Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహారాష్ర్టలోని ముంబైలో రూ.29,400 కోట్లకు పైగా విలువ గల పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, కొన్నింటిని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి

మహారాష్ర్టలోని  ముంబైలో రూ.29,400 కోట్లకు పైగా విలువ గల పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, కొన్నింటిని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ర్టలోని ముంబైలో శనివారం రూ.29,400 కోట్ల విలువ గల పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి కొన్నింటిని ప్రారంభించారు. వీటిలో రోడ్డు, రైల్వే, పోర్టు ప్రాజెక్టులున్నాయి.  

ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ముంబై నుంచి సమీప ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచేందుకు ఉపయోగపడే రూ.29,400 కోట్లకు పైగా విలువ గల పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి కొన్నింటిని ప్రారంభించే అవకాశం లభించినందుకు ప్రధానమంత్రి హర్షం ప్రకటించారు. మహారాష్ర్టలోని యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించేందుకు దోహదపడే అతి పెద్ద నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టు గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ‘‘ఇటీవలే రూ.76,000 కోట్ల పెట్టుబడితో కేంద్రప్రభుత్వం ఆమోదించిన వాధవాన్ పోర్టు ప్రాజెక్టు 10 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది’’ అని చెప్పారు.

గత నెల రోజుల కాలంలో మహారాష్ర్టలో ఇన్వెస్టర్ల మానసిక స్థితి గురించి ప్రస్తావిస్తూ ప్రభుత్వం మూడో విడత అధికారంలోకి రావడాన్ని చిన్న, పెద్ద ఇన్వెస్టర్లు ఉత్సాహంగా ఆహ్వానించారని ప్రధానమంత్రి అన్నారు. కేంద్రంలో ఏర్పడిన సుస్థిర ప్రభుత్వం మూడో విడత అధికార కాలంలో మూడింతలు వేగంతో పని చేస్తుందని ఆయన చెప్పారు. 

మహారాష్ర్టకు సమున్నతమైన చరిత్ర, సాధికార వర్తమానం, కలలను సాకారం చేయగల సుసంపన్నమైన భవిష్యత్తు ఉన్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. 

భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చి దిద్దడంలో మహారాష్ర్ట పాత్ర గురించి ప్రస్తావించిన ప్రధానమంత్రి పరిశ్రమ, వ్యవసాయం, ఆర్థిక రంగాల శక్తితోనే ముంబై ఆర్థిక శక్తిగా అవతరించిందన్నారు. ‘‘మహారాష్ర్ట శక్తిని ప్రపంచ ఆర్థిక శక్తిగా మార్చాలని, ముంబైని ప్రపంచానికే ఫిన్ టెక్ రాజధానిగా మార్చాలన్నది నా ధ్యేయం’’ అని ప్రదానమంత్రి వెల్లడించారు. శివాజీ మహరాజ్ నిర్మించిన కోటలు, కొంకణ్ కోస్తా తీరం, సహ్యాద్రి పర్వత శ్రేణులు గల మహారాష్ర్ట అగ్రశ్రేణి పర్యాటక కేంద్రంగా మారాలన్న ఆకాంక్ష శ్రీ మోదీ ప్రకటించారు. మెడికల్ టూరిజం, కాన్ఫరెన్స్ టూరిజం కేంద్రంగా మారగల సామర్థ్యం రాష్ర్టానికి ఉన్నదని ఆయన అన్నారు. ‘‘భారతదేశ అభివృద్ధిలో మహారాష్ర్ట నూతనాధ్యాయం లిఖించబోతోంది. అందులో మనందరం సహ ప్రయాణికులమే’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. నేటి ఈ కార్యక్రమం ఆ దిశగా ప్రభుత్వ సంకల్పాలకు దర్పణం పడుతుంది అన్నారు.  

21వ శతాబ్ది భారత పౌరులు భారీ ఆశలు కలిగి ఉన్నారంటూ రాబోయే 25 సంవత్సరాల కాలంలో దేశాన్ని వికసిత్ భారత్ గా తీర్చి దిద్దడమే జాతీయ సంకల్పమని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. ఈ ప్రయాణంలో ముంబై, మహారాష్ర్ట కీలక పాత్ర పోషిస్తాయని ఆయన నొక్కి చెప్పారు. ‘‘ముంబై, మహారాష్ర్టలోని ప్రతీ ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నదే మా లక్ష్యం. ముంబై పరిసర ప్రాంతాల కనెక్టివిటీ మెరుగుపరిచేందుకు మేం ప్రయత్నిస్తున్నాం’’ అని చెప్పారు. కోస్తా రోడ్డు, అటల్ సేతు ప్రాజెక్టులు పూర్తి చేయడాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రోజూ 20 వేల వాహనాలు అటల్ సేతును  ఉపయోగిస్తున్నాయంటూ తద్వారా రూ.20-25 లక్షల విలువ గల ఇంధనం ఆదా అవుతున్నదని ఆయన తెలిపారు. మెట్రో వ్యవస్థ కూడా వేగంగా విస్తరిస్తున్నదంటూ పది సంవత్సరాల క్రితం 8 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ వ్యవస్థ నేడు 80 కిలోమీటర్లకు  చేరిందని, మరో 200 కిలోమీటర్ల మెట్రో నెట్ వర్క్ పనులు పురోగతిలో ఉన్నాయని ప్రధానమంత్రి చెప్పారు. 

‘‘భారతీయ రైల్వేల పరివర్తన కూడా ముంబైకి, మహారాష్ర్టకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగిస్తోంది’’ అని పిఎం శ్రీ మోదీ తెలిపారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్. నాగపూర్ రైల్వే స్టేషన్ల పునర్నవీకరణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘’24 కోచ్ లు ఉన్న రైళ్లు ప్రయాణం సాగించేందుకు వీలుగా విస్తరించిన ఛత్రపతి శివాజీ టెర్మినస్, లోకమాన్య తిలక్ స్టేషన్లలోని కొత్త ప్లాట్ ఫారంలను నేడు జాతికి అంకితం చేశాం’’ అని ఆయన చెప్పారు.  

గత 10 సంవత్సరాల కాలంలో మహారాష్ర్టలోని జాతీయ రహదారుల నిడివి మూడింతలు అయిందని ప్రధానమంత్రి తెలియచేశారు. జాతీయ రహదారుల విస్తరణ స్వభావం, పురోగతికి గోరేగాం ములుంద్ లింక్ రోడ్డు (జిఎంఎల్ఆర్) ప్రాజెక్టు నిదర్శనమని ఆయన చెప్పారు. ఠాణే-బోరివలి మధ్య నిర్మిస్తున్న ద్వంద్వ సొరంగ మార్గంతో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ దూరం కొన్ని నిముషాలకు తగ్గుతుందన్నారు. దేశంలో యాత్రా స్థలాల అభివృద్ధికి, ప్రయాణ సౌలభ్యానికి, యాత్రీకుల సేవల విస్తరణకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రధానమంత్రి వివరించారు. పంధర్ పూర్ వారి యాత్రలో లక్షలాది మంది యాత్రికులు పాల్గొంటున్నారంటూ ప్రయాణ సౌలభ్యం కోసం 200 కిలోమీటర్ల నిడివిలో సంత్ ధ్యానేశ్వర్ పాల్కి మార్గ్ ను, 110 కిలోమీటర్ల నిడివిలో సంత్ తుకారాం పాల్కి మార్గ్ ను నిర్మిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ రెండు మార్గాలు కూడా త్వరలో అందుబాటులోకి వస్తాయని ఆయన హామీ ఇచ్చారు.

అనుసంధానత మౌలిక వసతులు పర్యాటక, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు సహాయకారిగా ఉన్నాయని, మహిళలకు విశ్రాంతి సౌలభ్యం కల్పిస్తున్నాయని శ్రీ మోదీ చెప్పారు. ‘‘ఎన్ డిఏ ప్రభుత్వం చేస్తున్న ఈ పనులన్నీ పేదలు, రైతులు, మహిళా శక్తి, యువశక్తిని సాధికారం చేస్తున్నాయి’’ అని ఆయన చెప్పారు. 10 లక్షల మంది యువతకు  నైపుణ్యాల కల్పన, ముఖ్యమంత్రి యువ కార్య ప్రశిఖాన్ యోజన కార్యక్రమం కింద స్కాలర్ షిప్ ల కల్పన కార్యక్రమాలు చేపట్టిన డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు.   

‘‘భారతదేశానికి భారీ ఎత్తున నైపుణ్యాభివృద్ధి, ఉపాధికల్పన నేటి అవసరం’’ అని ప్రధానమంత్రి చెప్పారు. కోవిడ్ మహమ్మారి కల్లోలం సృష్టించిన సమయంలో కూడా గత నాలుగైదు సంవత్సరాల కాలంలో రికార్డు స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించినట్టు ఆయన చెప్పారు.  దేశంలో ఉపాధి కల్పనపై రిజర్వ్ బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన సవివరమైన నివేదిక గురించి ప్రస్తావిస్తూ గత 3-4 సంవత్సరాల కాలంలో 8 కోట్లకు పైగా ఉద్యోగావకాశాలు కల్పించినట్టు వెల్లడించిన ఆ నివేదిక విమర్శకుల నోళ్లు మూయించిందని శ్రీ మోదీ అన్నారు. భారతదేశ అభివృద్ధిపై ప్రచారంలోకి తెస్తున్న తప్పుడు సమాచారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని పౌరులకు ప్రధానమంత్రి సూచించారు. వంతెనలు నిర్మించినప్పుడు, రైల్వే ట్రాక్ లు వేసినప్పుడు, రోడ్లు నిర్మించినప్పుడు, దేశీయంగా రైళ్లు తయారుచేస్తున్నప్పుడు ఎన్నో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని ఆయన చెప్పారు. దేశంలో మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతున్నంత వేగంగానే ఉపాధి కూడా ఏర్పడుతున్నట్టు ఆయన తెలిపారు.

‘‘నిరాకరణకు గురైన వారికి ప్రాధాన్యం ఇవ్వడమే ఎన్ డిఏ అభివృద్ధి నమూనా’’ అని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. దేశంలో 3 కోట్ల కొత్త ఇల్లు నిర్మించాలన్నది నూతన ప్రభుత్వ తొలి నిర్ణయం అన్న విషయం ఆయన గుర్తు చేశారు.  4 కోట్ల కుటుంబాలు ఇప్పటికే ఇళ్లు అందుకున్నాయని ఆయన చెప్పారు. ఆవాస్ యోజన ద్వారా మహారాష్ర్టలోని లక్షలాది మంది దళితులు, నిరాకరణకు గురవుతున్న వారు లబ్ధి పొందారన్నారు.
‘‘నగరాల్లో నివశిస్తున్న పేదలు, మధ్య తరగతి ప్రజలు అందరి సొంతింటి కల సాకారం చేయడమే మా కట్టుబాటు’’ అని ప్రధానమంత్రి చెప్పారు.
వీధి వ్యాపారుల ఆత్మ గౌరవ పునరుద్ధరణలో పిఎం స్వనిధి పథకం అద్బుత పాత్ర పోషిస్తున్నదని ఆయన చెప్పారు. ఈ స్కీమ్ కింద సుమారు 90 లక్షల రుణాలు మంజూరు చేయగా వాటిలో 14 లక్షలు మహారాష్ర్టలోను, 1.5 లక్షలు ముంబైలోను మంజూరయ్యాయని ఆయన తెలిపారు. ఈ స్కీమ్ తో వీధి వ్యాపారుల నెలవారీ ఆదాయం రూ.2 వేలు పెరిగినట్టు ఒక అధ్యయనంలో తేలిందని ఆయన చెప్పారు.    

వీధి వ్యాపారుల ఆత్మ గౌరవం, పేదల శక్తి పెరగడం స్వనిధి పథకం ప్రత్యేకత అని ప్రధానమంత్రి తెలియచేస్తూ ఈ పథకం కింద బ్యాంకు రుణాలు పొందిన వారు సకాలంలో ఆ రుణాలను తిరిగి చెల్లించేశారన్నారు. పిఎం స్వనిధి పథకం లబ్ధిదారులు ఇప్పటివరకు రూ.3.25 లక్షల డిజిటల్ లావాదేవీలు నిర్వహించారని ఆయన తెలియచేశారు.

‘‘మహారాష్ర్ట దేశంలో సాంస్కృతిక, సామాజిక, జాతీయతా చైతన్యాన్ని ప్రచారం చేసింది’’ అని ప్రధానమంత్రి చెబుతూ ఛత్రపతి శివాజీ మహరాజ్, బాబా సాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రీబాయి పూలే, అన్నాభావు సాథే, లోకమాన్య తిలక్, వీర్ సావర్కర్ వంటి వారు వదిలిన వారసత్వం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. పౌరులు ముందడుగేసి సామరస్యపూర్వకమైన సమాజం, బలమైన జాతి నిర్మాణం కలను సాకారం చేయాలని ప్రధానమంత్రి పిలుపు ఇచ్చారు. సామరస్యం, మైత్రీ భావం మాత్రమే సుసంపన్నతకు బాట వేస్తాయనే విషయం మనసులో ఉంచుకోవాలని పౌరులను అభ్యర్థిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.  

మహారాష్ర్ట గవర్నర్ శ్రీ రమేశ్ బియాస్, మహారాష్ర్ట ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే, మహారాష్ర్ట ఉపముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, శ్రీ అజిత్ పవార్;  కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయెల్; కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్ దాస్ అథావాలే, ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.   

పూర్వాపరాలు
రూ.16,600 కోట్ల వ్యయంతో ఠాణే-బోరివలి సొరంగ మార్గం ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఠాణే-బోరివలి మధ్య నిర్మిస్తున్న రెండు ట్యూబులుండే ఈ సొరంగ మార్గం సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ కిందుగా సాగుతూ బోరివలి వైపు వెస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవేని, ఠాణే వైపు ఠాణే-గోద్ బందర్ రోడ్డును కలుపుతుంది. ఈ మార్గం నిడివి 11.8 కిలోమీటర్లు. ఇది ఠాణే-బోరివలి మధ్య 12 కిలోమీటర్ల దూరాన్ని తగ్గించడం ద్వారా ప్రయాణ సమయం కూడా గంట మేరకు తగ్గుతుంది.

గోరేగాం ములుంద్ లింక్ రోడ్డుపై (జిఎంఎల్ఆర్) రూ.6300 కోట్ల వ్యయంతో చేపట్టిన సొరంగ మార్గానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. గోరేగాం వద్ద వెస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవే నుంచి ములుంద్ వద్ద ఈస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవేని జిఎంఎల్ఆర్ కలుపుతుంది. 6.65 కిలోమీటర్ల నిడివి గల జిఎంఎల్ఆర్ ప్రాజెక్టు పడమటి సబర్బ్ ప్రాంతాన్ని నవీ ముంబైలో నిర్మించతలపెట్టిన కొత్త విమానాశ్రయం, పుణె-ముంబై ఎక్స్ ప్రెస్ వేతో నేరుగా అనుసంధానత కల్పిస్తుంది.

నవీ ముంబైలో కల్యాణ్ యార్డ్ రీమోడలింగ్ ప్రాజెక్టు, గతిశక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్  ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. కల్యాణ్ యార్డ్ ప్రాజెక్టు దూర ప్రాంత, సబర్బన్ ట్రాఫిక్ ను విభజనకు సహాయకారి అవుతుంది. ఈ రీ మోడలింగ్ ప్రాజెక్టు మరిన్ని రైళ్ల రాకపోకలకు వీలుగా యార్డ్ సామర్థ్యాన్ని పెంచుతుంది. తద్వారా ఈ మార్గంలో రద్దీ తగ్గి  రైళ్ల రాకపోకల సామర్థ్యం పెరుగుతుంది. గతిశక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ ప్రాజెక్టును నవీ ముంబైలో 32600 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు సిమెంట్, ఇతర కమోడిటీల రవాణాకు అదనపు టెర్మినల్ ను అందుబాటులోకి తేవడంతో పాటు స్థానిక ప్రజలకు అదనపు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది.

లోకమాన్య తిలక్ టెర్మినస్ లో కొత్తగా నిర్మించిన ప్లాట్ ఫారంలను; ఛత్రపతి శివాజీ టెర్మినస్ లో విస్తరించిన 10, 11 ప్లాట్ ఫారంలను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. లోకమాన్య తిలక్ టెర్మినస్ లో కొత్తగా నిర్మించిన పొడవైన ప్లాట్ ఫారం అధిక నిడివి గల రైళ్ల రాకపోకలకు అవకాశం కల్పిస్తుంది. తద్వారా ఒక్కో రైలులో ఎక్కువ మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు దోహదపడుతుంది. స్టేషన్ ట్రాఫిక్ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఛత్రపతి శివాజీ టెర్మినస్ లో 10, 11 ప్లాట్ ఫారంలను 382 మీటర్ల వంతున విస్తరించారు. ఈ విస్తరణతో కవర్ షెడ్, వాషింగ్ చేయడానికి అనుకూలమైన ఆప్రాన్ అందుబాటులోకి వస్తాయి. ఈ ప్లాట్ ఫారంలు 24 కోచ్ లున్న రైళ్ల రాకపోకలకు అవకాశం కల్పించడంతో పాటు వాటి ప్రయాణికుల రవాణా సామర్థ్యం కూడా పెరుగుతుంది.

సుమారు రూ.5600 కోట్ల పెట్టుబడితో ముఖ్యమంత్రి యువ కార్య ప్రశిక్షణ్ యోజన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. 18-30 సంవత్సరాల మధ్య వయస్కులైన నిరుద్యోగ యువతలో నైపుణ్యాలు పెంచడానికి, తద్వారా వారికి పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు పెరిగేందుకు దోహదపడే పరివర్తన శక్తి గల ఇంటర్న్ షిప్ కార్యక్రమం ఇది.

***