Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కువైట్ ప్రధానితో ప్రధానమంత్రి భేటీ

కువైట్ ప్రధానితో ప్రధానమంత్రి భేటీ


కువైట్ ప్రధాని శ్రీ షేక్ అహమద్ అల్ – అబ్దుల్లా అల్-అహమద్ అల్-సబాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు చర్చలు జరిపారు.

రాజకీయాలు, వ్యాపారం, పెట్టుబడి, ఇంధనం, రక్షణ, భద్రత, ఆరోగ్యం, విద్య, టెక్నాలజీ, సాంస్కృతిక సంబంధాలు, రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు సహా అనేక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపర్చుకోవడానికి ఒక మార్గసూచీని రూపొందించుకోవడంపై నేతలిద్దరూ చర్చించారు. ఇరుదేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని విస్తృతపర్చుకోవాలని వారు స్పష్టంచేశారు. ఇంధనం, రక్షణ, వైద్య పరికరాలు, ఫార్మా, ఫుడ్ పార్కులు, తదితర రంగాల్లో కొత్త కొత్త అవకాశాలను పరిశీలించడానికి భారతదేశానికి రావాల్సిందిగా కువైట్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ఇతర ఆసక్తిదారులతో కూడిన ఒక ప్రతినిధివర్గాన్ని ప్రధాని ఆహ్వానించారు.  సాంప్రదాయక మందులు, వ్యవసాయ పరిశోధన రంగాల్లో సహకారం అంశాన్ని కూడా నేతలు చర్చించారు. ఆరోగ్యం, శ్రమశక్తి, హైడ్రోకార్బన్ల రంగాల్లో ఇప్పటికే సంయుక్త కార్యాచరణ బృందాలు (జేడబ్ల్యూజీలు) పనిచేస్తుండగా, వీటికి అదనంగా సహకారంపై ఏర్పాటైన  సంయుక్త సంఘం (జేసీసీ) పై ఇటీవల సంతకాలు చేయడాన్ని  వారు స్వాగతించారు. వ్యాపారం, పెట్టుబడి, విద్య, టెక్నాలజీ, వ్యవసాయం, భద్రతలతో పాటు సాంస్కృతిక  రంగాల్లో కొత్తగా జేడబ్ల్యూజీలను ఈ జేసీసీ పరిధిలో ఏర్పాటు చేశారు.

చర్చలు ముగిసిన తరువాత, నేతల సమక్షంలో ద్వైపాక్షిక ఒప్పంద పత్రాలపై సంతకాలయ్యాయి. ఆ ఒప్పంద పత్రాలతోపాటు అవగాహనపూర్వక ఒప్పందాల (ఎంఓయూల)ను ఇరుపక్షాల ఉన్నతాధికారులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొన్నారు. వీటిలో రక్షణ సహకారానికి ఉద్దేశించిన ఎంఓయూ, రెండు దేశాల సాంస్కృతిక బృందాలనూ ఒకదేశానికి మరొక దేశం పంపించడం, క్రీడారంగంలో సహకారానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడంతోపాటు అంతర్జాతీయ సౌర కూటమిలో కువైట్ చేరుతున్నట్లుగా సూచించే ఒక ఫ్రేంవర్క్ అగ్రిమెంట్‌లు కలిసి ఉన్నాయి.

భారత్‌లో పర్యటించాల్సిందిగా కువైట్ ప్రధానిని ప్రధానమంత్రి శ్రీ మోదీ ఆహ్వానించారు.