Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత-ఆస్ర్టియా విస్తృత భాగస్వామ్యంపై ఉమ్మడి ప్రకటన


ఆస్ర్టియా చాన్సలర్ కార్ల్ నెహామర్ ఆహ్వానాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 జూలై 9-10 తేదీల్లో ఆ దేశంలో అధికారికంగా పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఆస్ర్టియా అధ్యక్షుడు మాననీయ అలెగ్జాండర్ వాన్ డెర్ బెల్లెన్ ను కలవడంతో పాటు చాన్సలర్ నెహామర్ తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఇది ఆస్ర్టియాలో ప్రధానమంత్రి తొలి పర్యటన మాత్రమే కాదు, 41 సంవత్సరాల కాలంలో భారతదేశ ప్రధానమంత్రి ఒకరు ఆస్ర్టియాలో పర్యటించడం ఇదే ప్రథమం. అంతే కాదు, 2024 సంవత్సరం  ఉభయదేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన 75వ సంవత్సరం కావడం విశేషం.

భాగస్వామ్య ప్రజాస్వామిక విలువలు, స్వేచ్ఛ, అంతర్జాతీయ శాంతి సుస్థిరతలు, ఐక్యరాజ్య సమితి చార్టర్ లో పొందుపరిచిన నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థ ఉభయ దేశాల విస్తృత భాగస్వామ్యంలో కీలకమైన అంశాలని ప్రధానమంత్రి, చాన్సలర్ నొక్కి వక్కాణించారు. అంతే కాదు ఉభయ దేశాల మధ్య నెలకొన్న దీర్ఘకాలిక బంధం కూడా ఇందుకు కీలకమని అభిప్రాయపడ్డారు. మరింత సుస్థిరమైన, సుసంపన్నమైన, సుస్థిర ప్రపంచం కోసం ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ సహకారం మరింత లోతుగా విస్తరించుకునేందుకు కృషిని కొనసాగించాలన్న కట్టుబాటును పునరుద్ఘాటించారు.

ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత శ్రేణికి పెంచుకోగల సామర్థ్యం ఉభయ దేశాలకు ఉన్నదని చాన్సలర్ నెహామర్, ప్రధానమంత్రి శ్రీ మోదీ గుర్తించారు. ఈ భాగస్వామ్య లక్ష్యాన్ని మరింత ముందుకు నడిపించేందుకు వ్యూహాత్మక వైఖరి అనుసరించాలని అంగీకారానికి వచ్చారు. ఈ లక్ష్యసాధన కోసం సన్నిహిత రాజకీయ చర్చలతో పాటు భవిష్యత్ దృక్ప‌ధంతో కూడిన సుస్థిర ఆర్థిక, సాంకేతిక ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని నెలకొల్పుకోవాలని వారు నిర్ణయించారు. అనేక నూతన కార్యక్రమాలు, ఉమ్మడి ప్రాజెక్టులు, ఉమ్మడి టెక్నాలజీల అభివృద్ధి; పరిశోధన, నవకల్పనలు; హరిత, డిజిటల్ టెక్నాలజీలు, మౌలిక వసతులు, పునరుత్పాదక ఇంధనం, జలవనరుల నిర్వహణ, లైఫ్ సైన్సులు, స్మార్ట్ సిటీలు, మొబిలిటీ, రవాణా రంగాల్లో వ్యాపార భాగస్వామ్యాలు నెలకొల్పుకోవడం ఇందులో కీలకమని గుర్తించారు.

రాజకీయ, భద్రతా సహకారం

అంతర్జాతీయ, ప్రాంతీయ శాంతి సుస్థిరతల స్థాపనలో తమ వంతు వాటా అందించేందుకు ఇండియా, ఆస్ర్టియా వంటి ప్రజాస్వామ్య దేశాలు కలిసికట్టుగా పని చేయాల్సిన ఆవశ్యకత ఉన్నదని ప్రధానమంత్రి శ్రీ మోదీ, చాన్సలర్ నెహామర్ నొక్కి చెప్పారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఇటీవల ఉభయ దేశాల విదేశాంగ మంత్రుల స్థాయిలో నిర్దిష్ట కాలపరిమితిలో, నిర్మాణాత్మకంగా జరుగుతున్న సంప్రదింపుల పట్ల నాయకులిద్దరూ సంతృప్తి ప్రకటించారు. ఈ చర్చలను విభిన్న రంగాలకు విస్తరిస్తున్న ప్రస్తుత ధోరణిని కొనసాగించాలని వారు తమ అధికారులను ప్రోత్సహించారు.

సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతల పట్ల పూర్తి గౌరవభావంతో వ్యవహరిస్తూ ఐక్య రాజ్య సమితి సాగర జలాల నిబంధనావళిలో (యుఎన్ సిఎల్ఓఎస్) పొందుపరిచిన అంతర్జాతీయ సాగర న్యాయ చట్టాలకు లోబడి ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని స్వేచ్ఛాయుత, బహిరంగ, నిబంధనల ఆధారిత మండలంగా తీర్చి దిద్దాలన్న కట్టుబాటును నాయకులిద్దరూ పునరుద్ఘాటించారు. సాగర  ప్రాంత భద్రత, అంతర్జాతీయ శాంతి, సుస్థిరతలకు దోహదపడే విధంగా సాగర జలాల్లో రవాణా స్వేచ్ఛ ఉండాలని వారు అభిప్రాయపడ్డారు.

యూరప్, పశ్చిమాసియా/మధ్యప్రాచ్య దేశాల్లోని తాజా సంఘటనలపై తమ లోతైన అంచనాలను ఉభయులు పరస్పరం తెలియచేసుకున్నారు. శాంతి పునరుద్ధరణ, సాయుధ సంఘర్షణల నివారణ; అంతర్జాతీయ న్యాయ చట్టాలకు, ఐక్యరాజ్యసమితి నిబంధనావళి కట్టుబాటుకు ప్రాధాన్యం ఇస్తూ ఇలాంటి వ్యవహారాల్లో ఉభయ దేశాలు అనుసరిస్తున్న వైఖరి పరస్పరం బలం చేకూర్చేదిగా ఉన్నదన్న విషయం వారు గుర్తించారు.      

ఉక్రెయిన్ యుద్ధం విషయంలో కూడా అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్య సమితి నిబంధనావళికి లోబడి శాంతియుత పరిష్కారం కోసం చేసే ఎలాంటి ఉమ్మడి ప్రయత్నానికైనా తమ మద్దతు ఉంటుందని ఉభయ దేశాల నాయకులు మద్దతు ప్రకటించారు. ప్రత్యక్షంగా ఘర్షణ పడుతున్న దేశాలు రెండూ నిజాయతీగా భాగస్వాములై ఇతర భాగస్వామ్య దేశాలన్నీ కలిసికట్టుగా ప్రయత్నించినప్పుడే సమగ్ర, శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని నాయకులిద్దరూ అభిప్రాయపడ్డారు.

సీమాంతర, సైబర్ ఉగ్రవాదం సహా ఏ రకమైన ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ సహించబోమని  ఉభయ నాయకులు పునరుద్ఘాటించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయం, ప్రణాళికల రచన, మద్దతు, ఉగ్రవాద చర్యలకు పాల్పడడం వంటి ఎలాంటి కార్యకలాపాలకైనా ఏ దేశం స్వర్గధామంగా ఉండరాదని వారు నొక్కి చెప్పారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 1267 ఆంక్షల కమిటీ తన జాబితాలో పొందుపరిచిన సంస్థలు, వ్యక్తులు సహా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వారెవరిపై అయినా సమిష్టి చర్యలు తీసుకోవాలని ఉభయ వర్గాలు పిలుపు ఇచ్చాయి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటిఎఫ్), నో మనీ ఫర్ టెర్రర్ (ఎన్ఎంఎఫ్ టి) వంటి బహుముఖీన వేదికలపై కలిసి పని చేసేందుకు తమ కట్టుబాటును ఉభయ దేశాలు పునరుద్ఘాటించాయి.

2023 సెప్టెంబరులో ఢిల్లీలో జరిగిన జి-20 శిఖరాగ్రం సందర్భంగా ఏర్పాటు చేసిన ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్ (ఐఎంఇసి) గురించి నాయకులిద్దరూ గుర్తు చేసుకున్నారు. జి-20కి అద్భుత నాయకత్వం వహించినందుకు ప్రధానమంత్రి శ్రీ మోదీని చాన్సలర్ నెహామర్ అభినందించారు. ఈ ప్రాజెక్టుకు వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్నదంటూ దీని ద్వారా భారత్, మధ్యప్రాచ్య, యూరోపియన్ దేశాల మధ్య వాణిజ్య, ఇంధన సహకారం మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని వారు అంగీకరించారు. ఐఎంఇసితో కలిసి పని చేసేందుకు ఆస్ర్టియా ఆసక్తిగా ఉన్నదన్న విషయం చాన్సలర్ నెహామర్ తెలియచేశారు. యూరప్ దేశాల మధ్యలో ఉన్న ఆస్ర్టియా అనుసంధానతకు కీలక దోహదకారిగా ఉంటుందని ఆయన అన్నారు.

బారత్, యూరోపియన్ యూనియన్ రెండూ ప్రపంచంలోనే అతి పెద్ద, శక్తివంతమైన స్వేచ్ఛా మార్కెట్ ప్రదేశాలని పేర్కొంటూ ఇయు-ఇండియా భాగస్వామ్యం పరస్పర లాభదాయకమే కాకుండా ప్రపంచంపై కూడా సానుకూల ప్రభావం చూపుతాయని ఉభయులు నొక్కి చెప్పారు. భారత-ఇయులను మరింత సన్నిహితం చేయడానికి జరిగే ప్రయత్నాలన్నింటికీ మద్దతు ఇవ్వాలని చాన్సలర్ నెహామర్, ప్రధానమంత్రి శ్రీ మోదీ అంగీకరించారు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియా-ఇయు వాణిజ్య, పెట్టుబడి చర్చలకు; ఇయు-భారత అనుసంధానత భాగస్వామ్యం సత్వర అమలుకు నాయకులిద్దరూ గట్టి మద్దతు ప్రకటించారు.

సుస్థిర ఆర్థిక భాగస్వామ్యం

ఉభయ దేశాల మధ్య బలమైన ఆర్థిక, సాంకేతిక భాగస్వామ్యం వ్యూహాత్మక లక్ష్యమని ఉభయులూ గుర్తించారు. ఈ పర్యటనలో భాగంగా వియెన్నాలో పలు కంపెనీల సిఇఓల భాగస్వామ్యంతో తొలి అత్యున్నత స్థాయి ద్వైపాక్షిక వాణిజ్య సమావేశం నిర్వహించడం పట్ల  వారిద్దరూ హర్షం ప్రకటించారు. ఆ బిజినెస్ ఫోరంలో నాయకులిద్దరూ ప్రసంగించడంతో పాటు విబిన్న రంగాల్లో నూతన, చలనశీల భాగస్వామ్యాల కోసం కృషి చేయాలని వ్యాపార వర్గాల ప్రతినిధులను ప్రోత్సహించారు.

ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు నడిపించడంలో పరిశోధన, శాస్ర్తీయ భాగస్వామ్యాలు, టెక్నాలజీ భాగస్వామ్యాలు, నవకల్పనల కీలక ప్రాధాన్యతను నాయకులిద్దరూ గుర్తించారు. పరస్పర ప్రయోజనం కోసం అలాంటి మరిన్ని అవకాశాల కోసం అన్వేషించాలని వారు పిలుపు ఇచ్చారు. నూతన వ్యాపార రంగాలు, పరిశ్రమ; పరిశోధన, అభివృద్ధి భాగస్వామ్య నమూనాలు వంటి విభిన్న రంగాల్లో టెక్నాలజీలను అభివృద్ధి చేసి వాణిజ్యపరంగా అందుబాటులోకి తేవడంలో బలమైన సహకారం నెలకొనాలని వారు నొక్కి చెప్పారు.

2024 ఫిబ్రవరిలో ఆస్ర్టియా కార్మిక, ఆర్థిక శాఖల మంత్రి భారత సందర్శన, ఆ తర్వాత 2024 జూన్ లో భారత స్టార్టప్ ల  బృందం ఆస్ర్టియా సందర్శన సందర్భంగా ఏర్పాటు చేసిన స్టార్టప్ బ్రిడ్జ్ ద్వారా ఉభయ దేశాలు నవకల్పనలు, స్టార్టప్ వ్యవస్థల అనుసంధానత కోసం తీసుకున్న చర్యలను నాయకులిద్దరూ ఆహ్వానించారు. ఆస్ర్టియాకు చెందిన గ్లోబల్ ఇంక్యుబేటర్ నెట్ వర్క్, భారత్ కు చెందిన స్టార్టప్ ఇండియా కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో కూడా ఈ తరహా కృషిని కొనసాగించాలని సంబంధిత సంస్థలను వారు ప్రోత్సహించారు.

భారత, ఆస్ర్టేలియా దేశాలు ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల ఒడంబడిక (యుఎన్ఎఫ్ సిసిసి) సభ్య దేశాలు కావడంతో పాటు ప్రపంచ ఉష్ణోగ్రతల సగటు పెరుగుదలను పారిశ్రామికీకరణ ముందు కాలం నాటి 2 డిగ్రీల సెల్సియస్ కన్నా దిగువకు తీసుకురావాలన్న కట్టుబాటుకు మద్దతు ప్రకటించాయి. ఈ లక్ష్యాలను సాధించగలిగితే వాతావరణ మార్పుల రిస్క్, ప్రభావం గణనీయంగా తగ్గుతుందని ఉభయులు గుర్తించారు. 2050 నాటికి వాతావరణ తటస్థత సాధించేందుకు ఇయు స్థాయిలో ప్రకటించిన కట్టుబాటు, 2040 నాటికి వాతావరణ తటస్థత సాధించేందుకు ఆస్ర్టియా ప్రభుత్వం ప్రకటించిన కట్టుబాటు, 2070 నాటికి నికర జీరో వ్యర్థాల (నెట్ జీరో) లక్ష్యం సాధించేందుకు భారత ప్రభుత్వం ప్రకటించిన కట్టుబాటును వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.  

ఆస్ర్టియా ప్రభుత్వం ప్రకటించిన హైడ్రోజెన్ వ్యూహం, ఇంధన పరివర్తన సవాళ్లను దీటుగా ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా భారతదేశం ప్రకటించిన జాతీయ హరిత హైడ్రోజెన్ కార్యక్రమం పరిధిలో ఉభయ దేశాల మధ్య సహకారానికి అవకాశాలెన్నో ఉన్నాయని వారు గుర్తించారు. ఉభయ దేశాల్లోనూ పునరుత్పాదక/హరిత హైడ్రోజెన్ రంగంలో పని చేస్తున్న కంపెనీలు, ఆర్ అండ్ డి సంస్థలు విస్తృత భాగస్వామ్యాలు కుదుర్చుకునేందుకు వారు మద్దతు ప్రకటించారు.

స్వచ్ఛ రవాణా; నీరు, మురుగునీటి నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధనం, ఇతర హరిత టెక్నాలజీల రంగాల్లో సహకారంలో భాగంగా పర్యావరణ టెక్నాలజీల ప్రాధాన్యతను నాయకులు గుర్తించారు. ఆయా రంగాలు, వాటి అనుబంధ రంగాల్లో విస్తృత భాగస్వామ్యానికి మద్దతుగా ఏర్పాటవుతున్న వెంచర్లు, ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు పిలుపు ఇచ్చారు. సుస్థిర ఆర్థిక వ్యవస్థ సహా వివిధ పారిశ్రామిక ప్రాసెస్ కార్యకలాపాల్లో (ఇండస్ర్టీ 4.0) పెరుగుతున్న డిజిటల్ టెక్నాలజీల పాత్రను కూడా వారు గుర్తించారు.

భాగస్వామ్య భవిష్యత్తుకు నైపుణ్యాలు  

నైపుణ్యాభివృద్ధి, విభిన్న హైటెక్ రంగాల్లో విస్తృత సహకారం నేపథ్యంలో నిపుణులైన సిబ్బంది రాకపోకల ప్రాధాన్యతను చాన్సలర్ నెహామర్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తించారు. ఈ నేపథ్యంలో ద్వైపాక్షిక వలస, మొబిలిటీ ఒప్పందం అమలును వారు ఆహ్వానించారు. ఇలాంటి కీలకమైన రంగాల్లో నిపుణుల రాకపోకలకు అవకాశం కల్పించడంతో పాటు అక్రమ వలసల నిరోధానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.

సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ సహా పరస్పర ఆసక్తి గల విభిన్న రంగాల్లో భవిష్యత్ దృక్ప‌ధంతో కూడిన భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకునేందుకు ఉభయ దేశాల విద్యా సంస్థలను వారు ప్రోత్సహించారు.

ప్రజల మధ్య సంబంధాలు

దీర్ఘకాలంగా ఉభయ దేశాల మధ్య నెలకొన్న పరస్పర సాంస్కృతిక మార్పిడి సాంప్రదాయాన్ని నాయకులిద్దరూ ప్రశంసించారు. ఆస్ర్టియాలోని భారత సాంస్కృతికవేత్తలు, ఆస్ర్టియాతో బంధం కలిగి ఉన్న భారతీయ సాంస్కృతిక ప్రముఖుల పాత్రను వారు కొనియాడారు. ఆస్ర్టియన్లలో యోగా, ఆయుర్వేద పట్ల పెరుగుతున్న ఆసక్తిని వారు గుర్తించారు. సంగీతం, నాట్యం, ఒపేరా, నాటక రంగం, చలన చిత్రాలు, సాహిత్యం, క్రీడలు, ఇతర రంగాల్లో ద్వైపాక్షిక బంధం మరింత విస్తరించుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వారు ఆహ్వానించారు. సాంస్కృతిక సహకారంపై ఇటీవల ఒక ఎంఓయుపై సంతకాలు చేయడాన్ని కూడా వారు ప్రశంసించారు.

ఆర్థిక, సుస్థిర, సమ్మిళిత వృద్ధి సాధనలోను, ఉభయ దేశాల ప్రజల మధ్య అవగాహన పెంపులోనూ పర్యాటక రంగం  పాత్రను వారు గుర్తించారు. ఉభయ దేశాలకు పర్యాటకుల రాకపోకలను పెంచేందుకు వివిధ సంస్థలు చేస్తున్న సంఘటిత కృషిని వారు ప్రోత్సహించారు. అలాగే వైమానిక అనుసంధానత పెంపు, దీర్ఘకాలిక బస, ఇతర చొరవలకు వారు మద్దతు ప్రకటించారు.

బహుముఖీన సహకారం

బహుముఖీనత, ఐక్యరాజ్య సమితి చార్టర్ లోని నిబంధనావళికి నాయకులు తమ కట్టుబాటును పునరుద్ఘాటించారు. క్రమం తప్పకుండా ద్వైపాక్షిక సంప్రదింపుల నిర్వహణ, బహుముఖీన వేదికలపై సహకారం ద్వారా ఈ మౌలిక సిద్ధాంతాల పరిరక్షణ, ప్రోత్సాహానికి కలిసికట్టుగా కృషి చేయాలని వారు అంగీకారానికి వచ్చారు.

భద్రతా మండలి సహా ఐక్యరాజ్య సమితి వ్యవస్థలో సమగ్ర సంస్కరణల సాధనకు తమ కట్టుబాటును వారు పునరుద్ఘాటించారు. 2027-28లో యుఎన్ఎస్ సిలో ఆస్ర్టియా సభ్యత్వానికి భారత్ తన మద్దతు పునరుద్ఘాటించగా 2028-29 సంవత్సరంలో భారతదేశ అభ్యర్థిత్వానికి ఆస్ర్టియా మద్దతు ప్రకటించింది.

ఇటీవల నూరవ సభ్యుని కూటమిలోకి ఆహ్వానించడం ద్వారా ఒక కీలకమైన మైలురాయి సాధించిన ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ లో సభ్యదేశంగా చేరాలని ఆస్ర్టియాకు భారతదేశ ఆహ్వానాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ అందచేశారు.  

తన ఆస్ర్టియా పర్యటన సందర్భంగా ఆస్ర్టియా ప్రభుత్వం, ప్రజలు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చినందుకు చాన్సలర్ నెహామర్ కు ప్రధానమంత్రి శ్రీ మోదీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే వీలు చూసుకుని భారతదేశంలో పర్యటించాలని చాన్సలర్ నెహామర్ ను ప్రధానమంత్రి శ్రీ మోదీ ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్నినెహామర్ ఆనందంగా అంగీకరించారు.

***