న్యూయార్క్ లో నిన్నటి రోజు (సెప్టెంబర్ 22)న జరిగిన ‘ది సమిట్ ఆఫ్ ది ఫ్యూచర్’ సందర్భంగా పాలస్తీనా అధ్యక్షుడు శ్రీ మహమూద్ అబ్బాస్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.
గాజాలో తలెత్తిన మానవ సంక్షోభం పట్ల, ఆ ప్రాంతంలో అంతకంతకు క్షీణిస్తున్న ప్రజల భద్రత పట్ల ప్రధాన మంత్రి తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. పాలస్తీనాకు మానవతాపూర్వక సాయం కొనసాగించడంతోపాటు, పాలస్తీనా ప్రజలకు భారతదేశం సమర్థన చెక్కుచెదరక నిలుస్తుందని ప్రధాని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఇజ్రాయల్–పాలస్తీనా అంశంలో భారత్ అనుసరిస్తున్న సిద్ధాంతబద్ధ వైఖరి కాలపరీక్షకు తట్టుకొని నిలిచిన సంగతిని ప్రధాని మరో మారు గుర్తు చేశారు. కాల్పులను విరమించాలని, బందీలను విడుదల చేయాలని పిలుపునిచ్చారు. సంభాషణలు, దౌత్యం బాటలోకి తిరిగి రావాలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. రెండు దేశాల ఏర్పాటు ఒక్కటే ఆ ప్రాంతంలో చిర శాంతినీ, స్థిరత్వాన్నీ స్థాపించగలుగుతుందని ఆయన అన్నారు. పాలస్తీనాను గుర్తించిన మొట్టమొదటి దేశాలలో ఒక దేశంగా భారత్ ఉండిందని, ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు సభ్యత్వం ఇవ్వాలన్న అంశానికి భారతదేశం మద్దతు అందిస్తోందని తెలియజేశారు.
విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాల్లోనూ, సామర్థ్యాల పెంపుదల సంబంధిత ఇతరేతర అంశాల్లో పాలస్తీనాకు భారతదేశం ఇప్పుడు అందిస్తున్న సమర్ధన, సహకారాలతో పాటు ఐరాసలో పాలస్తీనాకు భారత్ సంఘీభావం సహా భారత్–పాలస్తీనా ద్వైపాక్షిక సంబంధాలలో వివిధ పార్శ్వాలపై ఇద్దరు నేతలు నిర్మాణాత్మక చర్చలు జరిపారు. భారత్, పాలస్తీనాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడానికి ఇరువురు నేతలు అంగీకరించారు.
Met President Mahmoud Abbas in New York. Reiterated India’s support for early restoration of peace and stability in the region. Exchanged views of further strengthening long standing friendship with the people of Palestine. pic.twitter.com/LnmAm7dDax
— Narendra Modi (@narendramodi) September 23, 2024