Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సహజ వ్యవసాయానికి సంబంధించి ‘నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్’ ప్రారంభం


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి, సహజ వ్యవసాయ పద్ధతుల కేంద్ర ప్రభుత్వ జాతీయ స్థాయి పథకం – ‘నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్’ (ఎన్ఎంఎన్ఎఫ్)కు ఆమోదం తెలిపింది. స్వతంత్ర  ప్రతిపత్తి గల ఈ పథకం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందింది.  

15వ ఆర్థిక సంఘం కాలంలో(2025-26 మధ్య) ఈ పథకం కోసం వెచ్చించే రూ. 2481 కోట్ల మూలధనంలో కేంద్ర ప్రభుత్వం రూ. 1584 కోట్లు ఖర్చుచేయనుండగా, రాష్ట్రాలు రూ. 897 కోట్ల ఖర్చును భరిస్తాయి.

ఉద్యమ స్థాయిలో సహజ వ్యవసాయానికి మద్దతునిచ్చే లక్ష్యంతో, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందిన ఈ స్వతంత్ర కేంద్రీయ పథకాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది.  

తమ పూర్వీకులు పాటించిన వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ, రసాయనాల ఊసు లేని సహజ వ్యవసాయ పద్ధతులతో రైతులు సాగు చేపడతారు.  వ్యవసాయ పశువులు, సహజ పద్ధతులు, పంట మార్పిడి వంటి పద్ధతులు ప్రకృతి  వ్యవసాయంలో భాగమవుతాయి. స్థానిక వాతావరణం, నేల స్వభావం వంటి పర్యావరణ అంశాలను పరిగణనలోకి తీసుకుని స్థానికంగా అనువైన పద్ధతులకు  సహజ వ్యవసాయం ప్రాధాన్యాన్నిస్తుంది.

అందరికీ సురక్షితమైన పోషకారాన్ని అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఎన్ఎంఎన్ఎఫ్ సహజ సాగు పద్ధతులను ప్రోత్సహిస్తుంది. రైతులు వివిధ పనిముట్ల కోసం వెచ్చించే ఖర్చును తగ్గించి, వ్యవసాయ పనిముట్లపై ఆధార పడటాన్ని తగ్గిస్తుంది. ప్రకృతి వ్యవసాయం చేపట్టడం ద్వారా నేల ఆరోగ్య పరిరక్షణ, జీవ వైవిధ్యం, పంటల మార్పిడి సాధ్యమయ్యి, స్థానిక పరిస్థితులకు అనువైన వ్యూహాలతో పండించిన పంటలు చీడపీడలను తట్టుకునే శక్తిని సొంతం చేసుకుంటాయి. సంప్రదాయ వ్యవసాయాన్ని శాస్త్రీయ దృక్పథంతో పునరుద్ధరించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన  ఎన్ఎంఎన్ఎఫ్ పథకం ద్వారా వ్యవసాయం లాభసాటిగా మారి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతూ రైతు కుటుంబాలకూ, వినియోగదారులకూ రసాయనాల బెడద లేని ఆరోగ్యకర ఆహారాన్ని అందుబాటులోకి తెస్తుంది.  

ఆసక్తిని కనపరిచే 15,000 గ్రామ పంచాయితీల్లో రాబోయే రెండేళ్ళలలో అమలయ్యే ఎన్ఎంఎన్ఎఫ్ పథకం, 7.5 లక్షల హెక్టార్లలో ప్రారంభమయ్యి, 1 కోటి కుటుంబాలను చేరుతుంది. ఇప్పటికే సాగులో సేంద్రీయ పద్ధతులని పాటిస్తున్న రైతులకు, రాష్ట్ర ఉపాధి పథకం-ఎస్ఆర్ఎల్ఎం, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు-పీఏసీఎస్, వ్యవసాయదారుల ఉత్పత్తి సంఘం-ఎఫ్పీఓ వంటి సంస్థలకు నూతన పథకంలో ప్రాధాన్యాన్నిస్తారు. సేంద్రీయ వ్యవసాయానికి అవసరమయ్యే సహజ ఉత్పత్తులు రైతులకు సులభంగా అందుబాటులో ఉంచేందుకు, అవసరాన్ని బట్టి 10,000 జీవాధార వనరుల కేంద్రాలు- బీఆర్సీలను ఏర్పాటు చేస్తారు. ఎన్ఎంఎన్ఎఫ్ కింద కృషి విజ్ఞాన్ కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, రైతుల పొలాల్లో దాదాపు 2000 వరకూ సహజ పద్ధతుల (ఎన్ఎఫ్) నమూనా వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేస్తారు. వీటిల్లో అనుభవం మెండుగా గల  నిపుణులైన శిక్షకులు (మాస్టర్ ట్రైనర్లు) ఆసక్తి గల రైతులకు ఉత్తమ సహజ వ్యవసాయ పద్ధతులు, సహజ ఎరువులు, జీవ ఎరువుల తయారీ వంటి పద్ధతుల్లో శిక్షణనిస్తారు. సుశిక్షితులైన 18.75 లక్షల మంది రైతులు జీవామృతం, బీజామృతం వంటి ఉత్పత్తులను తమ పొలాల్లోని పశువుల ద్వారా, లేదా జీవాధార వనరుల కేంద్రాల వద్ద నుంచి సమకూర్చుకుంటారు.  ఎంపిక చేసిన క్లస్టర్లలో కొత్త పథకం పట్ల అవగాహనను కలిగించేందుకు, స్థానిక రైతుల మధ్య సహకారాన్ని పెంచేందుకు, అవసరమైన ఇతర సహాయాన్ని అందించేందుకు 30,000 మంది ‘కృషి సఖులను’, సాగు సహాయకులు – ‘సీఆర్పీల’ను వినియోగిస్తారు.

 

వ్యవసాయ పనిముట్లపై రైతులు పెట్టే ఖర్చును తగ్గించడం, ఉపకరణాలు, యంత్రాలపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సేంద్రీయ వ్యవసాయం సహాయపడుతుంది. వరదలు, కరువు వంటి ప్రకృతి విపత్తులను తట్టుకునేందుకు, భూసారాన్ని పెంపొందించేందుకు ఈ పద్ధతులు ఉపకరిస్తాయి. రసాయన ఎరువులు,  పురుగు మందుల వాడకం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగి, రైతు కుటుంబాలకు సురక్షితమైన పోషకాహారం అందుబాటులోకి వస్తుంది.  అంతేకాక ఈ పథకం ద్వారా రాబోయే తరాలకు ఆరోగ్యవంతమైన భూమిని అందించే వీలు కలుగుతుంది. మట్టిలో కర్బనం శాతాన్ని, నీటి యాజమాన్యాన్ని మెరుగు పరచడం ద్వారా నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది, జీవ వైవిధ్యం సాధ్యపడుతుంది.

రైతులు వారి సహజ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ చేసుకునేందుకు  సులభమైన ధ్రువీకరణ వ్యవస్థ,  బ్రాండింగ్‌ ను అందిస్తారు. ఆన్లైన్ వేదిక ద్వారా  రియల్ టైమ్ జియో-ట్యాగింగ్, ఎన్ఎంఎన్ఎఫ్ అమలు తీరు పరిశీలన జరుగుతుంది.

స్థానిక పశువుల సంఖ్యను పెంపొందించేందుకు, కేంద్రీయ పశువుల పెంపకం కేంద్రాలు, ప్రాంతీయ పశుగ్రాస కేంద్రాలలో ఎన్ఎఫ్ మోడల్ ప్రదర్శన క్షేత్రాల ఏర్పాటు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రస్తుత పథకాలు, సహాయక వ్యవస్థలతో కొత్త పథకాన్ని  ఏకం చేసే అవకాశాలను పరిశీలిస్తారు. జిల్లా, బ్లాక్, గ్రామ పంచాయితీల స్థాయుల్లో స్థానిక రైతుబజార్లు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలు, డిపోలతో అనుసంధానం ద్వారా సహజ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలను కల్పిస్తారు.  

 

సహజ సాగు పద్ధతుల్లో శిక్షణ ద్వారా ఎన్ఎంఎన్ఎఫ్ పథకంలో ఆర్ఏడబ్ల్యూఈ కోర్సు విద్యార్థులు, గ్రాడ్యూయేట్, పోస్ట్ గ్రాడ్యూయేట్ స్థాయి విద్యార్థులను  భాగస్వాములను చేస్తారు.

 

***