Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి తో ఆల్ జమ్ము అండ్ కశ్మీర్ పంచాయత్ కాన్ఫరెన్స్ ప్రతినిధివర్గం భేటీ

ప్రధాన మంత్రి తో ఆల్ జమ్ము అండ్ కశ్మీర్ పంచాయత్ కాన్ఫరెన్స్ ప్రతినిధివర్గం భేటీ


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ని ఆల్ జమ్ము అండ్ కశ్మీర్ పంచాయత్ కాన్ఫరెన్స్ కు చెందిన 30 మంది సభ్యులతో కూడిన ప్రతినిధివర్గం నంబర్ 7 లోక్ కల్యాణ్ మార్గ్ లో ఈ రోజు కలుసుకొంది.

జమ్ము – కశ్మీర్ రాష్ట్ర పంచాయతీ నాయకులతో ఏర్పాటైన అత్యున్నత స్థాయి సంఘమే ది ఆల్ జమ్ము అండ్ కశ్మీర్ పంచాయత్ కాన్ఫరెన్స్. ఈ సంఘం జమ్ము – కశ్మీర్ లో 4000 గ్రామ పంచాయతీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఇందులో 4000 మంది సర్పంచులు మరియు 29000 పంచ్ లు ఉన్నారు. ఈ ప్రతినిధివర్గానికి ఆల్ జమ్ము అండ్ కశ్మీర్ పంచాయత్ కాన్ఫరెన్స్ చైర్మన్ శ్రీ శఫీక్ మీర్ నాయకత్వం వ్యవహరిస్తున్నారు.

రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అంశాలను ప్రతినిధివర్గం ప్రధాన మంత్రి కి వివరించింది. రాష్ట్రానికి కేంద్రం అందించిన ప్రయోజనాలు దేశంలోని మిగతా ప్రాంతాలలో మాదిరిగానే పంచాయతీల సాధికారిత లోపం కారణంగా పల్లెలకు చేరుకోలేదు అని వారు ప్రధాన మంత్రికి తెలిపారు. వారు ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. స్థానిక సంస్థలకు వర్తించే భారత రాజ్యాంగ 73వ మరియు 74వ సవరణలను జమ్ము – కశ్మీర్ రాష్ట్రానికి కూడా విస్తరింపచేయడం గురించి పరిశీలించాలని వారు ప్రధాన మంత్రికి విన్నవించారు. రాష్ట్రంలో పంచాయతీలకు, స్థానిక సంస్థలకు ఎన్నికలను సాధ్యమైనంత త్వరలో నిర్వహించాలని కూడా వారు డిమాండ్ చేశారు. 2011 లో ఎన్నికలు నిర్వహించినపుడు వోటర్లు ఉత్సాహంగా ముందుకు వచ్చారు అని వారు అన్నారు.

రాష్ట్రానికి ఈ రాజ్యాంగ నిబంధనలను విస్తరించడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక అభివృద్ధి కార్యకలాపాలను చేపట్టడం కోసం పంచాయతీలకు సాధికారిత లభించగలదని వారు అన్నారు. ఇది రాష్ట్రంలో అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయగలదని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల తాలూకు ప్రయోజనాలను రాష్ట్ర ప్రజలు అందుకొనేటట్లు చేయగలదని సభ్యులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఇప్పుడు నెలకొన్న పరిస్థితిని ప్రతినిధివర్గం ప్రధాన మంత్రికి వివరించింది. జాతి వ్యతిరేక శక్తులు పాఠశాలలకు నిప్పు పెట్టడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.

జమ్ము- కశ్మీర్ లో కూకటివేళ్ల స్థాయి ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సంఘం దేశంలోని ప్రజాస్వామిక సంస్థలు, ప్రక్రియల పట్ల తన విశ్వాసాన్ని పునరుద్ఘాటించింది. రాష్ట్రంలోని అధిక సంఖ్యాకులు శాంతిని, గౌరవాన్ని కోరుకుంటున్నారని శ్రీ శఫీక్ మీర్ అన్నారు. స్వార్థపరశక్తులు యువతను సొంతానికి ఉపయోగించుకొన్నాయని, అంతే కాకుండా వారి భవిష్యత్తుతో కూడా అవి ఆటాడుకొంటున్నాయని ఆయన అన్నారు. జమ్ము – కశ్మీర్ లో శాంతిని పునరుద్ధరించేందుకు వ్యక్తిగత చొరవ తీసుకోవలసిందని ప్రధాన మంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు

వారి డిమాండ్లను గురించి ప్రభుత్వం పరిశీలిస్తుందని ప్రతినిధివర్గానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హామీనిచ్చారు. జమ్ము- కశ్మీర్ అభివృద్ధి మరియు పురోగతిలకు తన కార్యక్రమ పట్టికలో అగ్ర ప్రాధాన్య అంశంగా ఉన్నట్లు ఆయన స్పష్టంచేశారు. ప్రజలు ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్న గ్రామ ప్రాంతాలు అభివృద్ధి చెందేటట్లు చూడడం రాష్ట్రం సమగ్ర అభివృద్ధికి కీలకం అని ప్రధాన మంత్రి అన్నారు. మానవీయ వైఖరి ముఖ్యమని ఆయన చెప్పారు. జమ్ము- కశ్మీర్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు వికాసం మరియు విశ్వాసం మూల స్తంభాలుగా ఉంటాయని ఆయన పునరుద్ఘాటించారు.