Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్‌ జాతీయ స్టేడియంలో ‘వీర్ బాల్ దివస్’ స్మారక చరిత్రాత్మక కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్‌ జాతీయ స్టేడియంలో ‘వీర్ బాల్ దివస్’ స్మారక చరిత్రాత్మక కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంలో ‘వీర్ బాల్ దివస్’ (వీరబాలల దినోత్సవం) నేపథ్యంలో నిర్వహించిన చారిత్రక కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా దాదాపు 300 మంది బాల కీర్తనిలు ఆలపించిన ‘షాబాద్ కీర్తన’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఢిల్లీలో దాదాపు 3 వేల మంది చిన్నారుల‌తో నిర్వహించిన కవాతును ప్ర‌ధాని జెండా ఊపి ప్రారంభించారు. కాగా, 2022 జనవరి 9న గురు గోవింద్‌ సింగ్‌ జయంతి వేడుకల నేపథ్యంలో ఆయన కుమారులైన సాహిబ్‌జాదా- ‘బాబా జొరావర్‌ సింగ్‌, బాబా ఫతే సింగ్‌’ల అమరత్వానికి గుర్తుగా ఏటా డిసెంబరు 26ను ‘వీర్‌ బాల్‌ దివస్‌’గా నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రధాని ప్రకటించిన సంగతి తెలిసిందే.

   ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన వారినుద్దేశించి ప్రసంగిస్తూ- భారతదేశం నేడు తొలి ‘వీర బాల్‌ దివస్‌’ నిర్వహించుకుంటోందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. దేశంలో నవారంభానికి ఈ దినం ఒక సంకేతమని, గతంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఎందరో మహానుభావులకు సామూహికంగా శిరసు వంచి కృతజ్ఞత ప్రకటించే రోజని పేర్కొన్నారు. “షహీదీ సప్తాహ్, వీర్ బాల్ దివస్ వంటివి కేవలం రగిలే భావోద్వేగ భాండాలు మాత్రమే కాదు… అవి అనంత స్ఫూర్తికి మూలం” అని ప్రధాని వ్యాఖ్యానించారు.

   సమాన శౌర్యానికి, అపార త్యాగానికి వయస్సుతో నిమిత్తం లేదని ‘వీర్ బాల్ దివస్’ మనకు గుర్తుచేస్తుందని ప్రధాని అన్నారు. అలాగే దేశం కోసం పదిమంది సిక్కు గురువుల అవిరళ కృషిని, భారత ప్రతిష్ట పరిరక్షణ కోసం సిక్కు సంప్రదాయం చేసిన అపార త్యాగాన్ని‘వీర్ బాల్ దివస్’ గుర్తుకు తెస్తుందని వివరించారు. “భారతదేశమంటే ఏమిటో.. దాని గుర్తింపు ఏమిటో తెలిపేదే వీర్ బాల్ దివస్. అంతేకాదు… ఏటా మన గతాన్ని గుర్తుకు తెచ్చుకుని భవిష్యత్తును నిర్మించుకోవడానికి స్ఫూర్తినిస్తుంది. మన యువతరం శక్తి ఎంతటిదో కూడా ఇది తెలియజేస్తుంది” అని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా వీర సాహిబ్‌జాదాలతోపాటు సిక్కు గురువులు, మాతా గుర్జరీలకు ఆయన నివాళి అర్పించారు. “డిసెంబరు 26ను ‘వీర్‌ బాల్‌ దివస్‌’గా నిర్వహించుకోవాలని ప్రకటించే అవకాశం లభించడం మా ప్రభుత్వానికి దక్కిన అదృష్టమని నేను భావిస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.

   వెయ్యేళ్ల ప్రపంచ చరిత్ర భయంకర క్రూరత్వ అధ్యాయాలతో నిండి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ఈ హింసాత్మక క్రూరత్వం మనకు ఎక్కడ తటస్థించినా, దాన్ని దునుమాడటంలో మన వీరులు పోషించిన పాత్ర చరిత్ర పుటల్లో స్పష్టంగా కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు చమ్‌కౌర్, సిర్హింద్ యుద్ధాల్లో జరిగిందేమిటో మనమెన్నడూ మరువలేమని ప్రధాని గుర్తుచేశారు. ఇవి ఓ మూడు శతాబ్దాల కిందట ఈ గడ్డపైనే చోటుచేసుకున్నాయని తెలిపారు. “ఒకవైపు కళ్లకు మతోన్మాద పొరలు కమ్మిన మొఘల్ సుల్తానుల బలమైన సామ్రాజ్యం..  మరోవైపు భారత ప్రాచీన జీవన సూత్రాలకు అనుగుణంగా జ్ఞాన ప్రకాశులైన గురువులు” అని గుర్తుచేస్తూ “ఒకవైపు జడలు విప్పే హింసాత్మక మతోన్మాదం; మరోవైపు ప్రతి మనిషిలో దైవాన్ని చూసే ఆధ్యాత్మికత.. కరుణల ఔన్నత్యం” కనిపించేవని ప్రధానమంత్రి అన్నారు. వీటన్నిటి నడుమ ఇటు మొఘలులకు భారీ సైన్యాలుంటే, అటు అపార ధైర్యసాహసాలే బలం.. బలగంగా గురుపుత్రులైన వీర సాహిబ్‌ జాదాలు. వారు ఒంటరివారైనా మొఘలుల ముందు  తల వంచలేదు. దాంతో ఆగ్రహించిన ఆ క్రూరులు వారిద్దరినీ నిలబెట్టి సజీవంగా గోడ కట్టారు. ఆ విధంగా నాటి చిన్నారుల ధైర్యసాహసాలు శతాబ్దాలుగా మనకు స్ఫూర్తినిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు.

   ద్భుత చరిత్రగల ఏ దేశమైనా ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవంతో నిండినదై ఉండాలి.. కానీ, న్యూనతను రేకెత్తించే కల్పిత కథనాలు మనకు నూరిపోయబడ్డాయని ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేశారు. అయినప్పటికీ స్థానిక సంప్రదాయాలు, సమాజం మన ఉజ్వల చరిత్రను సజీవంగా నిలిపాయని చెప్పారు. ముందడుగు పడాలంటే గతంపై సంకుచిత భాష్యాల నుంచి విముక్తం కావాల్సి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ఆ దిశగానే మన దేశం స్వాతంత్ర్య అమృత కాలంలో బానిస మనస్తత్వం జాడలు వదిలించుకోవాలని సంకల్పించిందని ఆయన గుర్తు చేశారు. ఆ మేరకు “వీర్ బాల్ దివస్’ పంచ ప్రాణాలకు జీవాధారం వంటిది” అని పేర్కొన్నారు. ఔరంగజేబు, అతని బలగాల దౌష్ట్యాన్ని వీర సాహిబ్‌ జాదాలు ఎదురొడ్డి నిలిచారని ప్రధానమంత్రి గుర్తుచేశారు. వారి దృఢ సంకల్పం, ధైర్యసాహసాల ప్రాముఖ్యాన్ని వివరిస్తూ- భారత యువతరం క్రూరత్వానికి లొంగిబోదని, దేశ నైతికత పరిరక్షణలో ఎంతటి త్యాగానికైనా సిద్ధం కాగలదని వారు రుజువు చేశారని తెలిపారు. దేశం పట్ల నాటి యువత కర్తవ్యాన్ని వారి ఉదంతం ప్రస్ఫుటం చేస్తున్నదని చెప్పారు. అదేతరహాలో నేటి యువతరం కూడా ఉక్కు సంకల్పంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తోందని ప్రధానమంత్రి ప్రశంసించారు. అందుకే ఏటా డిసెంబర్ 26న ‘వీర్ బాల్ దివస్’ పాత్రకూ ప్రాముఖ్యం ఏర్పడిందని తెలిపారు.

   సిక్కు గురు పరంపరకు నివాళి అర్పిస్తూ- సిక్కు సంప్రదాయం కేవలం ఆధ్యాత్మికత, త్యాగాలకు పరిమితం కాదని, ఒకే భారతం-శ్రేష్ట భారతం’ భావనకు సిక్కు గురు పరంపర ప్రేరణే మూలమని ప్రధానమంత్రి అన్నారు. దేశవ్యాప్తంగాగల సాధుజనుల ప్రబోధాలు, వ్యాఖ్యానాలతో కూడిన శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ విశాల దృష్టికి, సమ్మిళిత లక్షణానికి తిరుగులేని ఉదాహరణ అని పేర్కొన్నారు. గురు గోవింద్ సింగ్ జీవిత ప్రస్థానం కూడా ఇందుకు నిదర్శనమని ప్రధానమంత్రి అన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ‘పంచ్ ప్యారే’ వచ్చిందన్న వాస్తవాన్ని ప్రస్తావిస్తూ- వీటిలో ఒకటి ప్రధాని జన్మభూమిలోని ద్వారక నుంచి  వచ్చినదని ఆయన సగర్వంగా చెప్పారు. “దేశమే ప్రథమం’ అన్న గురు గోవింద్ సింగ్ ప్రబోధం ఆయన దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది” అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ తమ కుటుంబ అపార వ్యక్తిగత త్యాగాన్ని ప్రస్తావిస్తూ- “దేశమే ప్రథమం’ అనే సంప్రదాయం మనకు గొప్ప స్ఫూర్తినిస్తుంది” అని నొక్కిచెప్పారు.

   భారత రాబోయే తరాల భవిష్యత్తు వారికి స్ఫూర్తినిచ్చే మూలాలపై ఆధారపడి ఉంటుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. బాలలకు స్ఫూర్తినిచ్చే అసంఖ్యాక ఉదాహరణల్లో భరతుడు, భక్త ప్రహ్లాదుడు, నచికేతుడు, ధ్రువుడు, బలరాముడు, లవకుశులు, బాల కృష్ణుడు వంటి పాత్రలతోపాటు ప్రాచీన కాలం నుంచి ఆధునిక యుగందాకా ధైర్యసాహసులైన బాలబాలికలు భారత పరాక్రమానికి ప్రతిబింబంగా ఉన్నారని ప్రధాని అన్నారు.

   వ భారతం తన దీర్ఘకాలిక వారసత్వ పునరుద్ధరణ ద్వారా గత దశాబ్దాల తప్పులను సరిదిద్దుతోందని ప్రధానమంత్రి అన్నారు. ఏ దేశమైనా తన ఆదర్శాలను బట్టి గుర్తించబడుతుందని ఆయన పేర్కొన్నారు. ఒక దేశపు కీలక విలువలు పరివర్తనాత్మకం అయినప్పుడు దేశ భవిష్యత్తు కాలంతోపాటు మారుతుందని నొక్కిచెప్పారు. నేటి తరాలకు తమ జన్మభూమి చరిత్రపై స్పష్టత ఉంటేనే జాతి విలువల పరిరక్షణ సాధ్యమని ఉద్ఘాటించారు. “యువత సదా తాము అనుసరించదగిన, స్ఫూర్తినిచ్చే ఒక ఆదర్శ నమూనాను కోరుకుంటారు. అందుకే మనం శ్రీరాముని ఆదర్శాలను విశ్వసిస్తున్నాం… గౌతమ బుద్ధుడు, మహావీరుడు వంటి మహనీయుల నుంచి స్ఫూర్తి పొందాం. మహారాణా ప్రతాప్, ఛత్రపతి వీర  శివాజీల మార్గాలను అధ్యయనం చేస్తూ గురునానక్ దేవ్ సూక్తులకు అనుగుణంగా జీవించే ప్రయత్నం చేస్తున్నాం” అని ప్రధాని వ్యాఖ్యానించారు. మతం, ఆధ్యాత్మికతలను విశ్వసించే భారత సంస్కృతి, సంప్రదాయాలను ప్రస్తావిస్తూ- మన పూర్వికులు పండుగలు, విశ్వాసాలతో ముడిపడిన భారతీయ సంస్కృతికి రూపాన్నిచ్చారని ప్రధాని పేర్కొన్నారు. ఆ చైతన్యాన్ని మనం శాశ్వతీకరించుకోవాల్సి ఉందని, అందుకే స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సందర్భంగా దేశ స్వాతంత్ర్య పోరాట చరిత్ర వైభవ పునరుజ్జీవనానికి దేశం కృషి చేస్తోందని ప్రధాని అన్నారు. అలాగే గిరిజనంలో సాహసులైన స్త్రీ-పురుషులు పోషించిన పాత్రను ప్రతి వ్యక్తికీ చేరువచేసే కృషి కొనసాగుతున్నదని చెప్పారు. ‘వీర్ బాల్ దివస్’ సందర్భంగా నిర్వహించిన పోటీలు, కార్యక్రమాల్లో దేశంలోని ప్రతి ప్రాంతం నుంచి పోటీదారులు భారీగా పాల్గొనడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. వీర సాహిబ్‌జాదాల జీవిత సందేశాన్ని సంపూర్ణ దృఢ సంకల్పంతో ప్రపంచవ్యాప్తం చేయాల్సిన అవసరాన్ని ఆయన పునరుద్ఘాటించారు.

   ఈ కార్యక్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి శ్రీ భగవంత్ మాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్‌ షిండే, కేంద్ర మంత్రులు శ్రీ హర్దీప్ సింగ్ పూరి, శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్, శ్రీమతి మీనాక్షి లేఖి తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

   సాహిబ్‌ జాదాల ఆదర్శప్రాయ ధైర్యసాహసాల గాథను పౌరులందరికీ… ముఖ్యంగా బాలలకు తెలిపి, వారిలో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా పరస్పర, భాగస్వామ్య కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో వ్యాస రచన, క్విజ్ పోటీలు, ఇతర కార్యకలాపాలు నిర్వహించబడతాయి. రైల్వే స్టేషన్లు, పెట్రోల్ పంపులు, విమానాశ్రయాలు తదితరల బహిరంగ ప్రదేశాలలో డిజిటల్ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయబడతాయి. సాహిబ్‌జాదాల జీవిత చరిత్ర, త్యాగం గురించి ప్రముఖులు ప్రజలకు వివరించే కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించబడతాయి.

*****

DS/TS