ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 27 మధ్యాహ్నం 12.30 గం.లకు జరిగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పది రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 200 జిల్లాల్లో ఉన్న 46,000 గ్రామాల్లోని యజమానులకు స్వామిత్వ పథకం కింద 50 లక్షల స్థిరాస్థి కార్డులను అందజేస్తారు.
అధునాతన డ్రోన్ సర్వే టెక్నాలజీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు ఉన్న కుటుంబాలకు ‘హక్కుల రికార్డు’ను అందజేస్తారు. తద్వారా గ్రామీణ భారత ఆర్థిక పురోగతిని విస్తృత పరిచే లక్ష్యంతో స్వామిత్వ పథకాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు.
ఆస్తి విక్రయాలను సులభతరం చేసేందుకు, బ్యాంకుల నుంచి సంస్థాగత రుణాలు పొందేందుకు, ఆస్తి వివాదాలను తగ్గించేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులను, ఆస్తి పన్నుల అంచనాలను సులభంగా నిర్దారించేందుకు, సమగ్ర గ్రామ స్థాయి ప్రణాళికను అమలు చేసేందుకు ఈ పథకం తోడ్పడుతుంది.
ఇప్పటికే 3.1 లక్షల గ్రామాల్లో అంటే 92 శాతం లక్షిత గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయింది. ఇప్పటి వరకు దాదాపుగా 1.5 లక్షల గ్రామాల్లో 2.2 కోట్ల వరకు యాజమాన్య కార్డులను సిద్ధం చేశారు.
త్రిపుర, గోవా, ఉత్తరాఖండ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ పథకం దాదాపు పూర్తి కావొస్తోంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో పాటు కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో డ్రోన్ సర్వే పూర్తయింది.