Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2022 డిసెంబర్ 25వ తేదీ న జరిగిన ‘ మన్ కీ బాత్ ’ (‘ మనసు లో మాట ’) కార్యక్రమం 96వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం


          నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఈ రోజు మనం ‘మన్ కీ బాత్’ తొంభై ఆరవఎపిసోడ్ లో కలుస్తున్నాం. ‘మన్ కీ బాత్’ తర్వాతి ఎపిసోడ్ 2023 సంవత్సరంలో మొదటి ఎపిసోడ్ అవుతుంది. మీరు పంపిన సందేశాలను పరిశీలిస్తున్నప్పుడు 2022పై మాట్లాడాలన్న మీ కోరిక తెలిసింది.  గతం   పరిశీలన ఎల్లప్పుడూ వర్తమాన,  భవిష్యత్తు సన్నాహాలకు ప్రేరణనిస్తుంది. 2022లోదేశ ప్రజల సామర్థ్యం, సహకారం, సంకల్పం, విజయాలు ఎంత ఎక్కువగా ఉన్నాయంటే వాటన్నిటినీ ‘మన్ కీ బాత్’లో చేర్చడం కష్టం.2022 నిజానికి చాలా స్ఫూర్తిదాయకంగా, అనేక విధాలుగా అద్భుతంగా ఉంది. ఈ సంవత్సరానికి భారతదేశం స్వాతంత్ర్యం పొంది 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సంవత్సరంలోనే అమృతోత్సవ కాలం ప్రారంభమైంది. ఈ సంవత్సరం దేశం కొత్త ఊపందుకుంది. దేశప్రజలందరూ ఒకరికి మించి మరొకరు మంచి పనులు చేశారు. 2022లో సాధించిన విజయాలుప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ప్రత్యేక స్థానాన్నికల్పించాయి. 2022 అంటే భారతదేశం ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ హోదాను పొందడం.2022 అంటే ఎవరూ నమ్మలేని విధంగా దేశం 220 కోట్ల వాక్సిన్ల మైలు రాయిని అధిగమించి రికార్డు సాధించడం. 2022 అంటే భారతదేశం ఎగుమతుల్లో 400 బిలియన్ డాలర్ల మేజిక్ ఫిగర్‌ను దాటడం,2022 అంటే ప్రజలుఆత్మ నిర్భర్ భారత్  తీర్మానాన్ని స్వీకరించడం-జీవించి చూపించడం.  2022 అంటే భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక INS విక్రాంత్‌ను స్వాగతించడం. 2022 అంటే అంతరిక్షం, డ్రోన్,  రక్షణ రంగాలలో భారతదేశ   కీర్తి. 2022 అంటే ప్రతి రంగంలో భారతదేశ విజయం. కామన్వెల్త్ క్రీడలైనా మన మహిళా హాకీ జట్టు విజయమైనా క్రీడా రంగంలో కూడా మన యువత అద్భుతమైన సామర్థ్యాన్ని కనబరిచింది.

         మిత్రులారా!వీటన్నిటితో పాటు 2022 సంవత్సరాన్ని గుర్తుంచుకోవడానికి మరో కారణం కూడా ఉంది. ఇది ‘ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్’ భావన విస్తరణ. దేశ ప్రజలు ఐక్యతను, సంఘీభావాన్ని చాటిచెప్పేందుకుఅనేక అద్భుతమైన కార్యక్రమాలను కూడా నిర్వహించారు.రుక్మిణీ కళ్యాణంతో పాటుశ్రీకృష్ణునికి ఈశాన్య ప్రాంతాలతో ఉన్న సంబంధాన్ని వెల్లడించే గుజరాత్‌లోని మాధవపూర్ మేళా; కాశీ-తమిళ సంగమం మొదలైన ఉత్సవాల్లో ఏకీభావ ప్రదర్శన వర్ణమయంగా కనిపించింది. 2022లో దేశప్రజలు మరో అజరామర చరిత్రను లిఖించారు.ఆగస్టు నెలలో నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారాన్ని ఎవరు మర్చిపోగలరు! ప్రతి దేశస్థుది రోమాలు నిక్కబొడుచుకునే క్షణాలవి. స్వతంత్రభారత 75 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా దేశం యావత్తూ త్రివర్ణమయమైంది. 6 కోట్ల మందికి పైగా ప్రజలు త్రివర్ణ పతాకంతో సెల్ఫీలు కూడా పంపారు.ఈ స్వాతంత్ర్య అమృత మహోత్సవం వచ్చే ఏడాది కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. ఇది అమృతోత్సవ కాల పునాదిని మరింత బలోపేతం చేస్తుంది.

         మిత్రులారా!జి-20 గ్రూప్‌కు అధ్యక్షత వహించే బాధ్యత కూడా ఈ ఏడాది భారతదేశానికి వచ్చింది. ఇంతకుముందు కూడా దీని గురించి వివరంగా చర్చించాను. 2023 సంవత్సరంలోమనం జి-20   ఉత్సాహాన్ని కొత్తశిఖరాలకు తీసుకెళ్ళాలి. ఈ కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలి.

          నా ప్రియమైన దేశప్రజలారా!ఈరోజు క్రిస్మస్ పండుగను ప్రపంచమంతటా ఘనంగా జరుపుకుంటున్నారు. ఇది యేసుక్రీస్తు జీవితం, బోధనలను గుర్తుంచుకునే సందర్భం. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలుతెలియజేస్తున్నాను.

         మిత్రులారా!ఈరోజు గౌరవనీయ అటల్ బిహారీ వాజ్‌పేయి గారి పుట్టినరోజు కూడా. దేశానికి అసాధారణ నాయకత్వాన్ని అందించిన గొప్ప రాజనీతిజ్ఞుడు ఆయన. ప్రతి భారతీయుడి హృదయంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. కోల్‌కతాకు చెందిన ఆస్థా గారి నుండి నాకు ఉత్తరం వచ్చింది.ఈ లేఖలో ఆమె తన ఢిల్లీ పర్యటన గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో తాను పీఎంమ్యూజియాన్ని సందర్శించానని ఆమె రాశారు. ఈ మ్యూజియంలోని అటల్ జీ గ్యాలరీ ఆమెకు బాగా నచ్చింది. అక్కడ అటల్ జీ చిత్రంతో తీసుకున్న ఫోటో ఆమెకుఎప్పుడూ గుర్తుండే జ్ఞాపకంగా మారింది.అటల్ జీ గ్యాలరీలోదేశానికి ఆయన చేసిన అమూల్యమైన కృషిని మనం చూడవచ్చు. మౌలిక సదుపాయాల రంగంలో గానీ విద్యారంగంలోగానీ విదేశాంగ విధానంలో గానీ – ప్రతి రంగంలో భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ఆయన కృషి చేశారు. నేను మరోసారి అటల్ జీకి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను.

        మిత్రులారా!రేపు డిసెంబర్ 26న ‘వీర్ బాల్ దివస్’ జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అమరవీరులు సాహిబ్ జాదా జోరావర్ సింగ్ జీ, సాహిబ్ జాదా ఫతే సింగ్ జీ స్మృతిలో ఢిల్లీలో నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు కలిగింది. సాహిబ్ జాదే, మాతా గుజ్రీల త్యాగాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.

నా ప్రియమైన దేశవాసులారా!

“సత్యమ్ కిమ్ ప్రమాణం, ప్రత్యక్షమ్ కిమ్ ప్రమాణమ్” అంటారు.

అంటే సత్యానికి రుజువులు అవసరం లేదు. ప్రత్యక్షం గా కనబడేదానికి కూడా  రుజువు అవసరం లేదు. కానీ ఆధునిక వైద్య శాస్త్రం విషయానికి వస్తే రుజువు చాలా ముఖ్యమైన విషయం. శతాబ్దాలుగా భారతీయుల జీవితంలో భాగమైన యోగా,  ఆయుర్వేదం వంటి మన శాస్త్రాల్లో సాక్ష్యాధార ఆధారిత పరిశోధన లేకపోవడం ఎప్పుడూ సవాలుగా ఉంది. ఫలితాలు కనిపిస్తాయి. కానీ రుజువులు కాదు.కానీ సాక్ష్యాధారిత వైద్య యుగంలోయోగా,  ఆయుర్వేదం ఇప్పుడు ఆధునిక యుగపరీక్షల్లో విశ్వసనీయమైనవిగా నిలుస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ గురించి మీరందరూ వినే ఉంటారు. పరిశోధన, పరికల్పన, క్యాన్సర్ కేర్‌లోఈ సంస్థ  చాలా పేరు సంపాదించింది. బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్లకు యోగా చాలా ప్రభావవంతంగా ఉంటుందని ఈ కేంద్రం చేసిన లోతైన పరిశోధనలో వెల్లడైంది. అమెరికాలో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మక బ్రెస్ట్ క్యాన్సర్ సదస్సులో టాటా మెమోరియల్ సెంటర్ తన పరిశోధన ఫలితాలను అందించింది.ఈ ఫలితాలు ప్రపంచంలోని పెద్ద – పెద్ద నిపుణుల దృష్టిని ఆకర్షించాయి. ఎందుకంటేయోగా ఫలితంగా రోగులు ఎలా ప్రయోజనం పొందారో టాటా మెమోరియల్ సెంటర్ సాక్ష్యాధారాలతో సహా తెలియజేసింది. ఈ కేంద్ర పరిశోధన ప్రకారంక్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ పునరావృతమయ్యే అవకాశాలు,  మరణాల ప్రమాదం 15 శాతం తగ్గాయి.పాశ్చాత్య పద్ధతుల కఠినమైన ప్రమాణాలతో భారతీయ సంప్రదాయ వైద్య ఫలితాల నిగ్గు తేల్చడం విషయంలో ఇది మొదటి ఉదాహరణ.అలాగేరొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళల్లో జీవన నాణ్యతను మెరుగుపరచడంలో యోగా ఫలితాలను కనుగొన్న మొదటి అధ్యయనం ఇది. దీని దీర్ఘకాలిక ప్రయోజనాలు కూడా తెరపైకి వచ్చాయి. ప్యారిస్‌లో జరిగిన యూరోపియన్ సొసైటీ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ సదస్సులో టాటా మెమోరియల్ సెంటర్ తన అధ్యయన ఫలితాలను సమర్పించింది.

మిత్రులారా!నేటి యుగంలోభారతీయ వైద్య విధానాల్లోసాక్ష్యాధారాలు ఎక్కువైనకొద్దీ ప్రపంచం మొత్తంలో వాటికి అంతగా ఆదరణ పెరుగుతుంది. ఈ ఆలోచనతో ఢిల్లీలోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థలో కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇక్కడమన సంప్రదాయ వైద్య విధానాలను ధృవీకరించడానికి సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ ను ఆరేళ్ల కిందట స్థాపించారు. ఇందులో ఆధునిక పరిజ్ఞానాన్ని, పరిశోధనాపద్ధతులను ఉపయోగించారు. ప్రఖ్యాత అంతర్జాతీయ జర్నల్స్‌లో ఈ కేంద్రం ఇప్పటికే 20పత్రాలను ప్రచురించింది.అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఒక పత్రం మూర్ఛతో బాధపడుతున్న రోగులకు యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తుంది. ఇదేవిధంగాన్యూరాలజీ జర్నల్ లో ప్రచురితమైన పత్రంలో మైగ్రేన్‌ బాధితులకు యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఇవే కాకుండా అనేక ఇతర వ్యాధుల బాధితులకు కూడా యోగా వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించి అధ్యయనాలు జరుగుతున్నాయి. గుండె జబ్బులు, డిప్రెషన్, స్లీప్ డిజార్డర్,  గర్భధారణ సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలు మొదలైనవాటిపై ఈ అధ్యయనాలు నిర్వహిస్తున్నారు.

మిత్రులారా!కొన్ని రోజుల క్రితం నేను ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ లో పాల్గొనేందుకు గోవా వెళ్ళాను. ఇందులో 40కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొని 550కి పైగా శాస్త్రీయ పత్రాలను సమర్పించారు. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 215 కంపెనీలు ఇక్కడ ప్రదర్శనలో తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ ఎక్స్‌పోలో లక్ష మందికి పైగా ప్రజలు ఆయుర్వేదానికి సంబంధించిన అనుభవాన్ని ఆస్వాదించారు.ఆయుర్వేద కాంగ్రెస్‌లో కూడాప్రపంచం నలుమూలల నుండి హాజరైన ఆయుర్వేద నిపుణులను సాక్ష్యాధారిత పరిశోధనలు నిర్వహించాల్సిందిగా కోరాను.  కరోనా మహమ్మారి కాలంలో యోగా,  ఆయుర్వేద శక్తిని మనమందరం చూస్తున్నాం. వీటికి సంబంధించిన సాక్ష్యాధారిత పరిశోధనలు చాలా ముఖ్యమైనవిగా నిరూపితమవుతాయి.యోగా, ఆయుర్వేదం,  మన సంప్రదాయ వైద్య పద్ధతులకు సంబంధించిన అటువంటి ప్రయత్నాల గురించి మీకు ఏవైనా సమాచారం ఉంటేవాటిని సోషల్ మీడియాలో పంచుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా!గత కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్య రంగానికి సంబంధించిన అనేక ప్రధాన సవాళ్లను మనం అధిగమించాం. మన వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు,  దేశప్రజల సంకల్పశక్తి వల్లే ఇది సాధ్యమైంది. మనం భారతదేశం నుండి మశూచి, పోలియో, ‘గినియా వార్మ్’ వంటి వ్యాధులను నిర్మూలించాం.

ఈ రోజునేను ‘మన్ కీ బాత్’ శ్రోతలకు మరో సవాలు గురించి చెప్పాలనుకుంటున్నాను. అది ఇప్పుడు ముగియబోతోంది. ఈ సవాలు-ఈ వ్యాధి – ‘కాలాజార్’. ఈ వ్యాధి   పరాన్నజీవి శాండ్ ఫ్లైఈగ కాటు ద్వారా వ్యాపిస్తుంది. ‘కాలాజార్’ వచ్చినప్పుడు నెలల తరబడి జ్వరం ఉంటుంది. రక్తహీనత కలుగుతుంది. శరీరం బలహీనపడటంతోపాటు బరువు కూడా తగ్గుతుంది.ఈ వ్యాధి పిల్లల నుండి పెద్దల వరకు ఎవరికైనా రావచ్చు. కానీ అందరి కృషితో ‘కాలాజార్’ వ్యాధి నిర్మూలన ఇప్పుడు వేగంగా జరుగుతోంది.  నిర్మూలించబడుతోంది. కొద్దికాలం క్రితం వరకు’కాలాజార్’ వ్యాప్తి 4 రాష్ట్రాల్లోని 50 కంటే ఎక్కువ జిల్లాల్లో ఉండేది. కానీ ఇప్పుడు ఈ వ్యాధి బీహార్,  జార్ఖండ్‌లోని 4 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. బీహార్-జార్ఖండ్ ప్రజల సమర్థత,  అవగాహన ఈ నాలుగు జిల్లాల నుండి కూడా ‘కాలాజార్’ని నిర్మూలించడానికి ప్రభుత్వ ప్రయత్నాలకు దోహదపడతాయన్న విశ్వాసం నాకుంది. ‘కాలాజార్’ ప్రభావిత ప్రాంతాల ప్రజలు రెండు విషయాలను గుర్తుంచుకోవాలని నేను కోరుతున్నాను. ఒకటి – శాండ్ ఫ్లై లేదా ఇసుక ఈగ నియంత్రణ. రెండవది, వీలైనంత త్వరగా ఈ వ్యాధిని గుర్తించి పూర్తి చికిత్స అందించడం. ‘కాలాజార్’చికిత్స సులభం. దీనికి ఉపయోగించే మందులు కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి.మీరు అప్రమత్తంగా ఉంటే చాలు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయవద్దు. ఇసుక ఈగను చంపే మందులను పిచికారీ చేస్తూ ఉండండి. మన దేశం ‘కాలాజార్’నుండి విముక్తి పొందినపుడు మనకు ఎంత సంతోషం కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. సమష్టి కృషి- సబ్ కా ప్రయాస్- భావనతో భారతదేశం 2025 నాటికి టి. బి. నుండి కూడా విముక్తి పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో టీబీ విముక్త భారత ప్రచారాన్ని ప్రారంభించినప్పుడువేలాది మంది ప్రజలుటి.బి. రోగులను ఆదుకునేందుకు ముందుకు రావడాన్ని మీరు చూసి ఉంటారు. ఈ వ్యక్తులుక్షయరహిత ప్రచార మిత్రులు కావడంతో టీబీ రోగులను ఆదుకుంటున్నారు. వారికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. ప్రజల సేవ, భాగస్వామ్యం ఉన్న ఈ శక్తి ప్రతి కష్టమైన లక్ష్యాన్ని సాధించడం ద్వారా మాత్రమే ప్రదర్శితమవుతుంది.

నా ప్రియమైన దేశవాసులారా! మన సంస్కృతీ సంప్రదాయాలకు  గంగామాతతో అవినాభావ సంబంధం ఉంది. గంగాజలం మన జీవన విధానంలో అంతర్భాగంగా ఉంది.

నమామి గంగే తవ్ పాద పంకజం,

సుర అసురై: వందిత దివ్య రూపం|

భుక్తిం చ ముక్తిం చ దదాసి నిత్యం,

భావ అనుసరేణ్ సదా నరాణాం ||

అని మన గ్రంథాలలో పేర్కొన్నారు.

అంటే-“ఓ గంగామాతా! భక్తులకు వారి ఇష్టానుసారం ప్రాపంచిక సుఖాన్ని, ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తున్నావు. అందరూ నీ పవిత్ర పాదాలను పూజిస్తారు. నేను కూడా నీ పవిత్ర పాదాలకు నమస్కరిస్తున్నాను.” అని అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో శతాబ్దాల పాటు ప్రవహిస్తున్న గంగమ్మను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి ముందున్న పెద్ద బాధ్యత. ఈ లక్ష్యంతో ఎనిమిదేళ్ల క్రితం ‘నమామి గంగే అభియాన్’ ప్రారంభించాం. ఈ చొరవ నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడం మనందరికీ గర్వకారణం.పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడం విషయంలో  ప్రపంచంలోని మొదటి పది కార్యక్రమాలలో ‘నమామి గంగే’ మిషన్‌ను ఐక్యరాజ్యసమితి చేర్చింది. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన 160 కార్యక్రమాలలో ‘నమామి గంగే’కి ఈ గౌరవం లభించడం మరింత సంతోషకరమైన విషయం.

మిత్రులారా! ‘నమామి గంగే’ ప్రచారంలో అతిపెద్ద శక్తి ప్రజల నిరంతర భాగస్వామ్యం. ‘నమామి గంగే’ ప్రచారంలో గంగా ప్రహరీలకు, గంగా దూతలకు ప్రాముఖ్యత కల్పించారు. మొక్కలు నాటడం, ఘాట్‌లను శుభ్రపరచడం, గంగా హారతి, వీధి నాటకాలు, పెయింటింగ్‌లు వేయడం, కవితల ద్వారా అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాల్లో వారు నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రచారం వల్ల జీవవైవిధ్యంలో కూడా చాలా అభివృద్ధి కనిపిస్తోంది.వివిధ జాతుల హిల్సా చేపలు, గంగా డాల్ఫిన్ ,  తాబేళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గంగ   పర్యావరణ వ్యవస్థ పరిశుభ్రంగా ఉండటంతోఇతర జీవనోపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఇక్కడ జీవవైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన ‘జల జీవనోపాధి నమూనా’ గురించి చర్చించాలనుకుంటున్నాను.ఈ పర్యాటక ఆధారిత బోట్ సఫారీలను26 ప్రదేశాలలో ప్రారంభించారు. సహజంగానే ‘నమామి గంగే’ మిషన్ పరిధి, దాని విస్తృతినదిని శుభ్రపరచడం కంటే అధికంగా పెరిగింది. ఇది మన సంకల్ప శక్తికి ,  అవిశ్రాంత ప్రయత్నాలకు ప్రత్యక్ష నిదర్శనం. మరోవైపు పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రపంచానికి కొత్త మార్గాన్ని కూడా చూపబోతోంది.

నా ప్రియమైన దేశప్రజలారా!మన సంకల్ప శక్తి బలంగా ఉన్నప్పుడుఅతి పెద్ద సవాలు కూడా సులభం అవుతుంది. సిక్కింలోని థేగు గ్రామానికి చెందిన సంగే షెర్పా గారు దీనికి ఉదాహరణగా నిలిచారు. గత 14 సంవత్సరాలుగా 12,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో పర్యావరణ పరిరక్షణ పనిలో ఆయనఅ నిమగ్నమై ఉన్నారు. సంగే గారు సాంస్కృతిక,  పౌరాణిక ప్రాముఖ్యత ఉన్న  సోమ్‌గో సరస్సును శుభ్రంగా ఉంచే పనిని చేపట్టారు.తన అలుపెరగని కృషితోఆయన ఈ హిమానీనద సరస్సు రంగురూపులను మార్చారు. ఈ పరిశుభ్రత ప్రచారాన్ని 2008లో సంగే షెర్పా గారు ప్రారంభించినప్పుడు అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే అనతికాలంలోనే ఈ మహత్తర కార్యానికి యువకులు, గ్రామస్థులతో పాటు పంచాయతీ నుండి కూడా పూర్తి మద్దతు లభించడం ప్రారంభమైంది. ఈరోజుమీరు సోమ్‌గోసరస్సును చూడటానికి వెళితేఅక్కడ చుట్టూ పెద్ద పెద్ద చెత్త డబ్బాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ సేకరించిన చెత్తను రీసైక్లింగ్ కోసం పంపుతున్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా వారికి గుడ్డతో చేసిన చెత్త సంచులను కూడా అందజేస్తున్నారు.ఇప్పుడు ఈ పరిశుభ్రమైన సరస్సును చూడటానికి ప్రతి ఏటా సుమారు 5 లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటున్నారు. సోమ్‌గో సరస్సును పరిరక్షించడానికి చేసిన ఈ ప్రత్యేకమైన కృషికి సంగే షెర్పాను అనేక సంస్థలు గౌరవించాయి. ఇటువంటి ప్రయత్నాల కారణంగాసిక్కిం భారతదేశంలోని పరిశుభ్రమైన రాష్ట్రాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. సంగే షెర్పా గారు, ఆయన సహచరులతో పాటుదేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన గొప్ప ప్రయత్నాల్లో  నిమగ్నమైన ప్రజలను కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

మిత్రులారా! ‘స్వచ్ఛ భారత్ మిషన్’ నేడు ప్రతి భారతీయుని మనస్సులో స్థిరపడినందుకునేను సంతోషిస్తున్నాను. 2014వ సంవత్సరంలో ఈ ప్రజాఉద్యమం ప్రారంభమైనప్పటి నుండిదీన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ప్రజల నుండి అనేక విశిష్ట ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రయత్నాలు సమాజంలోనే కాకుండా ప్రభుత్వంలో కూడా జరుగుతున్నాయి.ఈ నిరంతర ప్రయత్నాల ఫలితాలు చాలా ఉన్నాయి. చెత్తను తొలగించడం వల్ల, అనవసరమైన వస్తువులను తొలగించడం వల్ల కార్యాలయాలలో చాలా స్థలంఖాళీ అవుతుంది. కొత్త స్థలం అందుబాటులోకి వస్తుంది. ఇంతకు ముందు స్థలాభావం వల్ల దూరప్రాంతాల్లో కార్యాలయాలు అద్దెకు తీసుకోవాల్సి వచ్చేది. ఈ రోజుల్లోఈ శుభ్రత కారణంగాచాలా స్థలం అందుబాటులోకి వచ్చి ఇప్పుడు, అన్ని కార్యాలయాలు ఒకే చోటికి వచ్చే అవకాశం ఏర్పడింది. గతంలోసమాచార,  ప్రసార మంత్రిత్వ శాఖ కూడా ముంబై, అహ్మదాబాద్, కోల్‌కతా, షిల్లాంగ్ లతో పాటు అనేక ఇతర నగరాల్లోని తన కార్యాలయాలలో చాలా కృషి చేసింది. ఆ కారణంగానే నేడు పూర్తిగా కొత్తగా వినియోగించుకునే రెండు- మూడు అంతస్తులు వారికి అందుబాటులోకి వచ్చాయి. ఈ పరిశుభ్రత కారణంగావనరులను ఉత్తమంగా వినియోగించుకోవడంలో ఉత్తమ అనుభవాన్ని పొందుతున్నాం. ఈ ప్రచారం సమాజంతో పాటు గ్రామాలు, నగరాలు,  కార్యాలయాల్లో కూడా అన్ని విధాలుగా దేశానికి ఉపయోగపడుతుంది.

నా ప్రియమైన దేశప్రజలారా!మన దేశంలో మన కళలు, సంస్కృతి పై  కొత్త అవగాహన వస్తోంది. కొత్త చైతన్యం జాగృతమవుతోంది. ‘మన్ కీ బాత్’లో ఇలాంటి ఉదాహరణలను తరచుగా చర్చిస్తాం. కళ, సాహిత్యం, సంస్కృతి సమాజానికి సమష్టి మూలధనం అయినట్లే, వాటిని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత కూడా మొత్తం సమాజంపై ఉంది.అలాంటి విజయవంతమైన ప్రయత్నం లక్షద్వీప్‌లో జరుగుతోంది. కల్పేని ద్వీపంలో ఒక క్లబ్ ఉంది –కూమేల్ బ్రదర్స్ ఛాలెంజర్స్ క్లబ్. ఈ క్లబ్ స్థానిక సంస్కృతి, సంప్రదాయ కళలను కాపాడుకోవడానికి యువతకు స్ఫూర్తినిస్తుంది. ఇక్కడ యువత స్థానిక కళలైన  కోల్కలి, పరీచాక్లి, కిలిప్పాట్ట్, సంప్రదాయ గీతాల్లో శిక్షణ పొందుతున్నారు.అంటే పాత వారసత్వాన్ని కొత్త తరం చేతుల్లో భద్రపరుచుకుంటూ ముందుకు సాగుతున్నారు. మిత్రులారా! దేశంలోనే కాదు-విదేశాల్లోనూ ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. ఇటీవల దుబాయ్‌ నుంచి అక్కడి కలరి క్లబ్‌ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసిందని వార్తలు వచ్చాయి. దుబాయ్ క్లబ్ రికార్డ్ సృష్టించిందని, దీనికి భారతదేశంతో సంబంధం ఏమిటని ఎవరైనా అనుకోవచ్చు. వాస్తవానికిఈ రికార్డు భారతదేశంలోని పురాతన యుద్ధ కళ కలరిపయట్టుకు సంబంధించింది.  ఏకకాలంలో ఎక్కువ మంది వ్యక్తులు కలరిని ప్రదర్శించినందుకు ఈ రికార్డు నమోదైంది. దుబాయ్ లోని కలరి క్లబ్, దుబాయ్ పోలీసులతో కలిసి దీనికి ప్రణాళిక రూపొందించి, అరబ్ ఎమిరేట్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో నాలుగేళ్ల పిల్లల నుంచి అరవయ్యేళ్ల వృద్ధుల వరకు కలరిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. వివిధ తరాలు ప్రాచీన సంప్రదాయాన్నిపూర్తి అంకితభావంతోఎలా ముందుకు తీసుకెళ్తున్నాయో తెలియజేసేందుకు ఇదొక అద్భుతమైన ఉదాహరణ.

మిత్రులారా!కర్ణాటకలోని గడక్ జిల్లాలో నివసించే ‘క్వేమశ్రీ’ గారి గురించి కూడా’మన్ కీ బాత్’ శ్రోతలకు నేను తెలియజేయాలనుకుంటున్నాను. దక్షిణాదిలో కర్ణాటక కళ-సంస్కృతిని పునరుద్ధరించే లక్ష్యంలో ‘క్వేమశ్రీ’గత 25 సంవత్సరాలుగా నిరంతరం నిమగ్నమై ఉన్నారు. వారి తపస్సు ఎంత గొప్పదో మీరు ఊహించుకోవచ్చు.అంతకుముందు క్వేమశ్రీ గారికి హోటల్ మేనేజ్‌మెంట్ వృత్తితో సంబంధం కలిగి ఉంది. కానీ సంస్కృతీ సంప్రదాయాలతో లోతైన  అనుబంధం ఉండడంతో దాన్ని తన లక్ష్యంగా చేసుకున్నారు. ‘కళా చేతన’ పేరుతో ఓ వేదికను రూపొందించారు.ఈ వేదికకర్ణాటకతో పాటు దేశ విదేశాల కళాకారులతో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులోస్థానిక కళను,  సంస్కృతిని ప్రోత్సహించడానికి అనేక వినూత్న కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. మిత్రులారా!తమ కళ,  సంస్కృతి పట్ల దేశప్రజల ఈ ఉత్సాహం ‘మన వారసత్వం పట్ల గర్వం’ అనే భావానికి నిదర్శనం. మన దేశంలోప్రతి మూలలో చెల్లాచెదురుగా అలాంటి వర్ణమయమైన ప్రయత్నాలు చాలా ఉన్నాయి. వాటిని అలంకరించడానికి,  భద్రపరచడానికి మనం నిరంతరం కృషి చేయాలి.

నా ప్రియమైన దేశప్రజలారా!దేశంలోని అనేక ప్రాంతాల్లో వెదురుతో చాలా అందమైన,  ఉపయోగకరమైన వస్తువులు తయారు చేస్తారు. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో నైపుణ్యం ఉన్న వెదురుపనివారు, కళాకారులుఉన్నారు. వెదురుకు సంబంధించిన బ్రిటిష్ కాలంనాటి చట్టాలను మార్చినప్పటి నుండిదానికి భారీ మార్కెట్ అభివృద్ధి చెందింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ వంటి ప్రాంతాల్లో కూడా ఆదివాసీలు వెదురుతో ఎన్నో అందమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.వెదురుతో చేసిన పెట్టెలు, కుర్చీలు, టీపాట్‌లు, బుట్టలు, ట్రేలు మొదలైనవి బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అంతే కాదు- ఈ వ్యక్తులు వెదురు గడ్డితో అందమైన బట్టలు,  అలంకరణ వస్తువులు కూడా చేస్తారు. దీనివల్ల ఆదివాసీ మహిళలు కూడా ఉపాధి పొందుతున్నారు. వారి నైపుణ్యానికి కూడా గుర్తింపు లభిస్తోంది.

మిత్రులారా!కర్నాటకకు చెందిన ఓ జంట తమలపాకుతో తయారు చేసిన అనేక ప్రత్యేకమైన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌కు పంపుతోంది. కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన ఆ దంపతులు – శ్రీ సురేష్ గారు, ఆయన భార్య శ్రీమతి మైథిలి గారు. వారు తమలపాకు పీచుతో ట్రేలు, ప్లేట్లు, హ్యాండ్‌బ్యాగ్‌ల నుంచి మొదలుకొని అనేక అలంకరణ వస్తువులను తయారు చేస్తున్నారు.ఈ పీచుతో చేసిన చెప్పులను కూడా చాలామంది ఇష్టపడుతున్నారు. వారి ఉత్పత్తులను లండన్,  ఐరోపాలోని ఇతర మార్కెట్లలో విక్రయిస్తున్నారు. ఇది అందరూ ఇష్టపడుతున్నమన సహజ వనరులు, సంప్రదాయ నైపుణ్యాల నాణ్యత. ఈ సంప్రదాయ జ్ఞానంలోప్రపంచం స్థిరమైన భవిష్యత్తు వైపు చూస్తోంది. మనం కూడా ఈ దిశగా మరింత అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది.మనమే అలాంటి స్వదేశీ,  స్థానిక ఉత్పత్తులను ఉపయోగించాలి. ఇతరులకు కూడా బహుమతిగా ఇవ్వాలి. ఇది మన గుర్తింపును దృఢపరుస్తుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. పెద్ద సంఖ్యలో ప్రజల భవిష్యత్తును ప్రకాశవంతం చేస్తుంది.

నా ప్రియమైన దేశప్రజలారా!ఇప్పుడు మనం ‘మన్ కీ బాత్’లో అపూర్వమైన మైలురాయి వందవ ఎపిసోడ్  వైపు నెమ్మదిగా కదులుతున్నాం. నాకు చాలా మంది దేశప్రజల నుండి లేఖలు వచ్చాయి. అందులో వారు వందవ ఎపిసోడ్ గురించి చాలా ఉత్సుకతను వ్యక్తం చేశారు. వందవ ఎపిసోడ్‌లో మనం ఏం మాట్లాడాలి,  దాన్ని ఎలా ప్రత్యేకంగా రూపొందించాలనే దానిపై మీరు మీ సూచనలను పంపితే నేను సంతోషపడతాను. తర్వాతిసారి మనం 2023 సంవత్సరంలో కలుద్దాం. 2023 సంవత్సరానికి మీకు శుభాకాంక్షలు.ఈ సంవత్సరం కూడా దేశానికి ప్రత్యేకం కావాలని, దేశం కొత్త శిఖరాలను తాకాలని కోరుకుందాం. అందరం కలిసి ఒక తీర్మానం చేయాలి. అలాగే దాన్ని సాకారం చేయాలి. ఈ సమయంలో చాలా మంది సెలవుల మూడ్‌లో ఉన్నారు.మీరు ఈ పండుగలను చాలా ఆనందించండి. అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రపంచంలోని చాలా దేశాల్లో కరోనా పెరుగుతోందని మీరు కూడా చూస్తున్నారు. కాబట్టి మనం మాస్కులు ధరించడం,  చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలపై  మరింత దృష్టి పెట్టాలి. మనం జాగ్రత్తగా ఉంటేసురక్షితంగా కూడా ఉంటాం. మన ఆనందానికి ఎటువంటి ఆటంకం ఉండదు. దీంతో మరోసారి మీ అందరికీ శుభాకాంక్షలు.చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం!

 

******