Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్ అయిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన మంత్రి ప్రసంగం తెలుగు అనువాదం

చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్ అయిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన  మంత్రి ప్రసంగం తెలుగు అనువాదం


నా ప్రియమైన కుటుంబ సభ్యులారా,

మన కళ్లముందే చరిత్ర ఆవిష్కృతం అయితే  జీవితం ధన్యమవుతుంది. ఇటువంటి చారిత్రక సంఘటనలు ఒక జాతి జీవితానికి శాశ్వత చైతన్యంగా మారతాయి. ఈ క్షణం మరువలేనిది. ఈ క్షణం అపూర్వం. ఈ క్షణం అభివృద్ధి చెందిన భారతదేశ విజయ నినాదం. ఈ క్షణం నవ భారత విజయం. ఈ క్షణం కష్టాల సముద్రాన్ని దాటడమే. ఈ క్షణం విజయపథంలో నడవడమే. ఈ క్షణం 1.4 బిలియన్ హృదయ స్పందనల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ క్షణం భారతదేశంలో కొత్త శక్తిని, కొత్త నమ్మకాన్ని, కొత్త చైతన్యాన్ని సూచిస్తుంది. ఈ క్షణం భారతదేశం అధిరోహించే గమ్యానికి పిలుపు. ఈ ఏడాది ‘అమృత్ కాల్’ ఉదయాన్నే తొలి విజయపు వెలుగును కురిపించింది. మనం భూమిపై ఒక ప్రతిజ్ఞ చేసాము దానిని చంద్రుడిపై నెరవేర్చాము. సైన్స్ రంగం లోని మన సహచరులు కూడా “భారతదేశం ఇప్పుడు చంద్రుడిపై ఉంది” అని చెప్పారు. ఈ రోజు, అంతరిక్షంలో నవ భారతదేశ (న్యూ ఇండియా) కొత్త ప్రయాణాన్ని మనం చూశాము.

మిత్రులారా,

బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు నేను ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్నాను. అయితే, ప్రతి దేశవాసుడిలాగే నా హృదయం కూడా చంద్రయాన్ మిషన్ పైనే కేంద్రీకృతమైంది. కొత్త చరిత్ర ఆవిష్కృతం కావడంతో, ప్రతి భారతీయుడు సంబరాలలో మునిగిపోయాడు,  ప్రతి ఇంటిలో పండుగలు ప్రారంభమయ్యాయి. నా హృదయం నుండి, నేను కూడా నా తోటి దేశస్థులతో , నా కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా కలసి పోయాను. చంద్రయాన్ బృందానికి, ఇస్రోకు, ఈ క్షణం కోసం ఏళ్ల తరబడి అహర్నిశలు శ్రమించిన దేశ శాస్త్రవేత్తలందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఉత్సాహం, ఉత్సాహం, ఆనందం , భావోద్వేగాలతో నిండిన ఈ అద్భుతమైన క్షణంలో  140 కోట్ల దేశ ప్రజలకు కూడా నా అభినందనలు.

నా కుటుంబ సభ్యులారా,

మన శాస్త్రవేత్తల కృషి, ప్రతిభతో ప్రపంచంలో మరే దేశం చేరుకోని చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని భారత్ చేరుకుంది. నేటి నుంచి చంద్రుడికి సంబంధించిన అపోహలు మారిపోతాయి, కథనాలు మారతాయి, కొత్త తరానికి సామెతలు కూడా మారతాయి. భారతదేశంలో, మనం  భూమిని ‘మా‘ అంటే తల్లిగా , చంద్రుడిని మన  ‘మామ’ (మేనమామ) అని పిలుస్తాము. “చందమామ చాలా దూరంలో ఉంది” అని చెప్పేవారు.” అయితే చందమామ కేవలం ఒక ప్రయాణ (టూర్) దూరంలో ఉంది” అని పిల్లలు చెప్పే రోజు వస్తుంది.

మిత్రులారా,

ఈ సంతోషకరమైన సందర్భంలో, నేను ప్రపంచంలోని ప్రజలందరినీ, ప్రతి దేశ ప్రజలను, ప్రాంత ప్రజలను ఉద్దేశించి చెప్పాలని అనుకుంటున్నాను. విజయవంత మైన మూన్ మిషన్ ఒక్క భారత్ దే  కాదు. భారతదేశ జి-20 అధ్యక్ష పదవిని ప్రపంచం చూస్తున్న సంవత్సరం ఇది. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే మన  విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. మనం ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ మానవ కేంద్రీకృత విధానం విశ్వవ్యాప్తంగా స్వాగతించబడింది. మన చంద్ర మిషన్ కూడా అదే మానవ కేంద్రీకృత విధానంపై ఆధారపడి ఉంది. కాబట్టి, ఈ విజయం మానవాళి మొత్తానికి చెందుతుంది. భవిష్యత్తులో ఇతర దేశాలు చేసే చంద్ర యాత్రలకు ఇది తోడ్పడుతుంది. గ్లోబల్ సౌత్ తో సహా ప్రపంచంలోని అన్ని దేశాలు ఇలాంటి విజయాలను సాధించగలవని నేను విశ్వసిస్తున్నాను. మనమందరం చంద్రుని కోసం , అంతకు మించి కోరుకోవచ్చు.

నా కుటుంబ సభ్యులారా,

చంద్రయాన్ మిషన్ సాధించిన ఈ విజయం చంద్రుడి కక్ష్యను దాటి భారతదేశ ప్రయాణాన్ని ముందుకు నడిపిస్తుంది. మనం మన సౌర వ్యవస్థ పరిధులను పరీక్షిస్తాము. ఇంకా మానవాళి విశ్వం లోని అనంత అవకాశాలను గ్రహించడానికి కృషి చేస్తూనే ఉంటాము. భవిష్యత్తు కోసం ఎన్నో పెద్ద, ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. సూర్యుడిపై లోతైన అధ్యయనం కోసం ఇస్రో త్వరలో ‘ఆదిత్య ఎల్ -1’ మిషన్ ను ప్రయోగించనుంది. ఆ తర్వాత శుక్ర (వీనస్) గ్రహం అన్వేషణ మిషన్ కూడా ఇస్రో ఎజెండాలో ఉంది. గగన్ యాన్ మిషన్ ద్వారా దేశం తన మొదటి మానవ అంతరిక్ష యాత్రకు ముమ్మరంగా సన్నద్ధమవుతోంది. ఆకాశమే హద్దు కాదని భారత్ పదేపదే రుజువు చేస్తోంది.

మిత్రులారా,

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మన దేశ ఉజ్వల భవిష్యత్తుకు పునాది. అందువల్ల ఈ రోజును దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఉజ్వల భవిష్యత్తు దిశగా పయనించడానికి ఈ రోజు మనందరికీ స్ఫూర్తినిస్తుంది. ఈ రోజు మన సంకల్పాలను నెరవేర్చే మార్గాన్ని చూపుతుంది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని విజయం ఎలా సాధిస్తారో ఈ రోజు తెలియజేస్తుంది. మరోసారి దేశంలోని శాస్త్రవేత్తలందరికీ హృదయపూర్వక అభినందనలు, భవిష్యత్ మిషన్ లకు శుభాకాంక్షలు…  మరీ మరీ ధన్యవాదాలు.

(గమనిక:  ఇది ప్రధాన మంత్రి ప్రసంగానికి సుమారు అనువాదం. ప్రధాన మంత్రి అసలు ప్రసంగం హిందీలో చేశారు.)

 

***