ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వికసిత భారత్ సంకల్పయాత్ర లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా సంభాషించారు. దేశవ్యాప్తంగాగల యాత్ర లబ్ధిదారులు కూడా ఇందులో పాలుపంచుకున్నారు. అలాగే కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ముంబైలో ‘సాయి కిన్నర్ పొదుపు స్వయం సహాయ సంఘం’ నిర్వహిస్తున్న లింగమార్పిడి వ్యక్తి కల్పనా బాయితో మాట్లాడారు. మహారాష్ట్రలో లింగమార్పిడి వ్యక్తుల కోసం మొట్టమొదట స్వయం సహాయ సంఘం ఏర్పాటు చేసిన వ్యక్తి కల్పన కావడం గమనార్హం. ఆమె ప్రధానితో ముచ్చటిస్తూ తన జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని తెలిపారు. తమవంటి వారిపై ప్రధానమంత్రి అవగాహనకు, సాదర భావనకు ముందుగా ధన్యవాదాలు తెలిపారు. తమవంటి వారికి జీవితం ఎంతో కఠినంగా ఉంటుందని గుర్తుచేస్తూ- పొదుపు సంఘం ప్రారంభించడానికి ముందు భిక్షాటన చేస్తూ, అస్థిర జీవన పరిస్థితులతో పోరాడాల్సి వచ్చిందని ప్రధానికి చెప్పారు.
ప్రభుత్వ ఆర్థిక సహాయంతో కల్పన తొలుత బుట్టల తయారీని ప్రారంభించారు. పట్టణ జీవనోపాధి కార్యక్రమంతోపాటు, స్వానిధి పథకం కింద ఆమెకు ప్రభుత్వం నుంచి మరింత చేయూత లభించింది. దీంతో ఇడ్లీ-దోసె, పూల వ్యాపారం కూడా నిర్వహిస్తున్నారు. ముంబైలో ప్రతి ఒక్కరికీ సుపరిచితమైన పావ్-భాజీ, వడా-పావ్ వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందంటూ ప్రధాని సరదాగా కల్పనను ఆరా తీసినపుడు అందరూ చిరునవ్వు చిందించారు. ఆమె తన వ్యవస్థాపక చొరవ ద్వారా లింగమార్పిడి వ్యక్తుల జీవన వాస్తవికతపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు కిన్నరల పట్ల ప్రజల్లోగల దురవగాహనను దూరం చేయడంలో చేసిన కృషిని అభినందించారు. తద్వారా సమాజానికి ఆమె చేసిన సేవ ఎంతో గొప్పదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. “కిన్నరులు ఏం చేయగలరో మీరు చేతల్లో చూపించారు’’ అని కల్పనను కొనియాడారు.
కల్పన నేతృత్వంలోని స్వయం సహాయ సంఘం ప్రస్తుతం లింగమార్పిడి వ్యక్తులకు గుర్తింపు కార్డులు అందజేస్తోంది. అలాగే బిచ్చమెత్తడం వదిలి, స్థిరమైన జీవితం దిశగా వ్యాపారం ప్రారంభించేలా ‘పిఎం స్వానిధి’ పథకాలను సద్వినియోగం చేసుకోవడంపై కిన్నర సమాజ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు. ‘మోదీ హామీ వాహనం’ కిన్నర సమాజానికి ఎంతో ఉత్సాహాన్నిచ్చిందని ఆమె ఆనందం వెలిబుచ్చారు. ఈ వాహనం తమ ప్రాంతానికి వచ్చినపుడు తనతోపాటు ఎందరో మిత్రులు కూడా చాలా ప్రయోజనాలు పొందారని తెలిపారు. కల్పన అలుపెరగని స్ఫూర్తికి ప్రధాని మోదీ అభివందనం చేశారు. ఎన్నో సవాళ్లతో కూడిన జీవితం గడిపినప్పటికీ ఇప్పుడామె ఉపాధి ప్రదాతగా మారారని ప్రశంసించారు. ఈ సందర్భంగా ‘‘మా లక్ష్యం అణగారిన వర్గాలకు అండదండగా నిలవడమే’’నని అని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.
***