ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ జి-20 భారత అధ్యక్షతలో భాగంగా ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల తొలి సమావేశంలో వీడియో సందేశం మాధ్యమం ద్వారా ప్రసంగించారు. భారత జి-20 అధ్యక్షత కింద ఇది మొట్టమొదటి మంత్రుల స్థాయి చర్చల కార్యక్రమమని ఆయనన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సమావేశం నిర్మాణాత్మకంగా సాగుతుందన్న ఆశాభావం వెలిబుచ్చుతూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచం నేడు అనేక సవాళ్ల మధ్య తీవ్ర ఆర్థిక కష్టనష్టాలను చవిచూస్తున్న వేళ ఏర్పాటైన ఈ సమావేశంలో వివిధ ప్రపంచ ద్రవ్య, ఆర్థిక వ్యవస్థల నేతృత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు పాల్గొంటున్నారని ప్రధానమంత్రి అన్నారు.
కోవిడ్ మహమ్మారి విజృంభణ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావాలను ప్రధానమంత్రి ఏకరువు పెట్టారు. ఈ మేరకు పెచ్చుమీరుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ సరఫరా శ్రేణిలో అంతరాయాలు, ధరల పెరుగుదల, ఆహార-ఇంధన భద్రత, అనేక దేశాల సహనశీలతను ప్రభావితం చేసే రుణభారం స్థాయి, సత్వర సంస్కరణలు లేక అంతర్జాతీయ ఆర్థిక సంస్థలపై నమ్మకం సన్నగిల్లడం వంటి అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో- ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం, విశ్వాసం, వృద్ధిని తిరిగి పురిగొల్పే బాధ్యత ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక-ద్రవ్య వ్యవస్థల సంరక్షకులపైనే ఉన్నదని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
భారత ఆర్థిక వ్యవస్థ చైతన్యం గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ- భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై దేశంలోని వినియోగదారులు-ఉత్పత్తిదారులలోగల ఆశావాదాన్ని ఎత్తిచూపారు. సమావేశంలో పాల్గొంటున్న ప్రతినిధులు ఈ సానుకూల భావన స్ఫూర్తితో దీన్ని ప్రపంచ వ్యాప్తం చేయగలరని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో అత్యంత దుర్బలులైన పౌరులపై చర్చలను కేంద్రీకరించాలని ప్రధానమంత్రి వారిని కోరారు. ప్రపంచ ఆర్థిక నాయకత్వం ప్రపంచ విశ్వాసాన్ని తిరిగి చూరగొనాలంటే సార్వజనీన కార్యక్రమ రూపకల్పనతోనే సాధ్యమని ఆయన నొక్కి చెప్పారు. ఈ దిశగా “మా జి-20 అధ్యక్షత ఇతివృత్తం ‘ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు’ అన్నది సార్వజనీన దృక్పథాన్ని ప్రోత్సహిస్తుంది” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
ప్రపంచ జనాభా 800 కోట్ల స్థాయిని దాటినప్పటికీ సుస్థిర ప్రగతి లక్ష్యాల పురోగమనం మందగిస్తున్నట్లు కనిపిస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పు, అధిక రుణభారం వంటి ప్రపంచ సవాళ్ల పరిష్కారానికి బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఆర్థిక ప్రపంచంలో సాంకేతికత ఆధిపత్యం పెరుగుతుండటాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- మహమ్మారి సమయంలో డిజిటల్ చెల్లింపు ఆధారిత పరోక్ష-నిరంతర లావాదేవీలను భారత్ ప్రారంభించిందని ప్రధాని గుర్తు చేసుకున్నారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత్వం, దుర్వినియోగ ముప్పుల నియంత్రణ దిశగా ప్రమాణాలను ఉన్నతీకరిస్తూ సాంకేతికత శక్తిని అన్వేషించాలని, సద్వినియోగం చేసుకోవాలని సమావేశంలో పాల్గొంటున్న సభ్యదేశాల ప్రతినిధులను కోరారు.
భారతదేశం తన డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థలో కొన్నేళ్ల వ్యవధిలోనే అత్యంత సురక్షిత, అత్యంత విశ్వసనీయ, అత్యంత సమర్థ ప్రభుత్వ డిజిటల్ మౌలిక సదుపాయాలను సృష్టించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాగే “మా డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థ ఉచిత ప్రజా ప్రయోజనంగా రూపొందించబడింది” అని సగర్వంగా చాటారు. దేశంలో పాలన, ఆర్థిక సార్వజనీనత, జీవన సౌలభ్యాలను ఇది సమూలంగా మార్చిందని కూడా ప్రధాని నొక్కిచెప్పారు. భారత సాంకేతిక రాజధాని అయిన బెంగళూరులో ఈ సమావేశం నిర్వహిస్తుండటాన్ని ప్రస్తావిస్తూ- భారత వినియోగదారులు డిజిటల్ చెల్లింపులను ఎలా అనుసరించారో ఇందులో పాల్గొంటున్నవారు ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చునని ప్రధాని సూచించారు. భారత జి-20 అధ్యక్షత సమయంలో అతిథులుగా వచ్చే ఇతర దేశాల ప్రతినిధులు వినూత్న యూపీఐ వేదికను వినియోగించుకునేలా సృష్టించిన వ్యవస్థ గురించి కూడా ఆయన వెల్లడించారు. “యూపీఐ వంటి ఉదాహరణలు అనేక దేశాలకు నమూనాలు కాగలవు. ఈ మేరకు మా అనుభవాన్ని ప్రపంచంతో పంచుకోవడం మాకెంతో సంతోషం కలిగిస్తుంది. ఇందుకు జి-20 ఒక వాహకం అవుతుంది” అని వివరిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.
Sharing my remarks at the G20 Finance Ministers’ and Central Bank Governors’ Meeting. https://t.co/dD8Frp3QRh
— Narendra Modi (@narendramodi) February 24, 2023
*****
DS/TS
Sharing my remarks at the G20 Finance Ministers' and Central Bank Governors' Meeting. https://t.co/dD8Frp3QRh
— Narendra Modi (@narendramodi) February 24, 2023