ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబర్ 20న వారణాసిలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 2:00 గంటలకు ఆర్జెశంకర నేత్ర వైద్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం 4:15 గంటలకు నగరంలో అనేక అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.
ప్రధానమంత్రి ప్రారంభించే శంకర కంటి ఆస్పత్రిలో వివిధ నేత్ర వ్యాధులకు ప్రాథమిక వైద్యంతోపాటు ఇతర ఉన్నత స్థాయి చికిత్స సదుపాయాలు కూడా లభిస్తాయి. ఈ కార్యక్రమా తర్వాత ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
దేశవ్యాప్త అనుసంధానంపై తన సంకల్పం మేరకు వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయ రన్‌వే విస్తరణ, కొత్త టెర్మినల్ భవన నిర్మాణం సహా రూ.2870 కోట్ల విలువైన అనుబంధ ప్రాజెక్టులకూ ఆయన శంకుస్థాపన చేస్తారు. అలాగే ఆగ్రా (రూ.570 కోట్లు), దర్భంగా (రూ.910 కోట్లు), బాగ్‌డోగ్రా (రూ.1550 కోట్లు) విమానాశ్రయాల్లో కొత్త పౌర సదుపాయ ప్రాంగణాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.
వీటితోపాటు రేవా, మాతా మహామాయ, అంబికాపూర్, సర్సావా విమానాశ్రయాల్లో రూ.220 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాలను ఆయన ప్రారంభిస్తారు. తద్వారా ఈ నాలుగు విమానాశ్రయాల్లో సమష్టి ప్రయాణిక నిర్వహణ సామర్థ్యం ఏటా 2.3 కోట్లు దాటుతుంది. ఆయా ప్రాంతాల్లోని వారసత్వ కట్టడాల విశిష్టతలను మేళవిస్తూ ఈ విమానాశ్రయ టెర్మినల్ భవనాలను తీర్చిదిద్దారు.
దేశంలోని క్రీడాకారుల కోసం అత్యున్నత–నాణ్యమైన మౌలిక వసతుల కల్పనపై ప్రధాని నిబద్ధతకు అనుగుణంగా ‘ఖేలో ఇండియా’, ‘స్మార్ట్ సిటీస్ మిషన్’ పథకాల కింద ప్రభుత్వం వారణాసిలో పలు సౌకర్యాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా రూ.210 కోట్లతో నవీకరించిన వారణాసి క్రీడా ప్రాంగణం 2, 3 దశల సదుపాయాలను ప్రధాని ప్రారంభిస్తారు. నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ప్లేయర్స్ హాస్టల్స్, స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, వివిధ క్రీడల అభ్యాస ప్రదేశాలు, ఇండోర్ షూటింగ్ రేంజ్‌లు, యుద్ధ క్రీడల ప్రదేశాలు వగైరాలతో కూడిన అత్యాధునిక క్రీడా ప్రాంగణాన్ని రూపుదిద్దడం ఈ ప్రధాన ప్రాజెక్ట్ లక్ష్యం. మరోవైపు లాల్‌పూర్‌లోని డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ స్పోర్ట్స్ స్టేడియంలో 100 పడకల బాలబాలికల హాస్టళ్లను, పబ్లిక్ పెవిలియన్‌ను కూడా ఆయన ప్రారంభిస్తారు.
సారనాథ్‌లో బౌద్ధమత ప్రాంతాల పర్యాటక అభివృద్ధి పనులను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ పనుల్లో భాగంగా పాదచారులకు అనువైన వీధులు, కొత్త మురుగు కాలువలు, ఉన్నతీకరించిన డ్రైనేజీ వ్యవస్థ, స్థానిక హస్తకళా వ్యాపారులు తదితరులను ప్రోత్సహించే ఆధునిక ‘డిజైనర్ వెండింగ్ కార్ట్’లతో కూడిన వ్యవస్థీకృత జోన్లను రూపొందించారు. అలాగే బాణాసుర ఆలయం, గురుధామ్ ఆలయాల వద్ద పర్యాటక అభివృద్ధి పనులు, పార్కుల సుందరీకరణ, నవీకరణ వంటి ఇతరత్రా కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.