Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ముంబయిలో జరిగిన అభిజాత్ మరాఠీ భాషా కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

ముంబయిలో జరిగిన అభిజాత్ మరాఠీ భాషా కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం


మహారాష్ట్ర గవర్నర్, శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్ జీ, ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే జీ, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ జీ, అజిత్ పవార్ జీ, కేంద్ర ప్రభుత్వంలోని నా సహచరులు, తన గాత్రంతో ఎన్నో తరాలపై చెరగని ముద్ర వేసిన ఆశా తాయ్ జీ., ప్రఖ్యాత నటులు భాయ్ సచిన్ జీ, నామ్‌దేవ్ కాంబ్లీ జీ, సదానంద్ మోరే జీ, మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రులు భాయ్ దీపక్ జీ, మంగళ్ ప్రభాత్ లోధా జీ, ముంబయి బీజేపీ అధ్యక్షులు భాయ్ ఆశిష్ జీ, ఇతర ప్రముఖులు, సోదరులు, సోదరీమణులకు నమస్కారాలు!

మొదటగా, మరాఠీ భాషకు ప్రాచీన భాష హోదా లభించిన సందర్భంలో మహారాష్ట్రలోని, మహారాష్ట్ర వెలుపల గల, అలాగే ప్రపంచవ్యాప్తంగా మరాఠీ మాట్లాడే ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

కేంద్ర ప్రభుత్వం మరాఠీ భాషకు ప్రాచీన భాష హోదా కల్పించింది. మరాఠీ భాష చరిత్రలో ఈరోజు ఒక సువర్ణాధ్యాయంగా నిలుస్తుంది. మోరే జీ దీని గురించి చాలా చక్కగా వివరించారు. మహారాష్ట్ర ప్రజలు, మరాఠీ మాట్లాడే ప్రతీ వ్యక్తి ఈ నిర్ణయం కోసం, ఈ క్షణం కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. మహారాష్ట్ర ప్రజల కలను నెరవేర్చేందుకు సహకరించే గౌరవం నాకు లభించడం సంతోషంగా ఉంది. ఈ సంతోష క్షణాన్ని మీతో పంచుకోవడానికే ఈరోజు నేను మీ అందరి మధ్య ఉన్నాను. మరాఠీతో పాటు బెంగాలీ, పాలి, ప్రాకృత, అస్సామీ భాషలకు కూడా ప్రాచీన భాష హోదా లభించింది. ఈ భాషలతో అనుబంధం ఉన్న వ్యక్తులను కూడా నేను అభినందిస్తున్నాను.

మిత్రులారా,

మరాఠీ భాష చరిత్ర చాలా గొప్పది. ఈ భాష ద్వారా లభించిన జ్ఞానం అనేక తరాలకు మార్గదర్శకంగా ఉంటూ, నేటికీ మనకు మార్గాన్ని చూపుతున్నది. ఈ భాష ద్వారానే సంత్ జ్ఞానేశ్వర్ వేదాల సారాన్ని మనకు బోధించారు. జ్ఞానేశ్వరి (పుస్తకం) గీతాజ్ఞానం ద్వారా భారత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తిరిగి మేల్కొల్పింది. ఈ భాష ద్వారానే సంత్ నామ్‌దేవ్ భక్తి ఉద్యమ చైతన్యాన్ని బలపరిచారు. అదేవిధంగా, సంత్ తుకారాం మరాఠీ భాషలో మతపరమైన అవగాహన కోసం ప్రచారానికి నాయకత్వం వహించారు, సంత్ చోఖమేలా సామాజిక మార్పు కోసం ఉద్యమాలకు శక్తినిచ్చారు.

మహారాష్ట్ర, మరాఠీ సంస్కృతి ఔన్నత్యం కోసం కృషి చేసిన మహానుభావులకు ఈ సందర్భంగా నేను నమస్కరిస్తున్నాను. ఛత్రపతి శివాజీ మహారాజ్‌కి పట్టాభిషేకం జరిగిన 350 ఏళ్ళు పూర్తయిన వేళ మరాఠీ భాషకు లభించిన ఈ గుర్తింపు యావత్ దేశం ఆయనకు సమర్పించే గౌరవ వందనం అవుతుంది.

మిత్రులారా,

భారతదేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలోనూ మరాఠీ భాష సహకారం మరవలేనిది. మహారాష్ట్రకు చెందిన అనేక మంది విప్లవ నాయకులు, మేధావులు ప్రజలను జాగృతం చేసి ఏకం చేయడం కోసం మరాఠీని మాధ్యమంగా ఉపయోగించారు. లోకమాన్య తిలక్ తన మరాఠీ వార్తాపత్రిక ‘కేసరి’ ద్వారా విదేశీ పాలకుల పునాదులను కదిలించారు. మరాఠీలో ఆయన చేసిన ప్రసంగాలు ప్రజల్లో ‘స్వరాజ్యం’ (స్వ పరిపాలన) కాంక్షను రగిలించాయి. న్యాయం, సమానత్వం కోసం పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మరాఠీ భాష కీలక పాత్ర పోషించింది. గోపాల్ గణేష్ అగార్కర్ తన మరాఠీ వార్తాపత్రిక ‘సుధారక్’ ద్వారా సామాజిక సంస్కరణల ప్రచారాన్ని ప్రతి ఇంటికీ తీసుకువచ్చారు. గోపాల కృష్ణ గోఖలే సైతం స్వాతంత్య్ర పోరాటానికి మార్గనిర్దేశం చేసేందుకు మరాఠీ భాషను ఉపయోగించారు.

మిత్రులారా,

మన నాగరికత అభివృద్ధి, సాంస్కృతిక ఔన్నత్యం గురించిన కథలను సంరక్షించే మరాఠీ సాహిత్యం భారత అమూల్య వారసత్వం. మరాఠీ సాహిత్యం ద్వారా, ‘స్వరాజ్’ (స్వయం-పాలన), ‘స్వదేశీ’ (స్వయం-సమృద్ధి), ‘స్వభాష’ (మాతృభాష), ‘స్వ-సంస్కృతి’ (స్వీయ-సంస్కృతి) భావన మహారాష్ట్ర అంతటా వ్యాపించింది. గణేష్ ఉత్సవం, శివ్ జయంతి కార్యక్రమాలు స్వాతంత్య్రోద్యమ కాలంలో ప్రారంభమైనాయి. వీర్ సావర్కర్ వంటి విప్లవకారుల ఆలోచనలు, బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక సమానత్వ ఉద్యమం, మహర్షి కార్వే మహిళా సాధికారత ప్రచారం, మహారాష్ట్ర పారిశ్రామికీకరణ, వ్యవసాయ సంస్కరణలకు కృషి వంటివి అన్నీ మరాఠీ భాష ద్వారానే శక్తిమంతమయ్యాయి. మరాఠీ భాషతో అనుబంధంతో మన దేశ సాంస్కృతిక వైవిధ్యం మరింత సుసంపన్నమవుతుంది.

మిత్రులారా,

భాష కేవలం సంభాషణ సాధనం కాదు. సంస్కృతి, చరిత్ర, సంప్రదాయం, సాహిత్యంతో భాషకు అన్యోన్య బంధం ఉంది. పోవాడ జానపద గాన సంప్రదాయాన్ని మనం దీనికి ఉదాహరణగా తీసుకోవచ్చు. పోవాడ ద్వారానే, ఛత్రపతి శివాజీ మహారాజ్‌తో పాటు అనేక మంది గొప్ప రాజుల వీరోచిత గాథలు అనేక శతాబ్దాల తర్వాత కూడా మనకు తెలిశాయి. ఇది నేటి తరానికి మరాఠీ భాష అందించిన అద్భుతమైన కానుక. గణేశుడిని పూజించేటప్పుడు సహజంగానే మన మనస్సులో ప్రతిధ్వనించే పదాలు ‘గణపతి బప్పా మోరియా’. ఇది కేవలం కొన్ని పదాల కలయిక మాత్రమే కాదు, అనంతమైన భక్తి స్రవంతి. ఈ భక్తి మొత్తం దేశాన్ని మరాఠీ భాషతో అనుసంధానిస్తుంది. అదేవిధంగా, భగవాన్ విఠల్ ‘అభంగాలు’ వినే వారు కూడా స్వయంచాలకంగా మరాఠీతో మమేకం అవుతారు.

మిత్రులారా,

మరాఠీని ప్రాచీన భాషగా గుర్తించడం మరాఠీ సాహితీవేత్తలు, రచయితలు, కవులు, అసంఖ్యాక మరాఠీ ప్రేమికుల సుదీర్ఘ కృషి ఫలితం. మరాఠీకి ప్రాచీన భాష హోదా లభించడం ఎందరో ప్రతిభావంతులైన సాహితీవేత్తల సేవకు ఘన నివాళి. బాలశాస్త్రి జంభేకర్, మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలే, కృష్ణాజీ ప్రభాకర్ ఖాడిల్కర్, కేశవసూత్, శ్రీపాద్ మహదేవ్ మాటే, ఆచార్య ఆత్రే, శాంతాబాయి షెల్కే, గజానన్ దిగంబర్ మద్గుల్కర్, కుసుమాగ్రజ్ వంటి ప్రముఖులు దీని కోసం చేసిన కృషి అమూల్యమైనది. మరాఠీ సాహిత్యం, సంప్రదాయం ప్రాచీనమైనది మాత్రమే కాకుండా బహుముఖమైనది కూడా. వినోబా భావే, శ్రీపాద్ అమృత్ డాంగే, దుర్గాబాయి భగవత్, బాబా ఆమ్టే, దళిత రచయిత దయా పవార్, బాబాసాహెబ్ పురందరే మరాఠీ సాహిత్యానికి గణనీయమైన కృషి చేశారు. పి.ఎల్. దేశ్‌పాండే, డా.అరుణ ధేరే, డా.సదానంద్ మోరే, మహేశ్ ఎల్కుంచ్వార్, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నామ్‌దేవ్ కాంబ్లీ వంటి ప్రముఖులు, పురుషోత్తం లక్ష్మణ్ దేశ్‌పాండే వంటి సాహితీవేత్తల సహకారాన్ని కూడా నేను ఈరోజు గుర్తుచేసుకుంటున్నాను. ఆశా బాగే, విజయ రాజాధ్యక్ష, డా. శరణ్ కుమార్ లింబాలే, రంగస్థల దర్శకుడు చంద్రకాంత్ కులకర్ణి వంటి ఎందరో మహానుభావులు ఈ క్షణం సాకారం కోసం ఏళ్ల తరబడి కృషి చేశారు.

మిత్రులారా,

సాహిత్యం, సంస్కృతితో పాటు మరాఠీ సినిమా కూడా మనల్ని గర్వపడేలా చేసింది. ఈ రోజు మనం చూస్తున్న భారతీయ సినిమాకి వి.శాంతారామ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి దిగ్గజాలు పునాది వేశారు. సమాజంలోని అణగారిన, వెనకబడిన వర్గాల వాణిని మరాఠీ థియేటర్ విస్తృతం చేసింది. మరాఠీ థియేటర్‌లోని దిగ్గజ కళాకారులు ప్రతి వేదికపై తమ ప్రతిభను నిరూపించుకున్నారు. మరాఠీ సంగీతం, జానపద సంగీతం, జానపద నృత్య సంప్రదాయాలు గొప్ప వారసత్వాన్ని కొనసాగిస్తున్నాయి. బాల గంధర్వ, డా. వసంతరావు దేశ్‌పాండే, భీంసేన్ జోషి, సుధీర్ ఫడ్కే, మొగుబాయి కుర్దికర్ వంటి దిగ్గజాలు, తరువాతి కాలంలో లతా దీదీ, ఆశా తాయ్, శంకర్ మహదేవన్, అనురాధ పౌడ్వాల్ మరాఠీ సంగీతానికి ప్రత్యేక గుర్తింపును అందించారు. మరాఠీ భాషకు సేవ చేసిన వారి సంఖ్య చాలా పెద్దది, నేను వారందరి గురించి ప్రస్తావించడానికి ఈ సమయం సరిపోదు.

మిత్రులారా,

ఇక్కడ కొంతమంది మరాఠీలో మాట్లాడాలా లేదా హిందీలో మాట్లాడాలా అని సంకోచించే సమయంలో మరాఠీ నుంచి గుజరాతీకి రెండు, మూడు పుస్తకాలను అనువదించే భాగ్యం నాకు లభించింది. గత 40 ఏళ్లలో నేను మరాఠీకి కొంత దూరంగా ఉన్నప్పటికీ, ఒకప్పుడు నేను మరాఠీ బాగానే మాట్లాడేవాడ్ని. కానీ ఇప్పటికీ నాకు మరాఠీ మాట్లాడటానికి  పెద్దగా ఇబ్బంది లేదు. ఎందుకంటే, నా చిన్నతనంలో, నేను అహ్మదాబాద్‌లోని కాలికో మిల్‌ సమీపంలోని జగన్నాథ్ జీ ఆలయం సమీపంలో నివసించాను. మిల్లు కార్మికుల నివాసాల్లో భిడే అనే మహారాష్ట్ర వ్యక్తి కుటుంబం ఉండేది. విద్యుత్ సరఫరాలో సమస్యల కారణంగా వారికి శుక్రవారం సెలవు ఉండేది. నేను ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయడం లేదు, కానీ ఆ రోజుల్లో అలాంటి సమస్యలు సాధారణమే. ఆయనకు శుక్రవారాల్లో సెలవు ఉన్నందున, నేను ఆరోజు వారి ఇంటికి వెళ్లేవాడిని. పక్కింట్లో ఉండే ఒక చిన్న అమ్మాయి నాకు ఇప్పటికీ గుర్తుంది, ఆమె నాతో మరాఠీలో మాట్లాడుతూ ఉండేది. ఆమె వల్లనే నేను మరాఠీ నేర్చుకోగలిగాను అందువల్ల ఆమె నాకు గురువుగా మారింది.

మిత్రులారా,

మరాఠీ ప్రాచీన భాషగా గుర్తింపు పొందడం వల్ల మరాఠీ భాష అధ్యయనానికి మరింత ప్రోత్సాహం లభిస్తుంది. ఇది పరిశోధనను, సాహిత్య సేకరణలను ప్రోత్సహిస్తుంది. మరీ ముఖ్యంగా, ఇది భారతీయ విశ్వవిద్యాలయాలలో మరాఠీ అధ్యయనాన్ని సులభతరం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో మరాఠీ భాషాభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థలు, వ్యక్తులు, విద్యార్థులకు మద్దతు లభించనుంది. ఇది విద్య, పరిశోధనలలో కొత్త ఉద్యోగావకాశాలను కూడా సృష్టిస్తుంది.

మిత్రులారా,

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా మాతృభాషలో విద్యాబోధనకు ప్రాధాన్యమిచ్చే ప్రభుత్వం మనకు లభించింది. చాలా సంవత్సరాల క్రితం యు.ఎస్.లోని ఒక కుటుంబాన్ని కలవడం నాకు ఇంకా గుర్తుంది, ఆ కుటుంబానికి గల ఒక అలవాటు నాకు ఎంతగానో నచ్చింది. అది ఒక తెలుగు కుటుంబం. అమెరికన్ జీవనశైలిలో జీవిస్తున్నప్పటికీ, వారు రెండు కుటుంబ నియమాలు ఏర్పాటు చేసుకున్నారు: మొదటిది, అందరూ కలిసి రాత్రి భోజనం చేయడం అలాగే రెండవది, రాత్రి భోజన సమయంలో ఎవరూ తెలుగు తప్ప మరే భాషలో మాట్లాకూడదు అని. ఫలితంగా, యు.ఎస్.లో పుట్టిన వారి పిల్లలు కూడా తెలుగు బాగా మాట్లాడేవారు. మీరు మహారాష్ట్ర కుటుంబాలను కలిసినా, ఇప్పటికీ వారు సహజ మరాఠీలో మాట్లాడుతుంటారు. కాని మిగతా వారు అలా కాదు, చాలా మంది ఇప్పుడు “హలో”, “హాయ్” అనే పలకరింపులనే ఆనందిస్తున్నారు.

మిత్రులారా,

కొత్త జాతీయ విద్యా విధానం వల్ల ఇప్పుడు మెడికల్, ఇంజినీరింగ్ కోర్సులను మరాఠీలో చదివే అవకాశం అందుబాటులో ఉంది. అంతేకాదు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా నేను ఓ విన్నపం చేశాను. ఒక పేద వ్యక్తి మీ న్యాయస్థానానికి వచ్చిన సమయంలో మీరు ఇంగ్లిషులో ఇచ్చే తీర్పును అతను అర్థం చేసుకోలేరు కదా, ఈ విషయంగా తగిన చర్యలు చేపట్టాలని కోరాను. ఈ రోజు మాతృభాషలో తీర్పులు  అందించటం నాకు సంతోషంగా ఉంది. సైన్స్, ఎకనమిక్స్, ఆర్ట్, కవిత్వం ఇలా మరాఠీలో అనేక విషయాలపై పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మనం ఈ భాషను మన ఆలోచనలకు వాహనంగా మార్చాలి, తద్వారా అది చైతన్యవంతం అవుతుంది. మరాఠీ సాహిత్య రచనలు వీలైనంత ఎక్కువ మందికి చేరేలా చూడడమే మా లక్ష్యం, మరాఠీ ప్రపంచ ప్రేక్షకులందరికీ చేరువ కావాలని నేను కోరుకుంటున్నాను. అనువాదం కోసం ప్రభుత్వం ప్రారంభించిన ‘భాషిణి’ యాప్ గురించి మీకు ఇదివరకే తెలిసి ఉండవచ్చు. మీరు దీన్ని కచ్చితంగా ఉపయోగించాలి. ఈ యాప్‌తో మీరు అన్ని భారతీయ భాషలల్లోని విషయాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. అనువాద లక్షణం భాషా అడ్డంకులను విచ్ఛిన్నం చేస్తుంది. మీరు మరాఠీలో మాట్లాడినప్పుడు, నా దగ్గర ‘భాషిణి’ యాప్ ఉంటే, నేను దానిని గుజరాతీ లేదా హిందీలో వినగలను. సాంకేతికత దీన్ని చాలా సులభతరం చేసింది.

ఈ రోజు మనం ఈ చారిత్రాత్మక సందర్భాన్ని జరుపుకొంటున్న క్రమంలో ఇది మనకు ఒక గొప్ప బాధ్యతను కూడా గుర్తుచేస్తుంది. ఈ అందమైన భాష అభివృద్ధికి తోడ్పడాల్సిన బాధ్యత మరాఠీ మాట్లాడే ప్రతి వ్యక్తిపైనా ఉంది. మరాఠీ ప్రజలు ఎంత సరళంగా ఉంటారో, మరాఠీ భాష కూడా అంతే సరళంగా ఉంటుంది. ఎక్కువ మంది ప్రజలు ఈ భాషతో అనుబంధం కలిగి ఉంటూ, దానిని విస్తరిస్తూ తర్వాతి తరం దాని గురించి గర్వపడేలా మనందరం కృషి చేయాలి. మీరందరూ నన్ను స్వాగతించారు, సత్కరించారు, రాష్ట్ర ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను ఈ కార్యక్రమానికి రావడం యాదృచ్ఛికంగా జరిగింది, ఎందుకంటే నేను ఈ రోజు మరో కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది, కాని అకస్మాత్తుగా, ఇక్కడి మిత్రులు నన్ను అదనంగా ఒక గంట సమయం ఇవ్వాలని అభ్యర్థించారు, ఈ కార్యక్రమానికి ప్రణాళిక చేశారు. మరాఠీతో సన్నిహిత సంబంధం గల మహనీయులందరూ ఈ కార్యక్రమానికి హాజరుకావడం మరాఠీ భాష గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఇందుకు మీ అందరికీ నేను చాలా కృతజ్ఞుడను. మరాఠీకి ప్రాచీన భాష హోదా లభించినందుకు మరోసారి నేను మీ అందరినీ అభినందిస్తున్నాను.

మహారాష్ట్రలోని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరాఠీ మాట్లాడే ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ధన్యవాదాలు.

గమనిక: ఇది ప్రధానమంత్రి వ్యాఖ్యలకు దాదాపు అనువాదం మాత్రమే. వాస్తవానికి ఆయన హిందీలో మాట్లాడారు.

 

***