Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజస్థాన్ ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా

రాజస్థాన్ ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా


‘ఏక్ వర్ష్ – పరిణామ్ ఉత్కర్ష్: రాజస్థాన్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సంవత్సరం పూర్తి’ పేరుతో ఈ రోజు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం ఏడాది పాలనను విజయవంతంగా పూర్తి చేసుకొన్నందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికీ, ఆ రాష్ట్ర ప్రజలకూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన లక్షలాది మంది ప్రజల ఆశీర్వాదాల్ని అందుకోవడం తనకు దక్కిన సౌభాగ్యమని ఆయన అన్నారు. రాజస్థాన్‌లో అభివృద్ధి పనులకు ఒక కొత్త దిశను, జోరును ఇవ్వడానికి ప్రయత్నాలు చేసినందుకు రాజస్థాన్ ముఖ్యమంత్రినీ, ఆయన జట్టునీ శ్రీ మోదీ ప్రశంసించారు. రాబోయే అనేక సంవత్సరాల్లో అభివృద్ధికి ఈ మొదటి సంవత్సరం ఒక బలమైన పునాదిగా మారిందని అన్నారు. ఈ రోజు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రభుత్వానికి సంవత్సర కాలం పూర్తి అవడం ఒక్కటే కాకుండా రాజస్థాన్ అభివృద్ధి ఉత్సవంతోపాటు రాజస్థాన్ ఉజ్వలంగా మెరిసిపోతూ ఉండడానికి కూడా సంకేతంగా నిలిచిందని ఆయన అన్నారు. ఇటీవల రైజింగ్ రాజస్థాన్ సమ్మిట్ 2024 సందర్భంగా తాను ఇక్కడ పర్యటించిన సంగతిని శ్రీ మోదీ గుర్తు చేస్తూ.. ప్రపంచమంతటి నుంచీ ఎంతో మంది పెట్టుబడిదారులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. ఈ రోజు రూ.45,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులు నీటి విషయంలో రాజస్థాన్ ఎదుర్కొంటున్న అడ్డంకుల్ని తొలగించేందుకు సముచిత పరిష్కారాన్ని అందిస్తాయనీ, భారతదేశంలో చాలా రాష్ట్రాలతో చక్కని అనుసంధాన సదుపాయాన్ని కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా రాజస్థాన్‌ను నిలబెడతాయని కూడా ఆయన అన్నారు. ఈ అభివృద్ధి పనులు మరింత మంది పెట్టుబడిదారులను ఆహ్వానించి, అనేక ఉద్యోగావకాశాలను కల్పించి, పర్యాటక రంగాన్ని బలపరచడంతోపాటు రాజస్థాన్‌లో రైతులకు, మహిళలకు, యువతకు ప్రయోజనాలను అందిస్తాయని ప్రధాని అన్నారు.

‘‘కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, రాష్ట్రంలోని ప్రభుత్వం సుపరిపాలనకు చిహ్నంగా మారుతున్నాయి’’ అని శ్రీ మోదీ అన్నారు. తమ ప్రభుత్వాలు చెప్పుకున్న సంకల్పాలను నెరవేర్చే జాగ్రత్తలు తీసుకొంటాయని ఆయన చెప్పారు. తమ పార్టీ సుపరిపాలనకు హామీనిచ్చే పార్టీగా ప్రజలు అభిప్రాయపడుతున్నారని, ఈ కారణంగానే చాలా రాష్ట్రాల్లో ప్రజల మద్దతు తమకు లభిస్తోందని కూడా ఆయన అన్నారు. వరుసగా మూడోసారి సేవ చేసే అవకాశాన్ని భారతదేశ ప్రజలు తమకు ఇచ్చినందుకు వారికి ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. గత 60 ఏళ్ళలో వరుసగా మూడుసార్లు ఒకే పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దాఖలా ఏదీలేదని ఆయన అన్నారు. మహారాష్ట్రలో, హర్యానాలో వరుసగా రెండుసార్లు తమకు మద్దతు తెలిపి తమను ఎన్నుకొన్నందుకు ప్రజలకు శ్రీ మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఇది తామంటే ప్రజలలో ఉన్న నమ్మకాన్ని తెలియజేసిందని ఆయన అన్నారు.

రాజస్థాన్‌లో అభివృద్ధికి బలమైన పునాదిని వేసినందుకు శ్రీ భైరాన్ సింగ్ షెఖావత్ నాయకత్వంలోని ప్రభుత్వానికీ, సుపరిపాలన వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయినందుకు శ్రీమతి వసుంధర రాజే సింధియా ప్రభుత్వానికీ శ్రీ మోదీ ధన్యవాదాలు తెలిపారు. శ్రీ భజన్‌లాల్ శర్మ నాయకత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం సుపరిపాలన వారసత్వాన్ని మరింతగా బలపరచడానికి చురుకుగా కృషిచేస్తోందన్నారు. గత సంవత్సర కాలంగా చేపట్టిన పనులు ఇదే భావనను సూచిస్తున్నాయని ఆయన అన్నారు. గడచిన సంవత్సరంలో అమలు చేసిన ప్రాజెక్టుల్ని గురించి సమగ్రంగా చర్చించామని, అనేక నిర్ణయాలు పేద కుటుంబాల, మహిళల, కార్మికుల, విశ్వకర్మల, సంచార తెగల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తీసుకొన్నవేనని వివరించారు. పేపర్ లీక్ కావడం, ఉపాధి పథకాలలో కుంభకోణాలు.. ఈ జాడ్యాలే గత ప్రభుత్వ గుర్తింపు చిహ్నాలని శ్రీ మోదీ ప్రధానంగా చెబుతూ.. యువత ఎంతో నష్టపోయిందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ సమస్యల్ని చక్కదిద్దే పనిలో నిమగ్నమైందన్నారు. రాజస్థాన్‌లో ప్రస్తుత ప్రభుత్వం గత ఏడాదికాలంలో వేలాది ఉద్యోగావకాశాల్ని కల్పించిందని ఆయన చెప్పారు. ఉద్యోగ పరీక్షల్ని పూర్తి పారదర్శక విధానంలో నిర్వహిస్తున్నారు.  అంతేకాదు, ఉద్యోగ నియామకాలను కూడా అదే పద్ధతిలో పూర్తి చేస్తున్నారని ఆయన తెలియజేశారు. ఇదివరకటి ప్రభుత్వాల హయాంలో ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు రాజస్థాన్ ప్రజలు పెట్రోలుకు, డీజిలుకు ఎక్కువ డబ్బు చెల్లించవలసి వచ్చిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న ప్రభుత్వ పాలనలో పెట్రోలు, డీజిల్ ధరలతో ప్రజలు ఊరట చెందారని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బును నేరుగా జమ చేస్తోందని, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సహాయంగా అదనపు నిధులను అందిస్తోందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను శరవేగంగా అమలుచేస్తూ, అవి ఇచ్చిన వాగ్దానాలను ఒక్కటొక్కటిగా త్వరత్వరగా నెరవేరుస్తున్నాయనీ, ఈ విషయంలో ఈనాటి కార్యక్రమానిది ఓ ముఖ్య పాత్ర అనీ ప్రధాని వివరించారు.

 

రాజస్థాన్ ప్రజల ఆశీస్సులతో తన ప్రభుత్వం గత పదేళ్ళలో కేంద్రంలో అధికారంలో ఉందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ పదేళ్ళలో ప్రజలకు సౌకర్యాలను అందించడంపైన వారి కష్టాల్ని తగ్గించడంపైన దృష్టిని కేంద్రీకరించామని ఆయన ప్రధానంగా చెప్పారు.  మునుపటి ప్రభుత్వాలు స్వాతంత్య్రం వచ్చిన తరువాత అయిదారు దశాబ్దాలలో సాధించిన దానికన్నా ఎక్కువగా పదేళ్ళలో తాము సాధించినట్లు ప్రధానమంత్రి అన్నారు. రాజస్థాన్‌లో నీటికి ఎంతటి ప్రాధాన్యం ఉన్నదీ ప్రధాని వివరిస్తూ, ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు తీవ్ర కరవును ఎదుర్కొంటే ఇతర ప్రాంతాల్లో నదీ జలాలు ఉపయోగానికి నోచుకోకుండా సముద్రంలో కలుస్తున్నాయన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ నదులను సంధానించే ఆలోచన చేశారని, దీనికోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారని ప్రధాని అన్నారు. నదులలో మిగులు జలాలను కరవు పీడిత ప్రాంతాలకు బదలాయించి అటు వరదలు, ఇటు దుర్భిక్షం.. ఈ రెండు సమస్యల్నీ పరిష్కరించాలనేదే దీని ధ్యేయమని ఆయన అన్నారు. ఈ దృష్టికోణాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని, అయితే ఇది వరకటి ప్రభుత్వాలు నీటి సమస్యలను నివారించడానికి బదులు రాష్ట్రాల మధ్య జల వివాదాలను ఎగదోశాయని ఆయన అన్నారు. ఈ విధానం కారణంగా రాజస్థాన్ ఎంతో నష్టపోయిందనీ, దీని ప్రభావం మహిళలపై, రైతులపై పడిందనీ శ్రీ మోదీ అన్నారు.  నర్మద నీటిని గుజరాత్, రాజస్థాన్‌లలో వివిధ ప్రాంతాలకు తీసుకురావడానికి అప్పటి ప్రభుత్వం అడ్డుపడే ప్రయత్నాలు చేసినప్పటికీ గుజరాత్ ముఖ్యమంత్రిగా తాను ప్రయత్నాలు చేశానని ప్రధాని గుర్తుకు తెచ్చారు. తాను అదే పనిగా చేసిన ప్రయత్నాలతో రాజస్థాన్‌కు మేలు జరిగిందనీ, ఈ ప్రయత్నాలను శ్రీ భైరాన్ సింగ్ షెఖావత్, శ్రీ జస్వంత్ సింగ్ వంటి సీనియర్ నేతలు ప్రశంసించారనీ ఆయన చెప్పారు. జాలోర్, బాడ్‌మేర్, ఛురూ, ఝుంఝునూ, జోధ్‌పూర్, నాగౌర్, హనుమాన్‌గఢ్ వంటి జిల్లాలు ప్రస్తుతం నర్మద నీటిని అందుకొంటున్నాయని శ్రీ మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.  

 

ఈస్టర్న్ రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్టు (ఈఆర్‌సీపీ)లో జాప్యాన్ని గురించి శ్రీ మోదీ ప్రధానంగా ప్రస్తావిస్తూ, తన ప్రభుత్వం ప్రతిఘటన, అవరోధాలకు బదులు సహకారం, పరిష్కారాలను నమ్మిందని శ్రీ మోదీ అన్నారు. ఈఆర్‌సీపీకి తన ప్రభుత్వం ఆమోదం తెలియజేయడంతోపాటు ఆ ప్రాజెక్టును విస్తరించిందని తెలిపారు. మధ్యప్రదేశ్‌లోనూ, రాజస్థాన్‌లోనూ తమ ప్రభుత్వాలు ఏర్పాటైన వెంటనే పర్బతీ-కాలీసింధ్-చంబల్ లింక్ ప్రాజెక్టు విషయంలో ఒక ఒప్పందం కుదిరిందని, అది చంబల్ నదిని, దాని ఉపనదులైన పర్బతీ, కాలీసింధ్, కూనో, బనాస్, రూపారెల్, గంభీరీ, మేజ్‌లను ఒకదానితో మరొకదానిని సంధానిస్తాయన్నారు. రాజస్థాన్ ఇంక ఎంతమాత్రం నీటిఎద్దడిని ఎదుర్కోకుండా అభివృద్ధి సాధనకు చాలినంత జలాన్ని కలిగి ఉండే ఒక రోజు రావాలన్నదే తన సంకల్పమని ప్రధానమంత్రి అన్నారు. పర్బతీ – కాలీసింధ్ – చంబల్ ప్రాజెక్టు ప్రయోజనాలను గురించి శ్రీ మోదీ ప్రధానంగా ప్రస్తావిస్తూ ఆ ప్రాజెక్టు రాజస్థాన్‌లో 21 జిల్లాలకు సాగునీటిని, తాగునీటిని అందించడంతోపాటు రాజస్థాన్‌లో, మధ్యప్రదేశ్‌లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందన్నారు. 

 

ఈ రోజు ఈసర్దా లింకు ప్రాజెక్టు శంకుస్థాపన పూర్తయిందని తెలిపిన ప్రధానమంత్రి, తాజేవాలా నుంచి శేఖావతికు నీటి పంపిణీకి సంబంధించిన అంగీకారానికి ఆమోదం లభించిందని వెల్లడించారు. ఈ చర్య అటు హర్యానాకి, ఇటు రాజస్థాన్ కూ  మేలు చేకూర్చగలదని శ్రీ మోదీ తెలిపారు. అతి త్వరలో రాజస్థాన్ లో 100 శాతం ఇళ్ళకు పంపు నీరు అందగలదన్న విశ్వాసం వ్యక్తం చేశారు. “21వ శతాబ్దంలోకి అడుగిడే భారత దేశానికి మహిళా సాధికారత ఎంతో కీలకం” అన్న ప్రధాని, మహిళల శక్తిని స్వయం సహాయక బృంద ఉద్యమం అద్వితీయంగా ప్రతిబింబిస్తోందన్నారు. రాజస్థాన్ కు చెందిన లక్షలాది మహిళలు సహా, దేశవ్యాప్తంగా దాదాపు పదికోట్ల మంది మహిళలు గత దశాబ్దంలో ఈ ఉద్యమంలో చేరారన్నారు. ఈ మహిళా బృందాల బలోపేతం కోసం తమ ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోందని, వారిని బ్యాంకులతో అనుసంధానిస్తున్నామని, ఆర్థిక సహాయం సొమ్మును రూ. 10 లక్షల నుంచీ 20 లక్షలకు పెంచామని, దాదాపు రూ. 8 లక్షల కోట్లను మహిళల ఆర్థిక చేయూత కోసం ఖర్చు చేశామని చెప్పారు. మహిళా స్వయం సహాయక బృందాలకు శిక్షణ తరగతులు, వారి ఉత్పత్తుల విక్రయానికి కొత్త మార్కెట్లతో అనుసంధానం వంటి చర్యలు చేపట్టామని, నేడు మహిళలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో బలమైన శక్తిగా సత్తా చాటుతున్నారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం లక్ష రూపాయల పైన వార్షికాదాయం కలిగిన మహిళల (లఖ్పతీ దీదీలు) సంఖ్య 1.25 కోట్లగా ఉండగా, స్వయం సహాయక బృందాలకు చెందిన మరో మూడు కోట్ల మందిని ‘లఖ్పతీ దీదీ’ లుగా తయారు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని శ్రీ మోదీ వెల్లడించారు.

మహిళా సాధికారత కోసం అనేక కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నామన్న ప్రధాని ‘నమో డ్రోన్ దీదీ’ పథకాన్ని ప్రస్తావించారు. ఇందులో భాగంగా వేలాది మహిళలు డ్రోన్లను నడిపే పైలెట్లుగా శిక్షణ పొందుతున్నారని, వేలాది బృందాలకు డ్రోన్ల పంపిణీ పూర్తయ్యిందని, వాటిని వ్యవసాయంలో వినియోగిస్తూ మహిళలు ఆదాయం పొందుతున్నారని వెల్లడించారు. ఈ పథకానికి  రాజస్థాన్ ప్రభుత్వం కూడా తోడ్పాటునందిస్తోందని శ్రీ మోదీ తెలియజేశారు.

ఇటీవల మహిళల కోసం ప్రారంభించిన కీలక పథకం – ‘బీమా సఖి’ గురించి తెలియజేస్తూ, తగిన శిక్షణ అనంతరం గ్రామంలోని మహిళలూ బాలికలూ బీమా రంగంలో భాగస్వాములవుతారన్నారు. ఈ పథకం వారికి దేశానికి సేవ చేసే అవకాశం సహా ఆదాయాన్నందిస్తుందన్నారు. ‘బ్యాంకు సఖి’ పథకం సాధించిన విజయాన్ని గురించి తెలియజేస్తూ,  వినియోగదారులతో అకౌంట్ల ప్రారంభం, రుణ పథకాలతో అనుసంధానం వంటి చర్యలతో  ‘బ్యాంకు సఖి’ కార్యకర్తలు దేశంలోని నలుమూలలకూ బ్యాంకు సేవలను అందుబాటులోకి తెచ్చారని చెప్పారు. ఇక బీమా సఖి కార్యకర్తలు దేశంలోని కుటుంబాలను బీమా సేవలతో అనుసంధానిస్తారన్నారు.

“అభివృద్ధి చెందిన దేశం కోసం గ్రామాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలి… మా ప్రభుత్వం ఈ దిశగా కృషి చేస్తోంది” అని ప్రధాని అన్నారు. గ్రామాల్లో వీలైనన్ని ఆదాయ, ఉపాధి మార్గాలను కల్పించడంపై దృష్టి కేంద్రీకరించామన్నారు. రాజస్థాన్ లోని తమ ప్రభుత్వం విద్యుత్ రంగంతో పలు ఒప్పందాలను చేసుకుందని, ఇవి రైతులకు ప్రయోజనం చేకూర్చాయని చెప్పారు. ఇకపై వ్యవసాయదారులకు పగటి పూట విద్యుత్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ చర్య వల్ల రాత్రి పూట వ్యవసాయ పనులు చేయవలసిన అవసరం రైతులకు ఇకపై ఉండబోదని శ్రీ మోదీ చెప్పారు.   

 “సౌర శక్తిని ఉత్పత్తి చేయగల సామర్ధ్యం పుష్కలంగా ఉన్న రాజస్థాన్ రాష్ట్రం ఈ రంగంలో అగ్రగామి కాగలదు” అని ప్రధాని అన్నారు. సున్నా విద్యుత్ బిల్లుల లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభుత్వం సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సాహిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకం ‘పీఎం సూర్య ఘర్’ ఉచిత విద్యుత్ పథకం గురించి వివరిస్తూ.. ఇళ్ల పైకప్పుల పై సౌర పలకలను ఏర్పాటు చేసుకునేందుకు రూ. 78,000ను ప్రభుత్వం అందిస్తుందని, ఉత్పత్తి అయిన విద్యుత్తును గృహావసరాలకు వినియోగించుకుని, మిగులును ప్రభుత్వానికి అమ్ముకోవచ్చని చెప్పారు. పథకంలో ఇప్పటికే 1.4 కోట్ల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని, 7 లక్షల ఇళ్ళలో సౌర పలకల ఏర్పాటు పూర్తయిందని చెప్పారు. రాజస్థాన్ లోని 20,000 గృహాలు పథకంలో భాగమయ్యాయని, ఆయా కుటుంబాలు విద్యుత్ బిల్లుల ఆదాను చవి చూస్తున్నాయని చెప్పారు.

అయితే సౌర పలకల ఏర్పాటు గృహాలకు పరిమితం చేయలేదని, వ్యవసాయ క్షేత్రాల్లో సైతం వీటిని ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం సహాయాన్నందిస్తుందని ప్రధాని చెప్పారు. ‘పీఎం కుసుమ్’ పథకం ద్వారా రానున్న రోజుల్లో వందలాది సౌరశక్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాజస్థాన్ ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. ప్రతి రైతు, ప్రతి కుటుంబమూ ఇంధన ఉత్పత్తిదారుగా మారితే, విద్యుదుత్పత్తి ద్వారా సమకూరిన ఆదాయం ప్రతి కుటుంబ ఆదాయాన్ని పెంచుతుందన్నారు.    

 “రోడ్డు, రైలు, విమాన సౌకర్యాల పరంగా రాజస్థాన్‌ను అత్యంత అనుసంధానత గల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నాం” అని శ్రీ మోదీ అన్నారు. ఢిల్లీ, వడోదర, ముంబై వంటి ప్రధాన పారిశ్రామిక కేంద్రాల మధ్య రాజస్థాన్ ఉన్నందువల్ల ఆ రాష్ట్ర  ప్రజలకు, ముఖ్యంగా యువతకు గొప్ప అవకాశాలు లభించగలవని చెప్పారు. ఈ మూడు నగరాలను రాజస్థాన్‌తో అనుసంధానించే  కొత్త ఎక్స్‌ప్రెస్‌వే దేశంలోనే అత్యుత్తమ మార్గాల్లో ఒకటిగా ఉంటుందని అన్నారు. మేజ్ నదిపై ప్రధాన వంతెన నిర్మాణం వల్ల సవాయ్ మాధోపూర్, బుండి, టోంక్, కోటా జిల్లాలకు ప్రయోజనం చేకూరుతుందని,  ఆయా జిల్లాల రైతులకు ఢిల్లీ, ముంబయి, వడోదర నగరాల్లోని  ప్రధాన మార్కెట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. జైపూర్, రణథంబోర్ టైగర్ రిజర్వ్‌లను సందర్శించే పర్యాటకులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రజల సమయాన్ని ఆదా చేస్తూ, వారికి మరిన్ని సౌలభ్యాలను కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని  శ్రీ మోదీ చెప్పారు.

జామ్‌నగర్-అమృత్‌సర్ ఎకనామిక్ కారిడార్ ను  ఢిల్లీ-అమృత్‌సర్-కట్రా ఎక్స్‌ప్రెస్‌వేతో అనుసంధానిస్తే,  సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం వైష్ణో దేవితో రాజస్థాన్‌ సులభమైన అనుసంధానాన్ని పొందుతుందని శ్రీ మోదీ తెలియజేశారు. నూతన రహదార్ల ద్వారా ఉత్తర భారతదేశంలోని పరిశ్రమలకు కాండ్లా, ముంద్రా ఓడరేవులు చేరువౌతాయని చెప్పారు. ఓడరేవులు, పెద్ద గిడ్డంగుల స్థాపనతో రాజస్థాన్‌ రవాణా రంగానికి ప్రయోజనం చేకూరుతుందని, యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. జోధ్‌పూర్ రింగ్ రోడ్ జైపూర్, పాలి, బార్మర్, జైసల్మేర్, నాగౌర్,  అంతర్జాతీయ సరిహద్దులకు అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. దీని వల్ల నగరంలో అనవసర ట్రాఫిక్ రద్దీ తగ్గి, జోధ్‌పూర్‌ను సందర్శించే పర్యాటకులు, వ్యాపారులకు సౌలభ్యం పెరుగుతుందని శ్రీ మోదీ వెల్లడించారు.

నీటి సంరక్షణ ప్రాముఖ్యతను గురించి చెబుతూ, ప్రతి నీటి బొట్టును సమర్ధవంతంగా వినియోగించుకోవడం అటు ప్రభుత్వం, ఇటు సమాజం రెండింటి బాధ్యత అని పేర్కొంటూ, సూక్ష్మ సేద్యం, బిందు సేద్యం వంటి చర్యలను అనుసరించాలని ప్రధాని సూచించారు. అమృత్ సరోవర్ల నిర్వహణ పట్ల శ్రద్ధ చూపాలని, నీటి నిర్వహణ గురించి అవగాహన పెంపొందించాలని చెప్పారు. ప్రకృతి  వ్యవసాయం పట్ల రైతులకు అవగాహన పెంచాలని చెప్పారు. మొక్కలు నాటే అవసరాన్ని తెలియజేస్తూ కన్నతల్లినీ, మాతృభూమినీ గౌరవించేందుకు  “ఏక్ పేడ్ మా కే నామ్” ఉద్యమంలో భాగమవ్వాలన్నారు.  సౌరశక్తి వినియోగంపై, పీఎం సూర్యఘర్ పథకం గురించి ప్రజల్లో అవగాహన పెంచాలని కోరారు. స్వచ్ఛ్ భారత్, బేటీ బచావో – బేటీ పఢావో వంటి ప్రచారోద్యమాలు విజయవంతమైన కారణాలను విశ్లేషిస్తూ,  ప్రచారాల వెనుక సరైన ఉద్దేశం, సక్రమమైన విధానాలని చూసినప్పుడు, ప్రజలు వాటిలో పెద్ద ఎత్తున పాల్గొంటారని, వాటికి వారే మరింత ప్రచారాన్ని కల్పిస్తారని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలోనూ ఇటువంటి విజయాలు దక్కగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

రాజస్థాన్‌లో ఆధునిక వ్యవస్థల, మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రస్తుత, భవిష్యత్తు తరాలకు ప్రయోజనం చేకూరుస్తాయని ప్రధాన మంత్రి చెప్పారు. ఈ చర్యలు అభివృద్ధి చెందిన రాజస్థాన్ నిర్మాణానికి దోహదపడతాయని, దరిమిలా భారతదేశ అభివృద్ధి వేగవంతమవుతుందని అన్నారు. రాబోయే సంవత్సరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత వేగంతో పనిచేస్తాయని, రాజస్థాన్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తుందంటూ శ్రీ మోదీ త ప్రసంగాన్ని ముగించారు.

కార్యక్రమంలో రాజస్థాన్ గవర్నర్ శ్రీ హరిభావు కిసన్‌రావు బగాడే, కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ సీ ఆర్ పాటిల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

నేపథ్యం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 7 కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, 2 రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులతో కలిపి మొత్తం రూ.11,000 కోట్ల విలువైన 9 ప్రాజెక్టులను ప్రారంభించారు. 9 కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, 6 రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులతో కలిపి రూ. 35,300 కోట్ల విలువైన 15 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు కూడా చేశారు

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన ప్రాజెక్టుల్లో నవ్‌నేర బ్యారేజ్, స్మార్ట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్,  అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ప్రాజెక్టులు, భిల్డి-సమ్‌దారి-లుని-జోధ్‌పూర్-మెర్టా రోడ్-దేగానా-రతన్‌గఢ్ సెక్షన్ రైల్వే విద్యుదీకరణ పనులు, ఢిల్లీ-వడోదర గ్రీన్ ఫీల్డ్ అలైన్మెంట్ (148ఎన్ జాతీయ రహదారి) (ప్రాజెక్ట్ SH-37A తో కూడి,  మేజ్ నదిపై జంక్షన్ వరకు ప్రధాన వంతెన)  ప్యాకేజీ 12 పనులు ఉన్నాయి.  ప్రధానమంత్రి హరిత దార్శనికతకు అనుగుణంగా ఈ ప్రాజెక్టులు ప్రజలకు సులభమైన ప్రయాణాన్ని అందించడంలో,  రాష్ట్ర ఇంధన అవసరాలను తీర్చడంలోనూ  సహాయపడతాయి.

రామ్‌గఢ్ బ్యారేజీ, మహల్‌పూర్ బ్యారేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన,  రూ.9,400 కోట్లకు పైగా వ్యయంతో చంబల్ నదిపై గల కృత్రిమ జలమార్గం ద్వారా నవ్‌నేరా బ్యారేజీ నుండి బిసల్‌పూర్ డ్యామ్, ఈసర్దా డ్యామ్‌లకు నీటిని తరలించే వ్యవస్థకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు.

ప్రభుత్వ కార్యాలయ భవనాలపై రూఫ్‌టాప్ సౌరశక్తి వ్యవస్థల ఏర్పాటు, పూగల్ (బికనీర్)లో 2000 మెగావాట్ల సోలార్ పార్క్,  రెండు దశల – 1000 మెగావాట్ల సోలార్ పార్కుల అభివృద్ధి, సాయిపౌ (ఢోల్‌పూర్) నుంచి భరత్‌పూర్-దీగ్-కుమ్హెర్-నగర్-కమాన్,  పహారీ వరకూ తాగునీటి సరఫరా లైను పనులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. చంబల్-ఢోల్పూర్-భరత్‌పూర్ రెట్రోఫిటింగ్ పనికి కూడా శంకుస్థాపనలు జరిగాయి.  లుని-సమ్దారి-భిల్డీ డబుల్ లైన్, అజ్మీర్-చందేరియా డబుల్ లైన్,  జైపూర్-సవాయి మాధోపూర్ డబుల్ లైన్ రైల్వే ప్రాజెక్ట్‌లతో పాటు ఇతర ఇంధన సరఫరా ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు ప్రధాని శంకుస్థాపనలు చేస్తారు.

 

 

 

***

MJPS/SR