ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈనెల 28న గుజరాత్లో పర్యటించనున్నారు. ఆ రోజున ఉదయం 10 గంటలకు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) క్యాంపస్ ఆవరణలో సీ-295 విమానాల తయారీ కోసం నిర్మించిన టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, స్పానిష్ ప్రధానమంత్రి శ్రీ పెడ్రో శాంచెజ్‌తో కలిసి ప్రారంభిస్తారు. అనంతరం, సుమారు 11 గంటలకు, ఆయన వడోదరలోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌ను సందర్శిస్తారు. వడోదర నుంచి సుమారు మధ్యాహ్నం 2.45 గంటలకు అమ్రేలీకి చేరుకుని దుధాలా వద్ద భారత్ మాతా సరోవర్‌ను ఆయన ప్రారంభిస్తారు. సుమారుగా 3 గంటలకు ఆయన అమ్రేలీలోని లథీ వద్ద రూ.4800ల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపనలు చేస్తారు.
వడోదరలో పీఎమ్ కార్యక్రమాలు
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) క్యాంపస్ ఆవరణలో సీ-295 విమానాల తయారీ కోసం టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, స్పానిష్ ప్రధానమంత్రి శ్రీ పెడ్రో శాంచెజ్‌తో కలిసి ప్రారంభిస్తారు. సీ-295 కార్యక్రమం కింద మొత్తం 56 విమానాల్లో, 16 విమానాలను నేరుగా స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్ అందిస్తుండగా, మిగతా 40 విమానాలను భారత్‌లో తయారు చేయనున్నారు.
ఈ 40 విమానాలను భారత్‌కు చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంస్థ తయారు చేస్తుంది. దేశంలో ఈ కేంద్రం సైనిక విమానాల కోసం మొదటి ప్రైవేట్ రంగ ఫైనల్ అసెంబ్లీ లైన్ (ఎఫ్ఏఎల్) కానుంది. ఇది విమానాల తయారీ, అమర్చడం, పరీక్షించడం, అర్హత నిర్ధారించడం, సరఫరాతో సహా పూర్తి ప్రక్రియ కోసం అవసరమైన అనుకూల వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది.
టాటాలతో పాటు, భారత్ ఎలక్ట్రానిక్స్, భారత్ డైనమిక్స్ వంటి ప్రముఖ రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు, అలాగే ప్రైవేట్ రంగంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తాయి.
2022, అక్టోబరు నెలలో ప్రధానమంత్రి వడోదర ఫైనల్ అసెంబ్లీ లైన్ (ఎఫ్ఏఎల్) కోసం శంకుస్థాపన చేశారు.
అమ్రేలీలో పీఎమ్ కార్యక్రమాలు
అమ్రేలిలోని దుధాలాలో ప్రధానమంత్రి భారత్ మాతా సరోవరాన్ని ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో గుజరాత్ ప్రభుత్వం, ధోలాకియా ఫౌండేషన్ల సహకారంతో అభివృద్ధి చేస్తున్నారు. వాస్తవానికి 4.5 కోట్ల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం గల ఆనకట్టను ధోలాకియా ఫౌండేషన్ మెరుగుపరిచింది. దాని లోతు, వెడల్పు పెంచి, మరింత బలోపేతం చేసిన తర్వాత ఆ ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం 24.5 కోట్ల లీటర్లకు పెరిగింది. ఈ కారణంగా సమీపంలోని బావులు, బోర్లలో నీటి మట్టం పెరిగింది. దీంతో మెరుగైన సాగునీటి సదుపాయాలతో స్థానిక గ్రామాలు, రైతులకు ప్రయోజనం కలగనుంది.
గుజరాత్‌లోని అమ్రేలిలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సుమారు రూ. 4,900 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలోని అమ్రేలి, జామ్‌నగర్, మోర్బి, దేవభూమి ద్వారక, జునాగఢ్, పోర్బందర్, కఛ్, బొటాడ్ జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తాయి.
2,800 కోట్లకు పైగా విలువైన వివిధ రహదారుల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ఎన్‌హెచ్ 151, ఎన్‌హెచ్ 151A, ఎన్‌హెచ్ 51, జునాగఢ్ బైపాస్‌లోని వివిధ విభాగాల్లో నాలుగు–వరుసలుగా అభివృద్ధి చేసిన రహదారుల ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. జామ్‌నగర్ జిల్లాలోని ధ్రోల్ బైపాస్ నుంచి మోర్బి జిల్లాలోని అమ్రాన్ వరకు మిగిలిన విభాగం నాలుగు వరుసల రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
దాదాపు రూ.1,100 కోట్లతో పూర్తి చేసిన భుజ్–నాలియా రైల్ గేజ్ కన్వర్షన్ ప్రాజెక్ట్‌ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. ఈ విస్తృత ప్రాజెక్ట్‌లో 24 ప్రధాన వంతెనలు, 254 చిన్న వంతెనలు, 3 రహదారికి ఎగువన నిర్మించే వంతెనలు, 30 రహదారికి దిగువన నిర్మించే వంతెనలు ఉన్నాయి. కఛ్ జిల్లా సామాజిక–ఆర్థిక అభివృద్ధిని మెరుగుపరచడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించనుంది.
అమ్రేలీ జిల్లాలో నీటి సరఫరా శాఖకు చెందిన రూ.700 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా నవ్దా నుంచి చావంద్ వరకు బల్క్ పైప్‌లైన్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇది 36 నగరాలు, బొటాడ్, అమ్రేలి, జునాగఢ్, రాజ్‌కోట్, పోర్బందర్ జిల్లాల్లోని 1,298 గ్రామాల్లో గల సుమారు 67 లక్షల మంది లబ్ధిదారులకు అదనంగా 28 కోట్ల లీటర్ల నీటిని అందిస్తుంది. భావ్‌నగర్ జిల్లాలో పసవి గ్రూప్ ఆగ్మెంటేషన్ నీటి సరఫరా పథకం రెండో దశ పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఇది భావ్‌నగర్ జిల్లాలోని మహువ, తలాజా, పాలిటానా తాలూకాల్లోని 95 గ్రామాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.
పోర్బందర్ జిల్లా మోకర్‌సాగర్‌లోని కర్లీ రీఛార్జ్ రిజర్వాయర్‌ను ప్రపంచ శ్రేణి సుస్థిర పర్యావరణ–పర్యాటక గమ్యస్థానంగా మార్చడంతోపాటు, పర్యాటక రంగంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.