ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో అంతర్జాతీయ విమానాశ్రయంసహా రూ.860 కోట్ల విలువైన అనేక అభివృద్ధి కార్యక్రమాలను జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులలో సౌనీ యోజన సంధానం-3 ప్యాకేజీలోని 8, 9 దశలు; ద్వారక గ్రామీణ నీటి సరఫరా-పారిశుధ్యం (ఆర్డబ్ల్యూఎస్ఎస్) ఉన్నతీకరణ; ఉపర్కోట్ కోట పరిరక్షణ, పునరుద్ధరణ, అభివృద్ధి ఫేజ్ I, II; నీటిశుద్ధి ప్లాంటు, మురుగు శుద్ధి ప్లాంటు, ఫ్లైఓవర్ వంతెన తదితరాలున్నాయి. కాగా, రాజ్‌కోట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించాక ప్రధాన భవనాన్ని ప్రధాని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ- ఇవాళ రాజ్‌కోట్‌కే కాకుండా సౌరాష్ట్ర ప్రాంతం మొత్తానికీ సుదినమని అభివర్ణించారు. తుపాను, వరదల వంటి ఇటీవలి ప్రకృతి విపత్తుల వల్ల ఈ ప్రాంతంలో సంభవించిన ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేస్తూ ప్రధాని వారికి నివాళి అర్పించారు. ప్రభుత్వం, ప్రజలు సమష్టిగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొన్నారని, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బాధితులకు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ దిశగా ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వానికి కేంద్రం అన్నివిధాలా సహకరిస్తున్నదని గుర్తుచేశారు. సౌరాష్ట్ర వృద్ధి చోదకంగా నేడు రాజ్‌కోట్ గుర్తింపు పొందిందని ప్రధాని అన్నారు. పరిశ్రమలు, సంస్కృతి, వంటకాలకు ప్రాధాన్యం వగైరాలన్నీ ఉన్నప్పటికీ, అంతర్జాతీయ విమానాశ్రయం లేని లోటు ఇవాళ తీరిందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేగా తొలిసారి తనను శానసభకు పంపింది రాజ్‌కోట్ ప్రజలేనని, ఈ నగరం తనకెంతో నేర్పిందని ప్రధాని గుర్తు చేసుకున్నారు. “రాజ్‌కోట్ రుణం ఎన్నటికీ తీర్చలేనిది. కానీ, ఎంతోకొంత తీర్చడానికి నేను సదా ప్రయత్నిస్తుంటాను” అన్నారు.
రాజ్‌కోట్‌లో విమానాశ్రయం ప్రారంభించడాన్ని ప్రస్తావిస్తూ- దీనివల్ల ప్రజలకు ప్రయాణ సౌలభ్యంతోపాటు ఇక్కడి పరిశ్రమలకూ ఎంతో ప్రయోజనం ఉంటుందని ప్రధానమంత్రి అన్నారు. ఒకనాడు రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా తాను కలగన్న ‘మినీ జపాన్’ను రాజ్‌కోట్ సాకారం చేసిందని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడీ నగరానికి విమానాశ్రయం రూపంలో నూతనోత్తేజాన్ని, విమానయాన సదుపాయాన్ని అందించే శక్తికేంద్రం సమకూరిందని పేర్కొన్నారు. అలాగే సౌని యోజన గురించి మాట్లాడుతూ- ఈ పథకం కింద ఇవాళ ప్రారంభించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయితే, ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలకు తాగు-సాగునీటి సదుపాయం కలుగుతుందని ప్రధాని తెలిపారు. దీంతోపాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం నేపథ్యంలో రాజ్‌కోట్ ప్రజలను ఆయన అభినందించారు.
గడచిన 9 సంవత్సరాల్లో ప్రతి ప్రాంతం, ప్రతి సామాజిక వర్గం జీవిత సౌలభ్యానికి కేంద్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని ప్రధానమంత్రి అన్నారు. “మేము ‘సుపరిపాలన’ హామీతో అధికారంలోకి వచ్చాం… ఇవాళ దాన్ని పూర్తిస్థాయిలో నెరవేరుస్తున్నాం” అని ఆయన గుర్తుచేశారు. “పేదలు, దళితులు, గిరిజనులు లేదా వెనుకబడిన తరగతుల వారి జీవితాల మెరుగుకు మేము నిరంతరం కృషి చేస్తున్నాం” అని ప్రధాని నొక్కిచెప్పారు. దేశంలో పేదరిక స్థాయి చాలా వేగంగా తగ్గుతున్నదని, కేవలం గత ఐదేళ్లలోనే 13.5 కోట్లమంది పౌరులు పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. వీరంతా నేడు దేశంలో నయా-మధ్యతరగతిగా ఎదుగుతున్నారంటూ తాజా నివేదిక పేర్కొనడాన్ని ఆయన ఉటంకించారు. ఈ మేరకు దేశంలో మధ్యతరగతి, నయా-మధ్యతరగతి సహా ఆ వర్గం మొత్తానికీ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తున్నదని ప్రధాని వివరించారు.
అనుసంధానంపై మధ్యతరగతి చిరకాల డిమాండ్‌ను ప్రధాని ప్రస్తావించారు. గడచిన 9 ఏళ్లలో ఈ దిశగా తాము చేపట్టిన చర్యలను ఏకరవు పెట్టారు. ఈ మేరకు 2014లో కేవలం 4 నగరాల్లో మాత్రమే మెట్రో నెట్వర్క్ ఉండగా, నేడు 20కిపైగా నగరాలకు విస్తరించినట్లు చెప్పారు. అలాగే వందే భారత్ వంటి ఆధునిక రైళ్లు 25 మార్గాల్లో నడుస్తుండగా- 2014తో పోలిస్తే నేడు విమానాశ్రయాల సంఖ్య 70 నుంచి రెట్టింపు అయిందన్నారు. “విమాన సేవల విస్తరణ మన విమానయాన రంగాన్ని కొత్త శిఖరాలకు చేర్చింది. మన విమానయాన సంస్థలు నేడు రూ.కోట్ల విలువైన విమానాలు కొంటున్నాయి” అని గుర్తుచేశారు. మరోవైపు విమానాల తయారీ దిశగా గుజరాత్ ముందడుగు వేస్తోందనన్నారు. “దేశ ప్రజలకు జీవన సౌలభ్యం-నాణ్యత కల్పించడమే మా ప్రభుత్వ ప్రాథమ్యాలలో కీలకం” అని ప్రధాని వ్యాఖ్యానించారు. లోగడ ఆస్పత్రులు/బిల్లు చెల్లింపు కేంద్రాల వద్ద బారులు తీరడం, బీమా-పెన్షన్ సమస్యలు, పన్ను రిటర్నుల దాఖలులో చిక్కులు వంటి అనేక సమస్యలు ప్రజలను బాధించేవని ఆయన గుర్తుచేశారు. అయితే, ‘డిజిటల్ భారతం’ అమలుతో ఇప్పుడు ఇవన్నీ అదృశ్యమయ్యాయని తెలిపారు. మొబైల్ బ్యాంకింగ్, ఆన్లైన్ రిటర్నుల దాఖలు, స్వల్ప వ్యవధిలోనే పన్ను వాపసు మొత్తం నేరుగా బ్యాంకు ఖాతాలో జమ వంటివి ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
దేశంలో పక్క ఇళ్ల ప్రాముఖ్యాన్ని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ- “మేము పేదల గృహావసరం తీర్చాం.. మధ్య తరగతి కలలను కూడా నెరవేర్చాం” అన్నారు. మధ్యతరగతి వర్గాలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రూ.18 లక్షలదాకా ప్రత్యేక సబ్సిడీ ఇచ్చామని గుర్తుచేశారుర. దీనికింద గుజరాత్లో 60 వేలుసహా దేశవ్యాప్తంగా 6 లక్షలకుపైగా కుటుంబాలు లబ్ధి పొందాయని ఆయన తెలిపారు. ఇక గృహనిర్మాణం పేరిట స్థిరాస్తి వ్యాపార సంస్థల మోసాలను ప్రస్తావిస్తూ- గత ప్రభుత్వాల హయాంలో సరైన చట్టం లేనందున డబ్బు చెల్లించిన ఏళ్ల తరబడి ఇళ్లు స్వాధీనం చేయని ఉదంతాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో తాము ‘రెరా’ చట్టం రూపొందించి ప్రజల సొమ్ముకు భద్రత కల్పించామని, వారి ప్రయోజనాలను కాపాడేది ప్రస్తుత ప్రభుత్వమేనని ఆయన అన్నారు. ఈ మేరకు “లక్షలాది ప్రజల సొమ్ముకు రెరా చట్టం నేడు దోపిడీనుంచి రక్షణనిస్తోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
మన దేశంలో ఇంతకుముందు ద్రవ్యోల్బణం 10 శాతానికి చేరిందని ప్రధానమంత్రి అన్నారు. అయితే, కరోనా మహమ్మారితోపాటు యుద్ధ సంక్షోభం వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రస్తుత ప్రభుత్వం ద్ర్యవోల్బణాన్ని అదుపులో ఉంచిందని పేర్కొన్నారు. “పొరుగు దేశాలలో ద్రవ్యోల్బణం 25-30 శాతందాకా పెరిగినా భారతదేశంలో నేడు ఆ పరిస్థితి లేదు. ఆ మేరకు సంపూర్ణ అవగాహనతో దీన్ని నియంత్రించేందుకు మేం కృషి చేస్తున్నాం. భవిష్యత్తులోనూ ఈ విధానాన్ని కొనసాగిస్తాం” అని ప్రధాని కృతనిశ్చయం ప్రకటించారు.
ప్రజలకు ఖర్చుల ఆదాతోపాటు మధ్యతరగతి వర్గాల్లో గరిష్ఠ పొదుపుపై ప్రభుత్వం భరోసా ఇస్తోందని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. దేశంలో 9 ఏళ్ల కిందట రూ.2 లక్షల వార్షికాదాయంపై పన్ను ఉండేదని, ఇవాళ రూ.7 లక్షలదాకా ఆదాయంపై పన్ను లేదని పేర్కొంటూ- “రూ.7 లక్షల వార్షికాదాయంపై పన్ను సున్నా” అని వ్యాఖ్యానించారు. ఈ విధంగా నగరాల్లోని మధ్యతరగతి కుటుంబాలకు ఏటా రూ.వేలల్లో ఆదా అవుతోందని పేర్కొన్నారు. చిన్న పొదుపు మొత్తాలపై అధిక వడ్డీ, ఉద్యోగుల భవిష్య నిధిపై వడ్డీ 8.25 శాతానికి పెంపు గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వ విధానాలు పౌరులకు డబ్బును ఎలా ఆదా చేస్తున్నదీ వివరిస్తూ- మొబైల్ ఫోన్ వినియోగ వ్యయంలో తగ్గుదలను ప్రధాని ఉదాహరించారు. ఈ మేరకు 2014లో 1 జీబీ డేటా రూ.300గా ఉండేదని, ఆ లెక్కన చూస్తే నేడు సగటున ఒక్కొక్కరు నెలకు 20 జీబీ డేటా వాడుతుండగా, ప్రతినెల రూ.5000కుపైగా ఆదా అవుతున్నట్లేనని వివరించారు.
జనౌషధి కేంద్రాల్లో ప్రజలకు చౌకగా మందులు లభించడాన్ని ప్రస్తావిస్తూ- నిత్యం చాలా మందులు వాడాల్సిన వారికి ఇదొక వరం వంటిదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ విధంగా పేద, మధ్యతరగతి ప్రజలకు దాదాపు రూ.20,000 కోట్లదాకా ఆదా అవుతున్నదని తెలిపారు. “పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలపై అవగాహనగల ప్రభుత్వం పనితీరు ఇలా ఉంటుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. గుజరాత్, సౌరాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రభుత్వం సంపూర్ణ అవగాహనతో కృషి చేస్తోందని ప్రధాని అన్నారు. సౌని పథకంతో ఈ ప్రాంతంలో నీటి సమస్య తీరుతోందని గుర్తుచేశారు. ఈ మేరకు “సౌరాష్ట్రలో అనేక ఆనకట్టలు, వేలాది చెక్ డ్యామ్‌లు నిర్మించడంతో అవన్నీ నేడు నీటి వనరులుగా మారాయి. ఇంటింటికీ నీరు పథకం కింద గుజరాత్‌లోని కోట్లాది కుటుంబాలకు ఇప్పుడు కొళాయి నీరందుతోంది” అని ఆయన వివరించారు.
చివరగా- గత 9 ఏళ్లలో తీర్చిదిద్దిన ఈ పాలనా విధానం సమాజంలోని ప్రతివర్గం అవసరాలు-ఆకాంక్షలకు అనుగుణంగా మారిందని ప్రధాని అన్నారు. “వికసిత భారతం నిర్మాణానికి ఇదొక మార్గం. ఈ బాటలో పయనించడం ద్వారా మనం అమృత కాల సంకల్పాలను సాకారం చేసుకోవాలి” అని పిలుపునిస్తూ ఆయన తన ప్రసంగం ముగించారు.
ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, పార్లమెంటు సభ్యుడు శ్రీ సి.ఆర్.పాటిల్, గుజరాత్ మంత్రులు, శాసనసభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నేపథ్యం
దేశవ్యాప్త విమాన అనుసంధానం మెరుగుపై ప్రధాని దార్శనికత రాజ్‌కోట్‌లో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంతో సాకారమైంది. ఈ విమానాశ్రయం 2500కుపైగా విస్తీర్ణంలో రూ.1400 కోట్ల వ్యయంతో నిర్మితమైంది. ఇక్కడ ఆధునిక సాంకేతికత, సుస్థిర సదుపాయాలతో కూడిన ఏర్పాట్లున్నాయి. టెర్మినల్ భవనం ‘గృహ-4’ (గ్రీన్ రేటింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హ్యబిటట్ అసెస్మెంట్) నిబంధనలకు అనుగుణంగా నిర్మించబడింది. అలాగే కొత్త టెర్మినల్ భవనం (ఎన్‌ఐటిబి) డబుల్ ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్, స్కైలైట్లు, ఎల్ఇడి లైటింగ్, తక్కువ వేడిని గ్రహించే పెంకులు తదితర విశేషాలతో రూపొందించబడింది.
రాజ్‌కోట్ సాంస్కృతిక చైతన్యం విమానాశ్రయ టెర్మినల్ భవన రూపకల్పనకు ప్రేరణనిచ్చింది. ఇది తనదైన దాని సుందర బాహ్య ముఖద్వారం, అద్భుతమైన అంతర్భాగాలతో లిప్పన్ కళ నుంచి దాండియా నృత్యం వరకూ కళారూపాలను ప్రతిబింబిస్తుంది. ఈ విమానాశ్రయం స్థానిక నిర్మాణ వారసత్వానికి ప్రతిరూపంగా ఉండటమేగాక గుజరాత్‌లోని కతియావాడ్ ప్రాంతం కళలు-నృత్య రూపాల సాంస్కృతిక వైభవాన్ని చాటుతుంది. ఈ కొత్త విమానాశ్రయం రాజ్‌కోట్ స్థానిక ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధికి మాత్రమేగాక రాష్ట్రమంతటా వాణిజ్యం, పర్యాటకం, విద్య, పారిశ్రామిక రంగాల ప్రగతికి దోహదం చేస్తుంది.
నగరంలో కొత్త విమానాశ్రయంసహా రూ.860 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రధాని ప్రారంభించారు. వీటిలో సౌనీ యోజన సంధానం-3 ప్యాకేజీలోని 8, 9 దశలు నీటిపారుదల సౌకర్యాలను మరింత బలోపేతం చేస్తాయి. అలాగే సౌరాష్ట్ర ప్రాంత తాగునీటి అవసరాలు తీరుస్తాయి; ద్వారక గ్రామీణ నీటి సరఫరా-పారిశుధ్యం (ఆర్డబ్ల్యూఎస్ఎస్) ఉన్నతీకరణతో అనేక గ్రామాలకు పైప్లైన్ల ద్వారా తాగునీరు సరఫరా అవుతుంది. ఇవేకాకుండా ఉపర్కోట్ కోట పరిరక్షణ, పునరుద్ధరణ, అభివృద్ధి ఫేజ్ I, II; నీటిశుద్ధి ప్లాంటు, మురుగు శుద్ధి ప్లాంటు, ఫ్లైఓవర్ వంతెన తదితరాలు కూడా ఉన్నాయి.
Big day for Rajkot as the city gets an international airport along with a multitude of development projects. https://t.co/TT0zrNKc2w
— Narendra Modi (@narendramodi) July 27, 2023
राजकोट इंटरनेशनल एयरपोर्ट से यात्रा में तो आसानी होगी ही, इस पूरे क्षेत्र के उद्योगों को भी बहुत लाभ होगा। pic.twitter.com/b8lEwJnC8l
— PMO India (@PMOIndia) July 27, 2023
बीते 9 वर्षों में केंद्र सरकार ने समाज के हर वर्ग, हर क्षेत्र के जीवन को आसान बनाने के लिए काम किया है: PM @narendramodi pic.twitter.com/Eb1XIQrogJ
— PMO India (@PMOIndia) July 27, 2023
Ease of Living, Quality of Life, हमारी सरकार की सर्वोच्च प्राथमिकताओं में से एक है: PM @narendramodi pic.twitter.com/7ugCOfWZQK
— PMO India (@PMOIndia) July 27, 2023
Thrilled that Rajkot has a new international airport! This modern infrastructure will significantly boost connectivity, fostering growth and development not only in Rajkot but also for the entire Saurashtra region. pic.twitter.com/q7mAIgLxAg
— Narendra Modi (@narendramodi) July 27, 2023
बीते 9 वर्षों में हमने गुजरात सहित पूरे देश में कनेक्टिविटी बढ़ाने के लिए किस स्पीड और स्केल पर काम किया है, आज इसके एक नहीं अनेक उदाहरण हैं… pic.twitter.com/2IRo5coh8d
— Narendra Modi (@narendramodi) July 27, 2023
पहले देश के लोगों को छोटे से छोटे काम के लिए भी कितनी परेशानियों से गुजरना होता था, ये हम भूल नहीं सकते। आज Ease of Living के साथ ही Quality of Life हमारी सरकार की सर्वोच्च प्राथमिकताओं में से एक है। pic.twitter.com/Bi4ThJDa3Q
— Narendra Modi (@narendramodi) July 27, 2023
हमने देशभर में गरीबों के घर की भी चिंता की और मिडिल क्लास के घर का सपना पूरा करने का भी इंतजाम किया। गुजरात के भी हजारों परिवारों को इसका लाभ मिला है। pic.twitter.com/nmZQV5TYh5
— Narendra Modi (@narendramodi) July 27, 2023