Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జల సంరక్షణపై అఖిలభారత రాష్ట్ర మంత్రుల వార్షిక సదస్సులో ప్రధానమంత్రి వీడియో సందేశం తెలుగు అనువాదం

జల సంరక్షణపై అఖిలభారత రాష్ట్ర మంత్రుల వార్షిక సదస్సులో ప్రధానమంత్రి వీడియో సందేశం తెలుగు అనువాదం


నమస్కారం!

జల సంరక్షణపై నిర్వహించిన తొలి అఖిలభారత రాష్ట్ర మంత్రుల వార్షిక సదస్సుకు చాలా ప్రాముఖ్యం ఉంది. భారతదేశం ఇవాళ జల భద్రతపై అసమాన కృషిలో నిమగ్నమైంది. ఆ మేరకు మునుపెన్నడూలేని రీతిలో పెట్టుబడులు కూడా పెడుతోంది. మన రాజ్యాంగ వ్యవస్థలో జలం రాష్ట్రాల పరిధిలోని అంశం. జల సంరక్షణ దిశగా రాష్ట్రాల కృషి దేశ ఉమ్మడి లక్ష్యాల సాధనకు ఎంతగానో దోహదం చేస్తుంది. అందుకే ‘2047లో జల దృక్కోణం’ రాబోయే 25 ఏళ్ల ‘అమృతకాల’ ప్రస్థానంలో కీలకమైన కోణం.

మిత్రులారా!

ఈ సమావేశంలో ‘సంపూర్ణ ప్రభుత్వం’, ‘యావత్‌ భారతం’ దృష్టిలో ఉంచుకుని చర్చించడం చాలా సహజమే కాదు.. అవసరం కూడా. దేశవ్యాప్తంగా ప్రభుత్వాలన్నీ ఒకే భౌతిక రూపంగా, ఒకే వ్యవస్థగా పనిచేయడమే ‘సంపూర్ణ ప్రభుత్వం’ భావనలో ఓ కీలకాంశం. కేంద్రం తరహాలోనే రాష్ట్రాల్లోనూ జల, నీటిపారుదల, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, పశుసంవర్ధక, పట్టణాభివృద్ధి, విపత్తు నిర్వహణ వగైరా వివిధ మంత్రిత్వ శాఖలున్నాయి. కాబట్టి నిరంతర సమాచార ఆదానప్రదానం, సంభాషణ, స్పష్టత, అందరికీ ఏకీకృత దృక్కోణం ఉండటం చాలా ముఖ్యం. ఆయా శాఖలు పరస్పరం సమాచార మార్పిడి చేసుకుంటే, పూర్తి గణాంకాలు కలిగి ఉంటే, అది వారి ప్రణాళికకు ఉపయోగపడుతుంది.

మిత్రులారా!

ప్రభుత్వ కృషితో మాత్రమే విజయం సాధించలేమనే వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ మేరకు ప్రభుత్వంలో ఉన్నవారు తమ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలిస్తాయనే ధోరణికి దూరంగా ఉండాలి. విజయం సాధించాలంటే జల సంరక్షణ సంబంధిత కార్యక్రమాల్లో వీలైనంత మేర ప్రజలతోపాటు సామాజిక సంస్థలను, పౌర సమాజాన్ని భాగస్వాములను చేయాలి. ప్రజా భాగస్వామ్యానికిగల మరో కోణాన్ని కూడా అర్థం చేసుకోవడం చాలా కీలకం. ప్రజల భాగస్వామ్యమంటే మొత్తం బాధ్యతను జనం నెత్తిన మోపడంగానో లేదా ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమంటే ప్రభుత్వ బాధ్యత తగ్గుతుందని కొందరు భావిస్తుంటారు. అయితే, ఇది ఎంతమాత్రం వాస్తవం కాదు. ప్రభుత్వం బాధ్యత తగ్గడమన్నది అవాస్తవం. ప్రజా భాగస్వామ్యంతో గొప్ప ప్రయోజనం ఏమిటంటే- ఈ కార్యక్రమం కోసం ఎంత ప్రజాధనం ఖర్చవుతున్నదో, ఇంకెంత కృషి జరుగుతున్నదో ప్రజలకూ తెలుస్తుంది. ఇందులో అనేక కోణాలున్నాయి… కార్యక్రమంలో పాలు పంచుకున్నప్పుడు అందులోని సాంద్రత, దాని సామర్థ్యం, స్థాయి, వినియోగించే మొత్తం వనరుల గురించి ప్రజలకు తెలుస్తుంది. ఆ మేరకు ఏ పథకమైనా, కార్యక్రమమైనా ప్రజలు దాన్ని చూసినపుడు, అందులో పాలు పంచుకున్నపుడు వాటిపై వారిలో యాజమాన్య భావన పెరుగుతుంది. ఈ భావనే విజయానికి చాలా కీలకం.

స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ దీనికో ఉత్తమ ఉదాహరణ. ప్రజలు ఇందులో భాగంగా మారినపుడు ప్రజల్లో అవగాహన పెరిగి, చైతన్యం వెల్లివిరుస్తుంది. మురుగును తొలగించడానికి వివిధ రకాల వనరులు కావాలి. ఆ మేరకు వివిధ రకాల నీటిశుద్ధి ప్లాంట్లు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి అనేక పనులు ప్రభుత్వం చేపట్టింది. అయితే, ఎక్కడపడితే అక్కడ చెత్త వేయరాదని ప్రజలు… అంటే- ప్రతి పౌరుడూ గ్రహిస్తే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఆ మేరకు పౌరుల్లో అపారిశుధ్యంపై విముఖత పెరగడం మొదలైంది. ఇక మనం జల సంరక్షణ దిశగా ప్రజల మదిలో ఈ ప్రజా భాగస్వామ్య భావనను పాదుకొల్పాలి. దీనిపై ప్రజల్లో మనం ఎంతగా అవగాహన కల్పిస్తామో అంత సానుకూల ప్రభావం కనిపిస్తుంది. ఉదాహరణకు- మనం ‘జల అవగాహన ఉత్సవాలు’ నిర్వహించవచ్చు. స్థానికంగా నిర్వహించే జాతరల వంటి వేడుకలలో జల అవగాహన సంబంధిత కార్యక్రమాలను జోడించవచ్చు. ముఖ్యంగా కొత్త తరానికి ఈ అంశంపై అవగాహన దిశగా పాఠశాలల్లో పాఠ్యాంశాల నుంచి కార్యకలాపాల దాకా వినూత్న మార్గాన్వేషణ చేయాలి. దేశంలోని ప్రతి జిల్లాలో 75 అమృత సరోవరాలను అభివృద్ధి చేస్తున్న సంగతి మీకు తెలిసే ఉంటుంది. మీ రాష్ట్రంలో మీరు కూడా ఈ కృషికి ఎంతగానో సహకరించారు. కాబట్టే చాలా తక్కువ వ్యవధిలో 25,000 అమృత సరోవరాల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఇది జల సంరక్షణలో ప్రపంచం మొత్తం మీద ఒక ప్రత్యేక కార్యక్రమం. ఇందులో ప్రజా భాగస్వామ్యం కూడా ఉంది… జనం చొరవ చూపి ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో జల పరిరక్షణ, ప్రజల భాగస్వామ్యంపై భరోసా దిశగా మన కృషిని నిరంతరం విస్తరింపజేయాలి.

మిత్రులారా!

నీటికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి వస్తే, చివరకు విధాన స్థాయిలోనైనా ప్రభుత్వ విధానాలకు, అధికార ప్రక్రియలకు అతీతంగా ఆలోచించాలి. సమస్యలను గుర్తించి, పరిష్కారాలు అన్వేషించడానికి మనం సాంకేతికతను, పరిశ్రమలను, అంకుర సంస్థలను అనుసంధానించాలి. ఈ దిశగా జియో-సెన్సింగ్, జియో-మ్యాపింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు మనకెంతగానో తోడ్పడతాయి.

మిత్రులారా!

ప్రతి ఇంటికీ నీటి సరఫరాలో ‘జల్ జీవన్ మిషన్’ రాష్ట్రాలకు ప్రధాన అభివృద్ధి కొలమానం. ఈ దిశగా అనేక రాష్ట్రాలు ప్రశంసనీయ కృషి చేశాయి. అనేక ఇతర రాష్ట్రాలు కూడా ఈ మార్గంలో ముందడుగు వేస్తున్నాయి. ఇక ఈ వ్యవస్థ అమల్లోకి వచ్చాక, నిర్వహణ కూడా అదే స్థాయిలో ఉండేవిధంగా చూసుకోవాలి. జల్ జీవన్ మిషన్‌కు పంచాయతీలు నాయకత్వం వహించాలి. పని పూర్తయ్యాక తగిన పరిమాణంలో స్వచ్ఛమైన నీరు సరఫరా అయ్యేలా శ్రద్ధ వహించాలి. ప్రతి పంచాయితీ పాలకవర్గం తమ గ్రామంలో ఎన్ని ఇళ్లకు కొళాయి ద్వారా నీటి సరఫరా జరుగుతున్నదో తెలిపే నెలవారీ లేదా త్రైమాసిక నివేదికను ఆన్‌లైన్‌లో ఉంచవచ్చు. నీటి నాణ్యత కూడా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించే దిశగా నిర్దిష్ట వ్యవధిలో తరచూ జల పరీక్ష వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోవాలి.

మిత్రులారా!

వ్యవసాయం, పరిశ్రమలు సహజంగానే నీటి అవసరం అత్యధికంగా ఉండే ప్రధాన రంగాలు. కాబట్టి ఈ రెండు రంగాల్లోని వారికీ నీటి కొరత గురించి స్పష్టమైన అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. ఇందులో భాగంగా వ్యవసాయ రంగంలో నీటి లభ్యతకు తగినట్లు పంట వైవిధ్యీకరణపై చైతన్యం కలిగించాలి. అలాగే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయ పద్ధతి అనుసరిస్తున్న ప్రాంతాల్లో జల సంరక్షణపై సానుకూల ప్రభావం కనిపించడాన్ని మనం గమనించవచ్చు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన కింద అన్ని రాష్ట్రాల్లో సంబంధిత పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పథకంలో భాగంగా ‘ప్రతి చుక్కకూ మరింత పంట’ పేరిట అవగాహన కార్యక్రమం ప్రారంభించబడింది. దేశవ్యాప్తంగా ఈ పథకం పరిధిలో 70 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి సూక్ష్మసాగు కిందకు వచ్చింది. ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో నిరంతరం ప్రోత్సహించాలి. జల సంరక్షణలో ఇదెంతో కీలకం కాగా, ఇవాళ కాలువల ద్వారా నీటి పారుదల స్థానంలో పైపుల ద్వారా సరఫరా చేసే కొత్త పథకాలు ప్రవేశపెట్టబడుతున్నాయి. ఈ కృషిని మరింత ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది.

మిత్రులారా!

జల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ‘అటల్ భూ జల్’ పేరిట పథకాన్ని ప్రారంభించింది. ఇదెంతో సున్నితమైన కార్యక్రమం కాబట్టి, అంతే సున్నితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. భూగర్భ జలాల నిర్వహణకు నియమితులై అధికారులు కూడా ఈ దిశగా ముమ్మర కృషి చేయాల్సి ఉంది. భూగర్భ జలాల పునరుద్ధరణ లక్ష్యంగా అన్ని జిల్లాల్లో వాటర్ షెడ్ పనులు పెద్ద ఎత్తున చేపట్టాలి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌-రెగా) కింద చేపట్టే పనుల్లో అధికశాతం జల సంరక్షణతో ముడిపడి ఉండటం వాంఛనీయం. కొండ ప్రాంతాల్లో నీటి ఊటల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో ఆ పనులనూ వేగవంతం చేయాలి. జల సంరక్షణ కోసం మీ రాష్ట్రాల్లో అటవీ ప్రాంతాల విస్తరణకూ ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇందుకోసం పర్యావరణ, జల మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా కృషిచేయాలి. సుస్థిర నీటి సరఫరా కోసం అన్ని స్థానిక జల వనరుల సంరక్షణపైనా శ్రద్ధ వహించాలి. పంచాయతీలు కూడా నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే ఐదేళ్ల కాలానికి తమవైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకోవాలి.

నీటి సరఫరా, పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ సంబంధిత మార్గ ప్రణాళికను కూడా ఇందులో చేర్చాలి. ఏ గ్రామానికి ఎంత నీరు అవసరమో.. అందుకోసం చేయాల్సిన పనులేమిటో వాటి ప్రాతిపదికన కొన్ని రాష్ట్రాల్లో పంచాయతీల స్థాయిలోనే జల బడ్జెట్‌ను రూపొందించారు. ఈ నమూనాను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించవచ్చు. ఇటీవలి కాలంలో ‘వర్షపు నీటిని ఒడిసిపట్టు’ కార్యక్రమం ప్రజలను ఎంతగానో ఆకర్షించడం మనం చూశాం. కానీ, అది పూర్తిగా విజయవంతం కావాలంటే మనం చేయాల్సింది ఎంతో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాల రోజువారీ కార్యాచరణలో ఇటువంటి కార్యక్రమాలు సహజంగా సాగడం చాలా అవసరం. అలాగే వాటి వార్షిక కార్యక్రమంలో ఇదొక ముఖ్యమైన భాగం కావాలి. అయితే, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేందుకు వర్షాల కోసం ఎదురుచూడకుండా దానికిముందే అన్ని ప్రణాళికలూ సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం.

మిత్రులారా!

ఈసారి బడ్జెట్‌లో వృత్తాకార ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. జల సంరక్షణ రంగంలో ఇది కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. శుద్ధి చేసిన నీటిని తిరిగి వాడటం ప్రారంభిస్తే మంచినీటి సంరక్షణ సులువవుతుంది. ఇది పర్యావరణ వ్యవస్థ మొత్తానికీ ప్రయోజనకరం. అందుకే జలశుద్ధి, పునరుపయోగం ఎంతో అవసరం. వివిధ పనుల్లో ‘శుద్ధి చేసిన నీటి’ వినియోగం పెంచాలని రాష్ట్రాలు యోచిస్తున్నాయి. వ్యర్థాల నుంచి కూడా గణనీయంగా ఆదాయం పొందవచ్చు. ఆ మేరకు మీరు స్థానిక అవసరాలను గుర్తించి, తదనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలి. ఇక్కడ మనం మరో వాస్తవం గమనించాలి. మన నదులు, జల వనరులు మొత్తం జల పర్యావరణ వ్యవస్థలో అత్యంత కీలక భాగం. వీటిలో ఏదీ బాహ్య కారకాల వల్ల కలుషితం కాకుండా చూడాలి. ఇందుకోసం మనం ప్రతి రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి నెట్‌వర్క్‌ను రూపొందించాలి. శుద్ధి చేసిన నీటిని తిరిగి వాడే దిశగా సమర్థ వ్యవస్థ ఏర్పాటుపైనా మనం శ్రద్ధ వహించాలి. ‘నమామి గంగే మిషన్‌’ ఒక నమూనాగా రూపొందిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు కూడా నదుల పరిరక్షణ, పునరుజ్జీవనం దిశగా ఇలాంటి కార్యక్రమాలను ప్రారంభించవచ్చు.

మిత్రులారా!

నీరు అన్ని రాష్ట్రాల మధ్య భాగస్వామ్యం, సమన్వయం, సహకారాంశంగా మారాలి. ఇది మనందరి బాధ్యత. ఇప్పడు మనం మరొక సమస్యనూ పరిష్కరించాల్సి ఉంది- మన జనాభా పట్టణాల బాట పడుతుండటంతో పట్టణీకరణ శరవేగంతో సాగుతోంది. ఇదెంత ఉధృతంగా ఉందంటే ఈ క్షణం నుంచే నీటి అవసరాలపై ఆలోచన మొదలుపెట్టాలి. ఈ క్షణం నుంచే

మురుగునీటి పారుదల, శుద్ధి వ్యవస్థల గురించి యోచించాలి. నగరాలు ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయో అంతకుమించిన వేగంతో మనం దూసుకెళ్లాలి. ఈ నేపథ్యంలో ప్రస్తుత శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అందరి ఆలోచనలు, అనుభవాలను పంచుకుంటూ చర్చలు ఫలవంతం చేసుకోగలమని నేను ఆశిస్తున్నాను. ఏకగ్రీవ తీర్మానంతో కచ్చితమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, దాన్ని విజయవంతంగా అమలు చేయాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రతి రాష్ట్రం తన పౌరుల సంక్షేమానికి భరోసా ఇస్తూ, అదే సమయంలో వారికి కర్తవ్యాన్ని సదా గుర్తుచేస్తూ ముందుకు సాగాలి. నీటి కోసం ప్రభుత్వ కృషికి ప్రాధాన్యమిస్తే ఈ సదస్సు చాలా అంచనాలు, హామీలను అందుకోగలదని నేను పూర్తి నమ్మకంతో చెప్పగలను.

మీకందరికీ శుభాకాంక్షలు!

ధన్యవాదాలు!

సమ్మతి నిరాకరణ ప్రకటన: ఇది ప్రధానమంత్రి ప్రసంగానికి స్వేచ్ఛానువాదం.. ప్రధాన ప్రసంగం హిందీలో సాగింది.