Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వేసవి కాలంలో ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధతపై ప్రధాని సమీక్ష


దేశవ్యాప్తంగా వడగాడ్పుల ముప్పు ఎదురుకానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ తన అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధతను స‌మీక్షించారు.

   ఈ సందర్భంగా 2024 ఏప్రిల్ నుంచి జూన్ మాసం దాకా వేసవి ఉష్ణోగ్రతలపై అంచనాలతోపాటు వడగాడ్పుల సమయంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సాధారణ స్థాయికన్నా గరిష్ఠంగా నమోదుకాగల అవకాశం గురించి ఉన్నతాధికారులు ప్రధానమంత్రికి సమగ్ర వివరణ ఇచ్చారు. ముఖ్యంగా మధ్య భారతం, పశ్చిమ ద్వీపకల్ప ప్రాంతాల్లో ఈ ప్రభావం అత్యధికంగా ఉంటుందని వారు తెలిపారు.

   ఈ సమావేశంలో భాగంగా దేశవ్యాప్త ఆరోగ్య రంగ సన్నద్ధతపైనా ప్రధానమంత్రి సమీక్షించారు. ప్రత్యేకించి వేసవిలో అత్యవసరమైన మందులు, నరాలద్వారా ఇచ్చే ద్రవౌషధాలు, ఐస్ ప్యాక్‌లు, ‘ఒఆర్ఎస్’సహా తాగునీటిపరంగానూ సంసిద్ధతపై ఆయన ఆరాతీశారు.

   టెలివిజన్, రేడియో, సామాజిక మాధ్యమాలు వగైరా వేదికలన్నిటినీ సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని ఆదేశించారు. ముఖ్యంగా సకాలంలో అత్యవసర సమాచారం చేరవేత అవసరాన్ని నొక్కిచెప్పారు. ఈ మేరకు అవగాహన కల్పన సరంజామాను ప్రత్యేకించి ప్రాంతీయ భాషలలోకి అనువాదం ద్వారా విస్తృత వ్యాప్తికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దేశంలో ఒకవైపు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయని, మరోవైపు 2024 వేసవి సాధారణంకన్నా గరిష్ఠ ప్రభావం చూపనుందని అంచనాలు పేర్కొంటున్నట్లు ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, ‘ఎన్‌డిఎంఎ’ ఎప్పటికప్పుడ జారీచేసే సలహాలు, సూచనలను ప్రాంతీయ భాషల్లోకి అనువదించి, ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు.

   ప్రభుత్వ సంపూర్ణ సన్నద్ధత విధానాన్ని తప్పక అనుసరించాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయుల్లోని అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు సంపూర్ణ సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు. అలాగే ఆస్పత్రుల్లో తగిన సన్నద్ధతతో పాటు అవగాహన కల్పన కార్యక్రమాలు కూడా చేపట్టాల్సి ఉందని ప్రధాని నొక్కిచెప్పారు. అంతేకాకుండా అడవులలో రేగే కార్చిచ్చు ముప్పును త్వరితగతిన గుర్తించి తక్షణం మంటలు ఆర్పాల్సిన ఆవశ్యకతను ఆయన స్పష్టం చేశారు.

   ఈ సమావేశంలో ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శితోపాటు హోంశాఖ కార్యదర్శి సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు, భారత వాతావరణ విభాగం (ఐఎండి), జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డిఎంఎ) అధికారులు కూడా పాల్గొన్నారు.

***