గౌరవనీయులు, మహిళామణులు/పురుషపుంగవులందరికీ నమస్కారం!
అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఇఎ) సచివుల సమావేశంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ నా శుభాభినందనలు. ఇవాళ ‘ఐఇఎ’ స్వర్ణోత్సవాలు (50వ వార్షికోత్సవం) నిర్వహించుకోవడం విశేషం. ఈ మైలురాయిని అందుకున్నందుకు అభినందనలు… ఈ సమావేశానికి సహాధ్యక్షత వహిస్తున్న ఐర్లాండ్, ఫ్రాన్స్ దేశాలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా!
భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ. సుస్థిర వృద్ధికి ఇంధన భద్రత, స్థిరత్వం అవసరం. ఒక దశాబ్ద కాలంలో మేము 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయి నుంచి 5వ స్థానానికి దూసుకొచ్చాం. అదే సమయంలో మా సౌరశక్తి స్థాపిత సామర్థ్యం 26 రెట్లు పెరిగింది! మా పునరుత్పాదక ఇంధన స్థాపిత సామర్థ్యం కూడా రెట్టింపైంది. ఈ విషయంలో మన పారిస్ ఒప్పందం నిర్దేశాలను గడువుకన్నా ముందే అధిగమించాం.
మిత్రులారా!
ప్రపంచ జనాభాలో 17 శాతం మంది భారత్లోనే నివసిస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద విద్యుత్ సౌలభ్య కల్పన కార్యక్రమాలలో కొన్నింటిని మేము అమలు చేస్తున్నాం. అయినప్పటికీ, మా దేశంలో కర్బన్ ఉద్గారాలు మొత్తం ప్రపంచ సగటుతో పోలిస్తే కేవలం 4 శాతమే. అయినప్పటికీ, వాతావరణ మార్పులను ఎదుర్కొనే దిశగా చర్యలు చేపట్టడానికి మేం దృఢంగా కట్టుబడి ఉన్నాం. మాది ముందుచూపుతో కూడిన సమష్టి విధానం. అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఎ) వంటి కార్యక్రమాలకు భారత్ ఇప్పటికే నాయకత్వం వహించింది. అలాగే మా ‘మిషన్ లైఫ్’ కార్యక్రమం కూడా సమష్టి ప్రభావం దిశగా భూగోళ హిత జీవనశైలి పద్ధతులపై దృష్టి సారిస్తుంది. ఆ మేరకు ‘రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్’ అనేది భారత సంప్రదాయ జీవన విధానంలో భాగం. భారత జి-20 అధ్యక్షత కూడా ఈ విషయంలో కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా ప్రపంచ జీవ ఇంధన కూటమికి శ్రీకారం చుట్టం కూడా ఈ ముఖ్యాంశాలలో ఒకటిగా ఉంది. ఈ కార్యక్రమాలకు మద్దతిఇచ్చినందుకు ‘ఐఇఎ’ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా!
ఏ వ్యవస్థలోనైనా సార్వజనీనతే విశ్వసనీయత, సామర్థ్యాలను ఇనుమడింపజేస్తుంది. ఆ మేరకు 140 కోట్లమంది భారతీయులు ప్రతిభ, సాంకేతికత, ఆవిష్కరణలను ముందుకు నడిపిస్తున్నారు. ప్రతి కార్యక్రమానికి తగిన స్థాయి, వేగం, పరిమాణం, నాణ్యతలను మేం విజయవంతంగా చేకూరుస్తాం. ఈ విషయంలో భారత్ నిర్ణయాత్మక పాత్ర పోషించడంద్వారా ‘ఐఇఎ’కి కూడా ప్రయోజనం కలుగుతుందని నా దృఢ విశ్వాసం. ఈ నేపథ్యంలో ‘ఐఇఎ’ సచివుల స్థాయి సమావేశం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పటికేగల భాగస్వామ్యాలను బలోపేతం చేయడంతోపాటు కొత్తవి ఏర్పరచుకోవడానికి ఈ వేదికను సద్వినియోగం చేసుకుందాం. స్వచ్ఛమైన, పచ్చదనం నిండిన ప్రపంచాన్ని నిర్మించుకుందాం!
ధన్యవాదాలు
అనేకానేక ధన్యవాదాలు
***
Sharing my remarks at the International Energy Agency’s Ministerial Meeting. https://t.co/tZrgrjdkJC
— Narendra Modi (@narendramodi) February 14, 2024