Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం


మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతిపట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని ఆయన వ్యాఖ్యానించారు. జీవితంలోని ప్రతి రంగంలోనూ విజయం సాధించడం మామూలు విషయం కాదన్న ప్రధానమంత్రి.. విభజన సమయంలో భారత్ కు వచ్చిన అనంతరం అనేక కష్టనష్టాలను ఎదుర్కొన్నప్పటికీ డాక్టర్ మన్మోహన్ సింగ్ విజేతగా నిలిచారని ప్రధానమంత్రి అన్నారు. ప్రతికూలతలను అధిగమించి ఉన్నత శిఖరాలను ఎలా అధిరోహించాలో డాక్టర్ మన్మోహన్ సింగ్ జీవితం భావి తరాలకు నేర్పుతుందన్నారు.

సౌమ్యుడిగా, ఉన్నతమైన ఆర్థిక వేత్తగా, సంస్కరణలపట్ల నిబద్ధత గల నాయకుడిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎప్పటికీ గుర్తుండిపోతారని స్పష్టంచేసిన శ్రీ మోదీ.. ఆర్థికవేత్తగా ప్రభుత్వంలోని వివిధ స్థాయిల్లో కేంద్ర ప్రభుత్వానికి ఆయన అందించిన సేవలను ప్రముఖంగా ప్రస్తావించారు. సవాళ్లతో కూడిన సమయంలో భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ గా డాక్టర్ మన్మోహన్ సింగ్ పాత్ర ప్రశంసనీయమైనదని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

మాజీ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ పి.వి. నరసింహరావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ సంక్షోభ కాలంలో దేశానికి మార్గనిర్దేశం చేసి సరికొత్త ఆర్థిక పథంలో నడిపారని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ప్రధానమంత్రిగా దేశ అభివృద్ధికీ, పురోగతికీ ఆయన అందించిన సేవలు ఎన్నటికీ గుర్తుండిపోతాయని ఆయన స్పష్టంచేశారు. ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి డాక్టర్ మన్మోహన్ సింగ్ అంకితభావంతో కృషిచేశారన్నారు.

డాక్టర్ సింగ్ జీవితం నిజాయితీకి, నిరాడంబరతకు ప్రతిరూపమని శ్రీ మోదీ కొనియాడారు. నిగర్విగా, మృదు స్వభావిగా, మేధావిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్లమెంటరీ ప్రస్థానం విలక్షణమైనదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ప్రారంభంలో రాజ్యసభలో డాక్టర్ మన్మోహన్ సింగ్ పదవీకాలం ముగిసినప్పుడు కూడా ఆయన నిబద్ధత అందరికీ స్ఫూర్తిదాయకమని తాను ప్రశంసించానని ప్రధానమంత్రి గుర్తుచేశారు. శారీరకంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ ముఖ్యమైన సమావేశాలకు చక్రాల కుర్చీలో హాజరై తన పార్లమెంటరీ విధులను నిర్వర్తించారని శ్రీ మోదీ అన్నారు.

ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సంస్థల నుంచి విద్యాభ్యాసం చేసి, అత్యున్నత ప్రభుత్వ పదవులు చేపట్టినప్పటికీ.. తాను ఎదిగి వచ్చిన నేపథ్యాన్ని మరచిపోకుండా డాక్టర్ మన్మోహన్ సింగ్ విలువలను పాటించారని ప్రధానమంత్రి చెప్పారు.ఆయన  ఎప్పుడూ  పార్టీ రాజకీయాలకు అతీతంగా ఉండేవారని చెప్పారు. అన్ని పార్టీల వ్యక్తులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, అందరికీ అందుబాటులో ఉండేవారన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ, ఆ తర్వాత ఢిల్లీలోనూ పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై డాక్టర్ సింగ్ తో తాను చేసిన బహిరంగ చర్చలను ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ కుటుంబానికి సంతాపం తెలిపిన ప్రధానమంత్రి.. ప్రజలందరి తరఫునా ఆయనకు నివాళి అర్పించారు. 

***

MJPS/SR/SKS