Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

42వ ప్రగతి సమావేశానికి ప్రధానమంత్రి అధ్యక్షత

42వ ప్రగతి సమావేశానికి ప్రధానమంత్రి అధ్యక్షత


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుధవారం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను భాగస్వాములను చేస్తూ ఐసిటి-ఆధారిత క్రియాశీల పాలన, సకాలంలో అమలు బహుముఖీన వేదిక ప్రగతి 42వ సమావేశానికి అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో 12 కీలక ప్రాజెక్టులపై సమీక్షించారు. ఆ 12 ప్రాజెక్టుల్లో ఏడు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖకు చెందినవి కాగా రెండు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రాజెక్టులు. వీటితో పాటు రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ;  ఉక్కు మంత్రిత్వ శాఖ;  పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ప్రాజెక్టులు ఒక్కోటి ఉన్నాయి. చత్తీస్  గఢ్, బిహార్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ర్ట, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, హర్యానా రాష్ర్టాలు; జమ్ము, కశ్మీర్;  దాద్రా, నగర్  హవేలి కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు జరుగుతున్న ఆ ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.1,21,300 కోట్లు.

రాజ్  కోట్, జమ్ము, అవంతిపురా, బీబీనగర్, మదురై, రేవారి, దర్భాంగాల్లో నిర్మాణంలో ఉన్న ఎయిమ్స్  ప్రాజెక్టుల పురోగతిపై కూడా పిఎం సమీక్షించారు. ఈ ప్రాజెక్టులకు గల ప్రజాప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకుని నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్న వారందరూ వీటికి ఎదురవుతున్న సమస్యలన్నింటినీ సత్వరం పరిష్కరించి సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కట్టుబడాలని ప్రధానమంత్రి ఆదేశించారు.

ఈ సందర్భంగానే  ప్రధానమంత్రి ‘పిఎం స్వనిధి స్కీమ్’ గురించి కూడా సమీక్షించారు. పట్టణ ప్రాంతాలు…ప్రత్యేకించి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని అర్హులైన వీధి వ్యాపారులందరినీ గుర్తించి అందరికీ కవరేజి లభించేలా చూడాలని ప్రధాన కార్యదర్శులను ఆయన కోరారు. వీధి వ్యాపారులందరూ డిజిటల్  లావాదేవీలు  నిర్వహించేలా ఉద్యమ స్ఫూర్తితో వారిని ప్రోత్సహించాలని ఆయన ఆదేశించారు. స్వనిధి సే సమృద్ధి ప్రచారం ద్వారా స్వనిధి లబ్ధిదారుల కుటుంబ  సభ్యులందరికీ ప్రభుత్వ  పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలని సూచించారు.

జి-20 సమావేశాలు విజయవంతంగా నిర్వహించినందుకు ప్రధాన కార్యదర్శులందరినీ ప్రధానమంత్రి అభినందించారు. ఆయా రాష్ర్టాల్లో జరుగుతున్న ఈ సమావేశాల ప్రయోజనాలు గరిష్ఠంగా అందేలా చూడాలని, ప్రధానంగా పర్యాటకం, ఎగుమతుల ప్రోత్సాహానికి కృషి చేయాలని ఆయన సూచించారు.

ప్రగతి సమావేశాల సందర్భంగా ఇప్పటివరకు రూ.17.05 లక్షల విలువ గల 340 ప్రాజెక్టులపై సమీక్షలు నిర్వహించారు. 

***