ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అహ్మదాబాద్లో నిర్వహించిన భారత ఫిజియోథెరపిస్టుల సంఘం (ఐఎపి) 60వ జాతీయ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఫిజియోథెరపిస్టులు సాంత్వన ప్రదాతలు, ఆశల చిహ్నాలు, దృఢత్వంలో, కోలుకోవడంలో చేయూతనిచ్చేవారంటూ ఈ సందర్భంగా వారి ప్రాధాన్యాన్ని గుర్తుచేశారు. ఫిజియోథెరపిస్టులు శారీరక గాయాలకు చికిత్స చేయడమేగాక రోగి మానసిక సవాలును ఎదుర్కొనేలా ధైర్యాన్నిస్తాడని పేర్కొన్నారు.
ఫిజియోథెరపిస్టుల వృత్తి నైపుణ్యాన్ని ప్రధాని కొనియాడారు. అవసరమైన సమయంలో వారు సహకారం అందించడంలోని స్ఫూర్తి ప్రభుత్వ పాలనలోనూ విస్తరించిందని వివరించారు. బ్యాంకు ఖాతాలు, మరుగుదొడ్లు, కొళాయి నీరు, ఉచిత వైద్యం, సామాజిక భద్రత వలయం వంటి ప్రాథమిక అవసరాలు తీర్చడంవల్ల దేశంలోని పేద, మధ్యతరగతి వర్గాలు కూడా కలలు కనగల ధైర్యాన్ని కూడగట్టుకున్నాయని ప్రధాని పేర్కొన్నారు. “స్వీయ సామర్థ్యంతో వారు కొత్త శిఖరాలకు చేరగలరని మేం ప్రపంచానికి రుజువు చేశాం” అని ప్రధాని తెలిపారు.
అదేవిధంగా రోగిలో స్వావలంబనకు భరోసానిచ్చే వృత్తి లక్షణాలను ఆయన వివరించారు. ఆ తరహాలోనే భారతదేశం కూడా స్వావలంబన వైపు పయనిస్తున్నదని చెప్పారు. ఈ వృత్తి ‘సమష్టి కృషి’కి ప్రతీకగా నిలుస్తుందని, రోగి-వైద్యుడు… ఇద్దరూ సమస్య పరిష్కారానికి సమన్వయంతో కృషి చేయాల్సి ఉంటుందన్నారు. ఈ సమన్వయం స్వచ్ఛ భారత్, బేటీ బచావో వంటి అనేక పథకాలు, ప్రజా కార్యక్రమాల్లో ప్రతిబింబిస్తుందని ప్రధాని అన్నారు. పాలన విధానాలకూ కీలకమైన స్థిరత్వం, కొనసాగింపు, నమ్మకం వంటి అనేక కీలక సందేశాలనిచ్చే ఫిజియోథెరపీ స్ఫూర్తి గురించి ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.
దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఫిజియోథెరపిస్టుల పాత్రను గుర్తిస్తూ ప్రభుత్వం ‘నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ బిల్లు’ను తెచ్చిందని ప్రధాని గుర్తుచేశారు. దీంతో వృత్తి నిపుణులుగా గుర్తింపుపై ఫిజియోథెరపిస్టుల చిరకాల వాంఛ స్వాత్రంత్య అమృత మహోత్సవాల నేపథ్యంలో నెరవేరిందని పేర్కొన్నారు. “దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మీరు సేవలందించే అవకాశాలను ఇది సులభతరం చేసింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ నెట్వర్క్ లో ప్రభుత్వం ఫిజియోథెరపిస్టులను కూడా చేర్చింది. తద్వారా మీరు రోగులకు చేరువయ్యే సౌలభ్యం కల్పించింది” అని శ్రీ మోదీ అన్నారు. సుదృఢ భారతం ఉద్యమం, ఖేలో ఇండియా వాతావరణంలో ఫిజియోథెరపిస్టులకు పెరుగుతున్న అవకాశాలను కూడా ప్రధానమంత్రి గుర్తుచేశారు.
దేశ ప్రజలకు “సరైన భంగిమ, సరైన అలవాట్లు, సరైన వ్యాయామాలపై అవగాహన కల్పించాల్సిందిగా ప్రధానమంత్రి వారిని కోరారు. “శరీర దారుఢ్యం విషయంలో ప్రజలు సరైన పద్ధతులు అనుసరించడం చాలా ముఖ్యం. మీరు దీని గురించి వ్యాసాలు, ఉపన్యాసాల ద్వారా ప్రజల్లో ప్రచారం చేయవచ్చు. ఇక నా యువమిత్రులు లఘుచిత్రాల ద్వారా కూడా ఈ దిశగా కృషి చేయగలరు” అని ఆయన పేర్కొన్నారు. ఫిజియోథెరపీకి సంబంధించి వ్యక్తిగత అనుభవాన్ని వివరిస్తూ- “యోగా నైపుణ్యాన్ని ఫిజియోథెరపీతో జోడిస్తే దాని శక్తి అనేక రెట్లు పెరుగుతుందన్నది నా అనుభవం. తరచూ ఫిజియోథెరపీ అవసరమయ్యే సాధారణ శరీర సమస్యలు కొన్ని సందర్భాల్లో యోగాతో కూడా పరిష్కారం కాగలవు. అందుకే ఫిజియోథెరపీతో పాటు యోగా గురించి కూడా తెలుసుకోవాలి. ఇది వృత్తిపరంగా మీ శక్తిసామర్థ్యాలను పెంచుతుంది” అని ప్రధాని చెప్పారు.
ఫిజియోథెరపీ వృత్తిలో అధికశాతం వయోవృద్ధులతో ముడిపడి ఉన్నందున అనుభవం, మృదు నైపుణ్యాల ఆవశ్యకత కూడా ఉందని ప్రధాని నొక్కిచెప్పారు. ఈ మేరకు విద్యాపరంగా పత్రాల ప్రచురణ, ప్రదర్శనల ద్వారా ప్రపంచానికి సచిత్రంగా చూపాల్సిందిగా వారికి సూచించారు. వీడియో సంప్రదింపులు, దూరవైద్యం మార్గాలను విస్తృతం చేయాలని కూడా శ్రీ మోదీ వారిని కోరారు. తుర్కియేలో భూకంపం వంటి విపత్కర పరిస్థితుల్లో ఫిజియోథెరపిస్టులు పెద్ద సంఖ్యలో అవసరమని, ఇందులో భాగంగా భారత్ నుంచి మొబైల్ ఫోన్ల ద్వారా సహాయం చేయడం సాధ్యమేనని పేర్కొన్నారు. ఈ దిశగా ఫిజియోథెరపిస్టుల సంఘం ఆలోచించాలని ఆయన కోరారు. “మీలాంటి నిపుణుల నాయకత్వంలో భారతదేశం దృఢంగా ఉంటుందని, తిరుగులేని విజయాలు సాధించగలదని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను” అంటూ ప్రధాని తన ప్రసంగం ముగించారు.
Sharing my remarks at the Indian Association of Physiotherapist National Conference in Ahmedabad. https://t.co/R0KTIp2sRY
— Narendra Modi (@narendramodi) February 11, 2023