Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పరాక్రమ దివస్ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ప్రసంగం

పరాక్రమ దివస్ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ప్రసంగం


పరాక్రమ దివస్‌గా నిర్వహిస్తున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నేపథ్యంలో ఆయన్ను యావత్ దేశం సగౌరవంగా స్మరించుకుంటోందని అన్నారు. నేతాజీ సుభాష్ బోస్‌కు నివాళులు అర్పిస్తూ, ఈ ఏడాది పరాక్రమ దివస్ ఉత్సవాలను ఆయన జన్మస్థలమైన ఒడిశాలో ఘనంగా నిర్వహిస్తున్నామని శ్రీ మోదీ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. నేతాజీ జీవితం ఆధారంగా ఒడిశాలోని కటక్‌లో భారీ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు ప్రధాని వెల్లడించారు. ఎంతో మంది చిత్రకారులు నేతాజీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సంఘటనలను కాన్వాస్‌పై చిత్రించారని అన్నారు. అలాగే నేతాజీకి సంబంధించిన ఎన్నో పుస్తకాలను సైతం సేకరించినట్లు ఆయన తెలిపారు. నేతాజీ జీవిత ప్రయాణంలోని ముఖ్యమైన ఈ పరిణామాలు మేరీ యువ భారత్ లేదా మై భారత్‌కు కొత్త శక్తిని ఇస్తాయనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

‘‘అభివృద్ధి చెందిన భారత్ (వికసిత్ భారత్) అనే లక్ష్యాన్ని సాధించడంలో ప్రస్తుతం మనం నిమగ్నమై ఉన్నాం. ఈ దిశగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉదాత్త జీవితం మనల్ని ప్రేరేపిస్తుంది’’ అని ప్రధాని అభిప్రాయం వ్యక్తం చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోసుకి అన్నింటికంటే ప్రధానమైన లక్ష్యం ఆజాద్ హింద్. దీన్ని సాధించేందుకు ఆజాద్ హింద్ అనే ఏకైక ప్రమాణం ఆధారంగా తీసుకున్న నిర్ణయంపై ఆయన దృఢంగా నిలబడ్డారని శ్రీ మోదీ పేర్కొన్నారు. సంపన్న కుటుంబంలో జన్మించి, సివిల్ సర్వీసు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన నేతాజీ బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపి ఉండవచ్చు. కానీ స్వతంత్రాన్ని సాధించే లక్ష్యంతో భారత్‌తో పాటు ఇతర దేశాల్లో సంచరిస్తూ.. కష్టాలు, సవాళ్లతో కూడిన మార్గాన్ని ఎంచుకున్నారని శ్రీ మోదీ కీర్తించారు. ‘‘నేతాజీ సుభాష్ సౌకర్యాలకు, అనుకూలమైన వాతావరణానికి లోబడి ఉండే వ్యక్తి కాదు’’ అని పీఎం అన్నారు. ‘‘ఇప్పుడు వికసిత్ భారత్ నిర్మాణం కోసం మనందరం మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన సూచించారు. అంతర్జాతీయంగా అత్యుత్తమంగా మారడానికి, ఉన్నతమైనవి ఎంచుకోవడానికి, సామర్థ్యంపై దృష్టి సారించేందుకు ఇవ్వాల్సిన ప్రాధాన్యం గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

దేశ స్వాతంత్య్రం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్‌ను నేతాజీ ఏర్పాటు చేశారని, అన్ని ప్రాంతాలు, వర్గాలకు చెందిన ధైర్యవంతులైన స్త్రీపురుషులు ఇందులో భాగమయ్యారని గుర్తు చేస్తూ వేర్వేరు భాషలు మాట్లాడుతున్నప్పటికీ దేశ స్వాతంత్య్రమే వారిని ఐక్యంగా ఉంచిన భావన అని ప్రధానమంత్రి అన్నారు. ఈనాటి వికసిత్ భారత్ అనే భావనకు ఈ ఐక్యత గొప్ప పాఠమని ఆయన స్పష్టం చేశారు. స్వరాజ్య సాధనకు అప్పట్లో ఈ ఐక్యత ఎంత అవసరమైందో.. ఇప్పుడు వికసిత్ భారత్ సాధించడానికి సైతం అంతే అవసరమని ఆయన పేర్కొన్నారు. దేశం పురోగతి సాధించే దిశగా అంతర్జాతీయంగా నెలకొన్న అనువైన వాతావరణం గురించి ప్రస్తావిస్తూ, 21వ శతాబ్ధాన్ని భారత్ ఎలా సొంతం చేసుకోనుందనే ఆసక్తితో ప్రపంచం మనల్ని చూస్తోందని ప్రధానమంత్రి అన్నారు. నేతాజి సుభాష్ నుంచి స్ఫూర్తి పొంది దేశ ఐక్యతపై దృష్టి సారించాలని అన్నారు. అలాగే దేశాన్ని బలహీనపరచాలని, ఐక్యతకు విఘాతం కలిగించాలని చూస్తున్నవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రధాని హెచ్చరించారు.

భారతీయ సాంస్కృతిక వారసత్వం పట్ల నేతాజీ సుభాష్ చాలా గర్వపడేవారని శ్రీ మోదీ అన్నారు. సుసంపన్నమైన దేశ ప్రజాస్వామ్య చరిత్ర గురించి తరచూ మాట్లాడుతూ ఉండేవారని, దాని నుంచి ప్రజలు స్ఫూర్తి పొందేలా ప్రోత్సహించేవారని ఆయన వివరించారు. ఇప్పుడు వలసవాద పాలన భావజాలం నుంచి భారత్ బయటకు వచ్చి, దాని వారసత్వం విషయంలో గౌరవ భావనను పెంచుకుంటోందని అన్నారు. మరపురాని చారిత్రక సందర్భమైన ఆజాద్ హింద్ ప్రభుత్వ 75వ వార్షికోత్సవంలో భాగంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం గౌరవంగా భావిస్తున్నానని ప్రధానమంత్రి వివరించారు. నేతాజీ అందించిన స్ఫూర్తితో ఢిల్లీలోని ఎర్రకోటలో 2019లో ఓ మ్యూజియాన్ని నెలకొల్పి ఆయనకే అంకితం చేశామని తెలియజేశారు. దీనితో పాటుగా అదే ఏడాదిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విపత్తు నిర్వహణ పురస్కారాలు ప్రారంభించామని వెల్లడించారు. ‘‘2021లో నేతాజీ జయంతిని పరాక్రమ దివస్ గా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది’’ అని శ్రీ మోదీ చెప్పారు. అలాగే ఇండియా గేట్ సమీపంలో నేతాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, అండమాన్ దీవుల్లో ఒకదానికి ఆయన పేరును పెట్టడం, గణతంత్ర దినోత్సవ కవాతులో ఐఎన్ఏ సైనికులకు గౌరవ వందనం సమర్పించడం ఇవన్నీ ఆయన అందించిన వారసత్వాన్ని గౌరవించడంలో ప్రభుత్వానికున్న నిబద్ధతను తెలియజేస్తున్నాయి.

‘‘గత పదేళ్లలో సామాన్యుడి జీవితం సులభతరమయ్యేలా వేగవంతమైన అభివృద్ధిని దేశం సాధించింది. సైనిక సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంది’’ అని శ్రీ మోదీ వివరించారు. గత దశాబ్దంలో 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని, ఇది గొప్ప విజయమని ఆయన అన్నారు. గ్రామం, నగరం అనే తేడా లేకుండా ప్రతి చోటా ఆధునిక మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని పీఎం తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా భారత సైనిక సామర్థ్యం పెరిగిందని, అంతర్జాతీయ వేదికపై దేశ ప్రాధాన్యం విస్తరించిందని ఆయన అన్నారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. నేతాజీ సుభాష్ నుంచి స్ఫూర్తి పొంది ఒకే లక్ష్యం, ఒకే ఆలోచనతో వికసిత్ భారత్ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. అదే నేతాజీకి మనం అందించే నిజమైన నివాళి అన్నారు. అందరికీ ప్రధానమంత్రి అభినందనలు తెలియజేశారు.

 

***