Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్తరప్రదేశ్‌లోని కాశీ నగరంలో ‘కాశీ తెలుగు సంగమం’ సందర్భంగా ప్రధాని ప్రసంగం


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉత్త‌రప్ర‌దేశ్‌లోని కాశీ నగరంలో నిర్వహించిన ‘కాశీ తెలుగు సంగమం’ కార్యక్రమంలో వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. గంగా పుష్కర వేడుకల నేపథ్యంలో ముందుగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపి, ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఆయన తన ప్రసంగం ప్రారంభించారు. ఈ వేళ కాశీ నగరంలో ఈ కార్యక్రమానికి హాజరైన వారంతా తన వ్యక్తిగత అతిథులేనని ఆయన అభివర్ణించారు. అలాగే మన భారతీయ సంస్కృతిలో అతిథులు దేవుడితో సమానమని ప్రధాని గుర్తుచేశారు. “మిమ్మల్ని నేను స్వయంగా స్వాగతించలేకపోయినా, నా మనస్సు మీతోనే ఉంది” అని ఈ సందర్భంగా తన మనోభావాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కాశీ-తెలుగు కమిటీతోపాటు పార్లమెంటు సభ్యుడు శ్రీ జి.వి.ఎల్. నరసింహారావును ప్రధాని అభినందించారు. కాశీ ఘాట్‌ల వద్ద గంగా పుష్కర వేడుకలు గంగా-గోదావరి నదుల సంగమం వంటిదని పేర్కొన్నారు. ఇది భారత ప్రాచీన నాగరికత-సంస్కృతులు-సంప్రదాయాల మేలు కలయికకు సంబంధించిన వేడుకని ప్రధానమంత్రి చెప్పారు. కొన్ని నెలల కిందట ఇక్కడే కాశీ- తమిళ సంగమం నిర్వహణను ఆయన గుర్తుచేసుకున్నారు. అలాగే కొన్ని రోజుల ముందు సౌరాష్ట్ర – తమిళ సంగమంలో తాను పాల్గొనడాన్ని కూడా ప్రస్తావించారు. ఈ మేరకు స్వాతంత్ర్య అమృత కాలాన్ని దేశంలోని వైవిధ్యాలు-సంస్కృతుల సంగమంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. “ఈ భిన్నత్వాల సంగమం జాతీయవాద అమృతాన్ని సృష్టిస్తోంది. భవిష్యత్తులో ఇది భారతదేశాన్ని సంపూర్ణంగా శక్తిమంతం చేస్తుంది” అని ప్రధానమంత్రి ఆశాభావం వెలిబుచ్చారు.

   కాశీకి తెలుగు ప్రజలతోగల ప్రగాఢ సంబంధాన్ని ప్రస్తావిస్తూ- తరతరాలుగా వారిని కాశీ స్వాగతిస్తున్నదని, ఈ నగరం ఎంత పురాతనమైనదో, ఈ బంధం కూడా అంత ప్రాచీనమైనదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కాశీలోని తెలుగు నేపథ్యంగల ప్రజల విశ్వాసం కాశీ నగరమంత పవిత్రమైనదని ఆయన అభివర్ణించారు. కాశీ యాత్రికుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు గణనీయ సంఖ్యలో ఉంటారని ప్రధాని పేర్కొన్నారు. అలాగే “తెలుగు రాష్ట్రాలు కాశీ నగరానికి ఎందరో గొప్ప రుషులను, యోగులను, ఆచార్యులను అందించాయి” అని ఆయన చెప్పారు. కాశీ ప్రజలు, యాత్రికులు విశ్వనాథ స్వామిని దర్శించుకోవడంతోపాటు తైలాంగ్ స్వామి ఆశ్రమాన్ని కూడా సందర్శించి ఆశీస్సులు పొందుతారని ప్రధానమంత్రి చెప్పారు. తైలాంగ్ స్వామి గురించి ప్ర‌స్తావిస్తూ- ఆయ‌న విజ‌యన‌గ‌ర‌ంలో జ‌న్మించారని ప్రధాని గుర్తుచేశారు. అయితే, స్వామి రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస ఆయనను కాశీలో సాక్షాత్తూ శివ స్వరూపుడుగా అభివర్ణించారని పేర్కొన్నారు. కాశీలో ఈనాటికీ జిడ్డు కృష్ణమూర్తి వంటి మహానుభావులను ప్రజలు తలచుకుంటూంటారని ఆయన గుర్తుచేశారు.

   నగరం తమను మమేకం చేసుకున్న తరహాలోనే తెలుగు ప్రజలు కూడా కాశీని తమ ఆత్మతో ముడివేసుకున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆ మేరకు తెలంగాణలోని పవిత్ర పుణ్యక్షేత్రం వేములవాడను దక్షిణ కాశీగా వ్యవహరించడాన్ని ఆయన గుర్తుచేశారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆలయాల్లో చేతులకు కట్టే నల్ల దారాన్ని ‘కాశీ దారం’గా పిలవడాన్ని ఆయన ప్రత్యేకంగా గుర్తుచేశారు. తెలుగు భాష-సాహిత్యంలో లోతుగా పాతుకుపోయిన కాశీ వైభవాన్ని ఎత్తిచూపుతూ- శ్రీనాథ మహాకవి రచించిన ‘కాశీ ఖండము’ గ్రంథాన్ని, ‘కాశీ యాత్ర’లో ఎంగుళ్‌  వీరస్వామయ్య పాత్రను, ప్రసిద్ధ ‘కాశీ మజిలీ కథల’ను ప్రధానమంత్రి ఉటంకించారు. ఈ నగరం దేశంలోని ప్రజల హృదయాలకు ఎంతో చేరువంటే నమ్మడం బయటి వ్యక్తులకు చాలా కష్టంగా ఉంటుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అయితే- “ఒకే భారతం – శ్రేష్ట భారతం” అనే నమ్మకాన్ని సజీవంగా ఉంచింది శతాబ్దాల భారత వారసత్వమే” అని ప్రధాని వ్యాఖ్యానించారు.

   “కాశీ నగరం జీవన్ముక్తి, మోక్ష ప్రదానం చేసే భూమి” అని ప్రధానమంత్రి అన్నారు. ఒకనాడు కాశీ చేరాలంటే తెలుగు ప్రజలు వేల మైళ్లు నడిచి వచ్చేవారని గుర్తుచేశారు. కానీ, నేటి ఆధునిక యుగంలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయని ఆయన అన్నారు. ఈ మేరకు ఇటు విశ్వనాథ క్షేత్రం దివ్య వైభవం, అటు గంగా ఘాట్‌ల విస్తరణను ప్రధాని ఉదాహరించారు. అదేవిధంగా కాశీ నగర వీధులు ఒకవైపు విస్తరిస్తుండగా, మరోవైపు కొత్త రహదారులతో హైవేల నెట్‌వర్క్‌ పెరుగుతున్నదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఇంతకుముందు కాశీ నగరాన్ని సందర్శించిన వారు ఇప్పుడు ఇక్కడికి వచ్చినపుడు విశేష మార్పులను స్పష్టంగా గ్రహిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. కొత్త జాతీయ రహదారి నిర్మాణంతో విమానాశ్రయం నుంచి దశాశ్వమేధ ఘాట్‌ వద్దకు చేరే సమయం తగ్గిపోవడం వారికి స్పష్టం తెలుస్తున్నదని చెప్పారు. నగరంలో అభివృద్ధిని వివరిస్తూ- చాలా ప్రాంతాల్లో విద్యుత్ తీగలను భూగర్భం నుంచి తీసుకురావడం, నగరంలోని కుండాలు, ఆలయ మార్గాలు,  సాంస్కృతిక ప్రదేశాల పునరుజ్జీవనం, గంగానదిలో ‘సిఎన్‌జి’ పడవల వినియోగం వగైరాలను ప్రధాని ఉదాహరించారు. కాశీ పౌరులకు ప్రయోజనం చేకూర్చేలా నిర్మితమయ్యే రోప్‌వే గురించి కూడా ఆయన పేర్కొన్నారు. నగరంలో పరిశుభ్రత కార్యక్రమాలతోపాటు ఘాట్‌ల పరిశుభ్రత సాధించిన ఘనత నగరవాసులు, యువతకే దక్కుతుందని ప్రధానమంత్రి ప్రశంసించారు.

   తిథులను సాదరంగా స్వాగతించి, సేవలు చేయడంలో కాశీ నగరవాసులు ఎంతమాత్రం లోటు చేయరని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. “స్వామి ఆశీస్సులు.. కాలభైరవుడితోపాటు అన్నపూర్ణ మాత దర్శనం అద్భుతం. గంగా నదిలో పుణ్యస్నానంతో మీకు ఆత్మానందం తథ్యం” అని ప్రధాని వ్యాఖ్యానించారు. అదేవిధంగా ‘లస్సీ, థండై, చాట్, లిట్టి-చోఖా, బనారసీ పాన్’ వంటి రుచికరమైన వంటకాలు, పదార్థాలు కాశీ యాత్రను మరింత చిరస్మరణీయం చేస్తాయని పేర్కొన్నారు. స్వదేశీయులైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రవాసులు కాశీ యాత్ర నుంచి వెళ్లేటపుడు తీసుకెళ్లే వారణాసి కొయ్యబొమ్మలు, బనారస్‌ చీరలు వంటివి ఆ రాష్ట్రాల్లోని ఏటికొప్పాక బొమ్మలు వంటివేనని ప్రధానమంత్రి గుర్తుచేశారు.

   “మన పూర్వికులు భారత చైతన్యాన్ని వివిధ కేంద్రాల్లో ప్రతిష్టించారు, ఇదంతా ఏకమైతే  భరతమాత సంపూర్ణ స్వరూపం ఆవిష్కృతమవుతుంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కాశీలో విశ్వనాథ స్వామి-విశాలాక్షి శక్తిపీఠం, ఆంధ్రాలో భ్రమరాంబ-మల్లికార్జున స్వామి, తెలంగాణలో రాజరాజేశ్వర స్వామి ఆలయం వంటి పవిత్ర స్థలాలన్నీ భారతదేశానికి ఎంతో  ముఖ్యమైన విశ్వాస కేంద్రాలు మాత్రమేగాక సాంస్కృతిక గుర్తింపునకు ప్రతీకలని ఆయన అన్నారు. చివరగా- దేశ వైవిధ్యాన్ని పరిపూర్ణ రూపంలో దర్శిస్తేనే భారత పరిపూర్ణత-సంపూర్ణ సామర్థ్యాలను మనం గ్రహించగలమని ప్రధాని స్పష్టం చేశారు. “ఆ విధంగా చేయగలిగితేనే మనలోని పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయగలం” అని శ్రీ మోదీ అన్నారు. భారతీయులలో దేశసేవ సంకల్పాన్ని గంగా పుష్కరాల వంటి వేడుకలు మరింత ముందుకు తీసుకెళ్లగలవని విశ్వాసం వ్యక్తం చేస్తూ ఆయన తన ప్రసంగం ముగించారు.

*****

DS/TS