సంత్ శిరోమణి ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహరాజ్ జీ సమాధిని పొంది మనందరినీ విషాదంలో ముంచెత్తారు. లోతైన జ్ఞానం, ఎల్ల లెరుగని దయ , మానవాళిని ఉద్ధరించాలన్న అచంచలమైన నిబద్ధతతో ఆయన జీవితం ఆధ్యాత్మికంగా సుసంపన్నం అయింది. అనేక సందర్భాల్లో ఆయన ఆశీస్సులు అందుకున్న గౌరవం నాకు దక్కింది. అందువలన, నాతో సహా లెక్కలేనన్ని ఆత్మలకు మార్గాన్ని ప్రకాశవంతం చేసిన మార్గదర్శక కాంతిని కోల్పోయినట్లుగా నేను తీవ్రమైన లోటును అనుభవిస్తున్నాను. ఆయన అనురాగం, ఆప్యాయత, ఆశీస్సులు కేవలం సుహృద్భావ సంకేతాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక శక్తిని ప్రసరింపజేసి, ఆయనతో సన్నిహితంగా మెలిగిన అదృష్టవంతులందరినీ శక్తివంతం చేసి, స్ఫూర్తిదాయకంగా నిలిచాయి.
జ్ఞానం, కరుణ, సేవ కలిగిన త్రివేణిగా పూజ్య ఆచార్య జీ ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన నిజమైన తపస్వి, ఆయన జీవితం భగవాన్ మహావీర్ ఆదర్శాలకు ప్రతీక. ఆయన జీవితం జైన మతం మూల సూత్రాలకు ఉదాహరణగా నిలిచింది, దాని ఆదర్శాలను తన స్వంత చర్యలు, బోధనల ద్వారా ప్రతిబింబింప చేశారు. సకల జీవరాశులపట్ల ఆయనకున్న శ్రద్ధ జైన మతానికి జీవితం పట్ల ఉన్న అమితమైన గౌరవానికి అద్దం పట్టింది. ఆలోచనలో, మాటలో, చేతల్లో నిజాయితీకి జైన మతం ఇచ్చిన ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తూ ఆయన నిజాయతీతో కూడిన జీవితాన్ని గడిపారు. ఆయన చాలా సరళమైన జీవనశైలిని కూడా అనుసరించారు. జైనమతం, భగవాన్ మహావీర్ జీవితం నుంచి ప్రపంచం ప్రేరణ పొందడానికి ఆయన వంటి మహానుభావులే కారణం. జైన సామాజిక వర్గంలో ఆయన ఉన్నత స్థానంలో నిలిచినప్పటికీ ఆయన ప్రభావం, పలుకుబడి కేవలం ఒక సామాజిక వర్గానికే పరిమితం కాలేదు. మతాలు, ప్రాంతాలు, సంస్కృతులకు అతీతంగా ప్రజలు ఆయన వద్దకు వచ్చారు. ఆధ్యాత్మిక జాగృతికి, ముఖ్యంగా యువతలో ఆధ్యాత్మిక జాగృతికి ఆయన అవిశ్రాంతంగా కృషి చేశారు.
విద్య ఆయన హృదయానికి చాలా దగ్గరైన రంగం. విద్యాధర్ (ఆయన చిన్ననాటి పేరు) నుండి విద్యాసాగర్ వరకు ఆయన ప్రయాణం విజ్ఞానాన్ని సంపాదించడం, అందించడంలో లోతైన నిబద్ధతతో కూడుకున్నది. న్యాయమైన, విజ్ఞానవంతమైన సమాజానికి విద్య మూలస్తంభమని ఆయన ప్రగాఢ విశ్వాసం. వ్యక్తులను శక్తివంతం చేయడానికి, లక్ష్యం, సహకారంతో కూడిన జీవితాలను గడపడానికి వీలు కల్పించే సాధనంగా జ్ఞానం లక్ష్యాన్ని అతను సమర్థించాడు.
న్యాయమైన మరియు జ్ఞానోదయమైన సమాజానికి విద్య మూలస్తంభమని అతని దృఢ విశ్వాసం. విద్యను వ్యక్తులకు సాధికారత కల్పించి ఒక ప్రయోజనం, సేవాభావం తో జీవితం గడిపేందుకు దోహదపడే సాధనంగా ఆయన భావించారు. వారి బోధనలు స్వీయ-అధ్యయనం , స్వీయ-అవగాహన ప్రాముఖ్యతను నిజమైన విజ్ఞానానికి మార్గాలుగా నొక్కిచెప్పాయి, జీవితకాల అభ్యాసం, ఆధ్యాత్మిక ఎదుగుదలలో నిమగ్నం కావాలని వారి అనుచరులను ప్రబోధించాయి.
అదే సమయంలో, మన సాంస్కృతిక విలువలతో ముడిపడి ఉన్న విద్యను మన యువత పొందాలని సంత్ శిరోమణి ఆచార్య విద్యాసాగర్ జీ మహరాజ్ జీ ఆకాంక్షించారు. నీటి ఎద్దడి వంటి కీలక సవాళ్లకు పరిష్కారం కనుగొనలేక పోయామని, గతం నుంచి నేర్చుకున్న పాఠాలకు దూరంగా ఉండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన తరచూ చెప్పేవారు. సంపూర్ణ విద్య అనేది నైపుణ్యం నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించేదని ఆయన విశ్వసించారు. భారతదేశ భాషా వైవిధ్యం పట్ల ఆయన ఎంతో గర్వపడ్డారు. భారతీయ భాషలను నేర్చుకోవడానికి యువతను ప్రోత్సహించారు.
పూజ్య ఆచార్య జీ స్వయంగా సంస్కృతం, ప్రాకృతం, హిందీలో విస్తృతంగా రచనలు చేశారు. ఒక సాధువుగా ఆయన చేరుకున్న శిఖరాలు, భూమిపై ఆయన ఎంత నిలదొక్కుకున్నారో ఆయన ప్రతిష్ఠాత్మక రచన ‘మూక్మతి’లో స్పష్టంగా కనిపిస్తుంది. తన రచనల ద్వారా అణగారిన వర్గాలకు గళం అందించారు.
ఆరోగ్య సంరక్షణ రంగంలో కూడా పూజ్య ఆచార్య జీ చేసిన కృషి చిరస్మరణీయం. ముఖ్యంగా నిరుపేదల నివాస ప్రాంతాల్లో ఆయన అనేక ప్రయత్నాల్లో పాలుపంచుకున్నారు. ఆరోగ్య సంరక్షణ పట్ల ఆయన విధానం సంపూర్ణమైనది, శారీరక శ్రేయస్సును ఆధ్యాత్మిక శ్రేయస్సుతో మిళితం చేస్తుంది, తద్వారా వ్యక్తి మొత్తం అవసరాలను తీర్చింది.
సంత్ శిరోమణి ఆచార్య శ్రీ విద్యాసాగర్ జీ మహరాజ్ జీ దేశ నిర్మాణం పట్ల చూపిన నిబద్ధత గురించి రాబోయే తరాలు విస్తృతంగా అధ్యయనం చేయాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. పక్షపాత ఆలోచనలకు అతీతంగా జాతీయ ప్రయోజనాలపై దృష్టి సారించాలని ఆయన ప్రజలను ఎల్లప్పుడూ కోరేవారు. ప్రజాస్వామ్య ప్రక్రియల్లో భాగస్వామ్య వ్యక్తీకరణగా భావించిన ఆయన ఓటును బలంగా విశ్వసించేవారిలో ఒకరు. ఆయన ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన రాజకీయాలను సమర్థించారు, విధాన రూపకల్పన ప్రజా సంక్షేమం గురించి ఉండాలి కానీ స్వప్రయోజనాల గురించి కాదు (లోక్ నీతి లోక్ సంగ్రహ్ గురించి కాని లోభ్ సంగ్రహ్ గురించి) అని చెప్పారు.
పౌరుల తమ పట్ల, తమ కుటుంబాల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల బాధ్యతల విషయంలో తన పౌరుల నిబద్ధత పునాదులపై ఒక బలమైన దేశం నిర్మితమవుతుందని ఆయన విశ్వసించారు.
నిజాయితీ, చిత్తశుద్ధి, స్వావలంబన వంటి సుగుణాలను పెంపొందించుకోవాలని ఆయన వ్యక్తులను ప్రోత్సహించారు, ఇది న్యాయమైన, దయగల, అభివృద్ధి చెందుతున్న సమాజ నిర్మాణానికి అవసరమని ఆయన భావించారు. మనం వికసిత్ భారత్ నిర్మాణం కోసం కృషి చేస్తున్నందున విధుల పట్ల ఈ ప్రాధాన్యత చాలా ముఖ్యం.
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ క్షీణత విపరీతంగా ఉన్న ఈ కాలంలో, పూజ్య ఆచార్య జీ ప్రకృతికి కలిగే హానిని తగ్గించే జీవన విధానానికి పిలుపునిచ్చారు. అదేవిధంగా, మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైన పాత్రను ఆయన చూశారు, వ్యవసాయాన్ని ఆధునికంగా, సుస్థిరంగా మార్చాలని కూడా నొక్కి చెప్పారు. జైలు ఖైదీల సంస్కరణకు ఆయన చేసిన కృషి కూడా చెప్పుకోదగినది.
వేల సంవత్సరాలుగా మన నేల ఇతరులకు వెలుగులు చూపించి మన సమాజాన్ని బాగు చేసిన మహానుభావులను అందించింది. సాధువులు, సంఘ సంస్కర్తల ఈ మహోన్నత వంశంలో పూజ్య ఆచార్య జీ మహోన్నత వ్యక్తిగా నిలుస్తారు. ఆయన ఏం చేసినా వర్తమానం కోసమే కాకుండా భవిష్యత్తు కోసం కూడా చేసేవారు. గత ఏడాది నవంబర్ లో ఛత్తీస్ గఢ్ లోని డోంగర్ గఢ్ లోని చంద్రగిరి జైన మందిరాన్ని సందర్శించే అవకాశం నాకు లభించింది. అప్పటి పూజ్య ఆచార్య జీ సందర్శన నా చివరి సమావేశం అవుతుందని నాకు తెలియదు. ఆ క్షణాలు చాలా ప్రత్యేకమైనవి. ఆయన నాతో చాలాసేపు మాట్లాడి, దేశానికి సేవ చేయడంలో నేను చేసిన కృషిని ఆశీర్వదించారు. మన దేశం తీసుకుంటున్న దిశ, ప్రపంచ వేదికపై భారత్ కు లభిస్తున్న గౌరవం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తాను చేస్తున్న పని గురించి మాట్లాడేటప్పుడు ఉత్సాహం చూపించారు. అప్పుడు, ఎప్పుడూ, వారి సున్నితమైన చూపులు, నిర్మలమైన చిరునవ్వు శాంతి , సేవా భావనను కలిగించడానికి సరి పోతాయి. ఆయన ఆశీస్సులు మనసుకు ఓదార్పునిచ్చే ఔషధంలా, మనలోని, చుట్టుపక్కల ఉన్న దైవిక ఉనికిని గుర్తు చేస్తాయి.
సంత్ శిరోమణి ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహరాజ్ జీ లేని లోటును ఆయన గురించి తెలిసిన వారు, ఆయన బోధనలు, జీవితం స్పృశించినవారు శూన్యంగా భావిస్తారు. అయితే, ఆయన వల్ల స్ఫూర్తి పొందిన వారి హృదయాల్లో వారు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన జ్ఞాపకాలను గౌరవించడంలో, వారు బోధించిన విలువలను ప్రతిబింబించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఈ విధంగా, మనం ఒక గొప్ప ఆత్మకు నివాళులు అర్పించడమే కాకుండా, మన దేశం, ప్రజల కోసం ఆయన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తాము.
****