ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పుణె మెట్రో రైలు పథకం తొలి దశ అభివృద్ధికి ఆమోదం తెలిపింది. పుణె మెట్రో రైల్ కారిడర్ 31.254 కిలోమీటర్ల మేర ఏర్పాటవుతుంది. దీనిలో అంతర్భాగమైన తొలి దశ (కారిడర్-1.. పింప్రి చించ్ వాడ్ పురపాలక సంస్థ- పి సి ఎమ్ సి నుండి స్వర్‌గేట్ దాకా) 16.589 కిలోమీటర్లు (ఇందులో 11.57 కిలోమీటర్ల మేర భూమికి ఎత్తు నుండి 5.019 కిలోమీటర్ల మేర భూగర్భం నుండి) సాగుతుంది. ఇక రెండో దశ (కారిడర్-2… వనాజ్ నుండి రామ్‌వాడి వరకూ) 14.665 కిలోమీటర్ల పొడవు (పూర్తిగా భూమికి ఎత్తున) ఉంటుంది.
ఈ రెండు దశలూ కలిసిన మెట్రో రైలు మార్గం నిర్మాణ వ్యయం రూ.11,420 కోట్లు ఉంటుంది. దీనివల్ల పుణె మహానగర ప్రాంతంలోని సుమారు 50 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది.
సమగ్ర పథక నివేదిక (డి పి ఆర్) ప్రకారం పనులు మొదలైనప్పటి నుండి ఐదు సంవత్సరాలలో పూర్తి కావలసివుంటుంది.
అనుమతి పొందిన మార్గ రేఖనం మేరకు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. ఇది పుణె మహానగర ప్రాంతంలోని కొన్ని దట్టమైన ఆవాస, వాహన రద్దీ మార్గాలను దాటుకుంటూ వెళ్తుంది. దీంతో వాహన రద్దీ సమస్య తీవ్రత తగ్గడంతో పాటు సౌకర్యవంతం, వేగవంతం, కాలుష్యరహితం, అందుబాటులో గల సామూహిక ప్రయాణ వ్యవస్థ నగరవాసులకు సమకూరుతుంది. అలాగే ఈ ప్రాంతమే గాక పుణె మహానగరం సహా జాతీయంగానూ ప్రగతి, సౌభాగ్యాలకు తోడ్పడుతుంది.
కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలకు సమాన (50:50 నిష్పత్తి) వాటా గల సంయుక్త సంస్థ మహారాష్ట్ర మెట్రోరైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (MAHA-METRO) ఈ పథకాన్నిఅమలు చేస్తుంది. మెట్రో రైల్వేస్ (కన్‌స్ట్రక్షన్ ఆఫ్ వర్క్స్) చట్టం 1978, ది మెట్రో రైల్వేస్ (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) చట్టం 2002, రైల్వే చట్టం 1989ల కింద, వాటికి సమయానుకూల సవరణలకు అనుగుణంగా ఈ పథకం అమలవుతుంది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం(GoI), మహారాష్ట్ర ప్రభుత్వం (GoM) ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రయోజన సంస్థగా ఉన్న నాగపూర్ మెట్రో రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (NMRCL)ను పునర్ వ్యవస్థీకరిస్తారు. దీని ప్రకారం ఇకపై ఇది మహారాష్ట్ర మెట్రోరైల్ కార్పొరేషన్ లిమిటెడ్ గా రూపొందుతుంది. అటుపైన పుణె మెట్రో రైల్ పథకం తొలి దశతో పాటు మహారాష్ట్రలో ముంబయ్ మహానగర ప్రాంతీయ పరిధికి వెలుపల అన్ని మెట్రో పథకాలను ఈ సంస్థే చేపడుతుంది. ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోచి, నాగపూర్ తదితర మెట్రో రైల్ పథకాల అనుభవం, అవగాహనల నుండి ఇది లబ్ధి పొందనుంది.
పూర్వరంగం:
పుణె మహానగర ప్రాంతీయ పరిధిలో పుణె నగరపాలక సంస్థ (పి ఎమ్ సి), పింప్రీ చించ్ వాడ్ పురపాలక సంస్థ- పి సి ఎమ్ సి లు అంతర్భాగంగా ఉన్నాయి. సైనిక స్థావరాలు ఉన్న పుణె, ఖడ్ కి ప్రాంతాలలో జనాభా వేగంగా పెరిగిపోయింది. పుణె నగర పరిధిలో 2001 లెక్కల నాటి జనసంఖ్య 35.7 లక్షలు కాగా, 2011 జనాభా లెక్కలు తీసేనాటికి 49.9 లక్షలకు దూసుకుపోయింది. ఈ పెరుగుదలను బట్టి 2021నాటికి 69 లక్షలకు, 2031నాటికి 77.3 లక్షలకు దూసుకుపోతుందని అంచనా.
పుణెలో గడచిన కొన్ని దశాబ్దాలపాటు వడివడిగా సాగిన పారిశ్రామికీకరణ, ముమ్మర వాణిజ్యాభివృద్ధి ఫలితంగా ప్రయాణ అవసరాలు వేగంగా పెరుగుతూ వచ్చాయి. దీంతో నగర రవాణా సదుపాయాలపై ఒత్తిడి ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఈ నేపథ్యంలో జనాభా పెరుగుదలపై తాజా అంచనాలను బట్టి చూస్తే ప్రస్తుత ప్రయాణ, రవాణా మౌలిక సదుపాయాలను అత్యవసరంగా బలోపేతం, సమృద్ధం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధితో పాటు చాలీచాలని రవాణా సేవల కారణంగా ప్రయాణికులు ప్రైవేటు సదుపాయాల బాట పడుతున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే వాహన యజమానుల సంఖ్య పెరుగుతున్న ధోరణి సుస్పష్టమవుతోంది. ఇది రహదారులను, వీధులను మరింత రద్దీకి గురి చేయడంతో పాటు వాయు కాలుష్యం పెరిగిపోవడానికి దారి తీయడం తథ్యం. కాబట్టే మెట్రో రైల్ వ్యవస్థను అత్యవసరంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.