రక్షణ దళాల సిబ్బంది సంక్షేమం కోసం నగదు, వస్తు రూపాలలో స్వచ్ఛందంగా ప్రజల నుంచి అందిన విరాళాల బాధ్యతను స్వీకరించేందుకు, వాటిని వినియోగించే తీరుపైన నిర్ణయాలు తీసుకొనేందుకు జాతీయ రక్షణ నిధి (ఎన్ డి ఎఫ్)ని ఏర్పాటు చేశారు. అర్ధ సైనిక దళాలతో సహా సాయుధ దళాల సిబ్బంది, వారిపైన ఆధారపడిన వారి సంక్షేమం కోసం ఈ నిధిని వినియోగిస్తారు. ప్రధాన మంత్రి చైర్ పర్సన్ గాను, రక్షణ, ఆర్థిక, హోం శాఖల మంత్రులు సభ్యులుగాను ఉండే ఒక కార్యనిర్వహణ సంఘం ఈ నిధిని నిర్వహిస్తుంది. ఈ నిధికి ఆర్థిక మంత్రి కోశాధికారి గాను, ప్రధాన మంత్రి కార్యాలయంలో ఈ విభాగాన్ని చూసే సంయుక్త కార్యదర్శి ఈ కార్యవర్గ సంఘానికి కార్యదర్శి గాను వ్యవహరిస్తారు. ఈ నిధి ఖాతాలు భారతీయ రిజర్వ్ బ్యాంకు వద్ద ఉంచుతారు. ఈ నిధి ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాల పైనే పూర్తిగా ఆధారపడుతుంది. దీనికి బడ్జెటు నుంచి ఎలాంటి నిధులను కేటాయించరు. ఈ నిధి దాతల నుంచి ఆన్ లైన్ లో విరాళాలను స్వీకరిస్తుంది. అటువంటి విరాళాలను pmindia.nic.in, pmindia.gov.in మరియు భారతీయ స్టేట్ బ్యాంక్ వెబ్ సైట్ అయిన www.onlinesbi.com ద్వారా అందించవచ్చు. ఎన్ డిఎఫ్ ఖాతా సంఖ్య 11084239799. ఈ ఖాతా ఉన్న బ్యాంక్ చిరునామా State Bank of India, Institutional Division, 4th Floor, Parliament Street, New Delhi.
ఈ ఫండ్ కు ఒక శాశ్వత ఖాతా సంఖ్య (PAN) కూడా కేటాయించారు. ఆ నంబర్ AAAGN0009F.
గత ఐదేళ్ళ కాలంలో ఎన్ డిఎఫ్ ఆదాయ వ్యయాల వివరాలు ఇలా ఉన్నాయి..
సంవత్సరం | వ్యయం | జమలు | ఖాతాలో నిల్వ |
---|---|---|---|
31.03.2020 | 54.62 | 103.04 | 1249.96 |
31.03.2021 | 52.51 | 87.04 | 1284.49 |
31.03.2022 | 70.75 | 90.64 | 1304.38 |
31.03.2023 | 77.76 | 110.74 | 1337.36 |
31.03.2024 | 60.43 | 119.29 | 1396.22 |
ఎన్ డిఎఫ్ పరిధిలోని స్కీమ్ లు
1. వీరమరణం పొందిన సాయుధ దళాలు, పారా మిలిటరీ దళాల సిబ్బంది కుటుంబాల్లోని వితంతువులు, అమరులైన సిబ్బంది సంరక్షణలో ఉన్న వారికి సాంకేతిక విద్య, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్య ల కోసం ఈ నిధి కింద ఒక ఉపకార వేతనాల పథకాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పథకాన్ని సాయుధ దళాల సిబ్బందికి సంబంధించినంతవరకు రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని మాజీ సైనికోద్యోగుల సంక్షేమ విభాగం నిర్వహిస్తున్నది. ఇక పారా మిలిటరీ దళాల సిబ్బంది, మరియు రైల్వే రక్షణ దళాలకు సంబంధించినంతవరకు క్రమానుగతంగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మరియు రైల్వేల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నాయి.
నేషనల్ డిఫెన్స్ ఫండ్ పరిధిలో అమలు చేస్తున్న ‘పిఎమ్ స్కాలర్ షిప్ స్కీమ్’ ముఖ్య లక్షణాలు ఇలా ఉన్నాయి.
1. పారా మిలిటరీ దళాలతో సహా సాయుధ దళాల సిబ్బంది అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఈ స్కీమ్ కింద నెలవారీ స్కాలర్ షిప్ లను (ఎ) మాజీ సైనికోద్యోగుల (అధికారి హోదాకు దిగువన ఉన్న వారికి మాత్రమే) సంరక్షితులకు, (బి) అటువంటి సిబ్బంది వితంతువులకు, (సి) విధి నిర్వహణ వర్గీకరణ లోకి వచ్చే కార్యకలాపాలలో వీర మరణం పొందిన వారి వితంతువులకు, (డి) సర్వీస్ లో ఉన్న పారా మిలిటరీ, రైల్వే రక్షణ దళం సిబ్బంది వితంతువులు, వారి సంరక్షణలో ఉన్న వారికి అందజేస్తారు. సాంకేతిక సంస్థలలో (వైద్య, దంత వైద్య, పశు వైద్య, ఇంజినీరింగ్, ఎమ్ బి ఏ, ఎ మ్ సి ఎ, మరియు ఎ ఐ సి టి ఇ/ యు జి సి ఆమోదం తో కూడిన ఇతర సమాన సాంకేతిక వృత్తి విద్యా సంస్థలలో) విద్యాభ్యాసం కోసం స్కాలర్ షిప్ లు లభిస్తాయి. విధి నిర్వహణలోని వీరమరణం పొందిన సిబ్బంది వితంతువులకు మరియు వితంతువుల సంరక్షితులకు (పైన పేర్కొన్న బి, సి శ్రేణిలోని వారు) ఎటువంటి ర్యాంక్ పరమైన ఆంక్షలు వర్తించవు. పారా మిలిటరీ దళాలకు చెందిన సిబ్బంది సంరక్షితులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద రక్షణ శాఖ నియంత్రణ లోని మాజీ సైనికోద్యోగుల కుటుంబ సభ్యులకు ప్రతి సంవత్సరం 4000 కొత్త స్కాలర్ షిప్ లు, హోం అఫైర్స్ శాఖ నియంత్రణ లోని సాయుధ దళాల సిబ్బంది సంరక్షణలో ఉన్న వారికి ప్రతి సంవత్సరం 910 కొత్త స్కాలర్ షిప్ లు, రైల్వే శాఖ నియంత్రణ పరిధి లోని సిబ్బంది సంరక్షితులకు ప్రతి సంవత్సరం 90 కొత్త స్కాలర్ షిప్‌లు ఇస్తారు. అయితే, 2015-16 విద్యా సంవత్సరం నుండి ఈ కొత్త స్కాలర్ షిప్ ల సంఖ్యను రక్షణ మంత్రిత్వ శాఖ నియంత్రణ లోని మాజీ సైనికోద్యోగుల సంరక్ష ణ లో ఉన్న వారి కోసం 5500 కు పెంచారు. అలాగే హోం అఫైర్స్ శాఖ నియంత్రణ లోకి వచ్చే సాయుధ దళాల సిబ్బంది సంరక్షితులకు ఈ కొత్త స్కాలర్ షిప్ ల సంఖ్యను 2000 కు, రైల్వే శాఖ నియంత్రణ లోని సిబ్బంది సంరక్షితులకు ఈ కొత్త స్కాలర్ షిప్ ల సంఖ్యను150 కి పెంచారు. మొదట్లో బాలురకు నెలకు 1250 రూపాయలు, బాలికలకు నెలకు 1500 రూపాయలు స్కాలర్ షిప్ లభించేది. వార్షిక స్కాలర్ షిప్ రేట్ లను బాలురకు నెలకు 2000 రూపాయలుగాను, బాలికలకు నెలకు 2250 రూపాయలుగాను సవరించారు.
2. ఎస్ పిజి సిబ్బంది, వారి కుటుంబాల ప్రయోజనార్థం వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు ఎస్ పిజి వెల్ఫేర్ ఫండ్ కు ఎన్ డిఎఫ్ నుంచి 15 లక్షల వార్షిక గ్రాంట్ ను విడుదల చేస్తున్నారు.
3. త్రివిధ రక్షణ దళాలు (సైన్యం, నావీకా దళం మరియు వైమానిక దళం) మరియు కోస్ట్ గార్డ్ యొక్క సిబ్బంది కోసం పుస్తకాలు మరియు ఇతర పఠనా సామగ్రి కొనుగోలు కోసం రక్షణ మంత్రిత్వశాఖకు సంవత్సరానికి నిధులు మంజూరు చేయబడతాయి. ప్రస్తుత నిధులు సైన్యానికి రూ .55 లక్షలు, వైమానిక దళానికి రూ .37 లక్షలు, నౌకాదళానికి రూ. 32 లక్షలు మరియు కోస్ట్ గార్డ్‌కు రూ .2.50 లక్షలు మొత్తంగా రూ .126.50 లక్షలు మంజూరవుతున్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గానూ ఇటీవలే రూ .126.50 లక్షల రూపాయిలు మంజూరైయ్యాయి.
(11.07.2024 వరకు సమాచారాన్ని అప్ డేట్ చేయడమైంది)