Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అక్టోబర్‌ 26న మహారాష్ట్ర, గోవాలలో పర్యటించనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ


ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 2023 అక్టోబర్‌ 26న మహారాష్ట్ర, గోవాలలో పర్యటించనున్నారు. 26 వతేదీ మధ్యాహ్నం 1 గంటకు ప్రధానమంత్రి అహ్మద్‌నగర్‌ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం షిర్దీ చేరుకుంటారు. అక్కడ శ్రీ షిర్దీ సాయిబాబా సమాధి మందిరంలో షిర్దీ సాయిబాబాకు పూజలు నిర్వహించి , స్వామివారి దర్శనం చేసుకుంటారు. అక్కడ నూతనంగా నిర్మించిన దర్శనం క్యూ కాంప్లెక్స్‌ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.  మధ్యాహ్నం 2 గంటలకు ప్రధానమంత్రి నీల్‌ వందే డ్యామ్‌ కు జలపూజ నిర్వహిస్తారు. అనంతరం డ్యామ్‌ కాల్వ నెట్‌వర్క్‌ ను జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం 3గంటల 15 నిమిషాలకు ప్రధానమంత్రి షిర్దీలో జరిగే ఒక కార్యక్రమంలో సుమారు 7500 కోట్ల రూపాయల విలువ చేసే పలు ఆరోగ్య, రైలు, రోడ్డు,  చమురు , సహజవాయు సంబంధ రంగాలకు చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం చేసే కార్యక్రమాలు చేపడతారు. సాయంత్రం 6.30 నిమిషాలకు ప్రధానమంత్రి గోవా చేరుకుని, అక్కడ తొలిసారిగా నిర్వహిస్తున్న 37 వ జాతీయ క్రీడలను ప్రారంభిస్తారు.

 

మహారాష్ట్రలో ప్రధానమంత్రి……

ప్రధానమంత్రి ప్రారంభోత్సవం చేసే షిర్దీలోని కొత్త క్యూ కాంప్లెక్స్‌, అత్యంత అధునాతన క్యూకాంప్లెక్స్‌. ఇందులో భక్తులకు అత్యంత సౌకర్యవంతంగా ఉండనుంది. ఇందులో భక్తులు వేచి ఉండేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది.ఏక కాలంలో పదివేలమంది భక్తులు కూర్చునే సదుపాయం కూడా ఉంది. సామాన్లు భద్రపరిచే గది, ఎయిర్‌ కండిషన్డ్‌ సదుపాయాలు, బుకింగ్‌ కౌంటర్లు, టాయిలెట్లు,  సమాచార కేంద్రం, ప్రసాద విక్రయ కేంద్రం ఇందులో ఉన్నాయి. ఈ కొత్త దర్శన్‌ క్యూ కాంప్లెక్స్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.
అలాగే ప్రధానమంత్రి, నిల్‌ వాండే డ్యామ్‌ ఎడమ కాలువ నెట్‌ వర్క్‌ను (85 కిలోమీటర్లు) జాతికి అంకితం చేస్తారు.  ఇది 7 తాలూకాలలో (అహ్మద్‌నగర్‌జిల్లాలోనివి 6, నాసిక్‌జిల్లాలోని 1 తాలూకా) గల 182 గ్రామాలకు పైపు ద్వారా మంచినీటిని సరఫరా చేస్తుంది.  నీల్‌ వాండే డ్యామ్‌ ఆలోచన తొలిసారిగా 1970లో వచ్చింది. దీనిని  రూప 5,177 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్నారు.

ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి, ‘ నమో షేత్కారి  మహాసన్మాన్‌నిధి యోజన’ ను ప్రారంభించనున్నారు. ఈ యోజన మహారాష్ట్రలోని సుమారు 86 లక్షల మంది ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన లబ్ధిదారులకు ప్రయోజనం కలిగించనుంది. ఇది ఏటా వీరికి అదనంగా ఆరువేల రూపాయలు అందేట్టు చూస్తుంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన పర్యటనలో అహ్మద్‌ నగర్‌లో సివిల్‌ ఆస్పత్రిలో ఆయుష్‌ ఆస్పత్రిని జాతికి అంకితం చేస్తారు. అలాగే కురుద్వాడి `లాతూర్‌ రోడ్‌ రైల్వే సెక్షన్‌ (186 కిలోమీటర్ల మార్గం) విద్యుదీకరణను, జల్గాం నుంచి భుసావల్‌ (24.46 కిలోమీటర్లు) వరకు 3వ, 4వ రైల్వే లైను అనుసంధానం, సాంగ్లినుంచి బోరోగామ్‌ సెక్షన్‌లో ఎన్‌ హెచ్‌ `166 (పాకేజ్‌ 1) నాలుగు లైన్లుగా మార్చడం, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ మన్మాడ్‌ టెర్మినల్‌లో అదనపు సదుపాయాల కల్పన వంటి వాటిని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.
అహ్మద్‌ నగర్‌ సివిల్‌ ఆస్పత్రిలో మాతా శిశు ఆరోగ్య విభాగానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి, ఆయుష్మాన్‌ కార్డులను, స్వమిత్వ కార్డులను లబ్ధిదారులకు అందజేయనున్నారు.

 

గోవాలో ప్రధానమంత్రి:

ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ నాయకత్వంలో , దేశంలో క్రీడల సంస్కృతి లో పెనుమార్పులు వచ్చాయి.  ప్రభుత్వ నిరంతర మద్దతుతో , ఆయా క్రీడలలో క్రీడాకారుల పనితీరు అంతర్జాతీయంగా మరింతగా మెరుగుపడిరది. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించేందుకు జాతీయ స్థాయిలో టోర్నమెంట్‌లను నిర్వహించాల్సిన ఆవశ్యకతను గుర్తించడం జరిగింది. అలాగే క్రీడల విషయంలో విశేష ప్రాచుర్యం కల్పించేందుకు, దేశంలో జాతీయస్థాయిలో క్రీడలను నిర్వహించడం జరుగుతోంది.
2023 అక్టోబర్‌ 26 నుంచి నవంబర్‌ 9 వరకు గోవాలో  37 వ జాతీయక్రీడలు జరగనున్నాయి.  అక్టోబర్‌ 26 న జాతీయ స్థాయి క్రీడలను మార్గోవాలోని పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహూ స్టేడియంలో  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.  ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఈ జాతీయ క్రీడోత్సవాలలో పాల్గోనే క్రీడాకారులనుద్దేశించి ప్రసంగించనున్నారు.
గోవాలో జాతీయ స్థాయి క్రీడలు జరగనుండడం ఇదే తొలిసారి. దేశం నలుమూలల నుంచి , సుమారు పదివేలమందికి పైగా క్రీడాకారులు ఈ జాతీయ క్రీడోత్సవాలలో పాల్గొంటున్నారు. 28 క్రీడాప్రాంగణాలలో 43 క్రీడాంశాలలో ఈ క్రీడాకారులు పోటీపడనున్నారు.