ఉమ్మడి జాతీయ, ఆర్థిక భద్రతకు సంబంధించిన పరస్పర అంశాలపై సహకారాన్ని మరింత పెంచుకోవాలని అమెరికా, భారత్ లు మరింత సహకరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఆర్థిక పరమైన అజెండాలో స్వచ్ఛ ఇంధనానికి పెద్దపీట వేయడం ద్వారా ప్రజలకు ఉన్నతోద్యోగాలను కల్పించవచ్చనీ, స్వచ్ఛ ఇంధన వినియోగాన్ని ప్రపంచవ్యాప్తం చేయవచ్చుననీ, అంతర్జాతీయ పర్యావరణ లక్ష్యాలను అందుకోవడం కూడా సాధ్యం అవుతుందని ఇరుదేశాలూ నిర్ణయించుకున్నాయి.
ఈ లక్ష్యాలను సాధించేందుకు గానూ – పరస్పర సహకారంతో స్వచ్ఛ ఇంధన తయారీ టెక్నాలజీల సామర్థ్యాన్ని పెంచుకోవాలనీ, ఇందుకు అమెరికా, భారత్ ద్వైపాక్షిక సాంకేతిక, ఆర్థిక, విధానపరమైన సహకారాన్ని పెంపొందించుకోవాలని భావిస్తున్నాయి. ఆఫ్రికాకు ప్రధమ ప్రాధాన్యాన్ని అందిస్తూ, అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా సహకారాన్ని అందించే దిశగా– కార్యాచరణను రూపొందించుకోవాలని నిర్ణయించుకున్నాయి.
ఈ ప్రయత్నం అమెరికా, భారత్ మధ్య స్వచ్ఛ ఇంధన సహకారాన్ని మరింత పెంచుతుంది. 2023లో ప్రధానమంత్రి మోదీ అమెరికా పర్యటనలో ప్రారంభించిన స్వచ్ఛ ఇంధన ప్రతిపాదనలూ, అమెరికా ఇంధన విభాగం, భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు భాగస్వామ్యం, అమెరికా ప్రయోగశాలలు అందిస్తున్న సాంకేతిక సహకారం, భారత్‌లో విద్యుత్ బస్సులను వేగంగా విస్తరించేందుకు చేపట్టిన పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం వంటి ప్రతిష్ఠాత్మక ఆర్థిక కార్యక్రమాలకు ఇది దోహదపడనుంది. వినూత్నమైన స్వచ్ఛ ఇంధన తయారీ పద్ధతుల కోసం అమెరికా, భారత్ మధ్య ఉమ్మడి, దృఢమైన, అధునాతన సాంకేతిక, పారిశ్రామిక కేంద్రీకృత భాగస్వామ్యం ప్రపంచానికి బలమైన ఉదాహరణగా నిలుస్తుంది. 21వ శతాబ్దంలో స్వచ్ఛ ఆర్థిక అభివృద్ధికి మన దేశాలు నేతృత్వం వహిస్తాయి.
ఈ భాగస్వామ్యాన్ని ప్రారంభించేందుకు అంతర్జాతీయ పునర్నిర్మాణం, అభివృద్ధి బ్యాంకు (ఐబీఆర్డీ) ద్వారా 1 బిలియన్ యూఎస్ డాలర్ల నిధులు లభించేందుకు అమెరికా, భారత్ కృషి చేస్తున్నాయి. భారతదేశ స్వచ్ఛ ఇంధన సరఫరా వ్యవస్థలను నిర్మించడం వంటి ప్రాజెక్టులకు ఇది ఉపకరిస్తుంది. సౌర, వాయు, బ్యాటరీ, విద్యుత్ గ్రిడ్ వ్యవస్థలు, అధిక సామర్థ్యం కలిగిన ఎయిర్ కండీషనర్, సీలింగ్ ఫ్యాన్ సరఫరా వ్యవస్థలపై ప్రధాన దృష్టితో సరఫరారంగ తయారీ సామర్థ్యాలను విస్తృతం చేసేందుకు ఈ నిధులు తోడ్పడతాయి. భవిష్యత్తులో సౌలభ్యమైన పర్యావరణ ఆర్థిక పరిష్కారాల కోసం పెరిగే డిమాండును అందుకునేందుకు ప్రాధాన్య హరిత ఇంధన తయారీ రంగాలకు ప్రభుత్వ, ప్రైవేటు ఆర్థిక సాధనాలను, వినూత్న ఆర్థిక సంస్థల ద్వారా అదనపు నిధులు సమీకరించాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి.
అర్హతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న స్వచ్ఛ ఇంధన వ్యవస్థలో పైలట్ ప్రాజెక్టుల ప్యాకేజ్‌ను గుర్తించడానికి, గుర్తించిన రంగాల్లో సరఫరా వ్యవస్థల విస్తరణ, వైవిధ్యతకు అర్థవంతంగా సహకరించేందుకు సంబంధిత ప్రభుత్వ సంస్థలు, పౌర సమాజం, ఇరు దేశాల ప్రైవేటు రంగాలు, దాతృత్వ సంస్థలు, బహుముఖ అభివృద్ధికి సహకరించే బ్యాంకులతో కలిసి పని చేయాలని అమెరికా, భారత్ భావిస్తున్నాయి. కొత్త భాగస్వామ్యాలను ప్రారంభించడానికి, విస్తరించడానికి ఈ కింది అంశాలపై పరిశ్రమలో అగ్రగాములతో కలిసి పని చేయాలని ఇరు దేశాల ప్రభుత్వాలు నిర్ణయించాయి:
నిర్దిష్ట స్వచ్ఛ ఇంధన సరఫరా వ్యవస్థల విభాగాల్లో తయారీ సామర్థ్యాలను విస్తరించడం కోసం స్వల్ప కాల పెట్టుబడి అవకాశాలను గుర్తించనున్నాయి. ప్రాథమికంగా ఈ కింది స్వచ్ఛ ఇంధన భాగాలపై దృష్టి ఉంటుంది:
1. సోలార్ వేఫర్లు, వేఫర్ తయారీ పరికరాలు, తర్వాతి తరం సౌర ఫలకాలు.
2. విండ్ టర్బైన్ నాసెల్లెకు విడిభాగాలు
3. కండక్టర్లు, కేబుళ్లు, ట్రాన్స్ఫార్మర్లు, తర్వాతి తరం సాంకేతికతలతో సహా విద్యుత్ సరఫరా వ్యవస్థకు సంబంధించినవి.
4. విద్యుత్ నిల్వ భాగాలతో సహా బ్యాటరీలు.
5. విద్యుత్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాల (ఈవీలు) బ్యాటరీలు, ఉద్గార రహిత విద్యుత్ బస్సులు, ట్రక్కుల భాగాలు
6. అధిక సామర్థ్యం కలిగిన ఎయిర్ కండిషనర్లు, సీలింగ్ ఫ్యాన్ విడిభాగాలు.
పైన పేర్కొన్న సరఫరా వ్యవస్థల విభాగాల్లో అర్హత గల అవకాశాలను గుర్తించేందుకు, ఆఫ్రికాకు స్వచ్ఛ ఇంధనాన్ని విస్తరించాలనే దృష్టితో చేపట్టే ప్రాజెక్టు సహా పైలట్ ప్రాజెక్టుల ప్రారంభ ప్యాకేజీకి సహకరించడం కోసం ప్రైవేటు రంగంతో భాగస్వామ్యం దోహదపడుతుంది. భవిష్యత్తులో అదనంగా పెట్టుబడి ప్రణాళికలు, నిధుల సమీకరణ మార్గాలను రూపొందిస్తారు. సౌర, వాయు, బ్యాటరీ, కీలకమైన ఖనిజాలకు సంబంధించి నిధులు అందించే అవకాశాలను కొనసాగించేందుకు యూఎస్ డెవెలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీఎఫ్‌సీ) ద్వారా ప్రైవేటు రంగ భాగస్వామ్యాలతో చేస్తున్న ఈ ప్రయత్నం తోడ్పడుతుంది. ఇది పునరుత్పాదక ఇంధన, నిల్వ, ఇ–మొబిలిటీ పెట్టుబడులకు సహకారాన్ని అందించే భారతదేశ క్లీన్ ట్రాన్సిషన్ ఫండ్‌కు మద్దతునిస్తాయి. స్థానికంగా తయారీ డిమాండ్‌ను బలోపేతం చేస్తుంది. ఇదే విధంగా డీఎఫ్‌సీ మద్దతు ఉన్న భారతీయ ప్రైవేటు ఈక్విటీ ఫండ్ మేనేజర్ ఎవర్‌సోర్స్ క్యాపిటల్ 900 మిలియన్ డాలర్ల నిధి సైతం పునరుత్పాదక ఇంధనం, సమర్థవంతమైన శీతలీకరణ, విద్యుత్ రవాణా వ్యవస్థ వంటి స్వచ్ఛ సాంకేతికతల్లో పెట్టుబడి పెట్టేందుకు దోహదపడుతుంది.
ఆఫ్రికా భాగస్వాములతో త్రైపాక్షిక సంబంధాలను నిర్మించుకోవడం సౌర, బ్యాటరీ నిల్వ అవకాశాలపై దృష్టితో స్వచ్ఛ ఇంధనాన్ని విస్తరించడం పట్ల రాజకీయ నిబద్ధతను చాటుతోంది. అధిక అవకాశాలు కలిగిన సౌర, విద్యుత్ వాహనాల విస్తరణ అవకాశాలు కొనసాగించడానికి, ప్రాజెక్టు విజయవంతం అవడానికి కావాల్సిన పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, భాగస్వామ్యాలను, ఆర్థిక విధానాన్ని వివరించడానికి, ప్రాజెక్టును అమలు చేయడానికి ఆఫ్రికా దేశాల భాగస్వాములతో భారత్, అమెరికాలు బహుముఖంగా పని చేయవచ్చు. పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికీ, స్థానిక ఆఫ్రికా దేశాల తయారీదారులతో భాగస్వామ్యాలను విస్తరించడానికి ప్రభుత్వ–ప్రైవేటు అవగాహనను సులభతరం చేయడానికి భారతీయ కంపెనీలకు సహకారాన్ని అందించాలని అమెరికా భావిస్తోంది. ఆరోగ్య కేంద్రాల వల్ల సౌర, ఈవీ చార్జింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి భారత్ కేంద్రంగా పని చేసే అంతర్జాతీయ సౌర కూటమితో డీఎఫ్‌సీ, యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవెలప్‌మెంట్ సంధానం చేస్తున్నాయి.
స్థానికంగా తయారైన స్వచ్ఛ సాంకేతికతకు డిమాండును బలోపేతం చేసే విధానాల కోసం పరిశ్రమతో సంప్రదింపులు, పరస్పర సహకారం ఉపయోగపడతాయి. యూఎస్ బైపార్టిసన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లా, ఇన్ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్ అనేవి స్వచ్ఛ ఇంధన సాంకేతికతలను పెద్ద ఎత్తున విస్తరించేందుకు పెట్టుబడి పెట్టేందుకు రూపొందించిన చారిత్రక చట్టాలు. ఇవి అమెరికా ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త శక్తిని ఇవ్వడంతో పాటు, స్వచ్ఛ ఇంధన సరఫరా వ్యవస్థలకు సముచితమైన మార్గాన్ని చూపాయి. ఇదే విధంగా భారతదేశంలో ఉత్పత్తితో జత చేసిన ప్రోత్సాహక పథకాలు స్వచ్ఛ ఇంధన తయారీని ప్రోత్సహించేందుకు 4.5 బిలియన్ డాలర్లు వెచ్చించాయి. అయినప్పటికీ, ప్రపంచ మార్కెట్ విభిన్నతలను, అతి తక్కువ లాభాలను తట్టుకునేలా ఈ పెట్టుబడులను విస్తరించేందుకు, రక్షించేందుకు అదనపు విధానాలు ఆవశ్యకత కూడా ఉంది. డిమాండ్‌కు సంబంధించిన అనిశ్చితులను తగ్గించడానికి, తయారీకి అవసరమైన సాధకాలు, సాంకేతిక నైపుణ్యం, నిధులు సరిపడా, సురక్షితంగా ఉండేలా చూసేందుకు విధానాల రూపకల్పన కోసం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ముఖ్యమని ఇరు దేశాలు గుర్తించాయి.
ప్రాజెక్టులపై ప్రాథమిక సహకారం పొందడానికి స్వల్పకాలిక సాధనంగా ఈ మార్గదర్శ ప్రణాళిక ఉంటుంది. భాగస్వామ్యానికి సంబంధించిన సమావేశాల ఏర్పాటుకు, కీలక విజయాలను సాధించేందుకు కలిసి పని చేయడంతో పాటు దీర్ఘకాలిక మార్గదర్శ ప్రణాళికను రూపకల్పనకు సాయపడుతుంది. కాగా, ఇది దేశీయ లేదా అంతర్జాతీయ చట్టాల ప్రకారం హక్కులు లేదా చట్టబద్ధమైన బాధ్యతలను పెంచడానికి ఉద్దేశించినది కాదు.
***