Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2022 నవంబర్ 27 వ తేదీన జరిగిన ‘ మన్ కీ బాత్ ’ (‘ మనసు లో మాట ’) కార్యక్రమం95వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం


నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం… మీ అందరికీ మరోసారి మన్ కీ బాత్లోకి స్వాగతం. ఈ కార్యక్రమం 95వ ఎపిసోడ్. మన్ కీ బాత్వందో సంచిక వైపు మనం వేగంగా దూసుకుపోతున్నాం. 130 కోట్ల మంది దేశప్రజలతో అనుసంధానమయ్యేందుకు ఈ కార్యక్రమం నాకు మరో మాధ్యమం. ప్రతి ఎపిసోడ్‌కు ముందుగ్రామాలు, నగరాల నుండి  వచ్చే చాలా ఉత్తరాలను చదవడం, పిల్లల నుండి పెద్దల వరకు మీరు పంపిన ఆడియో సందేశాలు వినడం నాకు ఆధ్యాత్మిక అనుభవం లాంటిది.

మిత్రులారా! నేటి కార్యక్రమాన్ని ఒక ప్రత్యేకమైన బహుమతి గురించిన చర్చతో ప్రారంభించాలనుకుంటున్నాను. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక నేత సోదరుడు ఉన్నారు. ఆయన పేరు యెల్ది హరిప్రసాద్ గారు. ఆయన తన స్వహస్తాలతో నేసిన ఈ జి-20 లోగోను నాకు పంపారు. ఈ అద్భుతమైన బహుమతిని చూసి నేను ఆశ్చర్యపోయాను. హరిప్రసాద్ గారు తన కళతో అందరి దృష్టిని ఆకర్షించే స్థాయిలో నైపుణ్యం ఉంది.చేతితో నేసిన G-20 లోగోతో పాటు హరిప్రసాద్ గారు నాకు ఒక లేఖ కూడా పంపారు. వచ్చే ఏడాది జి-20 సదస్సుకు భారత్‌ ఆతిథ్యమివ్వడం గర్వించదగ్గ విషయమని ఇందులో రాశారు.దేశం సాధించిన ఈ విజయం నుండి పొందిన ఆనందంతో ఆయన తన స్వహస్తాలతో  జి-20  లోగోను సిద్ధం చేశారు. తన తండ్రి నుండి ఈ అద్భుతమైన నేత ప్రతిభను వారసత్వంగా పొందిన ఆయన ఈ రోజు పూర్తి ఇష్టంతో అందులో నిమగ్నమై ఉన్నారు.

మిత్రులారా!కొన్ని రోజుల క్రితం నేను జి-20 లోగోను, ప్రెసిడెన్సీ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌ను ఆవిష్కరించే అవకాశాన్ని పొందాను. ఈ లోగోను పోటీ ద్వారా ఎంపిక చేశారు. హరిప్రసాద్ గారు పంపిన ఈ బహుమతి అందుకోగానే నా మనసులో మరో ఆలోచన వచ్చింది. తెలంగాణలోని ఒక జిల్లాలో కూర్చున్న వ్యక్తి కూడా జి-20 వంటి శిఖరాగ్ర సదస్సుతో ఎంతగా అనుసంధానమయ్యాడో చూసి నేను చాలా సంతోషించాను. ఇంత పెద్ద సమ్మిట్‌ని దేశం నిర్వహించడం వల్ల హృదయం ఉప్పొంగిపోయిందని హరిప్రసాద్‌ గారి లాంటి చాలా మంది నాకు లేఖలు పంపారు.పూణే నుండి సుబ్బారావు చిల్లరా గారు, కోల్‌కతా నుండి తుషార్ జగ్‌మోహన్‌ గారు పంపిన  సందేశాలను కూడా నేను ప్రస్తావిస్తాను. జి-20 మొదలుకుని భారతదేశం చేపట్టిన అనేక క్రియాశీలక ప్రయత్నాలను వారు ఎంతో ప్రశంసించారు.

మిత్రులారా!జి-20 దేశాలకు ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు, ప్రపంచ వాణిజ్యంలో నాలుగింట మూడు వంతులు, ప్రపంచ జిడిపిలో 85%భాగస్వామ్యం ఉంది. మీరు ఊహించవచ్చు- 3 రోజుల తర్వాత అంటే డిసెంబర్ 1వ తేదీ నుండి భారతదేశం ఇంత పెద్ద సమూహానికి, ఇంత శక్తిమంత మైన సమూహానికిఅధ్యక్షత వహించబోతోంది. భారతదేశానికి, ప్రతి భారతీయుడికి ఎంత గొప్ప అవకాశం వచ్చింది! స్వతంత్ర భారత అమృతోత్సవ కాలంలో భారతదేశానికి ఈ బాధ్యత లభించినందువల్ల ఇది మరింత ప్రత్యేకమైంది. మిత్రులారా!జి-20 అధ్యక్ష పదవి మనకు గొప్ప అవకాశంగా వచ్చింది.  మనం ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. విశ్వ కళ్యాణంపై-ప్రపంచ సంక్షేమంపై దృష్టి పెట్టాలి. శాంతి కావచ్చు. ఐక్యత కావచ్చు. పర్యావరణం నుండి మొదలుకుని సున్నితమైన విషయాలు కావచ్చు. సుస్థిర అభివృద్ధి కావచ్చు. ఏ విషయమైనా సరే.. వీటికి సంబంధించిన సవాళ్లకు భారతదేశం దగ్గర పరిష్కారాలున్నాయి. ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు అనే అంశంతో వసుధైక కుటుంబ భావన మన నిబద్ధతను తెలియజేస్తుంది.

ఓం సర్వేషాం స్వస్తిర్భవతు

సర్వేషాం శాంతిర్భవతు

సర్వేషాం పూర్ణంభవతు

సర్వేషాం మంగళం భవతు

ఓం శాంతిః శాంతిః శాంతిః ॥

– అని మనం ఎప్పుడూ చెప్తాం.

అంటే “అందరూ క్షేమంగా ఉండాలి. అందరికీ శాంతి లభించాలి. అందరికీ పూర్ణత్వం సిద్ధించాలి. అందరికీ శుభం కలగాలి” అని. రానున్న రోజుల్లో జి-20కి సంబంధించిన అనేక కార్యక్రమాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతాయి. ఈ సమయంలోప్రపంచంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు మీ రాష్ట్రాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. మీరు ఇక్కడి సంస్కృతిలోని విభిన్నమైన, విలక్షణమైన రంగులను ప్రపంచానికి అందిస్తారన్న నమ్మకం నాకుంది. జి-20 సమావేశాలకు  వచ్చేవారు ఇప్పుడు ప్రతినిధులుగా వచ్చినప్పటికీ వారు భవిష్యత్తులో పర్యాటకులనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. హరిప్రసాద్ గారిలాగా అందరూ ఏదో ఒకరకంగా జి-20తో అనుసంధానం కావాలని మీ అందరినీ- ముఖ్యంగా నా యువ మిత్రులను కోరుతున్నాను. జి-20  భారతీయ లోగోను చాలా ఆకర్షణీయంగా, కొత్త సొగసుతో తయారు చేసి బట్టలపై ముద్రించవచ్చు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు తమ తమ ప్రదేశాల్లో జి-20కి సంబంధించిన చర్చలకు, పోటీలకు అవకాశాలను కల్పించాలని కూడా నేను కోరుతున్నాను. మీరు జి20 డాట్ ఇన్ వెబ్‌సైట్‌ చూస్తే మీ ఆసక్తికి అనుగుణంగా చాలా విషయాలు కనిపిస్తాయి.

నా ప్రియమైన దేశప్రజలారా!నవంబర్ 18న అంతరిక్ష రంగంలో కొత్త చరిత్ర సృష్టించడాన్ని యావద్దేశం చూసింది. ఆ రోజునభారతదేశంలోని ప్రైవేట్ రంగం రూపొందించి, సిద్ధం చేసిన తొలి రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపింది. ఈ రాకెట్ పేరు విక్రమ్-ఎస్‘. స్వదేశీ స్పేస్ స్టార్ట్-అప్ తో రూపొందించిన ఈ మొదటి రాకెట్ శ్రీహరికోట నుండి అంతరిక్షంలోకి ఎగిరినవెంటనే ప్రతి భారతీయుడు గర్వంతో తలెత్తుకున్నాడు.మిత్రులారా! విక్రమ్-ఎస్రాకెట్ ను అనేక ఫీచర్లతో అమర్చారు. ఇది ఇతర రాకెట్ల కంటే తేలికైంది. చవకైంది. దీని అభివృద్ధి వ్యయం అంతరిక్ష యాత్రలో పాల్గొన్న ఇతర దేశాల ఖర్చు కంటే చాలా తక్కువ. తక్కువ ఖర్చుతోప్రపంచ స్థాయి నాణ్యత. అంతరిక్ష సాంకేతికతలో ఇప్పుడు ఇది భారతదేశానికి గుర్తింపుగా మారింది.ఈ రాకెట్ తయారీలో మరో ఆధునిక సాంకేతికతను ఉపయోగించారు. ఈ రాకెట్‌లోని కొన్ని ముఖ్యమైన భాగాలను త్రీడీ ప్రింటింగ్ ద్వారా తయారు చేశారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నిజానికి విక్రమ్-ఎస్లాంచ్ మిషన్‌కి పెట్టిన పేరు ప్రారంభ్సరిగ్గా సరిపోతుంది. ఇది భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష రంగంలో కొత్త శకానికి ప్రారంభం.దేశంలో విశ్వాసంతో నిండిన కొత్త శకానికి ఇది నాంది. చేతితోకాగితపు విమానాలను నడిపే పిల్లలు ఇప్పుడు భారతదేశంలోనే విమానాలను తయారుచేసి, ఎగురవేయగలరని మీరు ఊహించవచ్చు.ఒకప్పుడు చంద్రుడు, నక్షత్రాలను చూస్తూ ఆకాశంలో ఆకారాలు గీసే పిల్లలు ఇప్పుడు భారతదేశంలోనే రాకెట్లు తయారు చేసే అవకాశం పొందుతున్నారని మీరు ఊహించవచ్చు.అంతరిక్షరంగంలో ప్రైవేటు సంస్థలకు అవకాశాలు కల్పించిన తర్వాత యువత కలలు కూడా సాకారమవుతున్నాయి. రాకెట్లను తయారు చేస్తున్నఈ యువత ఆకాశం కూడా హద్దు కాదంటోంది.

మిత్రులారా!భారతదేశం అంతరిక్ష రంగంలో తన విజయాన్ని తన పొరుగు దేశాలతో కూడా పంచుకుంటుంది. భారతదేశం, భూటాన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఉపగ్రహాన్ని నిన్ననే భారతదేశం ప్రయోగించింది. భూటాన్ సహజ వనరుల నిర్వహణలో సహాయపడే విధంగా ఈ ఉపగ్రహం చాలా చక్కటి స్పష్టత ఉన్న చిత్రాలను పంపుతుంది. ఈ ఉపగ్రహ ప్రయోగం భారత్-భూటాన్ దేశాల మధ్య దృఢ సంబంధాలకు అద్దం పడుతోంది.

మిత్రులారా!గత కొన్ని మన్ కీ బాత్ ఎపిసోడ్లలో మనం అంతరిక్షం, సాంకేతికత, ఆవిష్కరణల గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం మీరు గమనించి ఉంటారు. దీనికి రెండు ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఒకటి మన యువత ఈ రంగంలో అద్భుతంగా పనిచేస్తోంది. యువకులు భారీస్థాయిలో ఆలోచిస్తున్నారు. భారీస్థాయిలో సాధిస్తున్నారు. ఇప్పుడు చిన్న చిన్న విజయాలతో వారు సంతృప్తి చెందడం లేదు. రెండవది-ఆవిష్కరణ, విలువ సృజనల ఈ ఉత్తేజకరమైన ప్రయాణంలో యువకులు ఇతర యువ సహచరులను, స్టార్ట్-అప్‌లను కూడా ప్రోత్సహిస్తున్నారు.

మిత్రులారా!టెక్నాలజీకి సంబంధించిన ఆవిష్కరణల గురించి మాట్లాడుతున్నప్పుడుమనం డ్రోన్‌లను ఎలా మరచిపోగలం? డ్రోన్ల రంగంలో భారత్ కూడా వేగంగా దూసుకుపోతోంది. కొన్ని రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్‌లో డ్రోన్‌ల ద్వారా ఆపిల్‌లను ఎలా రవాణా చేశారో చూశాం. కిన్నౌర్ హిమాచల్‌లోని మారుమూల జిల్లా. ఈ సీజన్‌లో అక్కడ విపరీతమైన మంచు కురుస్తుంది.ఇంత ఎక్కువ హిమపాతంతోకిన్నౌర్ కు రాష్ట్రంలోని  ఇతర ప్రాంతాలతో వారాల తరబడి అనుసంధానం చాలా కష్టమవుతుంది.  అటువంటి పరిస్థితిలోఅక్కడి నుండి యాపిల్స్ రవాణా కూడా అంతే కష్టం. ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ సహాయంతోహిమాచల్‌లోని రుచికరమైన కిన్నౌరి యాపిల్స్ ప్రజలకు మరింత త్వరగా చేరువకానున్నాయి. దీని వల్ల మన రైతు సోదర సోదరీమణుల ఖర్చు తగ్గుతుంది. యాపిల్స్ సమయానికి మార్కెట్‌కు చేరుతాయి. యాపిల్స్ వృధా తగ్గుతుంది.

మిత్రులారా! గతంలో ఊహకు కూడా వీలు కాని విషయాలను ఈ రోజు మన దేశవాసులు తమ ఆవిష్కరణలతో సాధ్యం చేస్తున్నారు. ఇది చూస్తే ఎవరు మాత్రం సంతోషించకుండా ఉంటారు? ఇటీవలి సంవత్సరాల్లోమన దేశం చాలా విజయాలు సాధించింది. భారతీయులు- ముఖ్యంగా మన యువతరం- ఇంతటితో ఆగబోదని నాకు పూర్తి నమ్మకం ఉంది.

ప్రియమైన దేశప్రజలారా! నేను మీ కోసం ఒక చిన్న క్లిప్ వినిపించబోతున్నాను.

##(పాట)##

 

మీరందరూ ఈ పాటను ఎప్పుడో ఒకసారి విని ఉంటారు. ఇది బాపుకి ఇష్టమైన పాట. ఈ పాట పాడిన గాయకులు గ్రీస్ దేశస్థులని నేను చెబితే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు! ఈ విషయం కూడా మీరు గర్వించేలా చేస్తుంది. ఈ పాటను గ్రీస్ గాయకుడు ‘కాన్ స్టాంటినోస్ కలైట్జిస్’ పాడారు. గాంధీజీ 150వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన దీన్ని పాడారు. కానీ ఈ రోజు నేను వేరే కారణాల వల్ల ఈ విషయాన్ని చర్చిస్తున్నాను. ఆయనకు భారతదేశంపై,భారతీయ సంగీతంపై గొప్ప అభిరుచి ఉంది. ఆయనకు భారతదేశంపై ఎంతో  ప్రేమ. గత 42 సంవత్సరాలలో ఆయన దాదాపు ప్రతి ఏటా భారతదేశానికి వచ్చారు. భారతీయ సంగీత మూలాలు, వివిధ భారతీయ సంగీత వ్యవస్థలు, వివిధ రకాల రాగాలు, తాళాలు, రసాలతో పాటు వివిధ ఘరానాల గురించి ఆయనఅధ్యయనం చేశారు. భారతీయ సంగీతానికి చెందిన అనేక మంది గొప్ప వ్యక్తుల సేవలను  అధ్యయనం చేశారు. భారతదేశంలోని శాస్త్రీయ నృత్యాలకు సంబంధించిన విభిన్న అంశాలను కూడా నిశితంగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన ఈ అనుభవాలన్నింటినీ ఒక పుస్తకంలో చాలా అందంగా పొందుపరిచారు. ఇండియన్ మ్యూజిక్ పేరుతో ఆయన రాసిన పుస్తకంలో దాదాపు 760 చిత్రాలు ఉన్నాయి.ఈ ఛాయాచిత్రాల్లో చాలా వరకు ఆయనే తీశారు. ఇతర దేశాల్లో భారతీయ సంస్కృతిపై ఇటువంటి ఉత్సాహం,ఆకర్షణ నిజంగా సంతోషాన్నిస్తుంది.

మిత్రులారా!కొన్ని వారాల క్రితం మనం గర్వించదగ్గ మరో వార్త కూడా వచ్చింది. గత 8 సంవత్సరాల్లో భారతదేశం నుండి సంగీత వాయిద్యాల ఎగుమతి మూడున్నర రెట్లు పెరిగిందని తెలుసుకుంటే మీరు సంతోషిస్తారు. ఎలక్ట్రికల్ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఎగుమతి 60 రెట్లు పెరిగింది.భారతీయ సంస్కృతికి, సంగీతానికి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ పెరుగుతోందని దీన్నిబట్టి తెలుస్తోంది. అమెరికా సంయుక్తరాష్ట్రాలు, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, యూకే మొదలైన అభివృద్ధి చెందిన దేశాలు భారతీయ సంగీత వాయిద్యాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. సంగీతం, నృత్యం, కళల విషయంలో గొప్ప వారసత్వ సంపదను మన దేశం కలిగి ఉండటం మనందరి అదృష్టం.

మిత్రులారా!నీతి శతకంకారణంగా ఆ శతక కర్త, గొప్ప కవి భర్తృహరి మనందరికీ తెలుసు. కళ, సంగీతం, సాహిత్యం పట్ల మనకున్న అనుబంధమే మానవత్వానికి నిజమైన గుర్తింపు అని ఆయన ఒక శ్లోకంలో చెప్పారు. నిజానికిమన సంస్కృతి దాన్ని మానవత్వానికి మించి దైవత్వానికి తీసుకువెళుతుంది. వేదాలలోసామవేదాన్ని మన విభిన్న సంగీతాలకు మూలంగా పేర్కొంటారు. సరస్వతీ మాత వీణ అయినా, భగవాన్ శ్రీకృష్ణుడి వేణువు అయినా, భోలేనాథుడి ఢమరు అయినామన దేవతలు కూడా సంగీతానికి భిన్నంగా ఉండరు. భారతీయులమైన మనం ప్రతిదానిలో సంగీతాన్ని అన్వేషిస్తాం. నది గలగలలైనా, వాన చినుకుల టపటప చప్పుడు అయినా, పక్షుల కిలకిలారావాలైనా, గాలి ప్రతిధ్వనులైనా మన నాగరికతలో సంగీతం ప్రతిచోటా ఉంటుంది.ఈ సంగీతం శరీరాన్ని సేద తీర్చడమే కాకుండా మనసును కూడా ఆహ్లాదపరుస్తుంది. సంగీతం మన సమాజాన్ని కూడా అనుసంధానిస్తుంది. భాంగ్రా, లావణి లలో ఉత్సాహం, ఆనందం ఉంటేరవీంద్ర సంగీతం మన ఆత్మను ఉల్లాసపరుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనులకు విభిన్నసంగీత సంప్రదాయాలున్నాయి. ఒకరితో కలిసి ఉండేందుకు, ప్రకృతితో సామరస్యంగా జీవించడానికి ఇవి మనకు స్ఫూర్తినిస్తాయి.మిత్రులారా!మన సంగీత రూపాలు మన సంస్కృతిని సుసంపన్నం చేయడమే కాకుండా ప్రపంచ సంగీతంపై చెరగని ముద్ర వేశాయి. భారతీయ సంగీత ఖ్యాతి ప్రపంచంలోని నలుమూలలకు వ్యాపించింది. మీకు మరో ఆడియో క్లిప్ వినిపిస్తాను.

##(పాట)##

ఇంటికి సమీపంలోని ఏదో గుడిలో భజన కీర్తనలు జరుగుతున్నాయని మీరు అనుకుంటూ ఉంటారు. అయితే ఈ స్వరం భారతదేశానికి వేల మైళ్ల దూరంలో ఉన్న దక్షిణ అమెరికా దేశమైన గయానా నుండి మీకు చేరింది. 19,20వ శతాబ్దాలలో ఇక్కడి నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు గయానాకు వెళ్ళారు.ఇక్కడి నుంచి భారత దేశంలోని అనేక సంప్రదాయాలను కూడా తీసుకెళ్లారు. ఉదాహరణకు-మనం భారతదేశంలో హోలీని జరుపుకుంటున్నప్పుడుగయానాలో కూడా హోలీ రంగులు పలకరిస్తాయి. హోలీ రంగులు ఉన్నచోట ఫగ్వా సంగీతం కూడా ఉంటుంది. గయానాలోని ఫగ్వాలో రాముడితో, శ్రీకృష్ణుడితో సంబంధం ఉన్న పెళ్ళి పాటలు పాడే ప్రత్యేక సంప్రదాయం ఉంది.ఈ పాటలను చౌతాల్ అంటారు. ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్న అదే రకమైన రాగంలోనే తారాస్థాయిలో వాటిని పాడతారు. ఇది మాత్రమే కాదు-చౌతాల్ పోటీ కూడా గయానాలో జరుగుతుంది. అదేవిధంగాచాలా మంది భారతీయులు-ముఖ్యంగా తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతాల నుండిప్రజలు ఫిజీకి కూడావెళ్లారు. వారు సంప్రదాయ భజనలు, కీర్తనలు పాడేవారు. వాటిలో ప్రధానంగా రామచరితమానస్ పద్య పాదాలు ఉండేవి.వారు ఫిజీలో భజనలు, కీర్తనలకు సంబంధించిన అనేక సమ్మేళనాలను కూడా ఏర్పాటు చేశారు. నేటికీ రామాయణ మండలి పేరుతో ఫిజీలో రెండు వేలకు పైగా భజన-కీర్తన మండళ్లు ఉన్నాయి. నేడు ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో వాటిని చూడవచ్చు. నేను ఇక్కడ కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇచ్చాను. మీరు ప్రపంచం మొత్తం మీద చూస్తేభారతీయ సంగీత ప్రియుల జాబితా చాలా పెద్దది.

నా ప్రియమైన దేశప్రజలారా!మన దేశం ప్రపంచంలోని పురాతన సంప్రదాయాలలో ఒకటైనందుకు మనమందరం ఎప్పుడూ గర్విస్తాం. అందువల్ల, మన సంప్రదాయాలను,సంప్రదాయ విజ్ఞానాన్ని కాపాడుకోవడం; వాటిని  ప్రోత్సహించడం, సాధ్యమైనంతవరకు ముందుకు తీసుకెళ్లడం కూడా మన బాధ్యత.మన ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌కు చెందిన కొందరు మిత్రులు అలాంటి ప్రశంసనీయమైన ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం నాకు బాగా నచ్చింది. అందుకే మన్ కీ బాత్శ్రోతలతో పంచుకోవాలని అనుకున్నాను.

మిత్రులారా!నాగాలాండ్‌లోని నాగా సమాజ  జీవనశైలి, వారి కళ, సంస్కృతి, సంగీతంఅందరినీ ఆకర్షిస్తాయి. ఇవి మన దేశ  అద్భుతమైన వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగం. నాగాలాండ్ ప్రజల జీవితం, వారి నైపుణ్యాలు కూడా సుస్థిర జీవన శైలికి చాలా ముఖ్యమైనవి.ఈ సంప్రదాయాలను, నైపుణ్యాలను కాపాడడంతో పాటు వాటిని తర్వాతి తరానికి అందించేందుకు అక్కడి ప్రజలు లిడి-క్రో-యుపేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. మెల్లమెల్లగా అదృశ్యమవుతున్న నాగా సంస్కృతిలోని విశేషాలను పునరుద్ధరించేందుకు లిడి-క్రో-యుసంస్థ కృషి చేస్తోంది. ఉదాహరణకునాగా  జానపద సంగీతం సుసంపన్నమైంది.ఈ సంస్థ నాగా మ్యూజిక్ ఆల్బమ్స్ ఆవిష్కరించే పనిని ప్రారంభించింది. ఇప్పటి వరకు అలాంటి మూడు ఆల్బమ్‌లు విడుదలయ్యాయి. వారు జానపద సంగీతం, జానపద నృత్యానికి సంబంధించిన కార్యశాలలను కూడా నిర్వహిస్తారు. వీటికి సంబంధించి యువతకు శిక్షణ కూడా ఇస్తున్నారు. అంతేకాదు-సంప్రదాయ నాగాలాండ్ శైలిలో దుస్తుల తయారీ, టైలరింగ్, నేయడంలో కూడా యువతశిక్షణ పొందుతోంది. ఈశాన్యరాష్ట్రాల్లో  వెదురుతో అనేక రకాల ఉత్పత్తులను తయారు చేస్తారు.కొత్త తరానికి చెందిన యువతకు  కూడా వెదురు ఉత్పత్తులను తయారు చేయడం నేర్పుతున్నారు. దీంతో ఈ యువత వారి సంస్కృతితో ముడిపడి ఉండటమే కాకుండావారికి కొత్త ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. నాగా జానపదసంస్కృతి గురించి మరింత ఎక్కువ మందికి తెలియజేసేందుకులిడి-క్రో-యుసంస్థ కృషి చేస్తోంది.

మిత్రులారా!మీ ప్రాంతంలో కూడా అలాంటి సాంస్కృతిక శైలులు, సంప్రదాయాలు ఉంటాయి. మీరు కూడా మీ ప్రాంతాల్లో అలాంటి కృషి  చేయవచ్చు. ఎక్కడైనా ఇలాంటి అద్వితీయ ప్రయత్నాల గురించి మీకు తెలిస్తేఆ సమాచారాన్ని నాతో కూడా పంచుకోవాలి.

నా ప్రియమైన దేశప్రజలారా!

‘విద్యాధనం సర్వధనప్రధానమ్’ అని లోకోక్తి.

అంటే ఎవరైనా విద్యను దానం చేస్తుంటేఅతను సమాజ హితం కోసం అతిపెద్ద పని చేస్తున్నట్టు. విద్యారంగంలో వెలిగించే చిన్న దీపం కూడా మొత్తం సమాజానికి వెలుగునిస్తుంది. ఈరోజు దేశవ్యాప్తంగా ఇలాంటి ఎన్నో ప్రయత్నాలు జరగడం నాకు చాలా సంతోషాన్నిస్తుంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు 70-80 కిలోమీటర్ల దూరంలోని హర్దోయ్‌ ప్రాంతంలో బన్సా ఒక గ్రామం. విద్యలో వెలుగులు నింపే పనిలో నిమగ్నమైన ఈ గ్రామానికి చెందిన జతిన్ లలిత్ సింగ్ గురించి నాకు సమాచారం వచ్చింది. జతిన్ గారు రెండేళ్లకిందట ఇక్కడ సామాజిక గ్రంథాలయాన్ని, వనరుల కేంద్రాన్ని ప్రారంభించారు. ఆ కేంద్రంలో హిందీ, ఆంగ్ల సాహిత్యం, కంప్యూటర్, లా అంశాలతో పాటు ప్రభుత్వ పోటీ పరీక్షలసన్నద్ధతకు సంబంధించిన 3000 కంటే ఎక్కువ పుస్తకాలు ఉన్నాయి. ఈ లైబ్రరీలోపిల్లల ఇష్టాయిష్టాలకు కూడా పూర్తి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ ఉన్న కామిక్స్ పుస్తకాలను, విద్యాసంబంధమైన బొమ్మలను పిల్లలు చాలా ఇష్టపడతారు. చిన్న పిల్లలు ఆటలతో కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. చదువులు ఆఫ్‌లైన్ అయినా ఆన్‌లైన్ అయినాదాదాపు 40 మంది వాలంటీర్లు ఈ కేంద్రంలో విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడంలో తీరికలేకుండా ఉన్నారు.ఈ గ్రంథాలయానికి ప్రతిరోజు 80 మంది విద్యార్థులు చదువుకునేందుకు వస్తుంటారు.

మిత్రులారా!జార్ఖండ్‌కు చెందిన సంజయ్ కశ్యప్ గారు కూడా పేద పిల్లల కలలకు కొత్త రెక్కలు ఇస్తున్నారు. తన విద్యార్థి జీవితంలోసంజయ్ గారు మంచి పుస్తకాల కొరతను ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పుస్తకాలు లేకపోవడం కారణంగాతమ ప్రాంత పిల్లల భవిష్యత్తు అంధకారం కాకూడదని నిర్ణయించుకున్నారు. ఈ మిషన్ కారణంగాఈ రోజు ఆయన జార్ఖండ్‌లోని అనేక జిల్లాల్లో పిల్లలకు లైబ్రరీ మ్యాన్అయ్యాడు.సంజయ్ గారు తన ఉద్యోగ ప్రారంభంలో తన స్వస్థలంలో మొదటి లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఉద్యోగం చేస్తున్న సమయంలో ఎక్కడికి బదిలీ అయినా పేదలు, గిరిజనుల పిల్లల చదువుల కోసం లైబ్రరీని ప్రారంభించే లక్ష్యంతో పనిచేశారు. ఇలా చేస్తూనే జార్ఖండ్‌లోని అనేక జిల్లాల్లో పిల్లల కోసం లైబ్రరీలను ప్రారంభించారు. గ్రంథాలయాన్ని ప్రారంభించాలన్న ఆయన లక్ష్యం నేడు సామాజిక ఉద్యమంగా రూపుదిద్దుకుంటోంది. సంజయ్ గారు అయినా జతిన్ గారు అయినా…వారి ఇలాంటి అనేక ప్రయత్నాలకు నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.

నా ప్రియమైన దేశవాసులారా!పరిశోధన, ఆవిష్కరణలతో పాటు అత్యాధునిక సాంకేతికత, పరికరాల సహాయంతో వైద్య విజ్ఞాన ప్రపంచం చాలా పురోగతి సాధించింది. అయితే కొన్ని వ్యాధులు నేటికీ మనకు పెద్ద సవాలుగా ఉన్నాయి. అటువంటి వ్యాధుల్లో ఒకటి కండరాల క్షీణత!ఇది ఏ వయస్సులోనైనా సంభవించే జన్యుపరమైన వ్యాధి. ఇందులో కండరాలు బలహీనపడటం ప్రారంభమవుతుంది. రోగి తన దైనందిన జీవితంలో చిన్న చిన్న పనులు కూడా చేయడం కష్టంగా మారుతుంది. అటువంటి రోగుల చికిత్స, సంరక్షణకు గొప్ప సేవాభావం అవసరం.హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో మనకు అలాంటి కేంద్రం ఉంది. ఇది కండరాల బలహీనత రోగులకు కొత్త ఆశాకిరణంగా మారింది. ఈ కేంద్రం పేరు మానవ్ మందిర్. దీన్ని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ మస్కులర్ డిస్ట్రోఫీ నిర్వహిస్తోంది. ‘మానవ్ మందిర్’ దాని పేరుకు తగ్గట్టుగానే మానవ సేవకు అద్భుతమైన ఉదాహరణ. మూడు-నాలుగేళ్ల క్రితమే ఇక్కడ రోగులకు ఓపీడీ, అడ్మిషన్ సేవలు ప్రారంభమయ్యాయి. మానవ్ మందిర్‌లో దాదాపు 50 మంది రోగులకు పడకల సౌకర్యం కూడా ఉంది. ఫిజియోథెరపీ, ఎలక్ట్రోథెరపీ, హైడ్రోథెరపీలతో పాటు యోగా-ప్రాణాయామం సహాయంతో కూడా వ్యాధులకు  చికిత్స చేస్తారు.మిత్రులారా!అన్ని రకాల అత్యాధునిక సౌకర్యాల ద్వారాఈ కేంద్రం రోగుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తోంది. మస్కులర్ డిస్ట్రోఫీకి సంబంధించిన సవాళ్లలో ఒకటి దాని గురించి అవగాహన లేకపోవడం. అందుకేఈ కేంద్రం హిమాచల్ ప్రదేశ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా రోగులకు అవగాహన శిబిరాలను నిర్వహిస్తోంది. అత్యంత స్ఫూర్తినిచ్చే విషయం ఏమిటంటే ఈ వ్యాధితో బాధపడేవారే ఈ సంస్థ నిర్వహణలో ప్రధానంగా భాగస్వాములు కావడం. సామాజిక కార్యకర్త ఊర్మిళ బల్దీ గారు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ మస్క్యులర్ డిస్ట్రోఫీ అధ్యక్షురాలు సోదరి సంజనా గోయల్ గారు, ఈ సంస్థ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించిన విపుల్ గోయల్ గారు ఈ సంస్థ నిర్వహణలో చాలా ప్రధాన భూమిక నిర్వహిస్తున్నారు. మానవ్ మందిర్‌ను ఆసుపత్రిగా, పరిశోధనా కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో రోగులకు ఇక్కడ మెరుగైన వైద్యం అందుతుంది. ఈ దిశలో ప్రయత్నిస్తున్న అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కండర క్షీణతతో బాధపడుతున్నవారందరికీమంచి జరగాలని కోరుకుంటున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా!నేటి మన్ కీ బాత్లో మనం చర్చించుకున్న దేశవాసుల సృజనాత్మక, సామాజిక కార్యక్రమాలు దేశ  సమర్థతకు, ఉత్సాహానికి ఉదాహరణలు. ఈ రోజు ప్రతి దేశవాసీ దేశం కోసం ఏదో ఒక రంగంలోప్రతి స్థాయిలో విభిన్నంగా చేయాలని ప్రయత్నిస్తున్నాడు. జి-20 లాంటి అంతర్జాతీయ అంశంలో మన నేత సహచరుడు ఒకరు తన బాధ్యతను అర్థం చేసుకుని దానిని నెరవేర్చేందుకు ముందుకు రావడాన్ని ఈరోజు జరిగిన చర్చలోనే చూశాం.అదేవిధంగా కొందరు పర్యావరణం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు నీటి కోసం పనిచేస్తున్నారు. చాలా మంది విద్య, వైద్యం, సైన్స్ టెక్నాలజీ నుండి సంస్కృతి-సంప్రదాయాల వరకు అసాధారణమైన కృషి చేస్తున్నారు.ఎందుకంటేఈ రోజు మనలోని ప్రతి పౌరుడు తన కర్తవ్యాన్ని అర్థం చేసుకుంటున్నాడు.దేశ పౌరులలో అటువంటి కర్తవ్య భావన వచ్చినప్పుడుదేశ బంగారు భవిష్యత్తు దానంతట అదే నిర్ణయమవుతుంది. దేశ  బంగారు భవిష్యత్తులో మనకు కూడా బంగారు భవిష్యత్తు ఉంటుంది.

దేశప్రజల కృషికి నేను మరోసారి నమస్కరిస్తున్నాను. మనం వచ్చే నెలలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఖచ్చితంగా మాట్లాడుకుందాం. మీరు మీ సూచనలను, ఆలోచనలను తప్పకుండా పంపుతూ ఉండండి. మీ అందరికీ చాలా ధన్యవాదాలు!

******