ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ట్రలో సెప్టెంబరు 29న మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రూ.11,200 కోట్లకుపైగా వివిధ ప్రాజెక్టులు జాతికి అంకితం, శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు.
ఈ మేరకు పుణె మెట్రో రైల్ ప్రాజెక్టు తొలిదశ పూర్తి కావడానికి గుర్తుగా జిల్లా కోర్టు-స్వర్‌గేట్ మెట్రో సెక్షన్‌ను ఆయన ప్రారంభిస్తారు. భూగర్భంలో నిర్మించిన ఈ విభాగం కోసం రూ.1,810 కోట్లు వెచ్చించారు.
అలాగే ఇదే దశ కింద స్వర్గేట్-కత్రాజ్ మధ్య దాదాపు రూ.2,955 కోట్లతో చేపట్టే భూగర్భ మెట్రో రైలు మార్గం విస్తరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. సుమారు 5.46 కిలోమీటర్ల పొడవైన ఈ దక్షిణ భాగం విస్తరణలో మూడు స్టేషన్లు మార్కెట్ యార్డ్, పద్మావతి, కత్రాజ్ పూర్తిగా ఇందులో భాగమవుతాయి.
అటుపైన కేంద్ర ప్రభుత్వ జాతీయ పారిశ్రామిక కారిడార్ నిర్మాణ కార్యక్రమం కింద 7,855 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన విస్తృత ప్రగతిశీల ప్రాజెక్టు ‘బిడ్కిన్ పారిశ్రామిక వాడ’ను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. ఇది మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌కు దక్షిణాన 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీన్ని ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ కింద దీనికి రూపమిస్తున్నారు. మరఠ్వాడా ప్రాంతంలో శక్తిమంతమైన ఆర్థిక కేంద్రంగా దీనికి ఎనలేని సామర్థ్యం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రూ.6,400 కోట్ల వ్యయంతో మూడు దశల్లో దీన్ని నిర్మిస్తోంది.
ఈ కార్యక్రమాలతోపాటు షోలాపూర్ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఇక్కడి ప్రస్తుత టెర్మినల్ భవనాన్ని ఏటా 4.1 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించేలా పునరుద్ధరించారు. ఈ విమానాశ్రయ అనుసంధానంతో పర్యాటకులకు, వాణిజ్య వ్యవహారాల కోసం తరచూ ప్రయాణించేవారికి, పెట్టుబడిదారులకు షోలాపూర్ మరింతగా అందుబాటులోకి వస్తుంది.
ఈ సందర్భంగా భిదేవాడలో క్రాంతి జ్యోతి సావిత్రిబాయి ఫూలే స్మారక తొలి బాలికల పాఠశాల నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన కూడా చేస్తారు.
****