Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రోజ్‌గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా పాల్గొన్న ప్రధాని: 71,000కు పైగా నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

రోజ్‌గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా పాల్గొన్న ప్రధాని:  71,000కు పైగా నియామక పత్రాల పంపిణీ  సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం


నమస్కారం.

మంత్రిమండలిలో నా సహచరులు, దేశంలో వివిధ ప్రాంతాల ప్రముఖులు, నా యువ మిత్రులారా.

నేను నిన్న రాత్రి పొద్దుపోయాక కువైట్ నుంచి తిరిగివచ్చాను.  అక్కడ, భారతీయ యువతీయువకులతోనూ, వృత్తినిపుణులతోనూ నేను చాలా సేపు సమావేశమయ్యాను. మా మధ్య చక్కని చర్చలు సాగాయి.  ఇక, ఇక్కడికి తిరిగివచ్చాక,  పాల్గొన్న మొట్టమొదటి కార్యక్రమం మన దేశ యువతతోనే.  ఇది నిజంగా సంతోషం కలిగించే యాదృచ్ఛిక ఘటన.  మీ వంటి వేలాది యువతీయువకులకు ఈ రోజు ఒక ముఖ్యఘట్టం.  మీ జీవనంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలవుతోంది.  మీరు ఏళ్ళపాటు కన్న కలలు నెరవేరాయి.  మీరు పట్టువిడువక చేసిన ప్రయత్నాలు ఫలించాయి.  కొద్దిరోజుల్లో వెళ్లిపోతున్న 2024 సంవత్సరం మీకూ, మీ కుటుంబాలకూ సరికొత్త ఉల్లాసాన్నిచ్చి, సెలవు తీసుకొంటోంది.  ఈ ప్రశంసనీయ విజయానికి గాను మీలో ప్రతి ఒక్కరికీ, మీ కుటుంబాలకూ నేను మనసారా నా అభినందనలను తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

మా ప్రభుత్వానికున్న అత్యున్నత ప్రాధాన్యం భారతదేశ యువతకు ఉన్న శక్తియుక్తులనూ, ప్రతిభనూ గరిష్ఠ స్థాయికి చేర్చడమే.  రోజ్‌గార్ మేళాల వంటి కార్యక్రమాల ద్వారా మేం ఈ గమ్యంకేసి పయనిస్తున్నాం.  గత పదేళ్ళలో, ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలన్న ఒక సమగ్ర ప్రచార ఉద్యమం వేరు వేరు మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో కొనసాగుతూ వస్తోంది.  ఈ రోజు కూడా 71,000మందికి పైగా యువతీయువకులకు నియామక పత్రాల్ని అందించారు.  ఒక్క గత ఏడాదిన్నర కాలంలోనే మా ప్రభుత్వం సుమారు 10 లక్షల మంది యువతీ యువకులకు శాశ్వత ప్రభుత్వోద్యోగాల్ని చూపించింది.  ఇది ఒక రికార్డు.  ప్రభుత్వంలో శాశ్వత ఉద్యోగ కల్పనకు ఉద్యమ తరహాలో ముందడుగు వేయడం ఇదివరకు ఏ పాలన యంత్రాంగంలోనూ ఎన్నడూ చోటుచేసుకోలేదు. పైపెచ్చు ఈ అవకాశాలను పూర్తి నిజాయతీతో, పారదర్శకమైన పద్ధతిలో అందిస్తున్నారు.  ఈ పారదర్శకత నిండిన సంప్రదాయంలో వృద్ధిలోకి వచ్చిన యువత ఎంతో అంకితభావంతో, చిత్తశుద్ధితో దేశ ప్రజలకు సేవ చేస్తున్నారు.  ఏ దేశంలో అయినా పురోగతి ఆ దేశ యువత చేసే ప్రయత్నాలూ, ఆ యువత సామర్థ్యాలూ, ఆ యువత నాయకత్వంతో ముడిపడి ఉంటుంది.

మిత్రులారా,

భారత్ 2047 కల్లా ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని సంకల్పించింది.  ఈ ఆకాంక్షను నెరవేర్చగలమని మేం దృఢంగా విశ్వసిస్తున్నాం.  ప్రతి ఒక్క విధాన నిర్ణయంలో మన దేశ ప్రతిభావంతులైన యువత ప్రయోజనాలు కీలకంగా ఉంటున్నాయన్న వాస్తవం ఆధారంగా మాలో ఈ విశ్వాసం పుట్టుకువచ్చింది.  గత దశాబ్ద కాలంలో మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్, స్టార్ట్-అప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా, డిజిటల్ ఇండియా.. వంటి కార్యక్రమాలు కూడా యువత ప్రయోజనాలను ప్రధానంగా లెక్కలోకి తీసుకొని రూపొందించినవే.  భారత్ అంతరిక్షం, రక్షణ రంగ తయారీ  వంటి రంగాల్లో అనుసరిస్తున్న విధానాలను సంస్కరించి, ఆయా అవకాశాల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి యువతకు సాధికారతను కల్పించింది.  ప్రస్తుతం, భారతదేశంలో యువత విశ్వాసానికి మారుపేరుగా ఉంటూ, ప్రతి రంగంలోనూ రాణిస్తోంది.  మనం ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగాం.  అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా మూడో అతిపెద్ద అంకుర సంస్థలకు అనుకూల వాతావరణం మన దేశంలో ఏర్పడింది.  ఒక యువ ప్రతినిధి ప్రస్తుతం స్టార్ట్-అప్ రంగంలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టాలని భావిస్తే, సానుకూల వాతావరణమంటూ సిద్ధంగా ఉంది.  ఇదే మాదిరిగా, ఓ యువ ప్రతినిధి క్రీడారంగాన్ని కెరియర్‌గా ఎంచుకోవాలనుకుంటే మొక్కవోని విశ్వాసంతో, విఫలం అవుతానేమోనన్న భయానికి  చోటివ్వకుండా ముందంజ వేయవచ్చు.  శిక్షణ మొదలుకొని, పోటీతత్వంతోసాగే ఆటల పోటీల వరకు చూస్తే, అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తెస్తూ విజయానికి సరైన బాటను వేస్తున్నారు.  వివిధ రంగాల్లో చెప్పుకోదగ్గ మార్పును గమనిస్తున్నాం.  మన దేశం ప్రస్తుతం ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారు దేశంగా ఎదిగింది.    పునరుత్పాదక ఇంధనం నుంచి సేంద్రీయ వ్యవసాయం వరకూ, అంతరిక్ష రంగం నుంచి రక్షణ రంగం వరకూ, పర్యాటకం మొదలు వెల్‌నెస్ వరకూ దేశం కొత్త శిఖర స్థాయిలకు చేరుకొంటూ, ఇదివరకు ఎప్పుడూ ఎరుగనన్ని అవకాశాల్ని అందిస్తోంది.

మిత్రులారా,

దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకుపోవడానికి మన యువతలో ఉన్న ప్రతిభకు పదును పెట్టితీరాలి.  ఈ బాధ్యత చాలా వరకు మన విద్యా వ్యవస్థదే.  దశాబ్దాల తరబడి దేశం ఒక నవ భారత్‌ను నిర్మించాలంటే ఆధునిక విద్యా బోధనకు సంబంధించి ఒక ప్రాథమిక కార్యాచరణ ప్రణాళిక ఎంతైనా అవసరమని భావించింది.  జాతీయ విద్యావిధానాన్ని తీసుకువచ్చి మేం మార్పు ప్రధానంగా ఉండే ప్రయాణాన్ని మొదలుపెట్టాం.  ఒకప్పుడు మార్పులకు తావివ్వని విద్యా వ్యవస్థ విద్యార్థులకు ఒక పరిమితిని విధించగా, ప్రస్తుతం వారికి అనేక కొత్త అవకాశాలు లభిస్తున్నాయి.  అటల్ టింకరింగ్ ల్యాబ్స్, ఆధునిక పీఎం-శ్రీ స్కూళ్ళు వంటి కార్యక్రమాలు బాలల్లో కొత్త కొత్త ఆలోచనలు చేసే మనస్తత్వాన్ని పెంచి పోషిస్తున్నాయి.  ఇదివరకు గ్రామీణ ప్రాంతాల వారికి, దళితలకు, వెనుకబడిన వర్గాల వారికి, గిరిజన యువతీయువకులకు భాష ఒక పెద్ద అడ్డంకిగా ఉండేది.   ఈ అడ్డును తొలగించడానికి మేం ప్రాంతీయ భాషల్లో విద్యాబోధన, పరీక్షల నిర్వహణకు అనువైన విధానాలను ప్రవేశపెట్టాం.  ప్రస్తుతం మా ప్రభుత్వం 13 భిన్న భాషలలో నియామక పరీక్షలను నిర్వహించడానికి రంగాన్ని సిద్ధం చేసింది.  దీనికి తోడు, సరిహద్దు జిల్లాల్లో యువతకు సాధికారతను కల్పించడానికి మేం వారి నియామక కోటాలను పెంచి, ప్రత్యేక ఉద్యోగాల భర్తీ కార్యక్రమాలను మొదలుపెట్టాం.  ఫలితంగా, 50,000 మందికి పైగా యువత కేంద్ర సాయుధ పోలీసుదళాల్లో ఉద్యోగ నియామక పత్రాలు అందుకొన్నారు.  ఈ యువజనులకు నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

ఈరోజు చౌధరీ చరణ్ సింగ్ జీ జయంతి కూడా.  చౌధరీ సాహబ్‌కు ఈ సంవత్సరం భారత్ రత్నను ప్రదానం చేసిన అదృష్టానికి మా ప్రభుత్వం నోచుకొంది. ఆయనకు నేను గౌరవ పూర్వకంగా నివాళి అర్పిస్తున్నాను.  మనం ఈ రోజున జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకొంటాం.  ఈ సందర్భంగా, మన దేశ ప్రజలకు అన్నదాతలైన రైతులకు నేను నమస్కరిస్తున్నాను.

మిత్రులారా,

భారత్‌లో గ్రామీణ ప్రాంతాలు వృద్ధి చెందితేనే మన దేశం ముందుకుపోతుందని చౌధరీ సాహబ్ పదేపదే అనేవారు.  ప్రస్తుతం మా ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు గ్రామీణ భారతంలో కొత్తగా ఉద్యోగావకాశాలను, స్వయం ఉపాధి మార్గాలను సృష్టిస్తున్నాయి.  భారీ సంఖ్యలో యువత వ్యవసాయ రంగంలో చక్కని ఉపాధిని పొంది, వారి ఆకాంక్షలకు సరితూగే పనిలో నిమగ్నమయ్యారు.  గోబర్‌ధన్ యోజనలో భాగంగా నిర్మించిన వందల కొద్దీ బయోగ్యాస్ ప్లాంట్లు ఒక్క విద్యుత్తును ఉత్పత్తి చేయడమే కాకుండా, వేల మంది యువతీయువకులకు కొలువులు దొరికేటట్లు కూడా చేశాయి.  వందల కొద్దీ వ్యవసాయ మార్కెట్లను ఈ-నామ్ యోజన పరిధిలోకి తీసుకురావడంతో లెక్కపెట్టలేనన్ని ఉద్యోగావకాశాలు అందివచ్చాయి.  ఇదే మాదిరిగా ఇథనాల్ మిశ్రణాన్ని 20 శాతం వరకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు ప్రయోజనాన్ని అందించడంతోపాటు చక్కెర రంగంలో కొలువులను కూడా సృష్టించింది.  సుమారు 9,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ( ఎఫ్‌పీఓస్) ను ఏర్పాటుచేసి, పల్లె ప్రాంతాల్లో ఉద్యోగాలు దొరికేటట్లు చూడటంతోపాటు రైతులకు కొత్త మార్కెట్లను అందించగలిగాం.  ప్రభుత్వం వేలకొద్దీ గిడ్డంగులను నిర్మిస్తూ, ప్రపంచంలో అతిపెద్ద ఆహార నిలవ పథకాన్ని అమలుచేస్తోంది.  ఈ కార్యక్రమం సైతం ఉద్యోగ స్వయంఉపాధి అవకాశాల్ని బాగా పెంచబోతోంది.  ఇటీవలే ప్రభుత్వం బీమా సఖి యోజనను ప్రారంభించింది.  దేశలో ప్రతి ఒక్కరికీ బీమా రక్షణను అందించడం ఈ పథకం ఉద్దేశం.  ఈ కార్యక్రమం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో ఉద్యోగావకాశాలను కల్పించనుంది.  అది డ్రోన్ దీదీ అభియాన్ కావచ్చు, లఖ్‌పతి దీదీ అభియాన్ కావచ్చు లేదా బ్యాంకు సఖి యోజన కావచ్చు.. ఈ కార్యక్రమాలన్నీ వ్యవసాయరంగంలో గ్రామీణ ప్రాంతాల్లో కొత్త కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి.

మిత్రులారా,

ఈ రోజు వేల సంఖ్యలో యువతులు ఉద్యోగ నియామక పత్రాలను అందుకున్నారు.  మీరు సాధించిన విజయం ఎంతో మంది ఇతర మహిళలకు ప్రేరణను ఇస్తుంది.  మేం జీవనంలో ప్రతి రంగంలో మహిళలకు సాధికారత కల్పించడానికి కట్టుబడి ఉన్నాం.  26 వారాలపాటు ప్రసూతి సెలవు ఇవ్వాలని మేం తీసుకున్న నిర్ణయం లక్షలాది మహిళల ఉద్యోగ జీవనానికి రక్షగా నిలిచింది.  ఇది వారి ఆకాంక్షలు చెదరకుండా చూసింది.  మహిళా ప్రగతికి అడ్డుపడే ప్రతి ఒక్క అవరోధాన్ని తొలగించడానికి మా ప్రభుత్వం అలుపెరుగక కృషి చేస్తోంది.  స్వాతంత్య్రం వచ్చి చాలా సంవత్సరాలయినా, చాలా మంది బాలికలు పాఠశాలల్లో వారికంటూ విడిగా టాయిలెట్‌లు లేనందువల్ల బడికి వెళ్ళడం మానుకోవలసివచ్చింది.  మేం ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ ద్వారా ఈ సమస్యను పరిష్కరించాం.  ఆర్థిక ఇబ్బందులనేవి బాలికల విద్యకు ఇక ఎంతమాత్రం అడ్డుపడకుండా ‘సుకన్య సమృద్ధి యోజన’ అభయమిచ్చింది.  మా ప్రభుత్వం 30 కోట్ల మంది మహిళలకు జన్‌ధన్ ఖాతాలు తెరిచి, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను వారు నేరుగా అందుకొనేందుకు ఒక మార్గాన్ని ఏర్పరిచింది.  మహిళలు ముద్ర యోజనలో పూచీకత్తు అక్కరలేని రుణాలను అందుకోగలిగారు.  ఇదివరకు పూర్తి కుటుంబ బాధ్యతలను మహిళలే తరచూ నిర్వహిస్తూ వచ్చినా ఆస్తి యాజమాన్యం హక్కు వారి పేరిట ఉన్న సందర్భాలు చాలా అరుదు.  ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చే ఇళ్ళల్లో ఎక్కువ ఇళ్ళు మహిళల పేర్లతో రిజిస్టరవుతున్నాయి.  పోషణ్ అభియాన్, సురక్షిత్ మాతృత్వ అభియాన్, ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలు మహిళలకు ఆరోగ్య సంరక్షణను చాలా వరకు అందుబాటులోకి తీసుకువచ్చాయి.  నారీ శక్తి వందన్ యాక్టుతో మహిళలు విధాన సభల్లో, లోక్ సభలో రిజర్వేషన్లను సాధించుకొన్నారు.  మన సమాజం, మన దేశం ‘మహిళల నేతృత్వంలో అభివృద్ధి’ దిశలో వేగంగా ముందుకు కదులుతున్నాయి.

 

మిత్రులారా,

ఈరోజు ఉద్యోగ నియామక పత్రాలు అందుకొంటున్న యువ వృత్తినిపుణులు ప్రభుత్వ ఆధునిక వ్యవస్థలో భాగం కానున్నారు.  గత పదేళ్ళలో ప్రభుత్వ కార్యాలయాల పాత వాసనలను తొలగించి, వాటి పనితీరును మార్చారు.  ఈ రోజు ప్రభుత్వోద్యోగుల్లో సామర్థ్యం, పని చేసే విధానం పెరిగాయి.  ఈ విజయం వారి అంకితభావంతోనూ, కష్టపడి పనిచేసే తత్వంతోనూ లభించింది.  మీలో ఉన్న తపన, రాణించాలన్న దృఢ సంకల్పంలతో ఈ విజయాన్ని దక్కించుకొన్నారు.  మీ వృత్తి జీవనంలో  ఇదే ఉత్సాహాన్ని ఎప్పటికీ పెంచి పోషించుకోండి.  మీరు నిరంతరం నేర్చుకుంటూ ఉండాలని కోరుకున్నప్పుడు మీకు ఐగాట్ కర్మయోగి (iGOT Karmayogi) ప్లాట్‌ఫాం దన్నుగా నిలుస్తుంది.  ఈ ప్లాట్ ఫాం 1,600కు పైగా భిన్న పాఠ్య ప్రణాళికలను అందించి, వేరు వేరు సబ్జెక్టులపై ప్రభావవంతమైన విధంగా జ్ఞానాన్ని- అది కూడా ఎంతో తక్కువ కాల వ్యవధిలో- మీరు సంపాదించడానికి వీలుకల్పిస్తుంది.  మీరు యవ్వనంలో ఉన్నారు.  మీరు, దేశ బలానికి ప్రతినిధులుగా ఉన్నారు.  మన యువత తలచుకొంటే సాధించలేని లక్ష్యమంటూ ఏదీ లేదు.  ఈ కొత్త అధ్యాయాన్ని ఒక పరమార్థంతోనూ, రెట్టించిన శక్తితోనూ మొదలుపెట్టండి.  మరోసారి నేను, ఈ రోజున నియామక పత్రాలు అందుకొన్న యువతీ యువకులందరికీ, నా హృదయపూర్వక అభినందనలను తెలియజేస్తున్నాను. మీకు ఒక ఉజ్వల భవిష్యత్తూ, ఫలప్రద భవిష్యత్తూ లభించాలని కోరుకుంటూ, నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మీకందరికీ అనేకానేక ధన్యవాదాలు.

గమనిక: ఇది ప్రధానమంత్రి ప్రసంగానికి దగ్గరి అనువాదం. ఆయన హిందీలో ప్రసంగించారు.

 

****