Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జ‌పాన్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా భార‌త‌దేశం-జ‌పాన్ సంయుక్త ప్ర‌క‌ట‌న‌


1. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని శ్రీ శింజో అబే ఆహ్వానాన్ని అందుకొని ప్రస్తుతం జపాన్ లో ఆధికారిక పర్యటనలో ఉన్నారు. టోక్యోలో ఇద్దరు ప్రధానులు నవంబర్ 11వ తేదీన భిన్న అంశాలపై విస్తృత చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఉభయులు 2015 డిసెంబర్ 12వ తేదీన ప్రకటించిన భారతదేశం-జపాన్ విజన్ 2025 లో భాగంగా ఉభయ దేశాల మధ్య నెలకొన్న ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని సమగ్రంగా సమీక్షించారు. 2014 ఆగస్టు- సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ లో పర్యటించిన తరువాత ఈ రెండు సంవత్సరాల కాలంలో ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ఏర్పడిన పురోగతిని వారు ప్రశంసించారు.

భాగస్వామ్య శక్తి

2. ప్రధానులిరువురూ ఉభయ దేశాల ప్రజల మధ్య నెలకొన్న నాగరక బంధాన్ని ప్రత్యేకించి బౌద్ధ మత విశ్వాసాలతో ముడిపడి ఉన్న ప్రాచీన బంధాన్ని కొనియాడుతూ ప్రజాస్వామ్యం, దాపరికం లేని ధోరణి, దేశీయ చట్టాలకు కట్టుబాటు వంటివి శాంతియుత సహజీవనంలో కీలక విలువలుగా పునరుద్ఘాటించారు. రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాల విషయంలో ఉభయుల ఆలోచనాధోరణులలో గల సారూప్యాన్ని ఆహ్వానిస్తూ రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక బంధానికి ఇవే బలమైన పునాదులు వేశాయని వారన్నారు.

3. ప్రపంచ సుసంపన్నతకు ప్రధాన చోదక శక్తిగా ఇండో- పసిఫిక్ ప్రాంతానికి గల ప్రాధాన్యాన్ని ఉభయులు ఉటంకించారు. ఈ ప్రాంతంలో బహుళపాక్షిక, సమ్మిళిత వృద్ధికి ప్రజాస్వామ్యం, శాంతి, దేశీయ చట్టాలు, సహనం, పర్యావరణం పట్ల గౌరవం మూలస్తంభాలుగా నిలిచాయని వారు నొక్కి చెప్పారు. “యాక్ట్ ఈస్ట్ పాలసీ” కింద ప్రాంతీయ బంధాన్ని పటిష్ఠం చేసేందుకు శ్రీ మోదీ తీసుకుంటున్న చర్యలను ప్రధాని శ్రీ అబే ఈ సందర్భంగా ప్రశంసిస్తూ “దాపరికానికి తావు లేని ఇండో- పసిఫిక్ వ్యూహం” గురించి ప్రధాని శ్రీ మోదీకి వివరించారు. ఈ వ్యూహానికి అనుగుణంగా ప్రాంతీయంగా జపాన్ పోషిస్తున్న పాత్రను ప్రధాని శ్రీ మోదీ కొనియాడారు. ఈ విధానం, వ్యూహం రెండింటినీ ఆచరణీయం చేయడంలో మరింత సహకారానికి గల అవకాశాలను గుర్తించినట్టు వారు ప్రకటించారు.

4. ఇండో- పసిఫిక్ ప్రాంతం సుసంపన్నత సాధనలో భాగంగా ఆసియా, ఆఫ్రికా అనుసంధానాన్ని పెంచడం కూడా కీలకమని వారు నొక్కి చెప్పారు. భారతదేశం అనుసరిస్తున్న “యాక్ట్ ఈస్ట్ పాలసీ”, జపాన్ అనుసరిస్తున్న “నాణ్యమైన మౌలిక వసతుల కోసం భాగస్వామ్య విస్తరణ” విధానాలు రెండింటి మధ్య గల సారూప్యతలను, బలాలను కాపాడుకుంటూ మరింత ప్రాంతీయ సమగ్రతకు, అనుసంధానం విస్తరణకు మరింత సమన్వయంతో కృషి చేయాలని ఉభయులు నిర్ణయానికి వచ్చారు. పరస్పర విశ్వాసం, సంప్రదింపులు మూలసూత్రాలుగా పారిశ్రామికంగా కూడా సహకరించుకోవాలని నిర్ణయించారు.

5. ప్రపంచంలో పరస్పరాశ్రయం, సంక్లిష్టతలు పెరిగిపోయిన నేపథ్యంలో వాతావరణ మార్పులు, ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాద వ్యతిరేక పోరాటం,ఐక్యరాజ్యసమితి (ఐరాస), ఐరాస భద్రత మండలిలో కీలక సంస్కరణల విషయంలో మరింత సహకరించుకోవాలని, నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థ నిర్మాణానికి కృషి చేయాలని ఉభయులు నిర్ణయించారు.

6. జపాన్ కు పెట్టుబడులు, నవకల్పనలు, సాంకేతిక పరిజ్ఞానంలో గల బలాన్ని, నానాటికీ మరింత శక్తివంతంగా ఎదుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థలోని నిపుణులైన మానవ వనరులు, ఆర్థికావకాశాలను పరిగణనలోకి తీసుకుని తమ మధ్య గల ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం, అంతరిక్షం, స్వచ్ఛ ఇంధనాలు, ఇంధన రంగం అభివృద్ధి, మౌలిక వసతులు, స్మార్ట్ సిటీలు, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, ఐసిటి వంటి రంగాలలో సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఉభయులు నిర్ణయానికి వచ్చారు.

సురక్షితమైన ప్రపంచానికి బలమైన భాగస్వామ్య నిర్మాణం

7. ఇండో- పసిఫిక్ ప్రాంత సుస్థిరత, సుసంపన్నతలకు భారతదేశం, జపాన్ లు పోషించవలసిన పాత్రను గుర్తించిన ఉభయులు భద్రత, రక్షణ విభాగాలలో భాగస్వామ్యాన్ని మరింత స్థిరీకరించుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రక్షణకు సంబంధించిన రెండు కీలక ఒప్పందాలు – రక్షణ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి సంబంధించిన డిఫెన్స్ ఫ్రేమ్ వర్క్ ఒప్పందం, రహస్యమైన సైనిక సమాచారం భద్రతకు సంబంధించిన ఒప్పందం- ఆచరణీయం కావడాన్ని వారు ఆహ్వానించారు. ఉభయుల సమన్వయం, సాంకేతిక సహకారం, రక్షణ పరికరాలు ఉమ్మడిగా అభివృద్ధి చేయడం, తయారుచేయడం, రక్షణ పరికరాలు, సాంకేతిక సహకార భాగస్వామ్యంపై జాయింట్ వర్కింగ్ గ్రూపు ద్వారా నిర్దిష్ట అంశాలపై చర్చలు వేగవంతం చేయడానికి కృషి చేయవలసిన అవసరాన్ని వారు గుర్తించారు.

8. న్యూ ఢిల్లీలో జరిగిన ఉభయ దేశాల రక్షణ మంత్రుల స్థాయి వార్షిక సమావేశం విజయవంతం కావడం పట్ల ఉభయులు హర్షం ప్రకటించారు. మలబార్ తీరంలో సైనిక విన్యాసాలు. విశాఖ తీరంలో జరిగిన ఫ్లీట్ రివ్యూ రెండింటిలోనూ జపాన్ నిరంతరం పాల్గొనడాన్ని ప్రశంసించారు. “2+2” సంప్రదింపులు, రక్షణ విధాన చర్చ, మిలిటరీ స్థాయి చర్చలు, కోస్ట్ గార్డుల మధ్య సహకారం ద్వారా ద్వైపాక్షిక రక్షణ సహకారం బలోపేతం చేసుకోవాలని ఉభయులు నిర్ణయించారు. రెండు దేశాల మధ్య వైమానిక దళాల స్థాయి చర్చలు ఈ ఏడాది మొదట్లో ప్రారంభం కావడాన్ని కూడా ఉభయులు ఆహ్వానించారు. దీంతో ఇప్పుడు ఇరు దేశాలు మూడు రక్షణ దళాలకు సంబంధించిన వ్యవస్థాత్మక చర్చల ప్రక్రియను కలిగి ఉన్నాయి. మానవతాపూర్వక సహాయం, వైపరీత్యాల సహాయ చర్యల్లో పరిశీలకుల మార్పిడి, ఆయా విభాగాలకు చెందిన సిబ్బంది శిక్షణకు కూడా సహకారం విస్తరించుకోవాలని ఇద్దరు ప్రధానులు నిర్ణయించారు.

9. యుఎస్-2 యాంఫిబియన్ విమానం సహా అత్యాధునిక రక్షణ పరికరాలు అందించేందుకు జపాన్ సంసిద్ధతను శ్రీ మోదీ కొనియాడారు. ఇరు దేశాల మధ్య గల విశ్వాసానికి, ద్వైపాక్షిక రక్షణ సహకారంలో ఉభయుల సాన్నిహిత్యానికి ఇది దర్పణమని ఆయన అన్నారు.

సుసంపన్నత కోసం భాగస్వామ్యం

10. “మేక్ ఇన్ ఇండియా”, “డిజిటల్ ఇండియా”, “స్కిల్ ఇండియా”, “స్మార్ట్ సిటీ”, “స్వచ్ఛ భారత్”, “స్టార్టప్ ఇండియా” వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు తమ ప్రభుత్వం చేస్తున్నకృషిని ప్రధాన మంత్రి శ్రీ మోదీ ప్రధాని శ్రీ అబేకు వివరించారు. ఆయా రంగాలలో తమకు గల అత్యున్నత స్థాయి నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం అందించడం, ఒడిఏ నుండి జపాన్ నుండి ప్రభుత్వ, ప్రయివేటు పెట్టుబడులు అందించడం ద్వారా ఆ కార్యక్రమాలకు గట్టి మద్దతు అందిస్తామని ప్రధాని శ్రీ అబే హామీ ఇచ్చారు. భారతదేశం, జపాన్ ల ప్రయివేటు రంగానికి ఈ కార్యక్రమాలు మంచి అవకాశాలు అందిస్తాయని ఉభయులు అభిప్రాయపడ్డారు.

11. ఉభయ దేశాల మధ్య ప్రస్తుతం నడుస్తున్న ప్రధాన ప్రాజెక్టు ముంబయ్ -అహమ్మదాబాద్ హై స్పీడ్ రైల్ (ఎమ్ ఎహెచ్ ఎస్ ఆర్) ప్రాజెక్టు పురోగతిని ఉభయులు ఆహ్వానించారు. 2016 సంవత్సరంలో ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి జాయింట్ కమిటీ సమావేశాల స్థాయి చర్చలు మూడు విడతలుగా జరిగాయి.

12. ఎమ్ఎహెచ్ ఎస్ ఆర్ ప్రాజెక్టు ప్రారంభించేందుకు నిర్దేశించుకొన్న కాలపరిమితిని కూడా ఉభయులు గుర్తుచేసుకుంటూ ఈ ప్రాజెక్టు జనరల్ కన్సల్టెంట్ 2016 డిసెంబర్ నాటికి పని ప్రారంభిస్తారని, 2018 చివరికల్లా నిర్మాణం పనులు ప్రారంభమై 2023 నాటికి ప్రాజెక్టు ప్రారంభం అవ్వాలని అంగీకారానికి వచ్చారు.

13. “మేక్ ఇన్ ఇండియా”, సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి సంబంధించిన స్థిరమైన ప్రణాళిక రూపకల్పనకు కృషి చేయాలని ఉభయులు నిర్ణయించారు. హై స్పీడ్ రైల్వే విభాగంలో భాగస్వామ్యాలను పటిష్టం చేసుకొనేందుకు గల అవకాశాలు అన్వేషించాలని కూడా ఉభయులు నిర్ణయించారు. ప్రణాళికాబద్ధంగా హై స్పీడ్ రైల్వే టెక్నాలజీ అభివృద్ధి, నిర్వహణ, అమలు, హెచ్ ఎస్ ఆర్ ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు, దానికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాల రూపకల్పనలో మానవ వనరుల ప్రాధాన్యతను కూడా ఉభయులు గుర్తించారు. 2017లో ఎమ్ఎహెచ్ ఎస్ ఆర్ ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం ద్వారా ఆ ప్రాజెక్టును వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఇది కాకుండా సాంప్రదాయక రైల్వే వ్యవస్థ ఆధునికీకరణలో భారతదేశం, జపాన్ సహకారం విస్తృతి పట్ల కూడా ఉభయదేశాల ప్రధానులు సంతృప్తి ప్రకటించారు.

14. తయారీ రంగంలో మానవ వనరుల అభివృద్ధి కోసం “తయారీ రంగ నైపుణ్యాల బదిలీ ప్రోత్సాహక కార్యక్రమం” కింద సహకరించుకోవాలని కూడా ఉభయులు నిర్ణయించారు. ఈ కార్యక్రమం భారతదేశం లో తయారీ రంగాన్ని బలోపేతం చేస్తుంది. వచ్చే పదేళ్ళ కాలంలో “మేక్ ఇన్ ఇండియా”, “స్కిల్ ఇండియా” కార్యక్రమాల కింద 30 వేల మందికి జపాన్-ఇండియా తయారీ సంస్థ (జెఐమ్), జపాన్ సహకార కోర్సు (జెఇసి) ల ద్వారా శిక్షణ ఇస్తారు. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్య విధానంలో జపాన్ కంపెనీలు గుర్తించిన ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం కింద మొదటి మూడు జెఐఎమ్ లు గుజరాత్, కర్ణాటక, రాజస్తాన్ లలో 2017 వేసవిలో ప్రారంభం అవుతాయి.

15. జపాన్ ఇండియా ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ పార్టనర్ షిప్ కార్యక్రమం కింద వచ్చే ఐదేళ్ళలో నిర్వహించే కార్యక్రమాల కోసం ప్రభుత్వ, ప్రవేటు భాగస్వామ్యంలో 3.5 ట్రిలియన్ యెన్ ల విడుదల ప్రణాళిక నిలకడగా పురోగమించడం పట్ల ఉభయులు సంతృప్తి ప్రకటించారు. వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్ (డిఎఫ్ సి), ఢిల్లీ- ముంబయ్ ఇండస్ట్రియల్ కారిడర్ (డిఎమ్ఐసి), చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడర్ (సిబిఐసి) ప్రాజెక్టుల పురోగతి పట్ల హర్షం ప్రకటించారు. నిర్దేశిత కాలపరిమితిలో ఒడిఎ ప్రాజెక్టుల అమలుకు ఉభయులు కట్టుబాటు ప్రకటించారు.

16. భారతదేశంలో మౌలిక వసతుల ఆధునికీకరణ, అభివృద్ధి కోసం ఒడిఎ కింద చేపడుతున్న ప్రాజెక్టులలో జపాన్ భాగస్వామ్యాన్ని ప్రధాన మంత్రి శ్రీ మోదీ ప్రశంసించారు. పట్టణ రవాణా వ్యవస్థలో భాగంగా ఒడిఏ సహకారం కింద అమలుజరుగుతున్న చెన్నై, అహ్మదాబాద్ మెట్రో, ముంబయ్ ట్రాన్స్ హార్బర్ లింక్, ఢిల్లీలోని ఈస్టర్న్ పెరిఫరల్ హైవే ప్రాజెక్టులో భాగమైన ఇంటెలిజెన్స్ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థ ప్రాజెక్టుల పురోగతిని ఉభయులు ఆహ్వానించారు. గుజరాత్ లోని భావ్ నగర్ జిల్లా అలంగ్ లో షిప్ రీసైక్లింగ్ యార్డును అప్ గ్రేడ్ చేసే ప్రాజెక్టులో సహకారం అందించడానికి జపాన్ ఆసక్తిని శ్రీ అబే వ్యక్తీకరించారు.

17. అనుసంధానత పెంపు విషయంలో కూడా సహకారం విస్తరణకు ఇద్దరు ప్రధానులు గట్టి కట్టుబాటు ప్రకటించారు. ఈశాన్య భారతంలో రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులలో పురోగతి పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. స్మార్ట్ సిటీల్లో భాగంగా స్మార్ట్ ఐలండ్ లను అభివృద్ధి చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాల గుర్తింపు, మౌలిక వసతులు, వ్యూహాల అభివృద్ధి వంటి విభాగాల్లో సమర్థవంతమైన, ఆచరణీయ భాగస్వామ్యాల ఏర్పాటులో సహకరించుకోవాలని నిర్ణయించారు.

18. ఝార్ ఖండ్ లో సేద్యపు నీటి పారుదల ప్రాజక్టుకు, ఒడిశాలో అటవీ వనరుల నిర్వహణ ప్రాజెక్టుకు, రాజస్తాన్, ఆంధ్ర ప్రదేశ్ లలో నీటిపారుదల ప్రాజెక్టుల అభివృద్ధికి ఒడిఎ నిధులు అందుబాటులోకి తేవడంపై ప్రధాన మంత్రి శ్రీ మోదీ హర్షం ప్రకటించారు.

19. వారాణసీలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు జపాన్ ఇస్తున్నమద్దతును శ్రీ మోదీ ప్రశంసిస్తూ, ద్వైపాక్షిక సంబంధాలలో పటిష్టానికి ఇది చిహ్నమని అన్నారు.

20. భారతదేశంలో వ్యాపారానుకూల వాతావరణం మెరుగుదల కోసం శ్రీ మోదీ శక్తిమంతమైన కట్టుబాటును శ్రీ అబే ప్రశంసించారు. ఈ దిశగా పెట్టుబడుల విధానంలో సరళీకరణ, పన్ను వ్యవస్థల హేతుబద్ధీకరణ, చారిత్రకమైన జిఎస్ టి బిల్లు, దివాలా చట్టం ఆమోదం వంటి చర్యలను ప్రధాని శ్రీ అబే ప్రశంసించారు.

21. భారతదేశంలో వ్యాపారాల నిర్వహణ వాతావరణం మెరుగుదలకు ప్రధాన మంత్రి శ్రీ మోదీ తీసుకొన్న చర్యలను, జపాన్ పెట్టుబడులకు అనుకూలత పెంచడాన్ని శ్రీ అబే ప్రశంసించారు. భారతదేశంలో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ (జెఐటి) ల ఏర్పాటు కోసం ప్రధాని శ్రీ అబే తీసుకున్న చొరవను శ్రీ మోదీ ప్రశంసించారు. ఈ ప్రాజెక్టులు భారతదేశంలో తయారీ రంగంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు, నవకల్పనలు, అత్యున్నత విలువలు ప్రవేశపెట్టడానికి ఈ టౌన్ షిప్ లు సహాయపడగలవన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రతిపాదిత 12 జెఐటి లలో ప్రయోగాత్మకంగా ప్రారంభించతలపెట్టిన కొన్ని ప్రత్యేక విభాగాలకు చెందిన జెఐటి ల పురోగతి పట్ల ఇద్దరు ప్రధానులు హర్షం ప్రకటించారు. జెఐటి ల అభివృద్ధిలో సంప్రదింపులు, సహకారం మరింత పెంచుకోవాలని కూడా వారు అంగీకారానికి వచ్చారు.

22. భారతదేశంలో జపాన్ కంపెనీల ఏర్పాటు కోసం ప్రారంభించిన “జపాన్ ప్లస్” కార్యక్రమం కింద కల్పిస్తున్న సౌకర్యాలకు ప్రధాని శ్రీ అబే కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం-జపాన్ భాగస్వామ్యం ప్రోత్సాహం కోసం కేబినెట్ కార్యదర్శి నాయకత్వంలో ఏర్పాటైన కోర్ గ్రూపు సమన్వయ చర్యలను ప్రశంసించారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య అంగీకారం (సిఇపిఎ) కింద వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్య చర్చలు, ఆర్థిక సంప్రదింపులు, ఇతరత్రా సమావేశాలు ఈ ఏడాది విజయవంతంగా జరుగుతూ ఉండడం పట్ల సంతృప్తిని ప్రకటిస్తూ ఈ చర్చలు మరింత పురోగమించాలని, సబ్ కమిటీల స్థాయిలో ద్వైపాక్షిక సహకారం మరింత పెరగాలని ఉభయులు అంగీకారానికి వచ్చారు. సామాజిక భద్రతపై కూడా ఒప్పందం 2016 అక్టోబర్ లో ఆచరణలోకి రావడాన్ని ఆహ్వానిస్తూ ఇది వ్యాపార నిర్వహణ వ్యయాల తగ్గుదలకు, భారతదేశం, జపాన్ ల మధ్య ఆర్థిక సహకారం విస్తరణకు దోహదపడుతుందని వారు పేర్కొన్నారు.

23. భారతదేశంలో జపాన్ కంపెనీల ప్రత్యక్ష పెట్టుబడుల ప్రోత్సాహం కోసం నిప్పన్ ఎక్స్ పోర్ట్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ ఇన్సూరెన్స్ (ఎన్ ఇ ఎక్స్ ఐ) “జపాన్- ఇండియా మేక్ ఇన్ ఇండియా స్పెషల్ ఫైనాన్స్ ఫెసిలిటీ” కింద 1.5 ట్రిలియన్ యెన్ల నిధితో చేపడుతున్న కార్యక్రమం ప్రాధాన్యాన్ని తాము గుర్తించినట్టు ప్రధానులిద్దరూ ప్రకటించారు. ఈ కార్యక్రమం పరిధిలో భారతదేశంలో మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించేందుకు నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ ఐఐఎఫ్), జపాన్ ఓవర్ సీస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్ ఫర్ ట్రాన్స్ పోర్ట్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ (జెఒఐఎన్) ల మధ్య కుదిరిన అంగీకారాన్ని వారు ఆహ్వానించారు.

స్వచ్ఛ, హరిత భవిష్యత్తుకు కలిసి అడుగు

24. ఉభయ దేశాల ఆర్థికాభివృద్ధికి ఆధారపడదగిన, స్వచ్ఛ ఇంధనాలు అందుబాటు ధరలకు సిద్ధంగా ఉండడం అవసరమన్న విషయం ఇద్దరు ప్రధానులు అంగీకరించారు. 2016 జనవరిలో జరిగిన 8వ జపాన్- ఇండియా ఇంధన చర్చలలో కుదిరిన జపాన్- ఇండియా ఇంధన భాగస్వామ్య అంగీకారాన్ని ఆహ్వానిస్తున్నట్టు ఉభయులు ప్రకటించారు. ద్వైపాక్షిక ఇంధన సహకారం మరింత బలోపేతం చేసుకోవాలని వారు నిర్ణయించారు. ఇది ఉభయ దేశాల్లోనూ స్వచ్ఛ ఇంధనాల అభివృద్ధి కోసం ఏర్పాటైన ద్వైపాక్షిక సహకారాన్ని పటిష్టం చేయడంతో పాటు ప్రపంచంలో ఇంధన భద్రత, వాతావరణ మార్పుల అంశాల్లో పురోగతికి దోహదపడుతుందని ఉభయులు అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో పారదర్శకమైన, భిన్నత్వం గల లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ మార్కెట్ అభివృద్ధికి తమ కట్టుబాటును పునరుద్ఘాటించారు.

25. వాతావరణ మార్పులకు సంబంధించిన పారిస్ అంగీకారం సత్వరం ఆచరణీయం కావాలని ఉభయులు పిలుపు ఇచ్చారు. ఆ అంగీకారం సత్వరం అమలుకావడానికి అవసరమైన నిబంధనల రూపకల్పనకు ఉభయులు కలిసికట్టుగా కృషి చేయాలని నిర్ణయించారు. జాయింట్ క్రెడిటింగ్ యంత్రాంగం (జెసిఎమ్) ఏర్పాటు కోసం మరిన్ని సంప్రదింపులు వీలైనంత త్వరలో ప్రారంభించాలని అంగీకారానికి వచ్చారు.

26. పునరుత్పాదక ఇంధన వనరుల విభాగంలోనూ ప్రత్యేకించి ఇంటర్ నేషనల్ సోలార్ అలయెన్స్ ఏర్పాటు లోను ప్రధాన మంత్రి శ్రీ మోదీ చూపిన చొరవను ప్రధాని శ్రీ అబే ప్రశంసించారు.

27. అణు ఇంధనాన్ని శాంతియుత ప్రయోజనాలకు వినియోగించేందుకు భారతదేశం, జపాన్ ప్రభుత్వాల మధ్య కుదిరిన అంగీకారాన్ని ఇద్దరు ప్రధానులు ఆహ్వానించారు. స్వచ్ఛ ఇంధనాలు, ఆర్థికాభివృద్ధి, శాంతిసుస్థిరతలకు ఆలవాలమైన ప్రపంచం అభివృద్ధికి పరస్పర సహకారంలో ఇది ఒక మైలురాయి కాగలదని ఉభయులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

28. పర్యావరణస్నేహపూర్వక ఇంధన సామర్థ్య సాంకేతిక విజ్ఞానాల రంగంలో ఉభయ దేశాలకు చెందిన ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని ప్రధానులిద్దరూ ఆహ్వానించారు. స్వచ్ఛ బొగ్గు సాంకేతిక విజ్ఞానాలు, పర్యావరణ మిత్ర హైబ్రిడ్ వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రాచుర్యంలోకి తేవడం వంటి విభాగాలలో సహకారాన్ని పెంచుకోవాలని ఉభయులు నిర్ణయించారు. సురక్షితమైన, పర్యావరణస్నేహపూర్వక నౌకల రీ సైక్లింగ్ విభాగంలో సహకారానికి హాంకాంగ్ అంతర్జాతీయ ఒడంబడికను సత్వరం ఒక కొలిక్కి తీసుకురావాలన్న అభిప్రాయం ఇద్దరు ప్రధానులు ప్రకటించారు.

భవిష్యత్ భాగస్వామ్యానికి పునాదులు

29. ఉభయ దేశాల సమాజాల్లో మౌలిక పరివర్తనకు మరింత లోతైన శాస్త్రసాంకేతిక సహకారానికి గల విస్తృత అవకాశాలను ఇద్దరు ప్రధానులు గుర్తించారు. అంతరిక్ష సహకారం మరింత పెంచుకోవాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణించారు. జెఎఎక్స్ ఎ, ఐఎస్ ఆర్ ఒ ల మధ్య ఈ మేరకు కుదిరిన అంగీకారాన్ని ఆహ్వానించారు. సముద్ర, భూ, వాతావరణ సైన్సెస్ లో ఎర్త్ సైన్సుల మంత్రిత్వ శాఖ, జెఎఎమ్ ఎస్ టి ఇ సి ల మధ్య సహకార భాగస్వామ్య ఒప్పందానికి అనుగుణంగా సహకారం విస్తరించుకోవడం పట్ల హర్షం ప్రకటించారు. జెఇటిఆర్ ఒ, శాస్త్రసాంకేతిక విభాగం జాయింట్ కమిటీ పర్యవేక్షణలో ఐటి, ఎలక్ట్రానిక్స్, జపాన్- ఇండియా ఐఒటి పెట్టుబడుల చొరవలో చోటు చేసుకున్నపురోగతి పట్ల కూడా వారు హర్షం ప్రకటించారు.

31. వైపరీత్యాల రిస్క్ నివారణకు సంబంధించి ఐక్యరాజ్యసమితి నిర్వహణలోని ప్రపంచ సదస్సు అనంతరం న్యూఢిల్లీలో “వైపరీత్యాల రిస్క్ నివారణకు సంబంధించి ఆసియా దేశాల మంత్రుల స్థాయి సదస్సు 2016” విజయవంతంగా నిర్వహించడాన్ని ఉభయ దేశాల ప్రధానులు ఆహ్వానించారు.
వైపరీత్యాల నివారణ, రిస్క్ తగ్గింపు విభాగాల్లో సహకారం విస్తరణకు గల అవకాశాలను వారు గుర్తించారు. సునామీ వంటి వైపరీత్యాల పట్ల ప్రపంచ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు, దాన్ని నివారించగల పరికరాలు సిద్ధం చేసుకునేందుకు ప్రపంచ సునామీ చైతన్య దినోత్సవం నిర్వహణ ప్రాధాన్యతను గుర్తించడాన్ని కూడావారు ప్రశంసించారు.

32. యాంటి మైక్రోబియల్ రెసిస్టెన్స్, స్టెమ్ సెల్ పరిశోధన, ఫార్మా, మెడికల్ పరికరాలతో సహా ఆరోగ్య సంరక్షణ రంగంలో సహకారం పెంచుకోవడానికి జరుగుతున్నకృషిని ఇద్దరు ప్రధానులు ఆహ్వానించారు. జపాన్ లో జనరిక్ ఔషధాల పంపిణీని పెంచడం కోసం భారతదేశం, జపాన్ ల ఫార్మా కంపెనీల మధ్య సహకారానికి గల అవకాశాలను కూడా వారు గుర్తించారు.

భాగస్వామ్య మనుగడకు ప్రజలపై పెట్టుబడి

33. పర్యాటకం, ఒక దేశానికి చెందిన యువకులను మరొక దేశానికి పంపించుకోవడం, విద్యా సహకారం రంగాల్లో అవకాశాలు మరింతగా పెంచుకోవలసిన అవసరం ఉన్నదని ఉభయ దేశాల ప్రధానులు పిలుపు ఇచ్చారు. 2017 సంవత్సరాన్ని భారతదేశం, జపాన్ సాంస్కృతిక, పర్యాటక స్వేహపూర్వక సహకార భాగస్వామ్య సంవత్సరంగా నిర్వహించాలని వారు నిర్ణయించారు. సాంస్కృతిక సహకారం విషయంలో ఎమ్ఒసి చొరవను వారు ప్రశంసించారు. ఉభయ దేశాల మధ్య పర్యాటకుల ప్రోత్సాహానికి వారు బలమైన కట్టుబాటు ప్రకటించారు. ఇండియా- జపాన్ టూరిజం కౌన్సిల్ ప్రారంభ సమావేశం పట్ల సంతృప్తి ప్రకటిస్తూ 2017లో జపాన్ లో జరుగనున్న రెండో సమావేశం కోసం ఎదురు చూస్తున్నట్టు ప్రకటించారు. 2016 సంవత్సరంలో ఢిల్లీలో జపాన్ జాతీయ టూరిజం ఆర్గనైజేషన్ ఏర్పాటు కావడాన్ని వారు ఆహ్వానించారు.

34. భారత విద్యార్థులకు వీసా నిబంధనలు సడలిస్తున్నట్టు, వీసా దరఖాస్తు కేంద్రాల సంఖ్య 20కి పెంచనున్నట్టు ప్రధాని శ్రీ అబే ప్రకటించారు. జపాన్ పర్యాటకులకు వీసా ఆన్ అరైవల్ సదుపాయం కల్పించడం, జపాన్ పర్యాటకులు, ఇన్వెస్టర్లకు దీర్ఘకాలిక పది సంవత్సరాల వీసా అందుబాటులోకి తెచ్చినందుకు ప్రధాని శ్రీ మోదీకి ప్రధాని శ్రీ అబే ధన్యవాదాలు తెలిపారు.

35. ఆసియాలో నిపుణులైన మానవ వనరుల మార్పిడి కోసం జపాన్ చేపడుతున్న “ఇన్నోవేటివ్ ఆసియా” చొరవ గురించి శ్రీ అబే వివరించారు. ఈ చొరవతో భారతీయ విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఇంటర్న్ షిప్ లు పొందడానికి మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, నవకల్పనలకు మరింత ఉత్తేజం ఏర్పడుతుందని వారు అభిప్రాయపడ్డారు.

36. విద్యారంగంపై అత్యున్నత స్థాయి విధాన చర్చలు విజయవంతంగా ప్రారంభం కావడం పట్ల ఉభయులు సంతృప్తిని ప్రకటిస్తూ విశ్వవిద్యాలయాల మధ్య అనుసంధానం పెంచడం ద్వారా ఈ బంధాన్ని మరింత పటిష్టపరచుకోవాలని నిర్ణయించారు. సకురా సైన్స్ ప్లాన్ (శాస్ర్త రంగంలో జపాన్ ఆసియా యువకుల మధ్య పర్యటనలకు అవకాశాల కల్పన) వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా సరికొత్త విద్యా నమూనాలను ఆచరణీయం చేయడంలో అత్యుత్తమ ప్రమాణాలు ఇచ్చి పుచ్చుకోవాలని ఉభయులు నిర్ణయించారు.

37. 2020 టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్ లపై ప్రధానంగా గురి పెడుతూ భారతీయ యువజన, క్రీడల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జపాన్ కు చెందిన విద్య, సంస్కృతి, క్రీడలు, శాస్త్రసాంకేతిక శాఖలు అనుభవాలు, నైపుణ్యాలు, పరిజ్ఞానం, సమాచారం మార్పిడి కోసం కుదుర్చుకున్న సహకార ఒప్పందాన్ని ఇద్దరు ప్రధానులు ఆహ్వానించారు. 2020 టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్ విజయవంతంగా నిర్వహించడానికి సహకరిస్తామన్న ప్రధాని శ్రీ మోదీ ప్రకటనను శ్రీ అబే ఆహ్వానించారు.

38. ప్రభుత్వ స్థాయి, పార్లమెంటు సభ్యుల స్థాయిలో సంప్రదింపులకు గల అవకాశాన్ని ఇద్దరు ప్రధానులు గుర్తించారు. పరస్పర సహకారం కోసం గుజరాత్ రాష్ర్ట ప్రభుత్వం, హ్యోగో ప్రిఫెక్చర్ సంస్థల మధ్య కుదిరిన అంగీకారాన్ని వారు ఆహ్వానించారు. ఉభయ దేశాలకు చెందిన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలైన వారాణసీ, క్యోటో నగరాల మధ్య సహకారం బలోపేతం చేసుకొనేందుకు జరుగుతున్నకృషి పట్ల వారు సంతృప్తి ప్రకటించారు.

39. అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణపై జపాన్ లో ఏర్పడిన ఆసక్తిని ప్రధాని శ్రీ మోదీ స్వాగతించారు. అత్యంత ప్రాచుర్యం కలిగిన యోగా ఇన్ స్టిట్యూట్ లలో శిక్షణ కోసం జపాన్ ఔత్సాహికులు భారత స్కాలర్ షిప్ లను వినియోగించుకోవచ్చునని ప్రధాని చెప్పారు.

40. మహిళా సాధికారిత ప్రాధాన్యాన్ని ఉభయ ప్రధానులు నొక్కి వక్కాణిస్తూ వరల్డ్ అసెంబ్లీ ఫర్ విమెన్ (డబ్ల్యుఎడబ్ల్యు) వంటి వేదికల ద్వారా ఈ రంగంలో కూడా సహకారాన్ని బలోపేతం చేసుకోవాలన్నకట్టుబాటును ప్రకటించారు.

41. సాంప్రదాయకమైన అహింస, సహనం, ప్రజాస్వామ్య సిద్ధాంతాల బాటలోని ఆసియా భవిష్యత్తును తీర్చి దిద్దాలన్న అభిప్రాయాన్ని ఉభయ దేశాల ప్రధానులు వ్యక్తం చేశారు. ఆసియాలో ప్రజాస్వామ్యం, భాగస్వామ్య విలువలు అనే అంశంపై 2016 జనవరిలో జరిగిన గోష్ఠిని ఆహ్వానిస్తూ 2017లో జరుగనున్న తదుపరి గోష్ఠికి ఎదురు చూస్తున్నట్టు ప్రకటించారు.

ఇండో పసిఫిక్ ప్రాంతంలో నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థ ఆవిష్కరణకు ఉమ్మడి కృషి

42. 21వ శతాబ్దిలో ఇండో- పసిఫిక్ ప్రాంతం సుసంపన్నతకు భారతదేశం, జపాన్ ల సహకారాన్ని ఉభయులు గుర్తించారు. ఉభయుల మధ్య సారూప్యతలను కాపాడుకుంటూ భాగస్వామ్య విలువలను పరిరక్షించుకోవాలని, ఆర్థిక,సామాజికాభివృద్ధిలో భాగస్వామ్యాన్ని విస్తరించుకోవాలని, సామర్థ్యాల నిర్మాణానికి, అనుసంధానం పెంపునకు, మౌలిక వసతుల అభివృద్ధకి కృషి చేయాలని ఇద్దరు ప్రధానులు నిర్ణయించారు. జపాన్ కు చెందిన ఒడిఎ ప్రాజెక్టుల ద్వారా ఈ మానవతా, ఆర్థిక, సాంకేతిక వనరులను ఒక చోటుకు చేర్చి పటిష్ట కృషికి బాటలు వేసేందుకు శ్రీ అబే ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రతిపాదించారు. ఈ విభాగంలో ద్వైపాక్షిక సహకారానికి గల ప్రాధాన్యాన్ని శ్రీ మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

43. ఆఫ్రికాలో శిక్షణ, నైపుణ్యాల నిర్మాణం, ఆరోగ్యం, మౌలిక వసతులు, అనుసంధానం విభాగాలలో సహకారంపై ఉమ్మడి ప్రాజెక్టుల కోసం అన్వేషణపై భారతదేశం, జపాన్ చర్చల ప్రాధాన్యత ప్రాముఖ్యాన్ని ఉభయులు నొక్కి వక్కాణించారు. ఆసియా, ఆఫ్రికా ఖండాలలో ఇండస్ట్రియల్ కారిడర్ లు, ఇండస్ట్రియల్ నెట్ వర్క్ ల అభివృద్ధిలో అంతర్జాతీయ సమాజంతో సహకరించుకొనేందుకు ఉభయులు సంసిద్ధత ప్రకటించారు.

44. దక్షిణాసియాలోను, ఇరాన్, అఫ్గానిస్తాన్ ల వంటి పొరుగు ప్రాంతాలలోను ద్వైపాక్షిక, త్రైపాక్షిక మార్గాల ద్వారా శాంతి, సుసంపన్నతలను ప్రోత్సహించేందుకు సహకరించుకోవాలని ప్రధానులు ఇద్దరూ నిర్ణయించారు. చాబహార్ పోర్టు ద్వారా కనెక్టివిటీ పెంపు, మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేయాలని నిర్ణయించారు. ఇలాంటి సహకారానికి సంబంధించిన వివరాలు సత్వరం రూపొందించాలని వారు తమ దేశాల అధికారులను ఆదేశించారు.

45. హెచ్ ఎ/ డిఆర్ విభాగంలో సహకారం, సమన్వయం, ప్రాంతీయ అనుసంధానం, సముద్ర జలాల భద్రత, నిఘా వంటి విభాగాల్లో సహకారం, సమన్వయం బలోపేతం చేసుకునేందుకు అమెరికా, జపాన్, భారతదేశం ల మధ్య త్రైపాక్షిక చర్చలను కూడా ఇద్దరు ప్రధానులు ఆహ్వానించారు. జపాన్, భారతదేశం, ఆస్ట్రేలియా లమధ్య త్రైపాక్షిక చర్యలను కూడా ఆహ్వానించారు.

46. ప్రాంతీయ రాజకీయ,ఆర్థిక, భద్రతాపరమైన అంశాలపై చర్చించేందుకు తూర్పు ఆసియా శిఖరాగ్రం (ఇఎఎస్) చేపట్టిన చొరవను శక్తిమంతం చేసే దిశగా చోటు చేసుకున్న పురోగతిని ఆహ్వానిస్తూ దీనిని మరింత క్రియాశీలంగా తయారుచేసేందుకు కృషి చేయాలని ఉభయులు నిర్ణయించారు. జకార్తాలో ఇఎఎస్ రాయబారుల సమావేశం నిర్వహణ కోసం, ఎఎస్ఇఎఎన్ (ఆసియాన్) సచివాలయంలో ఇఎఎస్ యూనిట్ ఏర్పాటు కోసం జరుగుతున్న కృషిని వారు ఆహ్వానించారు. ఇఎఎస్ ఒడంబడిక పరిధిలో సాగర జలాల్లో సహకారాన్ని, ప్రాంతీయ అనుసంధానతను విస్తరించుకోవాల్సిన అవసరం ఉన్నదని ఉభయులు నొక్కి చెప్పారు.

47. ఆసియాన్ ప్రాంతీయ వేదిక, ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం ప్లస్, విస్తరించిన ఆసియాన్ సాగరజలాల సహకార వేదిక ద్వారా ప్రాంతీయ సహకార వ్యవస్థను మరింత పటిష్ఠం చేసుకోవాలన్న ఆకాంక్ష ఉభయులు వ్యక్తం చేశారు. సాగర జలాల భద్రతకు ఎదురవుతున్న సవాళ్ళు, ఉగ్రవాదం, దౌర్జన్యపూరిత తీవ్రవాదం, వాతావరణ మార్పుల పరమైన సమస్యలు వంటి ప్రాంతీయ సవాళ్ళను ఎదుర్కొనడంలో ఈ కూటమి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఉభయులు నిర్ణయించారు.

48. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో సమతూకమైన, బహిరంగా, సమ్మిళిన, సుస్థిర, పారదర్శక, నిబంధనల ఆధారిత ఆర్థిక, రాజకీయ, భద్రతా వ్యవస్థ ఏర్పాటుకు ప్రాంతీయ, త్రైపాక్షిక చర్చల యంత్రాంగం ఎంతో సహాయకారిగా ఉంటుందన్న గట్టి విశ్వాసం ఉభయులు ప్రకటించారు.

49. ఇద్దరు ప్రధానులు ఉగ్రవాద కార్యకలాపాలను ముక్తకంఠంతో ఖండించారు. ఉగ్రవాదాన్నిఎంత మాత్రం సహించేది లేదని స్పష్టంచేశారు. ఉగ్రవాదం, దౌర్జన్యపూరిత తీవ్రవాదం అన్ని ప్రాంతాలకు విస్తరించాయంటూ వారు ఆందోళన వెలిబుచ్చారు. ఇటీవల ఢాకా, ఉరీ లలో చోటు చేసుకున్న ఉగ్రవాద సంఘటనల్లో బాధిత కుటుంబాలకు వారు సానుభూతి తెలియచేశారు. ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రత మండలి తీర్మానాలు 1267, ఇతర తీర్మానాలను తు.చ. తప్పకుండా అమలుపరచాలని వారు పిలుపు ఇచ్చారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న ప్రదేశాలు, మౌలిక వసతులు, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం అందిస్తున్న సంస్థలను ధ్వంసం చేయాలని, సీమాంతర ఉగ్రవాదుల కదలికలను నిలువరించాలని దేశాలన్నింటికీ ప్రధానులిద్దరూ పిలుపు ఇచ్చారు. నానాటికీ పెరిగిపోతున్న ఉగ్రవాద భూతాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఏర్పాటు కావాలసిన అవసరం ఉన్నదని వారు నొక్కి చెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాలు నిలువరించేందుకు జరుగుతున్న ద్వైపాక్షిక చర్చల ద్వారా సమాచారం, గూఢచారి సమాచారం పంచుకునేందుకు సహకారం విస్తరించుకోవాలని ఇద్దరు ప్రధానులు పిలుపు ఇచ్చారు. 2008 నవంబర్ లో జరిగిన ముంబయ్ ఉగ్రవాద దాడులు, 2016లో జరిగిన పఠాన్ కోట్ ఉగ్రవాద దాడులకు కారణమైన వారిని న్యాయవ్యవస్థ ముందుకు తెచ్చే చర్యలు చేపట్టాలని పాకిస్తాన్ కు ఉభయులు పిలుపు ఇచ్చారు.

50. అంతర్జాతీయంగా అందరికీ ఆందోళన రేకెత్తించే సాగరజలాలు, అంతరిక్షం, సైబర్ విభాగాలలో సహకారం విస్తరించుకోవాలని ఉభయులు ధ్రువీకరించుకున్నారు.

51. ఐక్యరాజ్యసమితి సాగర జలాల న్యాయ సదస్సు తీర్మానాలకు అనుగుణంగా సాగర జలాలకు పైన గల గగన ఉపరితలంలోనూ, సాగరజలాల్లోనూ, న్యాయబద్ధమైన వాణిజ్యంలోనూ సహకారాన్ని విస్తరించుకోవాలని ఉభయులు వచనబద్ధతను పునరుద్ఘాటించారు. శాంతియుత మార్గాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని, వివిధ కార్యకలాపాల నిర్వహణలో స్వయంనియంత్రణను పాటించాలని, ఉద్రిక్తతలకు కారణమయ్యే ఏకపక్ష ధోరణులకు స్వస్తి చెప్పాలని వారు అన్ని దేశాలకు పిలుపు ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి సాగర జలాల న్యాయ సదస్సు తీర్మానాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడాలని ఆ ఒడంబడికపై సంతకాలు చేసిన దేశాలైన భారతదేశం, జపాన్ లు పిలుపు ఇచ్చాయి. దక్షిణ చైనా సముద్రానికి సంబంధించిన వివాదాన్ని కూడా శాంతియుత మార్గంలోనే పరిష్కరించుకోవాలని సూచించారు.

52. ఉత్తర కొరియా నిరంతర పరమాణు ఆయుధ కార్యక్రమాన్ని, గతిశీల క్షిపణులు, యురేనియం శుద్ధి కార్యకలాపాలను ఉభయులు తీవ్ర స్వరంతో ఖండించారు. మరిన్ని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలితో సహా అన్ని అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడాలని పిలుపు ఇచ్చారు. కొరియా ఉపఖండంలో పరమాణు నిరస్త్రీకరణకు కృషి చేయాలని కోరారు. ప్రాంతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నకార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడాలన్న దృఢమైన కట్టుబాటును ప్రకటించారు.

53. “శాంతికి సానుకూలమైన సహకారం అందించేందుకు రూపొందించిన కార్యక్రమం” ద్వారా ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, సుస్థిరతలకు జపాన్ చేస్తున్న కృషిని ప్రధాని శ్రీ అబే వివరించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ స్థిరత్వం, సుసంపన్నతలకు జపాన్ చేస్తున్న కృషిని ప్రధాని శ్రీ మోదీ ప్రశంసించారు.

54. భద్రత మండలితో పాటు ఐక్యరాజ్యసమితి వ్యవస్థను 21వ శతాబ్ది అవసరాలకు అనుగుణంగా సంపూర్ణ ప్రాతినిధ్యం కలది గాను, మరింత చట్టబద్ధమైంది గాను తీర్చి దిద్దే దిశగా ఒకే రకమైన ఆలోచనా ధోరణులు గల వారందరితో కలిసికట్టుగా సంస్కరణలకు సత్వర చర్యలు తీసుకోవాలని ప్రధానులు ఇద్దరూ పిలుపు ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి భద్రత మండలి సంస్కరణల కోసం “గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్” ఏర్పాటును వారు ఆహ్వానించారు. భద్రతమండలి విస్తరణలో న్యాయబద్ధమైన సభ్యులు కావడానికి అర్హత గల దేశాలుగా ఉభయులు ఒకరి సభ్యత్వాన్ని మరొకరు బలపరచుకోవాలని ఇద్దరు ప్రధానులు కట్టుబాటు ప్రకటించారు.

55. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం, త్వరిత గతిన విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశం ఎపిఇసి (అపెక్) కూటమిలో సభ్యత్వదేశం అయ్యేందుకు సంపూర్ణ సహకారాన్ని అందించనున్నట్టు జపాన్ ప్రకటించింది. ఆసియా- పసిఫిక్ ప్రాంతంలో సరళీకరణకు, పెట్టుబడులు, వాణిజ్య స్వేచ్ఛకు కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధానులిద్దరూ నిర్ణయించారు. ఆధునిక, సమకాలీన, అత్యున్నత నాణ్యతతో కూడిన పరస్పర ప్రయోజనకరమైన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (ఆర్సిఇపి) ఆచరణీయం చేయడానికి సహకరించుకోవాలని కూడా వారు నిర్ణయించారు. డబ్ల్యుటిఓ వాణిజ్య వెసులుబాటు ఒప్పందం, విస్తరించిన వాణిజ్య వస్తు సేవల ఒప్పందం, ఆసియా- పసిఫిక్ ప్రాంతీయ పెట్టుబడుల ఒప్పందాల పరిధిలో వాణిజ్య సరళీకరణకు కృషి చేయాలని ప్రధానులిద్దరూ నిర్ణయించారు. ఉక్కు రంగంలో మితిమీరిన సామర్థ్యాలకు సంబంధించిన సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంతో పాటు జి20 దేశాల నాయకుల తీర్మానానికి అనుగుణంగా అధిక సామర్థ్యాలకు సంబంధించి అంతర్జాతీయ వేదిక ఏర్పాటుకు కృషి చేయాలని ఉభయులు పునరుద్ఘాటించారు.

56. అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలించేందుకు ఉభయులు కట్టుబాటు ప్రకటించారు. సమగ్ర పరమాణు పరీక్షల నిషేధ ఒప్పందంలో (సిటిబిటి) సత్వరం భాగస్వామి కావాలన్న ఆకాంక్ష ప్రధాని శ్రీ అబే ప్రకటించారు. షెనాన్ ఒప్పందానికి అనుగుణంగా ప్రమాదకర పదార్థాల కటాఫ్ ఒప్పందంపై వివక్షరహితంగా చర్చలు సత్వరం పూర్తి చేసి అంతర్జాతీయ బహుళపాక్షిక ఒప్పందాన్ని రూపొందించాలని వారు పిలుపు ఇచ్చారు. అణ్వాయుధ వ్యాప్తి నిరోధం, అణు ఉగ్రవాదం వంటి సవాళ్ళపై అంతర్జాతీయ సహకారం మరింత బలోపేతం చేసుకొనేందుకు ప్రయత్నాలు కొనసాగించాలని వారు తీర్మానించారు.

57. సమగ్ర అంతర్జాతీయ ఎగుమతుల అదుపు వ్యవస్థ ఏర్పాటుకు గల ప్రాధాన్యాన్ని ఇద్దరు ప్రధానులు గుర్తించారు. అణు సాంకేతిక పరిజ్ఞానం అదుపు వ్యవస్థ (ఎమ్ టిసిఆర్), ఖండాంతర అణు క్షిపణుల వ్యాప్తి నిరోధానికి హేగ్ ప్రవర్తనా నియమావళి (హెచ్ ఇ ఒ సి), ఎగుమతి అదుపు యంత్రాంగాల్లో భారతదేశం ఇటీవల భాగస్వామి కావడాన్ని జపాన్ ఆహ్వానించింది. మిగతా మూడు అంతర్జాతీయ ఎగుమతి నిరోధక వ్యవస్థల్లోనూ (అంతర్జాతీయ అణ్వాయుధ వ్యాప్తి నిరోధక వ్యవస్థలను పటిష్ఠం చేసేందుకు ఉద్దేశించిన ఆస్ట్రేలియా గ్రూప్, వాసెనార్ ఒప్పందం, పరమాణు సరఫరాదారుల బృందం) భారతదేశం పూర్తి సభ్యత్వం కోసం ఉమ్మడిగా కృషి చేయాలని ప్రధానులు ఇద్దరూ అంగీకారానికి వచ్చారు.

ముగింపు

58. జపాన్ ప్రజలు, ప్రభుత్వం ప్రదర్శించిన ఆదరాభిమానాలకు ప్రధాన మంత్రి శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. తదుపరి శిఖరాగ్ర సమావేశం కోసం ఉభయులకు ఆమోదయోగ్యమైన తేదీలలో భారత పర్యటనకు రావాలని ప్రధాని అబేను సాదరంగా ఆహ్వానించారు. ప్రధాని అబే ఆ ఆహ్వానాన్ని ఆమోదించారు.