పెనుమార్పులతో తీసుకువచ్చిన మూడు కొత్త నేర విచారణ చట్టాలు.. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్‌లను విజయవంతం కావడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2024 డిసెంబర్ 3న మధ్యాహ్నం 12 గంటలకు చండీగఢ్‌లో ఏర్పాటైన ఓ కార్యక్రమంలో జాతికి అంకితం చేయనున్నారు.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా కొనసాగుతున్న వలస చట్టాలను తొలగించడంతో పాటు, న్యాయ వ్యవస్థ దృక్పథాన్ని శిక్ష నుంచి న్యాయం వైపునకు మరల్చుతూ- ఆ వ్యవస్థలో కీలకమార్పులు తీసుకురావాలన్న ప్రధానమంత్రి దార్శనికత నుంచి స్ఫూర్తిని పొంది ఈ మూడు చట్టాలను రూపొందించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని, ‘‘రక్షణ సమాజం, శిక్ష నుంచీ న్యాయం దిశగా – అభివృద్ధి చెందిన భారతదేశం’’ అనే విషయాన్ని ఈ కార్యక్రమానికి ఇతివృత్తంగా ఎంచుకొన్నారు.
కొత్త నేర విచారణ చట్టాలు 2024 జులై 1న దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. భారతదేశంలో న్యాయవ్యవస్థ మరింత పారదర్శకంగా, సమర్థంగా, సమకాలీన సమాజం అవసరాలను తీర్చేదిగా ఉండేలా చూడడం ఈ చట్టాల ఉద్దేశం. భారతదేశంలో నేర సంబంధిత న్యాయ వ్యవస్థను గణనీయ స్థాయిలో ప్రక్షాళన చేసి, సైబర్ నేరాలు, వ్యవస్థీకృత నేరాల వంటి ఆధునిక కాలపు సవాళ్ళను పరిష్కరించడంతోపాటు వివిధ నేరాల బాధితులకు న్యాయాన్ని అందించడానికి సరికొత్త ప్రాథమిక కార్యాచరణ ప్రణాళికలను ఈ ప్రధాన సంస్కరణలు ఆవిష్కరించాయి.
ఈ చట్టాల ఆచరణీయ విధానాన్ని కార్యక్రమంలో చాటిచెప్పనున్నారు. నేర సంబంధిత న్యాయ ముఖచిత్రం రూపురేఖలను ఈ చట్టాలు ఇప్పటికే ఏ విధంగా చక్కదిద్దాయన్నది కూడా ఈ కార్యక్రమంలో వివరించనున్నారు. ఒక నేరం జరిగినట్లుగా ఓ సన్నివేశాన్ని కల్పించి, దానికి సంబంధించిన దర్యాప్తును కొత్త చట్టాల ప్రకారం ఏయే విధాలుగా నిర్వహించవచ్చో ప్రత్యక్షంగా సభికులకు వివరించే కార్యక్రమం కూడా దీనిలో భాగంగా ఉండబోతున్నది.