తావిస్తూ,  ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. అధ్య క్షుడు ప్ర బోవోతో క లిసి తాము ఈ దిశలో వేగంగా ముందుకు సాగుతామని ప్రధాన మంత్రి విశ్వాసం వ్య క్తం చేశారు. గతమే బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుందని పేర్కొన్నారు. ఆలయ మహా కుంభాభిషేకం సందర్భంగా అధ్యక్షుడు ప్రబోవోకు కృతజ్ఞతలు తెలుపుతూ,  అందరినీ అభినందిస్తూ ప్రధాని తమ ప్రసంగాన్ని ముగించారు.

 

***