ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఆస్ట్రియా ఛాన్సలర్ గౌరవనీయ కార్ల్ నెహమ్మర్ ఇవాళ భారత-ఆస్ట్రియా దేశాల్లోని భిన్న రంగాల అగ్రగామి సంస్థల ముఖ్య కార్యనిర్వహణాధికారు(సీఈవో)ల సమావేశంలో సంయుక్తంగా ప్రసంగించారు. ఉభయ దేశాల్లోని ఆటోమొబైల్, మౌలిక సదుపాయాలు, ఇంధనం, ఇంజినీరింగ్ రంగాలు సహా పలు అంకుర సంస్థల సీఈవోలు ఇందులో పాల్గొన్నారు.
భారత-ఆస్ట్రియాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం సహా ద్వైపాక్షిక ఆర్థిక సహకారానికి తోడ్పాటులో అగ్రగామి పరిశ్రమలు ప్రశంసనీయ పాత్ర పోషిస్తున్నాయని నాయకులిద్దరూ అభినందించారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం-పెట్టుబడులు కొన్నేళ్ల నుంచీ క్రమంగా పెరుగుతున్నాయని వారిద్దరూ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత-ఆస్ట్రియా భాగస్వామ్య సంపూర్ణ సామర్థ్య సాధన దిశగా సహకారం మరింత విస్తరించాలని పిలుపునిచ్చారు.
మరికొన్ని సంవత్సరాల్లో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భంచగలదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తదనుగుణంగా అందివస్తున్న అపార అవకాశాలను ఆస్ట్రియా వాణిజ్య భాగస్వాములు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గడచిన పదేళ్లలో భారత్ పరివర్తనాత్మక ప్రగతి సాధించిందని ఆయన గుర్తుచేశారు. దేశంలో నేటి రాజకీయ స్థిరత్వం, సానుకూల విధానాలు, సంస్కరణాధారిత ఆర్థిక కార్యక్రమాల బలంతో పురోగమన పథంలో మరింత వేగంగా దూసుకెళ్లగలదని ఆయన వివరించారు. వాణిజ్య సౌలభ్యం మెరుగుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ఈ కారణంగానే అంతర్జాతీయ అగ్రగామి సంస్థలు భారతదేశం వైపు మొగ్గు చూపుతున్నాయని తెలిపారు. భారత ఆర్థిక వృద్ధి, పరివర్తనాత్మకతల గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ మేరకు అంకుర సంస్థల రంగంలో భవిష్యత్తరం మౌలిక సదుపాయాల కల్పనలో భారత్ సాధించిన విజయాలను వివరించారు. అంతేకాకుండా హరిత కార్యక్రమాల అమలులో ముందంజ దిశగా భారత్ నిబద్ధతను ఆయన నొక్కిచెప్పారు. ఈ పరిస్థితుల నడుమ భారత-ఆస్ట్రియా అంకుర సంస్థల వారధి గణనీయ ఫలితాలివ్వగలదని ఆశాభావం వెలిబుచ్చారు. దీనికి సంబంధించి ఉభయ దేశాలూ ఒక సంయుక్త హ్యాకథాన్ నిర్వహించాలని ప్రధాని సూచించారు. దేశంలో డిజిటల్ పౌరసేవా మౌలిక సదుపాయాల రంగం సాధించిన విజయాన్ని, అనుసంధాన-రవాణా మెరుగుకు చేపట్టిన చర్యలను కూడా ఆయన విశదీకరించారు.
ఇటువంటి శక్తిసామర్థ్యాల దృష్ట్యా భారత్ నిర్మించిన ఆర్థిక వేదికను ఆస్ట్రియాలోని అగ్రగామి సంస్థలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆ మేరకు ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద తక్కువ వ్యయంతో అత్యుత్తమ నాణ్యతగల ఉత్పత్తుల తయారీ చేపట్టాలని కోరారు. తద్వారా జాతీయ-అంతర్జాతీయ విపణులలో ప్రభావశీల విస్తరణ దిశగా ప్రపంచ సరఫరా శ్రేణి గమ్యంగానూ భారత్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సెమి-కండక్టర్లు, వైద్య ఉపకరణాలు, సౌర విద్యుత్ ఘటాలు (సోలార్ పివి సెల్స్) వంటి రంగాల్లో అంతర్జాతీయ తయారీ సంస్థలను ఆకర్షించేందుకు ఉద్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పిఎల్ఐ) భారత్ అమలు చేస్తున్నదని ఆయన తెలిపారు. భారత ఆర్థిక శక్తిసామర్థ్యాలు-నైపుణ్యం, ఆస్ట్రియా సాంకేతిక పరిజ్ఞానం రెండు దేశాల్లో వాణిజ్యం, వృద్ధి, స్థిరత్వాలకు సహజ భాగస్వాములు కాగలవని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
భారత్లో పెట్టుబడి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంతోపాటు దేశ అద్భుత ప్రగతి చరిత్రలో భాగస్వాములు కావాల్సిందిగా ఆస్ట్రియా వాణిజ్య సంస్థలకు ప్రధానమంత్రి ఆహ్వానం పలికారు.
***
Boosting business ties!
— PMO India (@PMOIndia) July 10, 2024
PM @narendramodi and Chancellor @karlnehammer met business leaders from India and Austria. They discussed ways to promote innovation and explore opportunities for collaboration in various sectors. pic.twitter.com/VV7xorvlW0
Met business leaders from India and Austria. Our nations are confident of leveraging the many opportunities ahead to boost commercial and trade linkages. pic.twitter.com/PZnEJpvJ1I
— Narendra Modi (@narendramodi) July 10, 2024
Ein Treffen mit Wirtschaftsführern aus Indien und Österreich. Unsere Länder sind zuversichtlich, dass sie die zahlreichen Möglichkeiten, die sich ihnen bieten, nutzen können, um ihre Handelsbeziehungen zu stärken. pic.twitter.com/lA86poQVBD
— Narendra Modi (@narendramodi) July 10, 2024