Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌లో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌లో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం


జై స్వామి నారాయణ్!

 

 

 

పరమ పూజ్య గురు హరి మహంత్ స్వామి మహారాజ్, మహనీయులైన సాధువులకు, గౌరవనీయులైన సత్సంగి కుటుంబ సభ్యులకు, విశిష్ట ప్రతినిధులకు, ఈ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరసోదరీమణులకు!

 

 

 

పవిత్రమైన కార్యకర్ సువర్ణ మహోత్సవం సందర్భంగా, భగవాన్ స్వామి నారాయణుని పాదాలకు వినమ్రతతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గురు హరి ప్రగత్ బ్రహ్మ స్వరూపమైన ప్రముఖ్ స్వామి మహారాజ్ 103వ జయంతి ఈ రోజు. ఆయనకు కూడా భక్తితో నమస్కరిస్తున్నాను. పరమ పూజ్య గురు హరి మహంత్ స్వామి మహారాజ్ చేస్తున్న నిర్విరామ కృషి, అంకిత భావం ద్వారానే భగవాన్ స్వామి నారాయణుడి బోధనలు, ప్రముఖ్ స్వామి మహరాజ్ తీర్మానాలు ఈ రోజు నిజరూపం దాలుస్తున్నాయి. లక్ష మంది వాలంటీర్లు, యువత, చిన్నారులు భాగం పంచుకుంటున్న ఈ అద్బుతమైన సాంస్కృతిక కార్యక్రమం విత్తనం, చెట్టు, ఫలం అనే భావనను అందంగా సూచిస్తోంది. నేను అక్కడ ప్రత్యక్షంగా లేనప్పటికీ, ఈ కార్యక్రమ ఉత్సాహాన్ని, శక్తినీ నా హృదయం అనుభూతి చెందుతోంది. ఇంత గొప్ప దైవిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరమ పూజ్య గురు హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, మహనీయులైన సాధువులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వినయంగా నమస్కరిస్తున్నాను.

 

 

 

స్నేహితులారా,

 

 

 

సేవకే అంకితమైన 50 ఏళ్ల ప్రయాణానికి ఈ కార్యకర్ సువర్ణ మహోత్సవం ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. వాలంటీర్ల వివరాలను నమోదు చేయడం, వారిని సేవా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేలా చేసే కార్యక్రమం 50 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. అయితే దాని గురించి అప్పట్లో పెద్దగా ఎవరికీ తెలియలేదు. కానీ ఇప్పుడు, అచంచలమైన భక్తి, అంకితభావం నిండిన లక్షల మంది బీఏపీఎస్ వాలంటీర్లు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషదాయకం. ఏ సంస్థకైనా ఇది గొప్ప విజయం. దీన్ని సాధించిన మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు.

 

 

 

మిత్రులారా,

 

 

 

ఈ కార్యకర్ సువర్ణ మహోత్సవం దయతో కూడిన భగవాన్ స్వామి నారాయణ్ బోధనలకు, దశాబ్దాలుగా కోట్ల మంది జీవితాల్లో మార్పు తీసుకొస్తున్న నిస్వార్థ సేవకు నివాళి. బీఏపీఎస్ సేవా కార్యక్రమాలను దగ్గర నుంచి గమనించే అవకాశం రావడం, వారితో అనుబంధాన్ని కొనసాగించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. భుజ్ భూకంపం వల్ల కలిగిన విధ్వంసానికి ప్రతిస్పందించినా, నారాయణ్ నగర్ గ్రామాన్ని పునర్నిర్మించినా, కేరళలో వరదల సమయంలో సాయమందించినా, ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడినప్పుడు ఎదురైన వ్యథను పరిష్కరించినా లేదా ఇటీవలే ప్రపంచం ఎదుర్కొన్న మహమ్మారి కొవిడ్ -19 విసిరిన సవాళ్లను ఎదుర్కొన్నా, బీఏపీఎస్ వాలంటీర్లు సాయం అందించేందుకు ఎల్లప్పుడూ ముందువరుసలో ఉన్నారు. కుటుంబ స్పూర్తి, కరుణాభావంతో అవసరమైన ప్రతిచోటా వారు తమ సేవలను అందించారు. కొవిడ్ -19 సంక్షోభం సమయంలో బీఏపీఎస్ మందిరాలన్నింటినీ సేవా కేంద్రాలుగా మార్చడం వారి అంకితభావానికి నిదర్శనం.

మరో స్ఫూర్తిదాయక ఉదాహరణను మీతో పంచుకోవాలనుకుంటున్నా. దాని గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఉక్రెయిన్లో యుద్ధం తీవ్రమవుతున్న సమయంలో సంక్షోభ ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులను ఖాళీ చేయించాలని ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా, పెద్ద సంఖ్యలో భారతీయులు పోలండ్ చేరుకోవడం ప్రారంభించారు. అయితే, ఇక్కడే ఒక పెద్ద సమస్య ఎదురైంది. యుద్ధ వాతావరణంలో పెద్ద ఎత్తున పోలెండ్ చేరుకున్న భారతీయులకు అవసరమైన సాయాన్ని ఎలా అందించాలి? ఆ సమయంలో బీఏపీఎస్ సాధువును నేను సాయమడిగాను. ఆ రోజు అర్థరాత్రి ఒంటిగంట సమయంలో అనుకుంటా.. ఆయనకు ఫోన్ చేశాను.. పోలెండ్ వస్తున్న భారతీయులకు సాయం అందించాల్సిందిగా అభ్యర్థించాను. ఆ తర్వాత జరిగిన ఓ అద్భుతాన్ని నేను చూశాను. యుద్ధ వాతావరణంలో చిక్కుకున్న వారికి అవసరమైన సాయం అందించేందుకు మీ సంస్థ యూరోప్‌ వ్యాప్తంగా ఉన్న బీఏపీస్ వాలంటీర్లను రాత్రికి రాత్రే సమీకరించింది.

 

 

 

బీఏపీఎస్ అసాధారణ సామర్థ్యం, అంతర్జాతీయ స్థాయిలో మానవాళికి సేవ చేయాలనే దృఢమైన సంకల్పం నిజంగా అభినందనీయం. అందుకే కార్యకర్ సువర్ణ మహోత్సవ్ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేడు, బీఏపీఎస్ వాలంటీర్లు తమ సేవ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది జీవితాలను మారుస్తున్నారు. లెక్కలేనంత మంది హృదయాలకు చేరువ అవుతున్నారు. సమాజంలో అట్టడుగు వర్గాల వారి జీవితాల్లో చైతన్యం నింపుతున్నారు. మీరు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. అత్యున్నత గౌరవానికి అర్హులు.

 

 

 

స్నేహితులారా,

 

 

 

బీఏపీఎస్ చేపడుతున్న కార్యక్రమాలు అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రభావాన్ని, స్థాయిని గణనీయమైన రీతిలో బలపరుస్తున్నాయి. 28 దేశాల్లో 1800 భగవాన్ స్వామి నారాయణ్ ఆలయాలు, ప్రపంచవ్యాప్తంగా 21,000 ఆధ్యాత్మిక కేంద్రాలు, లెక్కలేనన్ని సేవా కార్యక్రమాలతో భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వం, గుర్తింపునకు ప్రతిరూపంగా బీఏపీఎస్‌ను ప్రపంచం వీక్షిస్తోంది. ఈ ఆలయాలు ప్రార్థనామందిరాలుగా మాత్రమే పరిమితం కాలేదు. అవి భారతీయ సంస్కృతికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ప్రపంచంలోనే పురాతనమైన జీవన నాగరికతను ప్రతిబింబిస్తున్నాయి. ఈ ఆలయాలతో అనుబంధం ఏర్పరచుకున్న ఎవరైనా సరే భారతీయ సుసంపన్నమైన సంస్కృతి, ఆధ్యాత్మికతకు ఆకర్షితులవుతారు.

 

 

 

కొన్ని నెలల క్రితమే అబుదాబిలో స్వామి నారాయణ్ ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. దీనిలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. ఈ ఆలయం, ఈ ఉత్సవం భారతీయ ఆధ్యాత్మిక వారసత్వం, సాంస్కృతిక వైవిధ్యం వైపు ప్రపంచం మొత్తం ఆకర్షితమయ్యేలా చేసింది. ఇలాంటి కార్యక్రమాలు భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, దాతృత్వ స్ఫూర్తిని తెలియజేస్తాయి. ఈ తరహా ప్రయత్నాలకు అంకితభావంతో సహకారం అందిస్తున్న సహచరులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

 

 

 

మిత్రులారా,

 

 

 

ఇలాంటి గొప్ప కార్యాలను బీఏపీఎస్ సులభంగా సాధించడం భగవాన్ స్వామి నారాయణ్, సహజానంద స్వామిల దివ్య తపస్సుకు నిదర్శనం. ఆయన కరుణ ప్రతి జీవికి, బాధతో నిండిన ప్రతి హృదయానికి చేరుకుంటుంది. ఆయన తన జీవితంలో ప్రతి నిమిషాన్ని సమాజ శ్రేయస్సుకే అంకితం చేశారు. ఆయన రూపొందించిన విలువలు బీఏపీఎస్ ద్వారా ప్రకాశిస్తూ, ప్రపంచవ్యాప్తంగా జ్ఞానాన్ని, ఆశను వ్యాపింపచేస్తున్నాయి.

 

 

 

బీఏపీఎస్ సేవల సారాంశాన్ని ఓ పాటలోని పంక్తులలో అందంగా వర్ణించారు. ఆ పాట ప్రతి ఇంట్లోనూ ప్రతిధ్వనిస్తోంది:

 

 

 

‘‘నదియా న పియే కభీ అప్నా జల్

 

 

వృక్ష్ న ఖాయే కభీ అప్నే ఫల్ నదియా న పియే కభీ అప్నా జల్

వృక్ష్ న ఖాయే కభీ అప్నే ఫల్,

అప్నే తన్ కా మన్ కా ధన్ కా దూజో కో దే జో దాన్ హై ఓ సచ్ఛా ఇంసాన్ ఆరే.. ఇస్ ధర్తీ కా భగవాన్ హై’’

మిత్రులారా,

 

 

 

బీఏపీఎస్, భగవాన్ స్వామి నారాయణుడితో చిన్నతనంలోనే అనుబంధం ఏర్పడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అనుబంధం నా జీవితంలో మార్గదర్శక శక్తిగా నిలిచింది. ప్రముఖ్ స్వామి మహారాజ్ నుంచి నేను పొందిన ప్రేమ, ఆప్యాయత నా జీవితంలో అమూల్యమైన సంపదలుగా సదా నిలిచిపోతాయి. నా జీవితంతో విడదీయలేని ఎన్నో వ్యక్తిగత సందర్భాలు ఆయనతో నాకు ఉన్నాయి.

 

 

 

నేను ప్రజాజీవితానికి రాక ముందు నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో, ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్న ఈ తరుణంలోనూ ఆయన మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ నా వెంటే ఉంది. నర్మదా నదీ జలాలు సబర్మతీ నదికి చేరిన చారిత్రక సందర్భం నాకు స్పష్టంగా గుర్తుంది. ఆ కార్యక్రమానికి ప్రముఖ్ స్వామి మహరాజ్ హాజరై ఆశీస్సులు అందించారు. అదే విధంగా ఆయన మార్గదర్శకత్వంలో జరిగిన స్వామి నారాయణ్ మహామంత్ర మహోత్సవం, మరుసటి ఏడాది జరిగిన స్వామి నారాయణ్ మంత్ర లేఖన మహోత్సవం జ్ఞాపకాలను నేను మనసులో నిక్షిప్తం చేసుకున్నాను.

 

 

 

మంత్ర రచన అనే భావన దానికదే గొప్పది. ఇది ఆయన అసమానమైన ఆధ్యాత్మిక దృష్టికి ప్రతిరూపం. తండ్రిలా నా మీద ఆయన కురిపించిన వాత్సల్యం మాటలకు అతీతమైనది. ప్రజాసంక్షేమానికి నేను చేసే ప్రతి ప్రయత్నానికి ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.

 

 

 

ఈ గొప్ప కార్యక్రమం ద్వారా, ప్రముఖ్ స్వామి మహారాజ్ ఆధ్యాత్మిక ఉనికిని, గురువుగా, తండ్రిగా ఆయన శాశ్వత మార్గదర్శకత్వాన్ని నేను గుర్తు చేసుకుంటున్నాను.

 

 

 

మిత్రులారా

 

 

 

మన సంస్కృతిలో సేవను అత్యున్నతమైన ధర్మంగా పరిగణిస్తారు. ‘సేవా పరమో ధర్మ’- సేవే సర్వోన్నత కర్తవ్యం. ఇవి మాటలకే పరిమితమైనవి కావు.. మన జీవితాల్లో లోతుగా పాతుకుపోయిన విలువలు. భక్తి, నమ్మకం లేదా ఆరాధనల కంటే ఉన్నత స్థానంలో సేవాభావం ఉంది. ప్రజాసేవ దైవసేవతో సమానమని తరచూ చెబుతుంటారు. నిజమైన సేవ నిస్వార్థమైనది, వ్యక్తిగత ప్రయోజనం లేదా గుర్తింపు కోరుకోనిది.

 

 

 

వైద్య శిబిరంలో రోగులకు సేవలు అందించడం, అవసరమైన వారికి ఆహారం అందించడం, లేదా చిన్నారికి బోధించడం ఏదైనా కావచ్చు మీరు వారికి సాయం చేయడానికే పరిమితం కాలేదు. ఈ క్షణాల్లోనే అసాధారణమైన మార్పు మీలో మొదలవుతుంది. ఈ అంతర్గత మార్పు మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి మార్గాన్ని నిర్దేశిస్తుంది. ఈ సేవను సామూహికంగా నిర్వహించినప్పుడు, వేలాది, లక్షలాది మంది ప్రజలు ఈ క్రతువులో భాగమైనప్పుడు అది గొప్ప ఫలితాలను సాధిస్తుంది. అలాంటి వ్యవస్థీకృత సేవకు సమాజం, దేశం ఎదుర్కొంటున్న క్లిష్టమైన సవాళ్లను పరిష్కరించే శక్తి ఉంటుంది. ఇది సామాజిక దురాచారాలను నిర్మూలించగలదు. అలాగే అసంఖ్యాకంగా ప్రజలను ఒకే లక్ష్యం దిశగా నడిపించగలదు. ఇది సమాజం, దేశం రెండింటికీ అపారమైన శక్తిని అందిస్తుంది.

 

 

 

అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే లక్ష్యంతో భారత్ ముందుకు సాగుతున్న ప్రస్తుత సమయంలో, అన్ని రంగాల్లోనూ ఐక్యత, సమష్టి కృషిల స్ఫూర్తిని మనం చూస్తున్నాం. స్వచ్ఛభారత్ కార్యక్రమం అయినా, సహజ వ్యవసాయం, పర్యావరణ స్పృహ, అమ్మాయిలను చదివించడం లేదా గిరిజన తెగల అభ్యున్నతి ఇలా అన్ని వర్గాల ప్రజలు దేశ నిర్మాణానికి నాయకత్వం వహించేందుకు ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమాలు మీ నుంచి కూడా స్ఫూర్తి పొందుతాయి. అందుకే ఈ రోజు మీకు మన:స్పూర్తిగా ఓ అభ్యర్థన చేస్తున్నాను.

 

 

 

మీ అందరూ కొత్త తీర్మానాలు చేసుకుని ప్రతి ఏడాది ఓ అర్థవంతమైన పనికి అంకితం చేయాలని కోరుతున్నాను. ఉదాహరణకు రసాయన రహిత వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించడానికి ఓ ఏడాది కేటాయించండి. మరో సంవత్సరం భారత దేశ స్ఫూర్తి భిన్నత్వంలో ఏకత్వాన్ని పండగల ద్వారా తెలియజెప్పండి. అలాగే మాదక ద్రవ్యాల వినియోగం నుంచి యువతను రక్షించేందుకు సైతం మనం సంకల్పం తీసుకోవాలి. దేశవ్యాప్తంగా నదుల పునరుజ్జీవానికి ప్రజలు కృషి చేస్తున్నారు. అలాంటి కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొన్నవచ్చు. అలాగే భూగ్రహ భవిష్యత్తు కోసం సుస్థిరమైన జీవన విధానాలను అవలంబించేందుకు మనం కర్తవ్య దీక్షతో ఉండాలి.

భారత్ అనుసరిస్తున్న సుస్థిరమైన జీవన విధాన దృక్పథం – మిషన్ లైఫ్ విశ్వసనీయతను, దాని ప్రభావం గుంచి ప్రపంచానికి అర్థమయ్యేలా మనం కృషి చేద్దాం. సమాజాన్ని అభివృద్ధి దిశగా నడిపించడంతో పాటు భవిష్యత్తు తరాల కోసం మన గ్రహాన్ని సంరక్షించేలా ఈ తీర్మానాలు వాస్తవ రూపం దాల్చేలా సమష్టిగా కృషి చేద్దాం.

 

 

 

ఈ రోజుల్లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ దిశగా మీరు చేసే ప్రతి ప్రయత్నమూ ప్రధానమైనదే. ఫిట్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్, తృణధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించడం తదితరమైన భారత్ అభివృద్ధిని వేగవంతం చేసే ఎన్నో కార్యక్రమాల్లో మీరు పాల్గొనవచ్చు. ఆలోచనాపరులైన యువతను ప్రోత్సహించేందుకు ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ కార్యక్రమం వచ్చే జనవరిలో జరుగుతుంది. ఇది వికసిత్ భారత్ (అభివృద్ధి చెందని భారత్) అనే కలను సాకారం చేసే దిశగా తమ ఆలోచనలను పంచుకోవడంతో పాటు తమ వంతు సహకారం అందించే అవకాశాన్ని యువతకు కల్పిస్తుంది. ఇక్కడ ఉన్న యువ కార్యకర్తలు ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.

 

 

 

స్నేహితులారా,

 

 

 

గౌరవనీయులైన ప్రముఖ్ స్వామి మహారాజ్ కుటుంబ ఆధారిత భారతీయ సంస్కృతిపై ప్రధానంగా దృష్టి సారించేవారు. ఘర్ సభ వంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో ఉమ్మడి కుటుంబాల విధానాన్ని బలోపేతం చేశారు. ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే సంకల్పంతో భారత్ ప్రస్తుతం పని చేస్తోంది. తదుపరి 25 ఏళ్ల పాటు సాగే ప్రయాణం ప్రతి బీఏపీఎస్ వాలంటీర్‌కు ఎంత ముఖ్యమో భారత్‌కూ అంతే కీలకం.

 

 

 

భగవాన్ స్వామి నారాయణ్ ఆశీస్సులతో బీఏపీఎస్ వాలంటీర్లు చేస్తున్న ఈ సేవా కార్యక్రమం చెక్కు చెదరని అంకితభావంతో ఇలాగే ముందుకు సాగుతుందని నేను విశ్వసిస్తున్నాను. మరోసారి కార్యకర్ సువర్ణ మహోత్సవ్ సందర్బంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

జై స్వామి నారాయణ్!