భారత్-కరికమ్ రెండో శిఖరాగ్ర సమావేశాన్ని జార్జ్‌టౌన్‌లో నిన్న నిర్వహించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కరికమ్ కు ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న గ్రెనడా ప్రధాని శ్రీ డికన్ మిషెల్‌లు ఈ శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించారు. శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యాన్ని ఇచ్చినందుకు గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీకి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. భారత్- కరికమ్ తొలి శిఖరాగ్ర సమావేశాన్ని 2019లో న్యూయార్క్ లో నిర్వహించారు. గయానా అధ్యక్షుడు, గ్రెనెడా ప్రధానిలకు తోడు శిఖరాగ్ర సమావేశంలో పాలుపంచుకొన్నా వారిలో..
(i) డొమినిక్ అధ్యక్షురాలు సిల్వేనీ బర్టన్ & డొమినిక ప్రధాని శ్రీ రూజ్వెల్ట్ స్కెరిట్
(ii) సురినామ్ అధ్యక్షుడు శ్రీ చంద్రికాపెర్సాద్ సంతోఖీ
(iii) ట్రినిడాడ్ & టొబాగో ప్రధాని డాక్టర్ కీథ్ రోలీ
(iv) బార్బడోస్ ప్రధాని మియా అమోర్ మోట్లీ
(v) ఆంటీగ్వా-బార్బుడా ప్రధాని శ్రీ గేస్టన్ బ్రౌన్
(vi) గ్రెనడా ప్రధాని శ్రీ డికన్ మిశెల్
(vii) బహమాస్ ప్రధాని, ఆర్థిక మంత్రి శ్రీ ఫిలిప్ ఎడ్వర్డ్ డేవిస్, కె.సి.
(viii) సెంట్ లూసియా ప్రధాని శ్రీ ఫిలిప్ జే పియరే
(ix) సెయింట్ విన్సెంట్ ప్రధాని శ్రీ రాల్ఫ్ ఎవరర్డ్ గోన్సాల్వెస్
(x) బహమాస్ ప్రధాని శ్రీ ఫిలిప్ ఎడ్వర్డ్ డేవిస్
(xi) బెలీజ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఫ్రాన్సిస్ ఫోన్సెకా
(xii) జమైకా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కామినా స్మిత్
(xiii) సెయింట్ కిట్స్ & నేవిస్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ డెంజిల్ డగ్లస్.. ఉన్నారు.
2. ‘బేరిల్’ పెనుతుఫాను వల్ల కరికమ్ ప్రాంతంలో పెను విధ్వంసం వాటిల్లిన నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలకు ప్రధానమంత్రి తన సానుభూతిని వ్యక్తం చేశారు. వారికి తన సంఘీభావాన్ని కూడా ఆయన తెలియజేశారు. సవాళ్ళు, ఇటీవల కొన్నేళ్ళుగా జరుగుతున్న పోరాటాల ప్రభావాన్ని అత్యంత అధికంగా ఎదుర్కొన్నది అభివృద్ధి చెందుతున్న దేశాలే అన్న సంగతిని ప్రధాని ప్రస్తావిస్తూ, కరికమ్ దేశాలకు ఒక విశ్వాసనీయ భాగస్వామిగా భారతదేశం ఎప్పటికీ తోడుంటుందని పునరుద్ఘాటించారు. భారతదేశం అందించిన అభివృద్ధి ప్రధానమైన సహాయ సహకారాలు కరికమ్ దేశాల అవసరాలను, ప్రాథమ్యాలను దృష్టిలో పెట్టుకొని అందించినవి అని ప్రధాని స్పష్టం చేశారు.
3. ఈ ప్రాంతంతో భారతదేశం సన్నిహిత భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి, ప్రజలతో దృఢమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రధానమంత్రి ఏడు కీలక రంగాలలో కరికమ్ దేశాలకు సాయపడడానికి ముందుకు వచ్చారు. ఈరంగాలు కరికమ్ పేరులోని ఒక్కో అక్షరానికి అనురూపంగా ఉండడమేగాక భారతదేశానికి, ఈ సమూహానికి మధ్య ఇప్పుడున్న సన్నిహిత స్నేహ సంబంధాలను మరింత బలపరిచేవిగా ఉన్నాయి. కరికమ్ పేరులోని ఆంగ్ల అక్షరాలకు అనురూపంగా ఉన్న రంగాలు ఏవంటే….
● సి – కెపాసిటీ బిల్డింగ్ రంగం (సామర్థ్యాలను పెంపొందిందే కార్యక్రమాలు)
● ఎ – అగ్రికల్చర్, ఫూడ్ సెక్యూరిటీ (వ్యవసాయం, ఆహార భద్రత)
● ఆర్ – రిన్యూవబుల్ ఎనర్జీ, క్లయిమేట్ ఛేంజ్ (పునరుత్పాదక ఇంధనం, వాతావరణ మార్పు)
● ఐ – ఇన్నొవేషన్, టెక్నాలజీ, ఇంకా ట్రేడ్ (నూతన ఆవిష్కరణలు, సాంకేతిక విజ్ఞానం, వ్యాపారం)
● సి – క్రికెట్ ను, సంస్కృతి
● ఒ – ఓషన్ ఎకానమీ (సాగర ప్రధాన ఆర్థిక వ్యవస్థ), మ్యారిటైమ్ సెక్యూరిటీ (నౌకావాణిజ్య భద్రత)
● ఎమ్ – మెడిసిన్, హెల్త్‌కేర్ రంగం (మందులు, ఆరోగ్య సంరక్షణ).
4. సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమాల విషయానికి వస్తే, రాబోయే అయిదు సంవత్సరాలలో కరికమ్ దేశాలకు ఒక వేయి కన్నా ఎక్కువ ఐటీఈసీ స్లాట్లను అందిస్తామని ప్రధానమంత్రి ప్రకటించారు. ఆహార భద్రత రంగం ఈ దేశాలకు ఒక పెద్ద సవాలుగా ఉంది. ఈ విషయంలో భారతదేశం వ్యవసాయ రంగంలో వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని.. అంటే డ్రోన్లు, డిజిటల్ వ్యవసాయం, వ్యవసాయ యంత్రీకరణ, భూసార పరీక్షలు.. అందిస్తుందని ఆయన వివరించారు. కరీబియన్ ప్రాంతంలో పర్యటనకు సర్‌గసుమ్ అనే పేరున్న సముద్ర జాతి కలుపు మొక్కలతో పెద్ద సవాలు ఎదురవుతోందని ప్రధాని చెబుతూ.. ఈ సముద్ర జాతి కలుపు మొక్కల నుంచి ఎరువు తయారీ పరిజ్ఞానాన్ని పొందే విషయంలో సహాయాన్ని అందించడానికి భారతదేశం సంతోషంగా ముందుకు వస్తుందన్నారు.
5. పునరుత్పాదక ఇంధనం, వాతావరణ మార్పు రంగాలలో భారతదేశానికి, కరికమ్ కు మధ్య సహకారం ఇప్పటి కన్నా పెరగాలని ప్రధాని పిలుపునిచ్చారు. భారతదేశం నాయకత్వంలో అమలుపరుస్తున్న అంతర్జాతీయ సౌర కూటమి (ఇంటర్నేషనల్ సోలర్ అలయన్స్.. ఐఎస్ఏ), కొయలిషన్ ఫర్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్ఐ), మిషన్ లైఫ్, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ వంటి కార్యక్రమాలలో చేరవలసిందిగా సభ్యులకు విజ్ఞప్తి చేశారు.
6. నూతన ఆవిష్కరణలు, టెక్నాలజీ, ఇంకా వ్యాపార రంగాలలో భారతదేశం అనేక మార్పులను తీసుకు వచ్చిన విషయాన్ని ప్రధాని వివరిస్తూ, ప్రజలకు త్వరిత గతిన సేవలను అందించడానికి యూపీఐ, క్లౌడ్-ఆధారిత డిజిలాకర్‌లతో పాటు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాధ్యమం పరంగా భారత్ తోడ్పడుతుందని చెప్పారు.
7. క్రికెట్లో కరికమ్ దేశాలకు, భారతదేశానికి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. కరికమ్ దేశాలలో ఒక్కొక్క దేశం నుంచి 11 మంది యువ మహిళా క్రికెటర్లకు భారతదేశంలో శిక్షణ ఇస్తామని ప్రధాని ప్రకటించారు. రెండు పక్షాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలను పటిష్ట పరచడానికి వచ్చే సంవత్సరంలో సభ్య దేశాలలో ‘‘భారతీయ సంస్కృతి దినోత్సవాలను’’ నిర్వహించాలని కూడా ఆయన ప్రతిపాదించారు.
8. సాగర ప్రాంత ప్రధాన ఆర్థిక వ్యవస్థకు, సముద్ర రంగ భద్రతకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ప్రధానమంత్రి పేర్కొంటూ, కరీబియన్ సముద్రంలో హైడ్రోగ్రఫీ, మారిటైం డొమైన్ మేపింగ్ అంశాలలో కలసి పని చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉందన్నారు.
9. భారతదేశంలో నాణ్యత కలిగిన, చౌకైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించగలుగుతున్నామని ప్రధాని ప్రధానంగా చెప్పారు. జన్ ఔషధీ కేంద్రాల ద్వారా జెనరిక్ మందులను అందుబాటులోకి తెచ్చే నమూనాను భారతదేశం నుంచి పొందవచ్చని ఆయన అన్నారు. కరికమ్ దేశాలలో ప్రజల ఆరోగ్యాన్ని, శ్రేయాన్ని పెంపొందింప చేసేందుకు యోగ నిపుణులను పంపిస్తామని కూడా ఆయన ప్రకటించారు.
10. భారతదేశానికి, కరికమ్‌కు మధ్య భాగస్వామ్యాన్ని పటిష్ట పరచడానికి ప్రధానమంత్రి సూచించిన ఏడు అంశాల ప్రణాళికను కరికమ్ నేతలు స్వాగతించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు (గ్లోబల్ సౌత్) భారతదేశం నాయకత్వాన్ని అందించడాన్ని ఆయా దేశాల నేతలు ప్రశంసించారు. అభివృద్ధి చెందుతున్న చిన్న ద్వీప దేశాలకు వాతావరణ విషయాలలో న్యాయం జరగాలని భారత్ గట్టి మద్దతును ఇస్తున్నందుకు కూడా వారు ప్రశంసలను కురిపించారు. ప్రపంచ సంస్థలలో సంస్కరణలు అవసరమని, ఈ విషయంలో భారత్‌తో సన్నిహితంగా పనిచేయాలని ఎదురుచూస్తున్నామని వారు స్పష్టం చేశారు.
11. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆందోళనలకు మద్ధతుగా భారతదేశం తన అభిప్రాయాలను బిగ్గరగా వినిపిస్తున్న సంగతిని ప్రధానమంత్రి ప్రస్తావించారు. తరువాతి భారత్-కరికమ్ శిఖరాగ్ర సమావేశానికి భారత్‌లో ఆతిథ్యాన్ని ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుత శిఖరాగ్ర సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు అధ్యక్షుడు శ్రీ ఇర్ఫాన్ అలీకి, ప్రధాని శ్రీ డికన్ మిషెల్ కు, కరికమ్ సచివాలయానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Addressing the India-CARICOM Summit in Guyana. https://t.co/29dUSNYvuC
— Narendra Modi (@narendramodi) November 20, 2024
With CARICOM leaders at the 2nd India-CARICOM Summit in Guyana.
— Narendra Modi (@narendramodi) November 20, 2024
This Summit reflects our shared commitment to strengthening ties with the Caribbean nations, fostering cooperation across diverse sectors.
Together, we are working to build a bright future for the coming… pic.twitter.com/5ZLRkzjdJn
PM @narendramodi with the CARICOM leaders at the 2nd India-CARICOM Summit in Guyana. pic.twitter.com/BXzzRpDU9J
— PMO India (@PMOIndia) November 21, 2024