ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన క్లీన్ ప్లాంట్ పథకానికి(సీపీపీ- క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్) కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
రూ.1,765.67 కోట్ల భారీ వ్యయంతో తీసుకొస్తున్న ఈ కార్యక్రమం దేశ ఉద్యాన రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకురానుంది. శ్రేష్టత, సుస్థిరత విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందని భావిస్తున్నారు. 2023 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి దీనిని ప్రకటించారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉద్యాన పంటల నాణ్యత, ఉత్పాదకతను పెంచడంలో ఒక పెద్ద ముందడుగు.
క్లీన్ ప్లాంట్ పథకం (సీపీపీ) ముఖ్య ప్రయోజనాలు:
* రైతులు: వైరస్ రహిత, అధిక-నాణ్యత గల మొక్కలను, ఉద్యాన సామగ్రిని సీపీపీ ప్రోత్సహిస్తుంది. ఇది పంట దిగుబడులను పెంచడానికి, మెరుగైన ఆదాయ అవకాశాలకు దారితీస్తుంది.
* నర్సరీలు: ధృవీకరణ ప్రక్రియను క్రమబద్ధీకరించటం, మౌలిక సదుపాయాల విషయంలో ఆర్థిక సహాయాన్ని అందించటం ద్వారా నర్సరీలు పర్యావరణ అనుకూల మొక్కలు, సామగ్రిని ఉపయోగించటానికి, తద్వారా వృద్ధి, సుస్థిరతను పెంపొందించడానికి వీలు కల్పించనుంది.
* వినియోగదారులు: వైరస్ లేని మెరుగైన ఉత్పత్తులు, మంచి రుచి, రూపం, పోషక విలువల గల పండ్ల ద్వారా వినియోగదారులు ప్రయోజనం పొందుతారు.
* ఎగుమతులు: అధిక నాణ్యత, వ్యాధి రహిత పండ్లను ఉత్పత్తి చేయడం ద్వారా ప్రముఖ ప్రపంచ ఎగుమతిదారుగా తన స్థానాన్ని భారత్ బలోపేతం చేసుకోవటంతో పాటు విస్తరిస్తున్న మార్కెట్ అవకాశాలను కైవసం చేసుకొని, అంతర్జాతీయ పండ్ల వాణిజ్యంతో తన వాటా పెంచుకుంటుంది.
భూ పరిమాణం, సామాజిక ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా రైతులందరికీ పర్యావరణ అనుకూల మొక్కలు, ఉద్యాన సామాగ్రిని సరసమైన ధరలకు ఈ పథకం అందించనుంది.
ఈ కార్యక్రమం మహిళా రైతులను దాని ప్రణాళిక, అమలులో చురుకుగా నిమగ్నం చేస్తుంది. వారికి వనరులు, శిక్షణ, నిర్ణయాలు తీసుకునే అవకాశాలకు కల్పిస్తుంది.
ప్రాంతాల వారీగా పర్యావరణ అనుకూల మొక్కల రకాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దేశంలోని వైవిధ్యమైన వ్యవసాయ-వాతావరణ పరిస్థితుల సమస్యను ఇది పరిష్కరించనుంది.
సీపీపీలో కీలక విభాగాలు:
క్లీన్ ప్లాంట్ కేంద్రాలు(సీపీసీ): అధునాతన డయాగ్నోస్టిక్ థెరప్యూటిక్స్, టిష్యూ కల్చర్ ప్రయోగశాలలతో కూడిన తొమ్మిది ప్రపంచ స్థాయి అత్యాధునిక సీపీసీల(క్లీన్ ప్లాంట్ సెంటర్స్)ను భారత్ అంతటా ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ద్రాక్ష(ఎన్ఆర్‌సీ, పూణే), సమశీతోష్ణ పండ్లు-సేపులు,బాదం, వాల్‌నట్ మొదలైనవి(సీఐటీహెచ్, శ్రీనగర్ & ముక్తేశ్వర్), సిట్రస్ పండ్లు (సీసీఆర్‌ఐ, నాగ్‌పూర్ & సీఐహెచ్ఏ, బికనీర్), మామిడి/జామ/అవకాడో(ఐఐహెచ్ఆర్, బెంగళూరు), మామిడి/జామ/లిచి(సీఐఎస్‌హెచ్, లక్నో), దానిమ్మ(ఎన్ఆర్‌సీ, షోలాపూర్), ఉష్ణమండల/ఉప ఉష్ణమండల పండ్లు(ఈశాన్య భారత్) ప్రయోగశాలలు ఉన్నాయి.
ధృవీకరణ, చట్టపరమైన చర్యలు: విత్తనోత్పత్తి, అమ్మకాల్లో పూర్తి జవాబుదారీతనం, మూలాన్ని గుర్తించేలా.. విత్తన చట్టం 1966 కింద చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ సహాయంతో పటిష్టమైన ధృవీకరణ వ్యవస్థను తీసుకురానున్నారు.
మెరుగైన మౌలిక సదుపాయాలు: మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నర్సరీలను ప్రోత్సహించనున్నారు. శుభ్రమైన మొక్కలు, నాటే సామగ్రిని పెంచుకోవటానికి ఇది వీలు కల్పిస్తుంది.
మిషన్ లైఫ్, వన్ హెల్త్ కార్యక్రమాల అనుసంధానంతో క్లీన్ ప్లాంట్ పథకం భారతదేశ ఉద్యాన రంగాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఇది స్థిరమైన, పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. ఉద్యానవనాల్లో ఉపయోగించే సామాగ్రి విషయంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. దేశాన్ని పండ్ల ఎగుమతిలో అగ్రగామి ప్రపంచ ఎగుమతిదారుగా నెలకొల్పేందుకు, ఈ రంగంలో విప్లవాత్మక మార్పును తీసుకురావటంలో ఒక కీలకమైన అడుగు ఈ పథకం. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) సహకారంతో నేషనల్ హార్టికల్చర్ బోర్డు ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది.
***
The Clean Plant Programme, which has been approved by the Cabinet is an ambitious initiative to revolutionize India's horticulture sector. It will ensure healthier and high-quality plants are encouraged. pic.twitter.com/NmuVzz19Su
— Narendra Modi (@narendramodi) August 9, 2024