Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘‘వికసిత్ భారత్, వికసిత్ గుజరాత్’’ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

‘‘వికసిత్  భారత్, వికసిత్ గుజరాత్’’ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘‘వికసిత్  భారత్ వికసిత్  గుజరాత్’’ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా గుజరాత్ లోని విభిన్న ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్  యోజన (పిఎంఏవై), ఇతర గృహ నిర్మాణ పథకాల కింద నిర్మించతలపెట్టిన, పూర్తయిన 1.3 లక్షలకు పైగా ఇళ్లకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఆవాస్ యోజన లబ్ధిదారులతో ఆయన సంభాషించారు. 

ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వారినుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ గుజరాత్ లోని ప్రతీ ప్రాంతానికి చెందిన వారు గుజరాత్  అభివృద్ధితో అనుసంధానం కావడం పట్ల హర్షం ప్రకటించారు. తాను ఇటీవల 20 సంవత్సరాలు పూర్తయిన వైబ్రెంట్ గుజరాత్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ భారీ స్థాయిలో పెట్టుబడుల ఆకర్షణకు నిర్వహించిన వైబ్రెంట్ గుజరాత్ నిర్వహణ తీరును ఆయన ప్రశంసించారు. 

ఒక పేదకు సొంత ఇల్లు కలిగి ఉండడం ఉజ్వలమైన భవిష్యత్తుకు హామీ అని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. కాని కాలం గడుస్తోంది, కుటుంబాలు పెరుగుతున్నాయి అంటూ అందుకే నేడు మరో 1.25 లక్షల కొత్త ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసినట్టు ప్రధానమంత్రి చెప్పారు. అలాగే నేడు కొత్తగా ఇళ్లు పొందిన వారందరికీ అభినందనలు తెలియచేశారు. ఇంత భారీ పరిధి గల పని పూర్తయిరనప్పుడు ‘‘మోదీ కీ గ్యారంటీ’’ అంటే ఆకాంక్షల సాకారానికి గ్యారంటీ’’ అని జాతి చెబుతూ ఉంటుందని శ్రీ మోదీ అన్నారు.  

రాష్ర్టంలోని 180కి పైగా ప్రాంతాల ప్రజలతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం నిర్వహణను ప్రధానమంత్రి ప్రశంసించారు. ‘‘ఇంత భారీ సంఖ్యలో వచ్చిన మీ అందరి ఆశీస్సులు మా సంకల్పాన్ని మరింత పటిష్ఠం చేస్తాయి’’ అన్నారు. ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి గురించి గుర్తు చేస్తూ ఒక్కో చుక్కకు మరింత పంట, డ్రిప్ ఇరిగేషన్ వంటి కార్యక్రమాలు బనస్కాంత, మెహ్సానా, అంబాజీ, పటాన్ ప్రాంతాల్లో వ్యవసాయానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. అంబాజీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు తీర్థయాత్రికుల సంఖ్య పెరిగేందుకు దోహదపడతాయని చెప్పారు. బ్రిటిష్ కాలం నుంచి పెండింగులో ఉన్న అహ్మదాబాద్ నుంచి అబూ రోడ్డు బ్రాడ్ గేజ్ లైన్ తో భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 

వద్  నగర్ గ్రామం గురించి మాట్లాడుతూ ఇటీవల ఇక్కడ బయటపడిన 3000 సంవత్సరాల క్రితం నాటి పురాతన కళాఖండాలు పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు. హట్కేశ్వర్, అంబాజీ, పటాన్, తరంగజి వంటి ప్రదేశాలు, ఉత్తర గుజరాత్ ప్రాంతం రాష్ర్టంలోని ఐక్యతా విగ్రహం తరహాలో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని చెప్పారు.

నవంబరు, డిసెంబరు, జనవరి నెలల్లో విజయవంతంగా నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర గురించి ప్రస్తావిస్తూ ఈ యాత్ర సందర్భంగా మోదీ గ్యారంటీ వాహనం దేశంలోని  లక్షలాది గ్రామాలను చుట్టివచ్చిందని చెప్పారు. గుజరాత్ నుంచి కూడా కోట్లాది మంది ప్రజలు ఈ యాత్రతో అనుసంధానమై ఉన్నారన్నారు. దేశంలో 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి వెలుపలికి తీసుకురావడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ఆయన కొనియాడారు. విబిన్న పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడం, అందుబాటులో ఉన్న నిధిని సమర్థవంతంగా నిర్వహించడం, పథకాలకు అనుగుణంగా వారి జీవితాలను తీర్చిదిద్ది తద్వారా పేదరికం నుంచి బయటపడేందుకు సహాయం చేయడం వంటి ప్రయత్నాలను ప్రశంసించారు. లబ్ధిదారులు ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడంతో పాటు పేదరికాన్ని నిర్మూలించేందుకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. లబ్ధిదారులతో అంతకు ముందు తాను సంభాషించిన విషయం గుర్తు చేసుకుంటూ కొత్త ఇళ్లు లభించడంతో వారిలో ఆత్మవిశ్వాసం ఇనుమడించడాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. 

‘‘నేటి కాలం చరిత్ర లిఖించే కాలం’’ అని ప్రధానమంత్రి పేర్కొంటూ ప్రస్తుత కాలాన్ని స్వదేశీ ఉద్యమం, క్విట్ ఇండయా ఉద్యమం, దండి యాత్ర కాలంతో పోల్చారు. నాడు ప్రతీ ఒక్క పౌరుని లక్ష్యం స్వాతంత్ర్య సాధనేనన్నారు. నేడు వికసిత్ భారత్ సృష్టి కూడా అదే తరహా సంకల్పంగా మారిందని చెప్పారు. ‘‘రాష్ర్టాన్ని పురోగమన పథంలో నడిపించడం ద్వారా జాతీయాభివృద్ధి సాధన’’ గుజరాత్ ఆలోచనా ధోరణి అని పేర్కొంటూ వికసిత్  భారత్ కార్యక్రమంలో భాగంగనే నేడు వికసిత్ గుజరాత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 

పిఎం ఆవాస్  యోజనలో గుజరాత్ నెలకొల్పిన రికార్డుల గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ రాష్ర్టంలోని పట్టణ ప్రాంతాల్లో 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం జరిగిందని చెప్పారు. అలాగే పిఎం ఆవాస్-గ్రామీణ్  కింద గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షలకు పైగా ఇళ్లు నిర్మించనట్టు తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యతను, వేగాన్ని పెంచేందుకు ఆధునిక టెక్నాలజీని ప్రవేశపెట్టినట్టు చెప్పారు. లైట్ హౌస్ ప్రాజెక్టు కింద 1100 ఇళ్లు నిర్మించినట్టు ఆయన తెలిపారు.

2014 ముందు కాలంతో పోల్చితే పేదలకు ఇళ్ల నిర్మాణం మరింత వేగంగా జరుగుతున్నదని ప్రధానమంత్రి శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. 2014 సంవత్సరానికి ముందు కాలంలో పేదల ఇళ్ళ నిర్మాణానికి అరకొర నిధులే అందుబాటులో ఉండేవని, దీనికి తోడు కమిషన్ల రూపంలో లీకేజిలుండేవని ప్రధానమంత్రి చెప్పారు. అందుకు భిన్నంగా నేడు పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.2.25 లక్షల కోట్ల కన్నా పైబడిన నిధులు అందుబాటులో ఉంచడంతో పాటు మధ్యదళారులకు ఆస్కారం లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే నిధులు బదిలీ చేస్తున్నట్టు తెలిపారు. నేడు ప్రజలకు తమ అవసరాలకు దీటుగా ఇల్లు నిర్మించుకునే స్వేచ్ఛ ఉన్నదని, దానికి తోడు మరుగుదొడ్డి, కుళాయి నీటి కనెక్షన్లు, విద్యుత్ సరఫరా, గ్యాస్ కనెక్షన్లు అన్నీ లభిస్తున్నాయని ఆయన తెలిపారు. ‘‘ఈ సదుపాయాలన్నీ పేదలు తమ సొమ్ము ఆదా చేసుకునేందు ఉపయోగపడుతున్నాయి’’ అన్నారు. అంతే కాదు నేడు మహిళలనే ఇంట యజమానులుగా చేస్తూ వారి పేరు మీదనే ఇళ్లను రిజిస్టర్  చేస్తున్నట్టు చెప్పారు. 

యువకులు, కిసాన్, మహిళలు, పేదలే వికసిత్ భారత్ కు నాలుగు ప్రధాన మూలస్తంభాలు అని గుర్తు చేస్తూ వారిని సాధికారం చేయడమే ప్రభుత్వ అత్యధిక కట్టుబాటు అని ప్రధానమంత్రి చెప్పారు. ‘‘పేదలు’’ అంటే అన్ని వర్గాలలోని వారు పరిగణనలోకి వస్తారన్నారు. పథకాల ప్రయోజనాలు ఎలాంటి వివక్ష లేకుండా లబ్ధిదారులందరికీ చేరుతున్నాయని చెప్పారు. ‘‘ఏ విధమైన గ్యారంటీ లేని వారందరికీ మోదీ గ్యారంటీగా నిలుస్తున్నారు’’ అని ఆయన స్పష్టం చేశారు. ముద్ర పథకం కింద ఏ వర్గానికి చెందిన ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపారవేత్త అయినా హామీ రహిత రుణం పొందుతున్నట్టు ఆయన చెప్పారు. అలాగే విశ్వకర్మలు, వీధి వ్యాపారులకు కూడా ఆర్థిక సహాయం, నైపుణ్య శిక్షణ అందుతున్నట్టు తెలిపారు. ‘‘పేదలకు ఉద్దేశించిన ప్రతీ సంక్షేమ పథకానికి లబ్ధిదారులు దళితులు, ఒబిసిలు, గిరిజన కుటుంబాలే. మోదీ గ్యారంటీ వల్ల ఎవరైనా అధిక ప్రయోజనం పొందారంటే ఈ కుటుంబాల వారే’’ అని ఆయన చెప్పారు.

‘‘లక్షాధికారి దీదీల సృష్టికి మోదీ గ్యారంటీ ఇస్తున్నాడు’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఇప్పటికే జాతి ఒక కోటి మంది లక్షాధికారి దీదీలను సృష్టించిందని, వారిలో కూడా  అధిక శాతం గుజరాత్ మహిళలున్నారని ఆయన వివరించారు. రాబోయే కొద్ది సంవత్సరాల కాలంలో 3 కోట్ల మంది లక్షాధికారి దీదీలను సృష్టించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఇది పేద కుటుంబాలను ఎంతో సాధికారం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో ఆశా, అంగన్  వాడీ కార్యకర్తలకు కూడా ఆయుష్మాన్ భారత్ ప్రయోజనాలు విస్తరించినట్టు చెప్పారు. 
పేదలు, మధ్యతరగతి ప్రజలకు వ్యయాలు తగ్గించడం ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ఉచిత రేషన్, ఆస్పత్రుల్లో తక్కువ వ్యయానికే చికిత్సా సదుపాయాలు, తక్కువ ధరలకే మందులు, అతి తక్కువ మొబైల్ బిల్లులు, ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్లు, విద్యుత్ బిల్లులు తగ్గించేందుకు ఎల్ఇడి బల్బులు వంటి ఉదాహరణలు ఆయన ప్రస్తావించారు. విద్యుత్ బిల్లుల భారం తగ్గించుకోవడంతో పాటు అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్తు ద్వారా ఆదాయం ఆర్జించుకునే అవకాశం కల్పించడం కోసం కోటి ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్ పథకం ప్రకటించిన విషయం ఆయన గుర్తు చేశారు. ఈ పథకం కింద ఆ ఇంటి వారు 300 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా పొందవచ్చునని, దీనికి తోడు వారి వద్ద అదనంగా అందుబాటులో ఉన్న విద్యుత్తును వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పిఎం శ్రీ మోదీ చెప్పారు. మోథేరాలో నిర్మించిన సోలార్ గ్రామం గురించి ప్రస్తావిస్తూ నేడు జాతి అంతటా ఇదే తరహా విప్లవం కనిపిస్తోంది అని పిఎం శ్రీ మోదీ అన్నారు. చౌడు భూముల్లో చిన్న తరహా సోలార్ ప్లాంట్లు, సోలార్  పంప్ ల ఏర్పాటుకు ప్రభుత్వం సహాయం అందిస్తున్నదని చెప్పారు. గుజరాత్ లో ప్రత్యేక ఫీడర్ ద్వారా రైతులకు సోలార్ విద్యుత్ అందించే పని సాగుతున్నదని, దీని కింద రైతులు పగటి సమయంలో ఇరిగేషన్ అవసరాలకు విద్యుత్ పొందవచ్చునని ఆయన తెలిపారు. 

గుజరాత్ ను వాణిజ్య రాష్ర్టంగా గుర్తించారని, దాని అభివృద్ధి యానం పారిశ్రామికాభివృద్ధికి కొత్త ఉత్తేజం కల్పిస్తున్నదని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.  పారిశ్రామిక రాష్ర్టంగా గుజరాత్ యువతకు అసాధారణ అవకాశాలను అందుబాటులో ఉంచుతున్నదన్నారు. గుజరాత్ యువత రాష్ర్టాన్ని ప్రతీ రంగంలోనూ కొత్త శిఖరాలకు చేర్చుతున్నారంటూ ప్రతీ అడుగులోనూ డబుల్ ఇంజన్ ప్రభుత్వం వారికి అవసరమైన మద్దతు ఇస్తుందన్న హామీతో ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు. 

పూర్వాపరాలు
గుజరాత్ లోని బనస్కాంతలో ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా విభిన్న రాష్ర్టాల్లో 180కి పైగా ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. గృహనిర్మాణ పథకం సహా వివిధ పథకాలకు చెందిన వేలాది మంది లబ్ధిదారులు రాష్ర్టవ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. గుజరాత్ ముఖ్యమంత్రి, గుజరాత్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.