విశిష్ట న్యాయ కోవిదులు, అతిథులు, వివిధ దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు, సభకు హాజరైన విజ్ఞులు తదితరులందరికీ నా శుభాభివందనాలు.
మిత్రులారా!
ఈ సదస్సును ప్రారంభించడం నాకెంతో ఆనందదాయకం. ప్రపంచవ్యాప్తంగాగల ప్రముఖ న్యాయకోవిదులు ఈ సదస్సుకు హాజరు కావడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. ఈ సందర్భంగా 140 కోట్ల మంది భారతీయుల తరపున మా అంతర్జాతీయ అతిథులందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను. అద్భుత భారతదేశంలోని ప్రతి అణువునూ ఆమూలాగ్రం ఆస్వాదించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.
మిత్రులారా!
ఆఫ్రికా నుంచి చాలామంది మిత్రులు ఈ సదస్సుకు హాజరయ్యారని నాకు సమాచారం అందింది. ఆఫ్రికా సమాఖ్యతో భారత్‌కు ప్రత్యేక సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో జి-20కి భారత్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నపుడు ఆఫ్రికా సమాఖ్య ఈ కూటమిలో భాగస్వామి కావడంపై మేమెంతో గర్విస్తున్నాం. ఆఫ్రికా ప్రజల ఆకాంక్షలను తీర్చడంలో ఇది ఎంతగానో దోహదం చేస్తుంది.
మిత్రులారా!
నేను కొన్ని నెలలుగా పలు సందర్భాలలో మా న్యాయనిపుణ సోదరులతో సంభాషిస్తూ వస్తున్నాను. ఇందులో భాగంగా కొద్ది రోజుల కిందటే భారత సర్వోన్నత న్యాయస్థానం వజ్రోత్సవాల్లో పాల్గొన్నాను. నిరుడు సెప్టెంబరులో ఇదే ప్రాంగణంలో నిర్వహించిన అంతర్జాతీయ న్యాయవాదుల సమావేశానికీ హాజరయ్యాను. ఇటువంటి పరస్పర సంభాషణలు మన న్యాయ వ్యవస్థల పనితీరుకు పరస్పర పూరకాలుగా తోడ్పడతాయి. అలాగే మెరుగైన, వేగవంతమైన న్యాయ ప్రదానంలో సమస్యల పరిష్కారానికి ఒక అవకాశం కల్పిస్తాయి.
మిత్రులారా!
భారతీయ దృక్పథంలో న్యాయానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వబడింది. ప్రాచీన భారతీయ మేధావులు ‘‘న్యాయమూలమ్ స్వరాజ్యం స్యాత్’’ అని ప్రబోధించారు. అంటే- ‘స్వతంత్ర స్వపరిపాలనకు న్యాయమే మూలం’ అని అర్థం. న్యాయంలేనిదే దేశం ఉనికిని ఊహించడం కూడా అసాధ్యం.
మిత్రులారా!
ఈ సదస్సు ‘‘న్యాయ ప్రదానంలో సీమాంతర సవాళ్లు’’ ఇతివృత్తంగా నిర్వహించబడుతోంది. అత్యంత అనుసంధానిత, శరవేగ పరివర్తనాత్మక ప్రపంచంలో ఇదెంతో సందర్భోచిత అంశం. కొన్నిసార్లు ఒక దేశంలో న్యాయ నిర్ధారణ కోసం ఇతర దేశాలతో కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఆ విధంగా మనం సహకరించుకుంటే మన వ్యవస్థలను పరస్పరం చక్కగా అర్థం చేసుకోగలం. ఆ మేరకు లోతైన అవగాహన అత్యున్నత సమన్వయానికి తోడ్పడుతుంది. మెరుగైన సమన్వయంతో న్యాయ ప్రదాన వేగం కూడా పెరుగుతుంది. కాబట్టి, తరచూ ఇటువంటి సదస్సులు, సమావేశాలు నిర్వహించుకోవడం ఎంతో ముఖ్యం.
మిత్రులారా!
మా వ్యవస్థలు ఇప్పటికే వివిధ రంగాల్లో పరస్పర సహకారంతో పనిచేస్తున్నాయి. గగనతల, సముద్ర రాకపోకల నియంత్రణ దీనికొక ఉదాహరణ. అదేతరహాలో మనం దర్యాప్తు-న్యాయప్రదానం విషయంలోనూ సహకారం విస్తరించాలి. పరస్పర అధికార పరిధిని గౌరవించుకుంటూ ఈ సంయుక్త కృషిని కొనసాగించవచ్చు. మనమంతా సమష్టిగా పనిచేస్తే న్యాయస్థానం జాప్యం లేకుండా న్యాయాన్ని అందించగల ఒక సాధనం కాగలదు.
మిత్రులారా!
ఇటీవలి కాలంలో నేరాల స్వభావం, పరిధి సమూలంగా కొత్తరూపు దాలుస్తున్నాయి. నేరగాళ్లు వివిధ దేశాలు, ప్రాంతాల్లో విస్తృత వలయంగా ఏర్పడి నేరాలు పాల్పడుతున్నారు. ఇందుకోసం వారు రెండువైపులా అత్యాధునిక సాంకేతికతను వాడుకుంటున్నారు. ఆ మేరకు ఒక ప్రాంతంలోని ఆర్థిక నేరాలు ఇతర ప్రాంతాల్లో కార్యకలాపాలకు నిధులు సమకూర్చే వనరుగా మారాయి. క్రిప్టోకరెన్సీ పెరుగుదల, సైబర్ బెదిరింపులు వంటివి ఈ తరహా కొత్త సవాళ్లకు నిదర్శనాలు. ఈ 21వ శతాబ్దపు సవాళ్లను 20వ శతాబ్దపు విధానాలతో ఎదుర్కోవడం అసాధ్యం కాబట్టి పునరాలోచన, పునరావిష్కరణ, సంస్కరణల ఆవశ్యకత ఎంతయినా ఉంది. న్యాయప్రదానం చేసే న్యాయ వ్యవస్థల ఆధునికీకరణ కూడా ఇందులో అంతర్భాగం. ఇది మన వ్యవస్థలను మరింత సరళం, సానుకూలం చేయగలదు.
మిత్రులారా!
మనం సంస్కరణల గురించి మాట్లాడుకుంటున్నపుడు- న్యాయ వ్యవస్థలను మరింత పౌర-కేంద్రకం చేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. ‘న్యాయ సౌలభ్యం’ అనేది న్యాయ ప్రదానానికి లో మూలస్తంభం. దీనికి సంబంధించి భారతదేశం నుంచి పంచుకోదగిన అనుభవాలు చాలా ఉన్నాయి. భారతీయులు 2014లో నన్ను ఆశీర్వదించి, ఈ దేశ ప్రధాని బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగానూ నేను పనిచేశాను. అప్పట్లో సాయంత్రం వేళ పనిచేసే కోర్టుల ఏర్పాటుకు నిర్ణయించాం. దీనివల్ల ప్రజలు తమ పని గంటల తర్వాత కోర్టు విచారణకు హాజరు కావడంలో వెసులుబాటు కల్పించింది. తద్వారా న్యాయ ప్రదానంతోపాటు సమయం, డబ్బు ఆదా అయ్యాయి. ఫలితంగా లక్షలాదిగా ప్రజలు లబ్ధి పొందారు.
మిత్రులారా!
భారతదేశంలో లోక్ అదాలత్ అనే విశిష్ట వ్యవస్థ- అంటే… ప్రజా న్యాయస్థానం అనేది అమలవుతోంది. ఈ కోర్టులు ప్రజా వినియోగ సేవల సంబంధిత చిన్న కేసులను పరిష్కరించే యంత్రాంగాన్ని సమకూరుస్తాయి. ఇది వ్యాజ్యానికి ముందు జరిగే ప్రక్రియ కావడంతో ఇలాంటి న్యాయస్థానాలు వేలాది కేసులను పరిష్కరించడమే కాకుండా సులభ న్యాయ ప్రదానానికి భరోసా ఇచ్చాయి. ఇటువంటి వినూత్న చర్యలపై చర్చలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో విలువ ఉంటుంది.
మిత్రులారా!
న్యాయ ప్రదానం ఇనుమడించడంలో న్యాయ విద్య కీలక సాధనం. యువ మేధావులకు అభిరుచి, వృత్తిగత యోగ్యత రెండింటినీ కల్పించేది విద్య. ప్రపంచవ్యాప్తంగా, ప్రతి రంగంలోనూ మహిళలను మరింత ఎక్కువ సంఖ్యలో తీసుకురావడం ఎలాగనే అంశంపై చర్చ సాగుతోంది. ఈ దిశగా విద్యా స్థాయిలోనే ప్రతి రంగాన్నీ సార్వజనీనం చేయడం తొలి దశ. న్యాయ విద్యా సంస్థలలో మహిళల సంఖ్య పెరిగితే, న్యాయవాద వృత్తిలోనూ వారి సంఖ్య పెరుగుతుంది. ఆ మేరకు మహిళలను మరింత ఎక్కువగా న్యాయ విద్యవైపు ఆకర్షించడంపై ఈ సదస్సులో పాల్గొంటున్నవారు తమ అభిప్రాయాలు, ఆలోచనలను పంచుకోవచ్చు.
మిత్రులారా!
వైవిధ్యభరిత అవగాహనగల యువ న్యాయకోవిదులు నేటి ప్రపంచానికి అవసరం. మారుతున్న కాలం, దూసుకెళ్తున్న సాంకేతికతలకు అనుగుణంగా న్యాయ విద్య కూడా ముందంజ వేయడం అవసరం. నేరాలు, దర్యాప్తు, సాక్ష్యాల విషయంలో తాజా పోకడలను అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టడం ఎంతో సహాయకారిగా ఉంటుంది.
మిత్రులారా!
అంతర్జాతీయంగా ఎక్కువ అవగాహనగల యువ న్యాయ నిపుణులకు తోడ్పాటునివ్వాల్సిన అవసరం ఎంతయినా ఉంది. తదనుగుణంగా దేశాల మధ్య ఆదానప్రదానాలను మన అత్యుత్తమ న్యాయ విశ్వవిద్యాలయాలు మరింత బలోపేతం చేయగలవు. ఉదాహరణకు ఫోరెన్సిక్ సైన్స్ సంబంధిత ప్రత్యేక విశ్వవిద్యాలయం ప్రపంచం మొత్తంమీద భారతదేశంలో మాత్రమే ఉంది. కాబట్టి, వివిధ దేశాల విద్యార్థులు, న్యాయశాస్త్ర బోధకులు, న్యాయమూర్తులు కూడా ఇక్కడ చిన్నచిన్న కోర్సులను అధ్యయనం చేయవచ్చు. అలాగే న్యాయ ప్రదానానికి సంబంధించి అనేక అంతర్జాతీయ సంస్థలు కూడా ఉన్నాయి. వర్ధమాన దేశాలు వాటిలో మరింత ప్రాతినిధ్యం పొందడం కోసం సంయుక్తంగా కృషి చేయవచ్చు. అటువంటి సంస్థలలో శిక్షణార్థులుగా చేరడంలో మన విద్యార్థులకు తోడ్పడవచ్చు. ఈ ప్రక్రియలన్నీ మన న్యాయ వ్యవస్థలు అంతర్జాతీయ ఉత్తమాచరణల నుంచి నేర్చుకునేందుకు దోహదం చేస్తాయి.
మిత్రులారా!
భారతదేశం వలసరాజ్యాల పాలన నుంచి న్యాయ వ్యవస్థను వారసత్వంగా పొందింది. అయితే, కొన్నేళ్లుగా మేము దాన్ని అనేక విధాలుగా సంస్కరిస్తూ వస్తున్నాం. వలస పాలన నాటి అనేక కాలం చెల్లిన వేలాది చట్టాలను భారత ప్రభుత్వం రద్దు చేసింది. ఈ చట్టాలలో కొన్ని ప్రజలను వేధించే సాధనాలుగా ఆనాడు ఉపయోగపడ్డాయి. కాబట్టి వాటి రద్దుతో జీవన సౌలభ్యం ఇనుమడించడమేగాక వ్యాపార సౌలభ్యం కూడా పెరిగింది. అదే సమయంలో ప్రస్తుత వాస్తవాలను ప్రతిబింబించేలా చట్టాల ఆధునికీకరణలో భారత్ చురుకైన నిర్ణయాలతో ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 3 కొత్త చట్ట సంహితలు రూపొందించబడ్డాయి. ఆ మేరకు 100 ఏళ్లకుపైగా కొనసాగిన వలసపాలనలోని క్రిమినల్ చట్టాల స్థానంలో కొత్త స్మృతి అమలులోకి వచ్చింది. అంతకుముందు శిక్ష, శిక్షార్హ అంశాలపై మాత్రమే నాటి చట్టాలు దృష్టి సారించేవి. కానీ, ఇప్పుడు వాటితోపాటు బాధితులకు న్యాయం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించబడింది. అందువల్ల, పౌరులకు భయంకన్నా న్యాయ ప్రదానంపై భరోసా ఎక్కువగా ఉంటుంది.
మిత్రులారా!
నానాటికీ వృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం న్యాయ వ్యవస్థలపైనా సానుకూల ప్రభావం చూపగలదు. ఈ నేపథ్యంలో కొన్నేళ్లుగా భారత్ స్థలాల మ్యాప్ రూపొందించడంతోపాటు గ్రామీణఉలకు స్పష్టమైన ఆస్తి కార్డులను అందించే దిశగా డ్రోన్లను ఉపయోగించింది. ఇలా మ్యాపింగ్ చేయడం వల్ల వివాదాలు సమసిపోయి, వ్యాజ్యాల సంఖ్య కూడా తగ్గుతుంది. ఫలితంగా న్యాయ వ్యవస్థ పనిభారం తగ్గి, సామర్థ్యం ఇనుమడిస్తుంది. భారతదేశంలోని అనేక న్యాయస్థానాలు ఆన్‌లైన్ విచారణ చేపట్టడంలో డిజిటలీకరణ ఎంతగానో తోడ్పడింది. ఇది మారుమూల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు న్యాయం పొందడంలో ఎంతగానో సహాయపడింది. దీనికి సంబంధించి భారతదేశం తన విధానాలను ఇతర దేశాలతో పంచుకోవడం సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇతర దేశాల్లోని ఇలాంటి కార్యక్రమాల గురించి తెలుసుకోవడంపై మేము కూడా ఆసక్తి చూపుతున్నాం.
మిత్రులారా!
న్యాయ ప్రదానంలో ఎదురయ్యే ప్రతి సవాలునూ మనం పరిష్కరించవచ్చు.. అయితే, ఈ దిశగా పయనం ఒక ఉమ్మడి విలువతో ప్రారంభమవుతుంది. మనం న్యాయం పట్ల మక్కువను పంచుకోవాలి. ఈ సదస్సు ఇదే స్ఫూర్తిని బలపరుస్తుంది. కాబట్టి, ప్రతి ఒక్కరికీ సకాలంలో న్యాయం లభించే, సమాజంలో ఏ ఒక్కరూ వెనుకబడని ప్రపంచాన్ని నిర్మించుకుందాం రండి!
ధన్యవాదాలు
Addressing the Commonwealth Legal Education Association - Commonwealth Attorney and Solicitors Generals Conference. https://t.co/ZSZTDugogN
— Narendra Modi (@narendramodi) February 3, 2024
India has a special relationship with the African Union.
— PMO India (@PMOIndia) February 3, 2024
We are proud that the African Union became a part of the G20 during India’s presidency.
This will go a long way in addressing the aspirations of the people of Africa: PM @narendramodi
Sometimes, ensuring justice in one country requires working with other countries.
— PMO India (@PMOIndia) February 3, 2024
When we collaborate, we can understand each other’s systems better.
Greater understanding brings greater synergy.
Synergy boosts better and faster justice delivery: PM @narendramodi
21st century challenges cannot be fought with a 20th century approach.
— PMO India (@PMOIndia) February 3, 2024
There is a need to rethink, reimagine and reform: PM @narendramodi
India is also modernizing laws to reflect the present realities.
— PMO India (@PMOIndia) February 3, 2024
Now, 3 new legislations have replaced more than 100-year-old colonial criminal laws: PM @narendramodi
India inherited a legal system from colonial times.
— PMO India (@PMOIndia) February 3, 2024
But in the last few years, we made a number of reforms to it.
For example, India has done away with thousands of obsolete laws from colonial times: PM @narendramodi