Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార అవార్డులు పొందిన వారితో ప్రధానమంత్రి సంభాషణ బాలలతో మనసు విప్పి ప్రధానమంత్రి ఇష్టాగోష్ఠి సంభాషణ

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార అవార్డులు పొందిన వారితో ప్రధానమంత్రి సంభాషణ బాలలతో మనసు విప్పి ప్రధానమంత్రి ఇష్టాగోష్ఠి సంభాషణ


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన నివాసం 7 లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార అవార్డులు పొందిన వారితో సంభాషించారు.
అవార్డుగ్రహీతలందరికీ ప్రధానమంత్రి సావనీర్లు బహూకరించారు. ప్రతీ ఒక్కరితోనూ వారి విజయాలపై వ్యక్తిగతంగా మాట్లాడడంతో పాటు మొత్తం అందరితో కలిసి సంభాషించారు. ఆయన వారందరితోనూ  మనసు విప్పి ఇష్టాగోష్ఠిగా చర్చించారు. తాము ఎదుర్కొంటున్న పలు రకాల సవాళ్లపై వారు ఆయనను ప్రశ్నించడంతో పాటు భిన్న అంశాలపై వారు ప్రధానమంత్రి మార్గదర్శకం కోరారు.
మొదట చిన్న సమస్యలు పరిష్కరించడంతో ప్రారంభించి క్రమంగా సామర్థ్యాలు పెంచుకోవాలని, జీవితంలో ముందుకు సాగుతున్న కొద్ది పెద్ద సమస్యలు పరిష్కరించగల  విశ్వాసం పొందాలని ప్రధానమంత్రి వారికి సూచించారు. బాలలు మానసిక ఆరోగ్యం విషయంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావిస్తూ దానితో ముడిపడి ఉన్న ఆందోళన గురించి మాట్లాడారు. అలాంటి సమస్యల పరిష్కారంలో కుటుంబ సభ్యుల పాత్ర ప్రాధాన్యతను వివరించారు. ఈ సంభాషణ సందర్భంగా చదరంగం ఆడడం, కళలు`సంస్కృతిని కెరీర్‌గా తీసుకోవడం,  పరిశోధన`ఇన్నోవేషన్‌, ఆధ్యాత్మికత వంటి భిన్న అంశాలపై ప్రధానమంత్రి మాట్లాడారు.
ఇన్నోవేషన్‌, సామాజికసేవ, విద్యా నైపుణ్యాలు, క్రీడలు, కళలు`సంస్కృతి, సాహసం వంటి భిన్న రంగాల్లో అసాధారణ విజయాలు సాధించిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ అవార్డులు బహూకరిస్తుంది. ప్రతీ ఒక్క అవార్డు గ్రహీతకు రూ.1 లక్ష నగదు, సర్టిఫికెట్‌ అందిస్తారు. ఈ ఏడాది దేశంలోని భిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 11 మందిని విభిన్న విభాగాల్లో బాలశక్తి పురస్కారాలకు ఎంపిక చేశారు. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అవార్డు గ్రహీతల్లో ఆరుగురు బాలురు, ఐదుగురు బాలికలు ఉన్నారు. వారు : ఆదిత్య సురేష్‌, ఎం.గౌరవి రెడ్డి, శ్రేయ భట్టాచార్జీ, సంభవ్‌ మిశ్రా, రోహన్‌ రామచంద్ర బాహిర్‌, ఆదిత్య ప్రతాప్‌ సింగ్‌ చౌహాన్‌, ఋషి శివ ప్రసన్న, అనూష్కా జాలీ, హనయా నిసార్‌, కోలగట్ల ఆలన మీనాక్షి, శౌర్యజిత్‌ రంజిత్‌కుమార్‌ ఖైరే.

***