స్వచ్ఛ్ భారత్ అభియాన్ కు ఈ రోజున పది సంవత్సరాలు అయిన సందర్భానికి గుర్తుగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దిల్లీలో బడి పిల్లలతో పాటు ఒక పరిశుభ్రత పరిరక్షణ కార్యక్రమంలో పాలుపంచుకొన్నారు. విద్యార్థులతో ఆయన మాట్లాడారు.
స్వచ్ఛత వల్ల కలిగే లాభాలు ఏమిటో చెప్పండంటూ ప్రధాన మంత్రి అడగడంతో, దాని వల్ల జబ్బుల బారిన పడకుండా ఉండవచ్చని ఒక విద్యార్థి జవాబు చెబుతూ, స్వచ్ఛమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి భారతదేశాన్ని తయారు చేసుకోవాలనే అవగాహనను మన ఇరుగుపొరుగులలో వ్యాప్తి చేసేందుకు శ్రద్ధ తీసుకోవాలన్నాడు. టాయిలెట్ లు లేని కారణంగా వ్యాధులు ప్రబలుతున్నాయని కూడా మరో విద్యార్థి చెప్పాడు. చాలా మంది వారి దిన చర్యలో తొలి కార్యాన్ని ముగించడం కోసం ఆరుబయలు ప్రదేశాలను ఎంచుకోక తప్పనిసరైన స్థితి ఇదివరకు ఉండిందని, దీనితో రోగాలు పుట్టల్లా పెరిగాయని, మహిళలు చెప్పరాని అవస్థలు పడ్డారని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. పాఠశాలల్లో బాలికల కోసం విడిగా టాయిలెట్ లను నిర్మించడంతో స్వచ్ఛ్ భారత్ అభియాన్ లో తొలి అడుగులు పడ్డాయని, బడికి వెళ్లడం మానేస్తున్న అమ్మాయిల సంఖ్య
ఈ చర్యతో ఒక్కసారిగా బాగా తగ్గిపోయింది అని ప్రధాన మంత్రి వివరించారు.
మహాత్మ గాంధీ జీ జయంతిని, ఇంకా లాల్ బహాదుర్ శాస్త్రి జీ జయంతి ని ఈ రోజున మనం జరుపుకొంటున్నాం అని కూడా ప్రధాన మంత్రి అన్నారు. యోగా ను అభ్యసిస్తున్న యువతీయువకుల సంఖ్య పెరుగుతూ పోతుండడం పట్ల శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని ప్రకటించారు. యోగాసనాలు ఎంత ప్రయోజనకరమో అనే సంగతిని కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. కొందరు బాలలు ఈ సందర్భంగా ప్రధాని కళ్లెదుట కొన్ని ఆసనాలను వేయడంతో అక్కడ ఉన్న వారంతా చప్పట్లు కొట్టి, మెచ్చుకొన్నారు. మంచి పోషణ పైన శ్రద్ధ వహించవలసిన అవసరం ఉందని కూడా ప్రధాని అన్నారు. పిఎమ్–సుకన్య యోజన గురించి మీకేం తెలుసో చెప్పగలరా అంటూ ప్రధాన మంత్రి అడగడంతో, ఒక విద్యార్థి లేచి నిలబడి ఆ పథకాన్ని గురించి చెప్పుకొచ్చాడు. ఆ పథకం లో బాలికల కోసం బ్యాంకు లో ఖాతాను తెరవచ్చని, వారు పెరిగి పెద్దయింతరువాత ఆ పథకం వారికి ఆర్థికంగా అండదండగా ఉంటుందని ఆ విద్యార్థి తెలిపాడు. పిఎమ్ సుకన్య సమృద్ధి ఖాతాను ఆడపిల్లలు పుట్టగానే ప్రారంభించవచ్చని ప్రధాని చెబుతూ, ఏటా ఒక వేయి రూపాయలను జమ చేస్తూ ఉండాలి, ఆ విధంగా పోగైన డబ్బును ఆడపిల్లలు పెద్దవారయ్యాక వారి చదువుల కోసం, వారికి పెళ్లి చేయడానికి ఉపయోగించుకోవచ్చన్నారు. ఆ డిపాజిటు రాశి పద్దెనిమిది సంవత్సరాలలో ఏభై వేల రూపాయలు అవుతుంది, అందులో వడ్డీ గా ముట్టేదే సుమారుగా ముప్ఫై రెండు వేల రూపాయల నుంచి ముప్ఫై అయిదు రూపాయల వరకు ఉంటుందని ఆయన అన్నారు. అమ్మాయిలకు 8.2 శాతం వరకు వడ్డీ కిడుతుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
స్వచ్ఛత ప్రధానాంశంగా బాలలు ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శన లో ప్రధాన మంత్రి ప్రవేశించి అక్కడంతా కలియదిరిగారు. గుజరాత్ లో ఓ నీటిఎద్దడి ప్రాంతం లో స్కూలు పిల్లల్లో ప్రతి ఒక్కరికి ఒక మొక్క ను అప్పగించి, విద్యార్థులు రోజూ వారి ఇళ్లలో నుంచి నీటిని తీసుకు వచ్చి ఆ నీటిని మొక్కలకు పోయాలని చెప్పిన సంగతి తనకు తెలుసు అని ఆయన చెప్పారు. అదే బడికి అయిదు సంవత్సరాల తరువాత తాను వెళ్లినప్పుడు అంతకు ముందు లేనటువంటి అపూర్వమైన పచ్చదనంతో ఆ పరిసరాలు కళకళలాడడం తాను చూశానని ప్రధాని అన్నారు. చెత్తను వేరుపరచి, ఎరువును తయారు చేయడం వల్ల ఎన్ని లాభాలుంటాయో కూడా విద్యార్థినీవిద్యార్థులకు ప్రధాని తెలియజెప్పి, ఈ పనిని మీ ఇళ్ల వద్ద కూడా చేస్తూ ఉండండి అంటూ వారిని ప్రోత్సహించారు. అలాగే ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను గురించి కూడా మీ చుట్టుపక్కల వారు అందరూ అర్థం చేసుకొనేటట్టుగా చెప్పండి, దానికి బదులు గుడ్డతో తయారైన సంచీని వాడమనండి అని కూడా ఆయన సూచించారు.
శ్రీ నరేంద్ర మోదీ బాలలతో తాను మాట్లాడడాన్ని ఇంకా కొనసాగిస్తూ, అక్కడి బోర్డు మీద రాసి ఉన్న గాంధీజీ కళ్లద్దాలను చూపించి అక్కడంతా స్వచ్ఛతను కాపాడుతున్నారో లేదోనని గాంధీ గారు గమనిస్తూంటారని, కాబట్టి ఈ విషయంలో సావధానంగా ఉండండి పిల్లలూ అన్నారు. గాంధీ గారు ఆయన బ్రతికి ఉన్నంత కాలం స్వచ్ఛత కోసం పాటుపడ్డారని ప్రధాని అన్నారు. ఒక పిట్టకథను శ్రీ నరేంద్ర మోదీ వినిపిస్తూ, స్వాతంత్ర్యం – పరిశుభ్రత ఈ రెండిటిలో మీరు దేనిని ఎంపిక చేసుకొంటారు అంటూ గాంధీ గారిని అడిగినప్పుడు, గాంధీ గారు స్వాతంత్ర్యం కన్నా స్వచ్ఛతనే ఎంచుకొన్నారు. ఎందుకంటే ఆయన దృష్టిలో స్వచ్ఛత కు మించింది మరేదీ లేదు అని శ్రీ మోదీ తెలిపారు. స్వచ్ఛత ను కాపాడుకోవడాన్ని ఒక కార్యక్రమంగా చూడాలా, లేక ఒక అలవాటుగా చూడాలా అని విద్యార్థులను అడిగిన మీదట, విద్యార్థులంతా ‘స్వచ్ఛతా పరిరక్షణను ఒక అలవాటుగా మార్చుకోవాలి’ అని ఒక్కుమ్మడిగా బదులిచ్చారు. శుభ్రపరచడం ఏ ఒక్క వ్యక్తి బాధ్యతో, లేదా ఏ ఒక్క కుటుంబం బాధ్యతో, లేదా ఒక్క సారితో ముగిసే కార్యక్రమమో కాదు, అది ఒక మనిషి అతడు గాని, ఆమె గాని జీవించి ఉన్నంత వరకు అడ్డూ ఆపూ లేకుండా అలా కొనసాగుతూ ఉండవలసిన కార్యమే నిర్మలత్వం అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘నేను నా చుట్టుపక్కల ప్రాంతాలను ఎంతమాత్రం మురికిగా ఉండనివ్వను’’ అనేదే దేశంలో ప్రతి ఒక్కరు అనుసరించవలసిన విధి అని విద్యార్థులతో ఆయన చెప్పారు. బాలల చేత స్వచ్ఛత ప్రతిజ్ఞను ప్రధాన మంత్రి చేయించారు.
***
Marking #10YearsOfSwachhBharat with India's Yuva Shakti! Have a look... pic.twitter.com/PYKopNeBoM
— Narendra Modi (@narendramodi) October 2, 2024