Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లావో పిడిఆర్ లోని వియంటియాన్ లో జరిగిన 21వ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సమావేశంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం- తెలుగు అనువాదం

లావో పిడిఆర్ లోని వియంటియాన్ లో జరిగిన 21వ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సమావేశంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం- తెలుగు అనువాదం


గౌరవ ప్రధాన మంత్రి శ్రీ సోనెక్సే సిఫాండోన్ గారూ,

ఘనత వహించిన నేతలు,

ప్రముఖులు,

నమస్కారం!

ఈ రోజు ఆసియాన్ కుటుంబంతో కలిసి పదకొండోసారి ఈ సమావేశంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నాను.

పదేళ్ల క్రితం నేను భారత్ ‘యాక్ట్ ఈస్ట్’ పాలసీని ప్రకటించాను. గత దశాబ్దకాలంగా, ఈ చొరవ భారత్- ఆసియాన్ దేశాల మధ్య చారిత్రాత్మక సంబంధాలను పునరుజ్జీవింపజేసింది, వాటికి కొత్త శక్తి, దిశ , వేగాన్ని నింపింది.

ఆసియాన్ కేంద్ర బిందువుగా 2019లో ఇండో-పసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ చొరవ   ఇండో-పసిఫిక్ పై ఆసియన్ దృష్టి కోణానికి (ఆసియాన్ అవుట్ లుక్ ఆన్ ది ఇండో-పసిఫిక్)  అనుబంధంగా ఉంది.

ప్రాంతీయ భద్రత, సుస్థిరతను పెంపొందించేందుకు గత ఏడాది సముద్ర విన్యాసాలను ప్రారంభించాం.

గడచిన పదేళ్లలో ఆసియాన్ ప్రాంతంతో మన వాణిజ్యం దాదాపు రెట్టింపు పెరిగి 130 బిలియన్ డాలర్లు దాటింది.

నేడు, భారతదేశం ఏడు ఆసియాన్ దేశాలతో ప్రత్యక్ష విమాన సంబంధాలను కలిగి ఉంది.  త్వరలో, బ్రూనై కి కూడా నేరుగా విమానాలు ప్రారంభమవుతాయి.

ఇంకా, మేము తైమూర్-లెస్తెలో ఒక కొత్త రాయబార కార్యాలయాన్ని కూడా ప్రారంభించాము.

ఆసియాన్ ప్రాంతంలో, సింగపూర్ మా ఫిన్ టెక్ అనుసంధానాన్ని నెలకొల్పిన మొదటి దేశం.  ఈ విజయాన్ని ఇప్పుడు ఇతర దేశాలు కూడా అనుసరిస్తున్నాయి.

మన అభివృద్ధి భాగస్వామ్యం ప్రజా కేంద్రీకృత దృష్టిపై ఆధారపడి ఉంది. నలంద విశ్వవిద్యాలయంలో 300 మందికి పైగా ఆసియాన్ విద్యార్థులు స్కాలర్ షిప్ ల ద్వారా ప్రయోజనం పొందారు. యూనివర్శిటీల నెట్ వర్క్ ను ప్రారంభించారు.

లావోస్, కంబోడియా, వియత్నాం, మయన్మార్,  ఇండోనేషియాలో మా భాగస్వామ్య వారసత్వాన్ని, సంప్రదాయాన్ని పరిరక్షించడానికి కూడా మేము పనిచేశాము.

కోవిడ్ మహమ్మారి సమయంలో అయినా, ప్రకృతి వైపరీత్యాలకు ప్రతిస్పందనగా అయినా పరస్పర సహాయాన్ని అందించి,  మానవతా బాధ్యతలను నెరవేర్చాము.

సైన్స్ అండ్ టెక్నాలజీ ఫండ్, డిజిటల్ ఫండ్, గ్రీన్ ఫండ్ సహా వివిధ రంగాల్లో సహకారం కోసం నిధులు ఏర్పాటు అయ్యాయి.  ఈ కార్యక్రమాలకు భారత్ 30 మిలియన్ డాలర్లకు పైగా విరాళం ఇచ్చింది. ఫలితంగా మన సహకారం ఇప్పుడు అండర్ వాటర్ ప్రాజెక్టుల నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు విస్తరించింది. మరో మాటలో చెప్పాలంటే, గత దశాబ్దంలో మన భాగస్వామ్యం ప్రతి అంశంలో గణనీయంగా విస్తరించింది.

2022లో దీన్ని ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచడం మనకు ఎంతో సంతృప్తినిచ్చే విషయం.

మిత్రులారా,

మనవి పొరుగు దేశాలు, గ్లోబల్ సౌత్‌లో మనం భాగస్వాములం. ఇంకా మనది ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. మన దేశాలు శాంతినే కోరుకుంటాయి. జాతీయ సమగ్రతను , సార్వభౌమత్వాన్ని పరస్పరం గౌరవించుకుంటాం. మన యువతకు గొప్ప భవిష్యత్తును అందించడానికి మనం కట్టుబడి ఉన్నాం.

21 వ శతాబ్దం భారత్ కు, ఆసియాన్ దేశాలకు “ఆసియా శతాబ్దం” అని నేను నమ్ముతున్నాను. నేడు, ప్రపంచంలోని అనేక ప్రాంతాల మధ్య సంఘర్షణ , ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితుల్లో భారత్, ఆసియాన్ మధ్య స్నేహం, సమన్వయం, చర్చలు , సహకారం చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఆసియాన్ సదస్సుకు విజయవంతంగా అధ్యక్షత వహించినందుకు లావో పి.డి.ఆర్ కు ప్రధాన మంత్రి సోనెక్సే సిఫాండోన్ కు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

నేటి సమావేశం భారత్-ఆసియాన్ భాగస్వామ్యంలో కొత్త కోణాలను ఆవిష్కరించగలదని నేను విశ్వసిస్తున్నాను.

చాలా ధన్యవాదాలు.

 

***